అఫ్ఘనిస్థాన్ పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నయా..? పాకిస్థాన్ అత్యుత్సాహంతో ఎగిరెగిరిపడుతోంది గానీ మెల్లిగా తాలిబనిజం తన పక్కలో బల్లెం కాబోతోందా..? పంజషీర్ కేంద్రంగా ప్రారంభమైన ప్రతిఘటన అప్పుడే మూడు జిల్లాల్ని స్వాధీనం చేసుకుందనీ, తాలిబన్లతో గట్టి పోరు నడుస్తోందని వార్తలొస్తున్నయ్… దాని వెనుక ఇండియా ఉందా..? రష్యా, ఇండియా దోస్తీకి అఫ్ఘన్ రాజకీయం చిచ్చు పెట్టబోతోందా..? ఇండియాతోపాటు అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్ కూడా ఎవరి మైండ్ గేమ్ వాళ్లు ఆడబోతున్నారా..? మిత్రుడు పార్ధసారధి పోట్లూరి…. ఫేస్‌బుక్‌లో రాసిన ‘‘ఆఫ్ఘనిస్తాన్-కొత్త ట్విస్ట్ ! మరోసారి అంతర్యుద్ధం లోకి వెళ్లబోతున్నది !’’ ఆర్టికల్ ఆసక్తికరంగా ఉంది… చదవండి…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకొని పట్టుమని 5 రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే ఇంకో మలుపు తిరిగింది. పంజ షీర్ ప్రావిన్స్ వేదికగా నేషనల్ రెసిస్టన్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ [National Resistance Front of Afghanistan] పేరిట కొత్త సంస్థ ఆవిర్భవించింది. ఆఫకోర్స్ పేరు కొత్తదే కానీ సంస్థ పాతదే. నార్దర్న్ అలియన్స్ [Northern Alliance] ని అహ్మెద్ షా మసూద్ [Lion of Panjshir ] స్థాపించాడు 1979 లో. అప్పట్లో సోవియట్ సైన్యానికి ఎదురుగా నిలిచి పంజ్ షీర్ ప్రావిన్స్ లోకి సోవియట్ సైన్యం రాకుండా అడ్డుకున్నాడు. అందుకే అహ్మెద్ షా మసూద్ కి పంజ షీర్ సింహం అన్న బిరుదు ఇచ్చారు స్థానికులు. సోవియట్ సైన్యం వెనక్కి వెళ్లిపోయాక తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకోవాలి అని ప్రయత్నించినప్పుడు అహ్మెద్ షా మసూద్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు వాళ్ళని తన ప్రావిన్స్ అయిన పంజ షీర్ లోకి అడుగుపెట్టనివ్వలేదు. 1996 నుండి 2001 వరకు తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని పాలించినా పంజ షీర్ లో మాత్రం వాళ్ళ పాలన లేదు. అటువంటి అహ్మెద్ షా మసూద్ అంటే తాలిబన్లకి కూడా హడల్ ! ఇప్పటి వరకు కూడా తాలిబన్లు పంజ షీర్ లో అడుగుపెట్టలేకపోయారు అంటే అక్కడి ప్రజల్లో అహ్మెద్ షా మసూద్ మీద ఎంత ప్రేమ ఉందో అర్ధం చేసుకోవచ్చు… సెప్టెంబర్ 11,2001 లో అమెరికాలోని జంట టవర్లని కూల్చివేయడానికి రెండు రోజుల ముందు, అంటే… సెప్టెంబర్ 9,2001 న అల్ ఖైదా ఉగ్రవాదులు అహ్మెద్ షా మసూద్ ని హత్య చేశారు [పాకిస్థాన్ ISI అని అనుమానం ]. ఆ తరువాత అహ్మెద్ షా మసూద్ కొడుకు అహ్మెద్ మసూద్ తండ్రి వారసత్వాన్ని తీసుకొని ఇప్పటి వరకు పంజ షీర్ ని తాలిబన్ల నుండి కాపాడుతూ వస్తున్నాడు.
- అమృల్లాహ్ సలేహ్ [Amrullah Saleh] ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్ అయిన అమృల్లాహ్ సలెహ్… రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేకపోతే ఆపద్ధర్మ అధ్యక్షుడుగా వైస్ ప్రెసిడెంట్ కొనసాగవచ్చు అంటూ ఇప్పుడు తానే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడిని అని ప్రకటించుకున్నాడు… ఇది అష్రాఫ్ ఘని పారిపోయిన రెండవరోజునే ! ఇప్పుడు ఈ అమృల్లాహ్ సలేహ్ అహ్మెద్ మసూద్ తో చేతులు కలిపాడు. అమృల్లాహ్ సలేహ్ కూడా పంజ షీర్ ప్రావిన్స్ నుండి వచ్చినవాడే అన్నది గమనార్హం.
