Bharadwaja Rangavajhala………. తెలుగు తెర రాముళ్లు….. ప్రభాస్ ఆదిపురుష్ సందర్భంగా తెలుగు తెర మీద ఇప్పటిదాకా రామపాత్రలు పోషించిన నటులను ఒక్కసారి గుర్తు చేసుకుందామే .
సర్వమంగళ గుణ సంపూర్ణుడైన రాముడిని దేవుడుగా కొలవడం ద్వారా మానవులు ఉన్నత ఆశయాలతో జీవించగలుగుతారు. ఆ ప్రేరణ నింపేందుకే కవులెల్ల నీ దివ్యకథ నెల్లరీతుల గొనియాడి ముక్తి గైకొండ్రు గాత!. అంటాడు అదేదో సినిమాలో నాగయ్యగారు. సరిగ్గా ఈ స్ఫూర్తితోనే టాలీవుడ్ లో అనేక మంది రామాయణాన్ని తెరకెక్కించి ధన్యులయ్యారు. రాముడిగా నటించి మరెందరో నటులు జన్మ పునీతం చేసుకున్నారు. టాలీవుడ్ టాకీ యుగంలోకి ప్రవేశించిన తర్వాత వచ్చిన తొలి రామాయణం శ్రీరామ పాదుకా పట్టాభిషేకం.
ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో యడవల్లి సూర్యనారాయణ నటించారు. తెలుగు తెర తొలి రాముడు ఆయనే. ఆ తర్వాత 1933లో వచ్చిన లవకుశతో పారుపల్లి సుబ్బారావు రాముడుగా నటించి మెప్పించారు. అదే కథతో ఆ తర్వాత పాతికేళ్లకు విడుదలైన మరో లవకుశలో రాముడుగా నటించిన నందమూరి తారక రామారావు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
Ads
ఎన్.టి.ఆర్ రంగ ప్రవేశంలో తెలుగుతెర మీద పౌరాణిక పాత్రల తీరుతెన్నులు మారిపోయాయి. ఆయన ఎంతటి ముద్ర వేశారంటే…రాముడు అనగానే కళ్లముందు ఆయన రూపమే సాక్షాత్కరించేంతగా ప్రభావం వేశారు. ఎన్.టి.ఆర్ మొదటిసారి రాముడుగా కనిపించిన చిత్రం చరణదాసి. ఎన్.టి.ఆర్, ఎఎన్నార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న ఈ సాంఘిక చిత్రంలో ఓ నాటకంలో రామారావు రాముడి గెటప్ లో కనిపిస్తారు.
తెలుగువారి తెరవేల్పు ఎన్.టి.ఆర్ తొలిసారి పూర్తి స్థాయిలో రాముడి పాత్రలో కనిపించింది తెలుగు చిత్రంలో కాదు. 1958లో వచ్చిన తమిళ సంపూర్ణరామాయణంలో ఎన్.టి.ఆర్ రాముడుగా నటించారు. ఆ సినిమా తెలుగులో డబ్ అయింది. అయితే అందులో ఎన్.టి.ఆర్ కు చుండ్రు సూర్యనారాయణ డబ్బింగ్ చెప్పారు.
ఆ సినిమా చూసే 1959లో ప్రారంభించిన లవకుశలో రాముడి పాత్రకు రామారావే బెస్ట్ అనుకున్నారు సి.పుల్లయ్య. లవకుశ సినిమాతో తెలుగుతెర మీద రాముడు అంటే రామారావే అనే భావన స్థిరపడిపోయింది. ఆ తర్వాత శ్రీ కృష్ణసత్య, శ్రీరామాంజనేయ యుద్దం, శ్రీ కృష్ణార్జున యుద్దం, శ్రీరామ పట్టాభిషేకం లాంటి చిత్రాల్లో రాముడుగా కనిపించి అలరించారు రామారావు. అయితే బాపు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ రామాంజనేయ యుద్దంలో రాముడుగా రామారావు చాలా అందంగా ఉంటాడు. ముఖ్యంగా ఓపెనింగ్ సాంగ్ మేలుకో శ్రీరామలో రామారావు విగ్రహం ఆడియన్స్ లో భక్తి బావాన్ని మేల్కొలుపుతుంది.
