Murali Buddha….. దాదాపు రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సరికి నా కోసం ఒకరు గేటు వద్దనే ఎదురు చూస్తున్నారు . నేను వచ్చాక ఏదో మాట్లాడి స్టైల్ గా చేతికి ఐడెంటిటీ కార్డు ఇచ్చాడు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా గలవారికి కూడా అంత నాణ్యమైన కార్డు ఉండదు . కార్డు నాణ్యతతో చాలా బాగుంది . అలా చూస్తూ ఉండిపోయాను . నేను కూడా రిపోర్టర్ ను ఐపోయాను అన్నాడు . టివి 9 సక్సెస్ అయ్యాక , 9 కి ముందో వెనుకనే కొన్ని అక్షరాలు , లేదా మరి కొన్ని తొమ్మిదులు చేర్చి చాలానే ఛానల్స్ వచ్చాయి .
అనంతరం ఈ తొమ్మిదులను చేర్చుకుంటూ పోతూ యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి . అందులో ఒక అనేక తొమ్మిదుల యూ ట్యూబ్ ఛానల్ లో తనను రిపోర్టర్ గా నియమించినట్టు ఐడెంటిటీ కార్డు చూపించాడు . ఎనీ బడి కెన్ డాన్స్ ( ఏబీసీ ) అని డాన్సర్ నటుడొకరు సినిమా తీసి జనం మీద వదిలినట్టుగా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా జర్నలిస్ట్ కావచ్చు అని మొత్తం జర్నలిజం మీదనే కక్ష తీర్చుకుంటున్నట్టు అనిపించింది . చక్కని ఐడెంటిటీ కార్డుతో నా ముందు నిలబడ్డ అతను మా మాజీ పని మనిషి భర్త …
నువ్వేమన్నా రాజకుటుంబం నుంచి జర్నలిజంలోకి వచ్చావా ? పని మనిషి భర్త జర్నలిస్ట్ కాకూడదా ? ఎంత అహంకారం అని తొందరపడి తిట్టకండి . మా రోజుల్లోనైనా , ఈ రోజుల్లో ఐనా ఎక్కువగా పేదవారు , దిగువ మధ్యతరగతి వారే జర్నలిజంలోకి వస్తున్నారు . మధ్యతరగతి ఐతే ఇంజనీరింగ్ చేసి అమెరికాకో, కెనడాకో , ఇంకో దేశానికో వెళ్లి పోతారు . ఆ విషయం నాకు తెలుసు . నా సందేహం అది కాదు . అతనికి చదువు రాదు , పని గండం .
Ads
శివశంకరి అనే పాటతో బాలకృష్ణ గాయకుడు అయినట్టు , వినేవాళ్ళు , చూసేవాళ్ళు ఉంటే ఎవరు ఏమైనా కావచ్చు అభ్యంతరం చెప్పడానికి నేనెవరిని . కానీ చదువు రానివారు జర్నలిస్ట్ ఎలా అవుతారు అనేదే నా అనుమానం . తరువాత ఆ అనుమానం తీరిపోయింది . అక్షరం ముక్క రావలసిన అవసరం , రాయాల్సిన అవసరం లేకుండా యూట్యూబ్ జర్నలిస్ట్ లను చేసేస్తుందని తెలిసింది .
*****
అతనితో మాట్లాడుతూనే యూట్యూబ్ లో రెండుకన్నా ఎక్కువ తొమ్మిదులు టైప్ చేసి చూశాను . ఓ ఛానల్ కనిపించింది . ఏడాది కాలంలో దాదాపు నాలుగు వందల మంది ఆ ఛానల్ చూశారు . ఇసుక మాఫియా అంటూ ఏదో స్టోరీ . విషయం అర్థమైంది . అది సరే, చదువుకోక పోయినా జర్నలిజంలోకి రావచ్చు అనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అని ఆసక్తిగా అడిగాను . అప్పుడప్పుడు అతను టెంపో నడుపుతాడు . టెంపోను ఓ యూట్యూబ్ ఛానలతను అద్దెకు తీసుకోని ‘‘నువ్వూ జర్నలిస్ట్ కావచ్చు అని ఐడెంటిటీ కార్డు అంటగట్టాడు . ( టెంపోకు అద్దె ఇచ్చాడో ఐడెంటిటీ కార్డుతోనే సరిపెట్టాడో నేను అడగలేదు, అతనూ చెప్పలేదు )
అతన్ని అడిగిన మొదటి ప్రశ్న నెలకు ఎంత ఇమ్మన్నాడు అని … భలే అడిగాను అని మనసులోనే నన్ను నేను అనుకున్నాను . ఎవరైనా ఉద్యోగం వచ్చింది అంటే , వెంటనే జీతం ఎంత అని అడుగుతారు . కానీ నేను ఎంత ఇమ్మన్నారు అని అడిగాను . నా ప్రశ్నకు అతనేమీ ఆశ్చర్యపోకుండా , ఇది కామన్ అన్నట్టు ఎంతో అనుభవజ్ఞుడిలా 25 వేలు ఇమ్మన్నాడు అని బదులిచ్చాడు . అతనికి 25 వేలు ఇవ్వాలి , నీకు ఎంతో కొంత కావాలి, ఇదంతా ఎలా వస్తుంది అని అడిగాను . అతను రాదా ? లీడర్లు ఇస్తారు కదా ? అని బదులిచ్చాడు .