- అష్రాఫ్ ఘని [Ashraf Ghani ] తజికిస్తాన్ పారిపోయిన రెండవరోజే టెలివిజన్ లో ప్రత్యక్షం అయి తాను రక్తపాతం నివారించడానికే వెళ్లిపోయాను తప్పితే నేనెక్కడికి పారిపోలేదు. నేను మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వస్తాను తాలిబన్లని ఎదుర్కుంటాను అని ప్రకటించాడు. ఈ మాజీ అధ్యక్షుడు కూడా అహ్మెద్ మసూద్ తో చేతులు కలుపుతున్నాడు.
- Afghan National Defence and Security Forces (ANDSF) ఆఫ్ఘన్ నేషనల్ డిఫెన్స్ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్ [ANDSF]. ఇది మిలటరీ & పోలీస్ లకి చెందిన సంస్థ. అధ్యక్షుడు దేశం వదిలి వెళ్ళిపోవడంతో ఇప్పుడు మిలటరీ & పోలీస్ కి చెందిన అధికారులు, సైనికులు, పోలీసులు అందరూ తమ తమ ఆయుధాలతో పంజ షీర్ చేరుకున్నారు. ఇప్పుడు వీళ్లందరూ కలిసి అహ్మెద్ మసూద్ నాయకత్వంలో తాలిబన్లకి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లందరూ అమెరికా మరియు నాటో దేశాల మిలటరీ అధికారుల దగ్గర శిక్షణ పొందినవారే! కాస్తో కూస్తో అమెరికన్ ఆయుధాలని వాడడంలో అనుభవం ఉన్నవారే ! పారిపోయిన సైనికులు కూడా వివిధ మార్గాల ద్వారా మళ్ళీ పంజ షీర్ కి చేరుకుంటున్నారు. 3 లక్షల మంది సైన్యంలో ఒక లక్షమంది పంజ షీర్ చేరుకునే దారిలో ఉన్నట్లు తెలుస్తున్నది. వీళ్ళకి తోడు పంజ షీర్ లో ఉన్న సాయుధ దళాలు చెరిపోతాయి అన్నమాట.
RAW కీలక పాత్ర పోషిస్తున్నదా…?
Ads
అవుననే అనిపిస్తున్నది. పైన జరిగిన ఘటనలని, జరగబోయే ఘటనలని పోల్చుకుంటే ఇది ఖచ్చితంగా RAW వెనుక ఉండి ప్లాన్ చేసింది, చేయబోతున్నది అన్న సంగతి తెలిసిపోతున్నది… గత రెండు నెలల కాలంలో మాజారే షరీఫ్ లోని భారత కాన్సులేట్ కార్యాలయం దగ్గర ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులని పాకిస్థాన్ కి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కాల్చి చంపారు. అయితే ఈ ఘటన మీద పాకిస్థాన్ సైన్యం స్పందించింది: కాబూల్ లో భారత రాయబార కార్యాలయం ఉండగా మాజారే షరీఫ్ లో కాన్సులేట్ ఎందుకుపెట్టింది భారత ప్రభుత్వం అంటూ ఏడిచింది… మా మీద గూఢచర్యం చేయడం కోసమే భారత్ కి చెందిన రా ఆ ఇద్దరు ఆఫ్ఘన్ పౌరులని తమ ఏజంట్లుగా నియమించింది కాబట్టే మేము చంపాల్సి వచ్చింది అంటూ ఒక ప్రకటన ఇచ్చింది సైన్యం. అయితే ఇదేమీ అంత రహస్యమయిన విషయం కాదు. ఒక పక్క పాకిస్థాన్ ISI గూఢచారులు ఆఫ్ఘనిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతూ ఉంటే రా ఎలా చూస్తూ ఊరుకుంటుంది ? చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన నార్దర్న్ అలియన్స్ Vs నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్థాన్. ఈ రెండూ పాకిస్థాన్ కి వ్యతిరేకంగా ఉండే ప్రావిన్స్ లు.
పంజ షీర్‌లో భారీగా ఆయుధనిల్వలు..?
