సోషల్ మీడియాలోని ఇరువర్గాల బురదను… మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చిపడిన వార్తల వరదను… ఎంత పరిశీలించినా అర్థం కాని ప్రశ్నలు కొన్ని అలాగే ఉండిపోయాయి… వాటికి జవాబులు తెలిస్తే తప్ప అసలు ఈ స్కామ్ ఏమిటో, స్కీమ్ ఏమిటో అంతుపట్టదు… 1) జస్ట్, నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందా..? అబద్ధం… 2) ఇప్పటికిప్పుడు వాళ్లతో మునుగోడు ఉపఎన్నికలో పొలిటికల్ ఫాయిదా ఏమైనా ఉంటుందా..? ఏమీలేదు… 3) మరి బీజేపీ ఆ నలుగుర్ని కొనేయడానికి అంత భారీ రేట్లతో ఎందుకు ప్రయత్నించినట్టు..? ఇది నిజమేనా అసలు..? అయినా రాజీనామాలు చేయించి గానీ బీజేపీ చేర్చుకోదు కదా, మరి ఇదేమిటి..?
4) ఒక్కొక్కరికీ వంద కోట్లు అట… సరే, నలుగురికీ కలిసి అడ్వాన్స్ 15 కోట్లు అట… ఎమ్మెల్యేలే మమ్మల్ని కొనడానికి ప్రయత్నిస్తున్నారు అని ఫోన్ చేసి, పోలీసులను రమ్మన్నారట… అప్పటికే టీవీ చానెళ్లు ఆ పరిసరాల్లో చేరి రికార్డింగులు చేసుకుంటున్నారట… పోలీసులు వెళ్లి ఆపరేషన్ భగ్నం చేశారట… ఈ పోలీస్ స్క్రిప్ట్ ఏమైనా నమ్మబుల్‌గా ఉందా..? తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ కొనుగోలు యవ్వారం మాకేమీ తెలియదు అన్నారట మీడియాతో… మరి పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ ఆపరేషన్ భగ్నం చేసినవాళ్లు అలా ఎందుకు చెబుతున్నట్టు..? అసలు చివరలో ఓ ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడటంతో వ్యవహారం బెడిసికొట్టిందని పత్రికల్లో డౌటనుమానాలు… ఎందుకలా చేసినట్టు..? అసలు వ్యూహం ఏమిటి..?
5) అసలు ఆ డబ్బు ఏది..? పోలీసులు దాన్ని చూపిస్తే ఈడీయో, సీబీఐయో, అవసరమైతే ఎన్ఐఏయో ఎంటరైతే కదా ఆ డబ్బు సోర్స్ ఏమిటో, ఏ ఖాతాల నుంచి వచ్చిందో, తేలుతుంది…? అబ్బే, డబ్బు దొరికిందని ఎవరు చెప్పారు అని ఉల్టా అడుగుతున్నారు పోలీసులు మీడియాను…
Ads
6) వాళ్లెవరో స్వాములట… ఈ కొనుగోళ్లకు తెగబడ్డారు సరే, వాళ్లు కిషన్‌రెడ్డికి సన్నిహితులట, సరే… కానీ చేరికల కమిటీకి బాధ్యుడు ఈటల కదా… కిషన్‌రెడ్డికి కొత్తగా ఈ కొనుగోళ్ల బాధ్యతలు ఎవరిచ్చారు..? ఫో, ఫోయి ఫలానాచోట ఎమ్మెల్యేలు ఉంటారు, కొనుక్కురాఫో, వారిలో ముగ్గురు ఆల్‌రెడీ గెలిచిన పార్టీ తెప్పలు తగలేసి వచ్చినవాళ్లే… అని చెప్పగానే ఆ బ్రోకర్ స్వాములు వందల కోట్ల నోట్ల కట్టల్ని గోనె సంచుల్లో నింపుకుని బయల్దేరారా..?
7) పోనీ, వంద కోట్ల చొప్పున కొనేంత సీన్ ఉందా వాళ్లకు..? 400 కోట్లు పెడితే ఏకనాథ్ షిండే రేంజ్‌లోనే దొరుకుతారు కదా… 8) దొరికినవాళ్లు బీజేపీకి సన్నిహితులు అని ఎస్టాబ్లిష్ చేయడానికి టీఆర్ఎస్ సోషల్ మీడియా, మీడియా విపరీతంగా ప్రయత్నించాయి… బోలెడు వీడియోలు, ఫోటోలు గుప్పించారు… అంటే అంతా ప్రీప్లాన్‌డ్ యవ్వారమేనా..?