స్వీయ దర్శకత్వంలో ఆయన నిర్మించిన తొలి చిత్రం నిజానికి సీతారామకళ్యాణమే అయినా…అందులో రాముడుగా హరనాథ రాజును తీసుకుని తాను రావణుడి పాత్ర చేసి మెప్పించారు ఎన్.టి.ఆర్. ఆ తర్వాత చాలా కాలానికి ఆయనే దర్శకత్వం వహించిన శ్రీ రామ పట్టాభిషేకంలో రాముడుగా కనిపిస్తారు. చిత్తూరు నాగయ్య దర్శకత్వంలో రూపొందిన రామదాసు చిత్రంలో కూడా నందమూరి తారక రాముడే శ్రీ రాముడుగా తానీషా దగ్గరకు వెళ్లి రామదాసు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లిస్తారు. ఈ సన్నివేశంలో శ్రీరాముడి అనుజుడు లక్ష్మణుడుగా శివాజీగణేశన్ నటించడం విశేషం.
తెలుగు తెర మీద రాముడుగా రామారావు తర్వాత అంతటి ప్రేక్షకాభిమానాన్ని పొందిన నటులు ఇద్దరున్నారు. ఒకరు హరనాథ్ అయితే మరొకరు శోభన్ బాబు. వీరిద్దరి రామపాత్ర ధారణ వెనుక నందమూరి ఆశీస్సులు పుష్కలంగా ఉండడం విశేషం. రామారావుకన్నా ముందుగా రాముడి పాత్ర పోషించి అడియన్స్ ఆశీస్సులు అందుకున్న వాడు అక్కినేని నాగేశ్వర్రావు.
టాలీవుడ్ సెకండ్ జనరేషన్ హీరోలుగా పాపులర్ అయిన ఎన్.టి.ఆర్, ఎఎన్నార్ లు ఇద్దరూ తొలిరోజుల్లో పౌరాణికాలు చేసిన వారే. అక్కినేని తొలి చిత్రం సీతారామజననం. అందులో ఆయన శ్రీరాముడుగా కనిపిస్తారు. ఆ తర్వాత పౌరాణికాలకు కాస్త దూరం జరిగిన ఎఎన్నార్ చివర్రోజుల్లో శ్రీ రామరాజ్యంలో వాల్మీకిగా నటించి ఆ పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేసినట్టు కనిపించారు.
ఎన్.టి.ఆర్ తర్వాత శ్రీరాముడుగా కనిపించి ప్రేక్షకులతో అవుననిపించుకున్న హీరో హరనాథే. ఆయన్ని రాముడి పాత్రకు స్వయంగా రామారావే ఎంపిక చేయడం విశేషం. ఎన్.ఎ.టి బ్యానర్ లో తనే దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సీతారామ కళ్యాణంలో హరనాథ్ రాముడుగా కనిపిస్తాడు. రాముడుగా హరనాథ్ చాలా అందంగా ఉంటాడు.
స్వీయదర్శకత్వంలో రామారావే నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణం చిత్రంలో రామారావు రావణపాత్రలో కనిపిస్తారు. ఇది ఆయన గురువులుగా అభిమానించే చక్రపాణి, కె.వి.రెడ్డిలే మెచ్చలేదు. పైగా వద్దన్నారు. కానీ తను అనుకున్న పని చేసి తీరే రామారావు అనుకున్నట్టుగానే హరనాథ్ ను రాముడుగా డైరక్ట్ చేశారు. శబాష్ అనిపించారు. ఆ తర్వాత హరనాథ్ పద్మనాభం తీసిన శ్రీరామకథలోనూ రాముడుగా ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తారు.
