అదుగో విడిపోతున్నారు… ఇవిగో ఆ సందేహాలకు సంకేతాలు… నుంచి మొదలుపెట్టి… ఇంతకీ ఎందుకు విడిపోయారో తెలుసా..? అనే దాకా సినిమా సెలబ్రిటీల పర్సనల్ విషయాల్లోకి మీడియా దూరుతూనే ఉంటుంది, రాస్తూనే ఉంటుంది… ఎవరెన్ని విమర్శలు చేస్తున్నా సరే ఈ ధోరణి దశాబ్దాలుగా ఉంది…ఇక సోషల్ మీడియా వచ్చాక ఈ ధోరణి చెలరేగిపోయింది… ఎవడూ ఏదీ వినడు… రాసేస్తాడు, కూసేస్తాడు… కేసులు, నోటీసులు, బెదిరింపులు గట్రా పనిచేయనంత ఇమ్యూనిటీ వచ్చేసింది… ఎస్, లవ్వులు, అఫయిర్స్, బ్రేకప్పులు, పెళ్లిళ్లు, పెటాకులు కామన్… సినీరంగమే అనేముంది..? బయట కూడా అంతే కదా…ఇంతకుముందు సమాజ భయమో, ఆర్థిక పరాధీనతో, పిల్లలో… కారణాలేమైనా కావచ్చు, సంసారాల్లో సర్దుబాట్లు ఉండేవి… ఇప్పుడు అలా కాదు… చిన్న చిన్న ఈగోలు సైతం, అక్రమ సంబంధాల అనుమానాలు సైతం బంధాల్ని పుటుక్కున తెంచేస్తున్నయ్… ఇది కాలం తెచ్చిన మార్పు, ఇది ఆ డిబేట్ కాదు…నటుడు, గాయకుడు, స్వరకర్త జీవీ ప్రకాష్, గాయని సైంధవిలు విడాకులు తీసుకుంటున్నారు… బజారుకెక్కి గొడవలకు దిగలేదు, రచ్చకు తావివ్వలేదు… పరస్పరం గౌరవంతోనే, చాలా ఆలోచించి ఈ విడిపోయే నిర్ణయానికి వచ్చామనీ, మా ప్రైవసీని గౌరవించాలని, ఈ నిర్ణయం మా ఇద్దరి ప్రయోజనం కోసమే అని ఆ జంట విజ్ఞప్తి చేసింది… కారణాలు ఏమైనా సరే, వాళ్ల బంధం తెగిపోయింది…కానీ సోషల్ మీడియా ఈ పెటాకులకు కారణాలు ఇవీ అని బోలెడు వార్తలు రాసేస్తోంది… దాంతో… ‘బాబ్బాబు, మా ప్రైవసీని గౌరవించడర్రా, ఇదేనా మన తమిళ సంస్కృతిలోని సుగుణం..? ఎందుకు విడిపోతున్నామో మా స్నేహితులకు, బంధువులకు అందరికీ తెలుసు… ఏవేవో ఊహాజనిత కథనాలు దేనికి..?’ అంటూ ప్రకాష్ వాపోయాడు… ప్చ్, లాభం లేదు… నిజానికి వాళ్లది మంచి లవ్ స్టోరీయే…బాల్య స్నేహితులు వాళ్లు… ప్రకాష్ పాపులర్ స్వరకర్త రెహమాన్‌కు మేనల్లుడు కావచ్చు బహుశా… ప్రకాష్ చాలాాకాలంగా పాడుతున్నాడు, సంగీత దర్శకత్వం చేస్తున్నాడు, నటిస్తున్నాడు, నిర్మాత కూడా… ఇలా బహుముఖ ప్రతిభ… సైంధవి కూడా కర్నాటక శాస్త్రీయ సంగీతం చేర్చుకుంది, చాన్నాళ్లుగా పాడుతోంది… దాదాపు పదేళ్లపాటు వాళ్లు కలిసి తిరిగారు… తరువాతే 2013లో పెళ్లి చేసుకున్నారు…సినిమా ఫీల్డు ఎలా ఉంటుందో, మీడియా కన్ను ఈ ఫీల్డు మీద ఎలా ఉంటుందో తెలియనివాళ్లేమీ కారు… 2022లో అవని అని ఓ బిడ్డ కూడా పుట్టింది… ఐనా ఏవో అభిప్రాయభేదాలు… చాన్నాళ్లుగా టరమ్స్ బాగా లేవు… ఇక కలిసి ఉండలేమని అనుకున్నారు… గుడ్ బై చెప్పుకున్నారు… ఎస్, అనేకరకాల ఊహాగానాల వార్తల పట్ల ప్రకాష్ బాధలో అర్థముంది… కానీ ఎవరూ ఏమీ చేయలేని అసహాయత కూడా నెలకొని ఉంది… ఎవడేమయినా రాసుకోనీ అనుకొని సైలెంట్ అయిపోవడం ఒక ఉత్తమ మార్గం… పని మీద మనసు లగ్నం చేయడం..!!
Share this Article