9) తీరా చూస్తే లీగల్ ఒపీనియన్ తీసుకుని, తదుపరి విచారణ కొనసాగిస్తామంటున్నారట… మరి అరెస్టులు ఎలా చేసినట్టు..? ఇప్పుడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీద మాత్రమే ఎందుకు ఇష్యూ కేంద్రీకృతం అయి ఉంది..? 10) ఇంత సీరియస్ ఇష్యూ కదా, వెంటనే ఓ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే బెటర్ కదా… కెసిఆర్ బీజేపీని ఇంకా కార్నర్ చేయొచ్చు…
11) ఇలాంటి కీలకసందర్భాల్లో టీఆర్ఎస్ ఎందుకోగానీ కిషన్‌రెడ్డి పేరునే తెరపైకి తీసుకొస్తూ ఉంటుంది… ఆయనకేమో మైహోం రామేశ్వరరావు కావల్సినవాడు… ఆయనకు మేఘా కృష్ణారెడ్డి కావల్సినవాడు… నంబర్ వన్, నంబర్ టూ చానెళ్లయిన ఎన్టీవీ, టీవీ9 చానెళ్లు ప్లాన్ ప్రకారం యాంటీ-బీజేపీ ప్రచారాన్ని నిన్న సాయంత్రంపూట దుమ్మురేపాయి… ఫాఫం, ఆ ఇద్దరూ తమ ఫోల్డ్‌లోనే ఉన్నారనే పిచ్చి భ్రమల్లోనే ఉంది బీజేపీ ఇంకా… 12) కేసీయార్ ప్రతి శ్వాస రాజకీయం… తను ఆలోచించినంత వేగంగా బీజేపీ నుంచి ప్రతిచర్య ఉండదు… చేతకాదు… అసలు తెలంగాణలో పార్టీలో ఎవరిది పెత్తనమో ఎవరికీ తెలియదుగా…
13) దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల పరాజయంతో కేసీయార్ మునుగోడులో మరింత విశ్వరూపం చూపిస్తున్నాడు… ఈ స్థితిలో ఇలాంటి కొనుగోళ్ల కథలు, ఇతరత్రా ప్రచారాలు, పథకాలు బయటికి వస్తూనే ఉంటాయి… ఒకరోజంతా బీజేపీ తాటతీసి వదిలేస్తే సరి… అనేది ఓ ప్లాన్… అనుకున్నట్టే అమలు చేశారు… బీజేపీ బిక్కమొహం వేసింది… మరుసటిరోజు రాష్ట్రవ్యాప్త నిరసనలు… బీజేపీకి కడుక్కోవడానికే ఇక సరిపోతుంది…
14) కొంతలోకొంత బండి సంజయ్ ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు గానీ, సరిపోలేదు… తన మాటలు అసలు సగం అర్థమే కావు… నువ్వు నమ్మిన, నువ్వు పునర్‌నిర్మాణం చేసిన అదే యాదాద్రి దగ్గర, ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేస్తాను, నువ్వూ చేస్తావా అని కెసిఆర్ కు సవాల్ విసిరాడు… కానీ కేసీయార్ ఎలాగూ లైట్ తీసుకుంటాడుగా…? అసలు బీజేపీని ఫిక్స్ చేయడానికి రెండుమూడు రోజులుగా స్కెచ్ వేస్తున్నా సరే, చివరలో తిరగబడిందా..? ఇదీ అసలు డౌట్…
15) మునుగోడు పోలింగ్ ముగిసేదాకా కిషన్‌రెడ్డిని తెలంగాణ బీజేపీ రాజకీయాలకు దూరంగా ఉంచేయలేదా బీజేపీ హైకమాండ్..? పోనీ, యాదాద్రి దగ్గరకు కేసీయార్ ఎలాగూ రాడు, నిజంగానే బండి సంజయ్ వెళ్లి ‘ఈ పాపపు పనిలో మా పాత్ర ఏమీ లేదు… పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ప్రకటించవచ్చుగా… పార్టీకి ఆ నిజాయితీ ఉందా..? తెలంగాణ సమాజానికి ఆ సమాధానం ఇస్తారా..?
రసీదు, తప్పితే మసీదు… అంటే ఏ సాక్ష్యాధారాలు లేకపోతే దేవుడే దిక్కు అని… ఇలాంటి కేసులు ఎలాగూ ఎటూ తేలవు… సో, ఆ దేవుడి ఎదుటే సచ్ఛీలతను నిరూపించుకోవచ్చు కదా..? కనీసం తెలంగాణ సమాజానికి చెప్పొచ్చు కదా… ప్చ్, ఈ ప్రశ్నలకు అంతూపొంతూ లేకుండా పోతోంది సుమీ…
Share this Article