హరనాథ్ తర్వాత రాముడుగా సక్సస్ అయిన వాడు ఆంధ్రుల అభిమాన అందాల నటుడు శోభన్ బాబు. అరవై దశకంలో వచ్చిన గుమ్మడి పోతనలో శ్రీరాముడుగా మొదటి సారి తెరమీద కనిపించారు శోభన్ బాబు. ఆ తర్వాత బాపు సంపూర్ణ రామాయణంలో నందమూరి తారక రామారావు ఆశీస్సులతో పూర్తి స్తాయి రాముడుగా నటించి హిట్ అయ్యారు.
శోభన్ బాబుతో సంపూర్ణరామాయణం తీయబోతున్న విషయాన్ని ముందుగా రామారావుకే చెప్పారు బాపు రమణలు. మొదట ఆశ్చర్యపోయినా… ఆ తర్వాత అభినందించారు నందమూరి. చిత్రం విడుదలయ్యాక మొదటి రోజు కలెక్షన్స్ డల్ అయిన సందర్భంలో ఖంగారు పడకండి… టాక్ పికప్ అవుతుంది. సినిమా హిట్ అవుతుందని ధైర్యం చెప్పిందీ రామారావే.
డెబ్బై దశకంలో పౌరాణికాలు దాదాపు తగ్గిపోయాయి. దర్శకుడు బాపు రామాయణం మీద ప్రత్యేకాభిమానంతో ఒకటి రెండు ప్రయత్నాలు చేశారు. ఈ జనరేషన్ లోనూ ప్రాపర్ గా తీస్తే పౌరాణికాలు జనం చూస్తారని శ్రీ రామరాజ్యంతో నిరూపించారు కూడా. బాపు తీర్చిదిద్దిన రాముళ్లుగా శోభన్ బాబునీ, రవినీ, నందమూరి బాలయ్యలను చెప్పుకోవాలి.
1934 ప్రాంతాల్లో తెలుగులో సీతాకళ్యాణం పేరుతో ఒక చిత్రం వచ్చింది. అందులో ప్రముఖ సంగీత విధ్వాంసుడు కళ్యాణి వెంకట్రావు శ్రీరాముడుగా నటించారు. అదే టైటిల్ తో సెవెంటీస్ లో బాపు రవి అనే కొత్త నటుడ్ని తీసుకుని రాముడుగా తీర్చిదిద్ది… ఔరా అనిపించారు. ఆ తర్వాత నందమూరి బాలయ్యను శ్రీరాముడుగా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేసిన ఘనత కొట్టేశారు బాపు. శ్రీ రామరాజ్యం చిత్రంలో బాలయ్యను చూసిన ఆడియన్స్ లవకుశలో రామారావును చూసిన అనుభూతి పొందారా అనేది అనుమానమే. పొందినట్టు నటించారా అనేది కూడా అనుమానమే.
రాముడుగా నందమూరి వంశం మూడో తరం హీరో తారక్ కూడా నటించాడు. కూచిపూడి ప్రాక్టీస్ చేసిన తారక్ తొలి చిత్రం బాల రామాయణం కావడం విశేషం. గుణశేఖర్ దర్శకత్వంలో మల్లెమాల నిర్మించిన ఈ చిత్రంలో అంత చిన్న వయసులోనే రాముడుగా నటించేశాడు .. జూనియర్ ఎన్.టి.ఆర్ ఎందుకేనా మంచిదని .
టాలీవుడ్ లో ఎంతమంది రాముడి పాత్రలో కనిపించినా…మెప్పించినా…ప్రేక్షకులతో బాగున్నారనిపించుకున్నా…మనస్సుల్లో స్థిరపడిపోయిన రాముడు మాత్రం నందమూరి తారక రాముడే. అయితే ఇప్పుడు ప్రభాస్ రాముడుగా ఎలాంటి ప్రభావం వేయబోతున్నాడు? … ఈ సినిమా విజయం తర్వాత పౌరాణిక చిత్రాలకు పూర్వవైభవం వస్తుందా అని చర్చలు సాగుతున్నాయి. మరి ప్రభాస్ ఆ రేంజ్ లో తెలుగు తెర రాముళ్ల వారసత్వాన్ని నిలబెడతాడో లేదో రేపు విడుదల అవుతున్న ఆదిపురుష్ చూస్తే గానీ చెప్పలేం…
Share this Article