నీకు స్మార్ట్ ఫోన్ ఉంటే రెండు వందలు ఖర్చు పెడితే జియో సిమ్ తో నువ్వే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయవచ్చు, ఇప్పుడున్న తొమ్మిదులకు మరో తొమ్మిది కలిపితే పేరు కోసం కూడా వెతకాల్సిన అవసరం లేదు అన్నాను . నాయకుల వద్ద బోలెడు వసూలు చేయవచ్చు అని ఉత్సాహంగా ఉన్న అతనికి అనుభవం ఐతే కానీ తత్త్వం బోధపడదు అని …
మన లోకల్ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, అతన్ని కలిసి నీ అనుభవం చెప్పు అని పంపించేశాను . అతను హనుమంతరావును.. కలిశారో లేదో తెలియదు, మళ్ళీ నన్ను ఎప్పుడూ కలువ లేదు . గర్భస్థ శిశువులా ఇంకా పురుడు పోసుకొని జర్నలిస్ట్ ను చంపేశానో లేదో తెలియదు .****95లో ఎన్టీఆర్ ను దించినప్పుడు అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది . బాబు శిబిరం , ఎన్టీఆర్ శిబిరాలుగా టీడీపీ విడిపోయింది .
ఈ రోజు వార్తలను మరుసటి రోజు రోజుకు గంట చొప్పున ప్రసారం చేసే రోజులు అవి .. కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు నర్రా రాఘవరెడ్డిని టీవీ ఛానల్ మహిళా రిపోర్టర్ ‘మీరు బాబు గ్రూపా ? ఎన్టీఆర్ గ్రూపా ?’ అని అడిగింది . రాఘవరెడ్డి కూడా టీడీపీ శాసనసభ్యులు అని ఆ అమ్మాయి అనుకుంది . అది విన్న తలపండిన జర్నలిస్టులు చాలామంది ఆ ప్రశ్నను ఘోరమైన తప్పుగా చూశారు . దాన్నే తప్పు అనుకుంటే ఈనాటి యూట్యూబ్ ఛానల్స్ జర్నలిజాన్ని ఏమనాలో ..
చిన్నప్పటి నుంచి హైదరాబాద్ నగరంలోనే జీవితం . చిన్నప్పుడు పలువురు పేరు మోసిన రౌడీల పేర్లు వినిపించేవి . పేర్లు వినే వణికిపోయే వాళ్ళం … ఆ పేర్లలో ఇప్పటికీ బతికి ఉన్న కొందరి దివ్య మంగళరూపాల్ని యూట్యూబ్ ఛానల్స్ వల్ల చూసే భాగ్యం లభించింది . ఆ పుణ్య దంపతుల ఇంటర్వ్యూలు , వారి నిజ గృహంబులను చక్కగా చూపిస్తున్నారు . నా బాల్యంలో పేరు మోసిన రౌడీలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో జాతిని ఉద్దేశించి చక్కని సందేశాలు కూడా ఇస్తున్నారు . యూట్యూబ్ ఛానల్స్ తరపున ఇంటర్ వ్యూ చేసేవారు సైతం వయసుకు మించిన నటనా కౌశలం ప్రదర్శిస్తూ వారు చెప్పే మాటలు వింటూ చక్కగా ఆశ్చర్యాన్ని నటిస్తున్నారు .
*****
యూట్యూబ్ ఛానల్స్ మాత్రమేనా ? మిగిలిన మీడియా పవిత్రమైనదా ? అనే ప్రశ్న రావచ్చు . పార్టీలకు అనుబంధం లేకుండా ఏ మీడియా లేదు . ఈ దేశంలో మీడియా పుట్టిందే పార్టీలకు అనుబంధంగా . బ్రిటిష్ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ , మీడియా , స్వతంత్ర సమరయోధులు ఒకే లక్ష్యంతో పని చేశారు . దేశానికి స్వతంత్రం తేవాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులే పత్రికలను ప్రారంభించారు . ఆ రోజులు , ఆనాటి మీడియా లక్ష్యాలు వేరు , ఇప్పుడు వేరు …
ఇప్పుడు శాసన సభ్యులే కాదు టికెట్ ఆశిస్తున్న వాళ్ళు , లోకల్ లీడర్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నారు . మా పార్టీ వాళ్లే యూట్యూబ్ ఛానల్స్ పెట్టి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల మీద ఫిర్యాదు చేశారు . డజన్ల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్న నాయకులు కూడా ఉన్నారు .
ఓ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ వెల్లువెత్తిన యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడుతూ… వీటిని ఎవరూ ఆపలేరు . కాలం గడిచిన తరువాత అబద్దాల ఛానల్స్ పోతాయి , నాణ్యత ఉన్నవి మిగులుతాయి అన్నారు . రోగాన్ని దాచిపెట్టుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు . రోగం ఉందని గుర్తిస్తే చికిత్స లభిస్తుందేమో . రాం గోపాల్ వర్మ జోస్యం నిజం కావాలి అని ఆశించడం తప్ప , ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు .
–
ఇది ఎన్నికల సీజన్… మండలాల వారీగా, నియోజక వర్గాల వారీగా రిపోర్టర్లు కావాలి అని ప్రకటనలు కనిపిస్తుంటాయి . ఇవి జీతాలు ఇచ్చే మీడియా సంస్థలు కాదు, పని చేయించుకొని డబ్బులు కూడా వసూలు చేసే సంస్థలు … జాగ్రత్త… -బుద్దా మురళి..
Share this Article