నాగసూరి వేణుగోపాల్ సోషల్ మీడియాలో పంచుకున్న ముచ్చట ఏమిటంటే… ‘‘దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాదుకి ఏ పెద్ద జర్నలిస్టు లేదా సంపాదకుడు వచ్చినా ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రసంగించడం అనేది ఆనవాయితీ! అటువంటి మహామహులను ఈ బడ్డింగ్ జర్నలిస్టులు కలిసే అవకాశం చాలా విలువైనది.
అలా లెక్చరిచ్చిన పత్రికాసంపాదకులకు పారితోషికం, వసతి వంటివి ఎలాగూ ఏర్పాటు చేయబడతాయి. ఇది ఒక పార్శ్వం కాగా, ఆ సంపాదకులు లేదా జర్నలిస్టులు, వారు ఇతర చోట్ల ఇటువంటి సదుపాయం గురించి, ఇటువంటి తర్ఫీదు ఇస్తున్న పత్రిక గురించి, పత్రికా యజమాని గురించి చెప్పడం కూడా ఆనవాయితీగా మారింది. అంటే ఇది ఒక డబల్ ఎడ్జడ్ స్ట్రాటజీ. ఒకవైపు ట్రైనీలు లాభపడతారు,మరో వైపు ఆ సంస్థ ఇమేజ్ ద్విగుణీకృత మవుతుంది.
ఒకసారి ఖుష్వంత్ సింగ్ వచ్చారట. ఆయన చాలా పెద్ద జర్నలిస్టు. ఒక సినిమా తారకు ఉన్నంత గ్లామర్ ను హిందుస్థాన్ టైమ్స్, ది ఇలాస్ట్రేటెడ్ వీక్లీ ఎడిటర్ గా ఆయన సొంతం చేసుకున్నారు. రామోజీరావు, తను ఈనాడు దినపత్రికకు చీఫ్ ఎడిటర్ అని పరిచయం చేసుకున్నప్పుడు; మరి ఎడిటర్లుగా ఎంత మంది పనిచేస్తున్నారు మీ దగ్గర అని అడిగారట. దానికి జవాబు ఏం చెప్పారో తెలియదు, కానీ అప్పటినుంచి ఈనాడు చీఫ్ ఎడిటర్ అనే స్థానంలో ఎడిటర్ అని రావడం మొదలైందట!
Ads
P.S: ఈ విషయం ఎడిటర్ గా పనిచేసిన ఒక ప్రముఖ వ్యక్తి కొన్నేళ్ల క్రితం ముఖాముఖి నాతో చెప్పారు!
ఇదే విషయంలో మంగు రాజగోపాల్ షేర్ చేసుకున్న ముచ్చట కూడా ఇంట్రస్టింగే…
చీఫ్ ఎడిటర్, ఎడిటర్ ఇన్ చీఫ్ లాంటి డిజిగ్నేషన్లు ఎన్నయినా ఇంప్రింట్ లో వేసుకోవచ్చు. అయితే చట్టప్రకారం ఎడిటర్ అనే డిజిగ్నేషన్ తో ఎవరో ఒకరి పేరు ఇంప్రింట్ లో విధిగా ఉండాల్సిందే. పత్రికలో వచ్చే కంటెంట్ కి ఎడిటర్ మాత్రమే రెస్పాన్సిబుల్ అవుతాడు. 1974 లో విశాఖలో ఈనాడు పెట్టినప్పుడు ఎడిటర్ గా ఏబికె ప్రసాద్ గారి పేరు మాత్రమే ఇంప్రింట్ లో ఉండేది. 1975 లో హైదరాబాద్ ఎడిషన్ పెట్టినప్పుడు ఎడిటర్ డిజిగ్నేషన్ తో మరో ఏడుగురు సీనియర్ జర్నలిస్టులు చేరారు. అప్పుడు ఇంప్రింట్ నుంచి ఏబికె గారి పేరు తీసేసి చీఫ్ ఎడిటర్ గా రామోజీ రావు గారు తన ఒక్కడి పేరు వేసుకోవడం ప్రారంభించారు. ఇంప్రింట్ లో తన పేరు మాయం చేసినందుకు ఏబికె గారు నొచ్చుకున్నారట కూడా.
ఇక నేను 1976 లో ఈనాడులో చేరినప్పుడు రామోజీరావు గారు కాకుండా ఎడిటర్ డిజిగ్నేషన్ తో ఉన్న సీనియర్ జర్నలిస్టులు ఎవరంటే…1. టివికె కృష్ణ గారు (సీనియర్ ఎడిటర్); 2. వి. హనుమంతరావు గారు (ఎడిటర్, స్టేట్ న్యూస్ బ్యూరో); 3. ఏబికె ప్రసాద్ గారు (ఎడిటర్, ఎడిటోరియల్స్); 4. పొత్తూరి వెంకటేశ్వర రావు గారు (ఎడిటర్, సెంట్రల్ డెస్క్); 5. రాంభట్ల కృష్ణమూర్తి గారు (ఎడిటర్, అడ్మినిస్ట్రేషన్ & ప్రిన్సిపాల్, జర్నలిజం స్కూలు); 6. చలసాని ప్రసాదరావు గారు (ఎడిటర్, ఆదివారం అనుబంధం); 7. పన్యాల రంగనాథరావు గారు (ఎడిటర్, సితార);
వీరిలో ఏబికె, వి.హనుమంతరావు, చలసాని ప్రసాదరావు గార్లు 1974 లో విశాఖ ఎడిషన్ పెట్టినప్పట్నించి ఉన్నారు. గజ్జెల మల్లారెడ్డి, రాచమల్లు రామచంద్రారెడ్డి, బూదరాజు రాధాకృష్ణ గార్లు తర్వాతి కాలంలో చేరారు. ఇదీ నాకు గుర్తున్న సమాచారం. తప్పులుంటే చెప్పండి… సవరించుకుంటాను.
Share this Article