- వాషింగ్టన్ పోస్ట్ కధనం ప్రకారం… అహ్మెద్ మసూద్ దగ్గర పెద్ద ఆయుధ డిపో ఉంది. చాలా కాలంగా ఆయుధాలు కొని వాటిని భద్రంగా తన డిపో లో దాస్తూ వస్తున్నాడు మసూద్. ‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు అందుకే అధునాతన ఆయుధాలు స్టాక్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఆఫ్ఘన్ సైన్యo, పోలీసులు కూడా తమ ఆయుధాలని తీసుకొని వస్తున్నారు. నా సారధ్యంలో మా నాన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తాను. తాలిబన్ల ని ఈ దేశ పాలకులుగా నేను ఒప్పుకోను’’ అని అన్నాడు. ఈ వార్త వాషింగ్టన్ పోస్ట్ ది.
- ఇక ఉబ్జెక్ వార్ లార్డ్ అయిన దొస్తూం [Dostum] మరో వార్ లార్డ్ అయిన హాజీ మహమ్మద్ హకాకి [Haji Muhammad Muhaqiq] లతో పాటు షియా కమ్యూనిటీ నాయకుడు కూడా అహ్మెద్ మసూద్ తో చేతులు కలిపారు. అహ్మెద్ మసూద్ కూడా తజిక్ కమ్యూనిటీకి చెందినవాడే. వీళ్ళతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలో చిన్న చిన్న విభిన్న జాతుల వారు కూడా తాలిబన్లని ఇష్టపడరు.
- ఇక ఆఫ్ఘనిస్తాన్ జనాభా ప్రకారం వివిధ జాతుల వారి జన సంఖ్య ఎలా ఉందో చూద్దాం … పష్టూన్ భాష మాట్లాడే సున్నీముస్లిం 42%, తజక్ 27% , హజారా [షియా] 9%, ఉబ్జెక్ 9%, Aimaqs 4%,తుర్క్మెన్ 4%, బాలూచ్ 2% గా ఉన్నారు. వీళ్లందరిని తాలిబన్ల కి వ్యతిరేకంగా కూడగట్టడం అనేది ముందు ముందు జరగవచ్చు.
రష్యా-ఇండియా కాన్‌ఫ్లిక్ట్ తప్పకపోవచ్చా..?
తాలిబన్ల కి వ్యతిరేకంగా వీళ్లందరినీ కూడగట్టి పోరాడడం అనేది అంత సులభం కాదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కి అహ్మెద్ షా మసూద్ కి అసలు పడదు. అలాంటిది షా మసూద్ కొడుకు అహ్మెద్ మసూద్ సారధ్యంలో తాలిబన్ల మీదకి తిరిగబడితే చూస్తూ కూర్చోడు. తజక్, ఉబ్జెక్, తుర్క్మెన్ లని అహ్మెద్ మసూద్ తో కలవకుండా చూడడానికే ప్రయత్నిస్తాడు అంతో కొంత విజయం సాధిస్తాడు అన్నదీ నిజం. ఎందుకంటే వీళ్ళ బంధువులు చాలామంది తజకిస్థాన్, ఉబ్జెక్స్థాన్ లలో ఉన్నారు. ఈ దేశాలు అన్నీ ఒకప్పటి సోవియట్ రాష్ట్రాలు. అందులోనూ పుతిన్ మాజీ KGB గూఢచారి అన్న సంగతి మరువకూడదు. భారత్ ప్రయత్నాలకి శుక్రాచార్యుడులా పుతిన్ అడ్డుపడతాడు. ఈ విషయంలో భారత్ కి రష్యా కి చెడే ప్రమాదం ఉంది. So, రానున్న రోజుల్లో అమెరికా ఇటు అహ్మెద్ మసూద్ కి సహాయం చేస్తుంది.. పరోక్షంగా తాలిబన్ల కి సహాయం చేస్తుంది కాబట్టి అంతర్యుద్ధం తప్పదు… అంతర్యుద్ధం అంటూ వస్తే ప్రస్తుతానికి రష్యా, చైనా, పాకిస్థాన్ ల ప్లాన్స్ ఏవయితే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి తమ రాయబార కార్యాలయాలని మూసేసి వెళ్ళి పోవాలి. ఈసారి అమెరికా, రష్యా, చైనా, పాకిస్థాన్ లతో పాటు భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్ లో మైండ్ గేమ్ ఆడబోతున్నాయి. ఎవరిది పై చేయి అవుతుందో మరి కొన్ని వారాలలో తెలిసిపోతుంది, కాకపోతే జన నష్టం మాత్రం తప్పదు…!!
Share this Article