Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మెళ్లో మెలికల నాగుల దండ… వలపుల వేడికి ఎగిరి పడంగ…

July 21, 2023 by M S R

Snake – Sentiment: తమిళంలో “గరుడా! సౌఖ్యమా?” అని ఒక సామెత. పద్నాలుగు లోకాల్లో ఆగకుండా తిరిగిన విష్ణు మూర్తి వైకుంఠంలో దిగి…తన వాహనం గరుత్మంతుడికి వీక్లి ఆఫ్ సెలవు ఇచ్చాడు. మనోవేగం కంటే వేగంగా తిరగడంతో ఒళ్లు వేడెక్కింది…అలా చల్లగా హిమాలయాల కూల్ కూల్ కులూ మనాలి కాశ్మీర పర్వత సానువుల రిసార్టులో సేద తీరుదామని బయలుదేరాడు గరుత్మంతుడు.

పైన దూది కొండల్లాంటి చల్లటి మేఘాలు, కింద వెండి కొండల్లాంటి మంచు పర్వతాలు. ప్రకృతి పరవశ గీతం పాడుతోంది. గరుత్మంతుడు ఒళ్లు మరిచి చల్ల గాలుల్లో ఎగురుతున్నాడు. ఈలోపు మేఘమండలం మధ్యలో శివుడు ధ్యాన ముద్రలో కళ్లు మూసుకుని కనిపించాడు. అంతే- ఒక్కసారిగా గరుత్మంతుడు వేగం తగ్గించి…రెక్కల చప్పుడు కూడా చేయకుండా వెనక్కు తిరగబోయాడు. పరమశివుడు చూడలేదు కానీ…శివుడి మెడలో పాము గరుత్మంతుడిని చూసింది.

Ads

బయట ఎక్కడయినా పాము కనపడితే గరుత్మంతుడు గుటుక్కుమని నోట్లో వేసుకునేవాడు. అది శివుడి మెడలో వాసుకి.
“ఏమి గురుత్మంతుడా!
బాగున్నావా?
ఏమిటి విశేషాలు?
(గరుడా! సౌఖ్యమా?)”
అని పాము అడిగేసరికి గరుత్మంతుడి పై ప్రాణాలు పైనే పోయినంత పని అయ్యింది.

మహా ప్రభో!
హాలిడే మూడ్లో ఉండి స్పీడ్ పెంచి కైలాసం దాకా వచ్చేశాను. నువ్వు నన్ను చూడలేదు. నేను నిన్ను చూడలేదు. దయచేసి నా ట్రెస్ పాసింగ్ గురించి మీ స్వామికి కంప్లైంట్ చేయకు. వచ్చినదారినే వెళ్లిపోతా. ప్లీజ్ అని రెక్కలు జోడించి దండం పెట్టి…బతుకు జీవుడా అనుకుని బయటపడ్డాడు.

కైలాసంలో ఒక పవిత్ర కార్తిక మాసం సాయం సంధ్యవేళ. పుట్టపర్తివారు చెప్పినట్లు మొదట శివుడు తాండవం చేశాడు. తరువాత పార్వతి లాస్యం అయ్యింది. ఇద్దరూ ఇసుమంతయినా అలుపు లేకుండా ఉన్నత స్థానంలో ఒకరి పక్కన కూర్చున్నారు. దేవతలందరూ పోటీలు పడి స్తోత్రాలు చేస్తుంటే…పార్వతి మనసు పొంగిపోయింది. పక్కనున్న శివుడి చేతి మీద చేయి వేసి ప్రేమపొంగిన మనసుతో అభినందించబోయింది. ఆమె చేతికి మెత్తగా ఏదో తగిలింది. వెంటనే చేయి తీసేసి…నవ్వుకుంది. శివుడు కూడా ప్రతిగా ముసిముసిగా నవ్వాడు. ఆ నవ్వుకు లోకాలు ఆనంద తాండవం చేశాయి. అలాంటి వేళ శివ పార్వతులకు నమస్కరించాడు ఆది శంకరాచార్యుడు. ఆ క్షణంలో పార్వతి చేతికి మెత్తగా తగిలినది శివుడి ముంజేతికి, వేళ్లకు ఆభరణంగా ఉన్న పాము!

మృత్యువును జయించినవాడు- మృత్యుంజయుడు కాబట్టి శివుడు పామును మెడలో వేసుకుని తిరుగుతూ ఉంటాడు. విష్ణువు కూడా అంతే కాబట్టి ఆయన పాము మీదే పడుకుని ఉంటాడు.

వేదాంత భాషలో పాము మృత్యువుకు సంకేతం. యోగభాషలో పాము పైకి పాకే కుండలినీ శక్తి. సామాన్య భాషలో పాము పామే. పామంటే ఎవరికయినా భయమే. అందుకే పాముకు పాలు పోసి పెంచినా అది పాలన్నీ తాగి…పాలు పోసినవారిని కృతజ్ఞతాపూర్వకంగా కాటు వేస్తూ ఉంటుంది. పామును పక్కలో పెట్టుకుని పడుకున్నట్లు అని లోకం  భయపడుతూ…మానవరూపంలో ఉన్న ఎన్నో సర్పాలతో సహజీవనం చేస్తూ ఉంటుంది.

చిన్న పామునయినా పెద్ద కర్రతో కొడతామని తెలుసు కాబట్టి పెద్దవి అయ్యాకే పాములు వీధుల్లో తిరగడం అలవాటు చేసుకున్నాయి. మనదగ్గర పాముకు- గద్దకు అస్సలు పడదు. విష్ణువు దగ్గర వేయిపడగల పాము- గరుత్మంతుడు క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడూ వన్ బై టు టీ తాగుతూ ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి దగ్గర కూడా అంతే. నెమలి పురి విప్పి నాట్యం చేస్తుంటే పాము పడగ విప్పి మిత్రధర్మం పాటిస్తూ అడుగులో అడుగు వేస్తుంది.

“తలనుండు విషము ఫణికిని,
వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్‌,
తలతోక యనక యుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!”

పాముకు పడగ కోరల్లోనే విషం. తేలుకు తోకలోనే విషం. మనిషికి నిలువెల్లా విషమే అని సుమతీ శతకకారుడి స్కానింగ్ రిపోర్ట్ లో శతాబ్దాల క్రితమే తేలిపోయింది.

మనుషుల్లో కాలనాగులు, విషనాగులు, విషకన్యలు, మన్ను తిన్న పాములు…ఇలా స్వభావాన్ని, సైజును బట్టి ఎన్నెన్నో రకాలు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవిస్ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. ఆమె తన రెండు చేతుల్లో రెండు విష సర్పాలను పట్టుకుని…ఒకదాన్ని దాదాపు ముద్దు చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను ప్రపంచానికి ఆమే విడుదల చేశారు. (బహుశా కోరలు తీసినవే అయి ఉంటాయి). “ఈ భూమ్మీద అత్యంత కౄరమయిన, విషపూరితమయిన జంతువులు మనుషులు మాత్రమే…పాపం…కాళ్లు లేని వంకర తిరుగుడు పాములు అత్యంత విశ్వాసం కలవి…” అనే అర్థం వచ్చేలా స్వయంగా ఫొటోకు ఒక వ్యాఖ్య కూడా పెట్టారు.

దాంతో నెటిజెనులు ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు. “అవును తల్లీ! మీరన్నది అక్షరాలా నిజం. మహారాష్ట్ర తాజా రాజకీయ ముఖ చిత్రంలో కాలనాగులు, విషసర్పాలు, రక్తపింజరులు, పైథాన్ లు, కింగ్ కోబ్రాలు, స్పైడర్ స్నేక్స్, జంపింగ్ స్నేక్స్ ను చూసిన తరువాత…మీ చేతిలో ఉన్నవి సాధు సర్పాలే…” అనే అర్థం వచ్చేలా లెక్కకు మిక్కిలి కామెంట్లు పెడుతున్నారు.

మన శాస్త్రాల ప్రకారం మనకు పైన-
1. భూలోకం
2. భువర్లోకం
3. సువర్లోకం
4. మహాలోకం
5. జనోలోకం
6. తపోలోకం
7. సత్య లోకం

మనకు కింద-
1. అతల
2. వితల
3. సుతల
4. తలాతల
5. మహాతల
6. రసాతల
7. పాతాళం
లోకాలు ఉన్నాయట. ఈ కింది లోకాల్లో మహాతలమంతా విషనాగులు, విషకన్యలది. నాగలోకం.

ఇప్పటి ఎన్నికల విషనాగులు, విషకన్యల భాష ప్రకారం మన కింద ఇంకా రసాతల, పాతాళ లోకాలున్నాయి. ఈ సంస్కార వేగంతో మనం పాతాళం కిందికి ఎప్పటికి చేరుకుంటామో! ఏమో!

ఇంకా నయం!
కలియుగారంభంలో తన తండ్రి పరీక్షిత్తును తక్షకుడు (సర్పం) చంపేశాడని జనమేజయుడు సర్పయాగం చేయబట్టి కొన్ని కోట్ల సర్పజాతులు తుడిచిపెట్టుకుపోయాయి. లేకుంటే పద్నాలుగు భువన భాండాల్లో బుస్సు బుస్సుమని విషం చిమ్ముతూ…కనిపించినవారినందరినీ కాటు వేస్తూ కాలనాగులు, విషనాగులు, విషకన్యలే ఉండి ఉండేవేమో! ఏమో!

(పుట్టలో దాగిన పాత పాము కథనమిది. అమృతా ఫడ్నవిస్ దెబ్బకు మరోసారి నెమరువేత- అంతే!)

-పమిడికాల్వ మధుసూదన్
madhupamidikalva@gmail.com

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!
  • గోపీనాథ్ మరణ మిస్టరీ ఏమిటి..? కేటీయార్ మౌనం వెనుక మర్మమేంటి..!!
  • దీనక్క… ఏం రాశాడు గురూ సినిమా మాండలికంలో… బాగా ప్రాసపడుతూ…
  • నేతల సొంత కంచాల కథలేమిటి..? చానెల్‌లో పర్సనల్ కేసు లొల్లేమిటి..?
  • అంబానీలు, ఆదానీలకన్నా… శివ నాడార్ శిఖర సమానుడు… ఎలాగంటే..?!
  • బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది… టెండర్ల రద్దు అసలు కథ వేరు…
  • …. అలాంటి నాగార్జున సడెన్‌గా యాక్షన్ హీరో అనేసరికి మేమంతా షాక్’’
  • సాయి అభ్యంకర్..! మూడేళ్లలోనే ఎగిసిన స్వరకెరటం… భారీ డిమాండ్..!!
  • చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!
  • సుమలత, ఊర్వశి… నాలుగు భాషల్లోనూ వాళ్లే… దర్శకుడూ ఒకడే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions