పండుగ అంటే..? ఏముంది..? జొమాటో లేదా స్విగ్గీ నుంచి ఏవైనా స్పెషల్స్ ఆర్డర్ పెట్టుకోవడం… నోట్లో కుక్కుకుంటూ టీవీలకు కళ్లు అతికించడం… ఆది వెగటు పంచులో, రాంప్రసాద్ వెకిలి డైలాగులో, స్త్రీముఖి భీకరమైన యాంకరింగో… తప్పేదేముంది..? ఇంట్లోనే దొరికే ఏకైక వినోదం కదా..! లేదంటే ఓటీటీలో ఏదైనా సినిమా ఓపెన్ చేసి చూడటం… ఇదీ ఈతరం నగర ఉగాది…
ఇప్పటికీ ఊరి ఉగాది లేదా సంప్రదాయ ఉగాది వేరు… తలస్నానాలు… మామిడాకులు కట్టాలి, ఉగాది పచ్చడి చేయాలి, భక్ష్యాలు (బొబ్బట్లు, హోలిగె) చేసుకోవాలి, మామిడి పులుసు, మామిడి పప్పు, మామిడి తొక్కులు చేసుకోవాలి… తెలిసిన పూజ చేసుకోవాలి… సాయంత్రానికి ఏదైనా గుళ్లో పంచాంగశ్రవణం… ఓపిక ఉంటే సాయంత్రం బజ్జీలో, పకోడీలో వేయించుకోవాలి…
తెలుగు పండుగ కాబట్టి వేరే భాష చానెళ్లలో పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు… మన టీవీల్లో పండుగ స్పెషల్స్ వేస్తారు… సోది, ఒకే మూస… కాకపోతే ఒకటీఅరా తళుక్కులు… ఈమధ్య మన తెలుగు చానెళ్లు ముఖ్యమైన పండుగలకు కూడా స్పెషల్స్ మానేస్తున్నారు… కాకపోతే ఈసారి దసరా సినిమా ప్రమోషన్ డబ్బుల కోసం స్పెషల్స్ తీసుకొస్తున్నాయి…
Ads
తీసుకొస్తున్నాయి కదా, జీతెలుగు వాడికి ఆత్రం ఎక్కువ… పండుగపూట వేరే చానెళ్లతో పోటీపడే తలంపు లేదు… తమ స్పెషల్ షోలో పెద్దగా అట్రాాక్షన్స్ కూడా లేవు… అందుకే ఆదివారం ప్రసారం చేసేసి మమ అనిపించేసింది… దాని పేరే ఉగాది మాస్ ధమాకా అవార్డ్స్… విష్వక్సేన్ రాబోయే సినిమా ప్రమోషన్… అందులో శ్రీముఖి, రోహిణి, విష్వక్సేన్, ఇమ్మూల బూతు పంచాంగం గురించి నిన్న చెప్పుకున్నాం కదా… ఆ షో గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
ఇక ఈటీవీ అంటేనే ఓ వింత గోల… తెలుసు కదా… ఈసారి పండుగ కోసం కలిసుందాం రండి అని ఓ స్పెషల్ షో చేశారు… పండుగపూట ఉదయం 10 గంటలకు… (మాటీవీలో రాబోయే పండుగ స్పెషల్‌తో క్లాష్ లేకుండా… ఎవరి టీఆర్పీలు వాళ్లవే అన్నమాట… మాటీవీ పండుగ స్పెషల్ మధ్యాహ్నం 12 గంటలకు…)
అదే టీం… అదే ఆది, అదే రాంప్రసాద్, అదే బ్యాచ్… ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అదనపు పండుగ షో అన్నమాట… కాస్త వెరయిటీగా చేద్దామనే సోయి కూడా ఉండదు ఈటీవీకి… కాకపోతే ఈసారి ఒకప్పటి హీరోయిన్ లయను దింపారు.., ఆమె సినిమా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నిస్తూ టీవీల ప్రోగ్రాములకు వస్తోంది… పాపం శమించుగాక… ఇప్పుడొస్తున్న కొందరు హీరోయిన్లతో పోలిస్తే లయ ఈరోజుకూ హీరోయిన్ లుక్కే…
కాసేపు కార్తికేయ హడావుడి, మాళవిక తళుక్కు… కాకపోతే ఒక భరతనాట్యం డాన్స్ బిట్ బాగున్నట్టుంది ప్రోమో ప్రకారం…, ఒక సాంగులో లేడీ మృదంగం హైలెట్… తోడుగా ఒక మగ ఫ్లూట్… అయితే ఈ ఒకటీఅరా మెరుపుల కోసం ఆ పాత బ్యాచ్‌ను పండుగపూట భరించడం కష్టసాధ్యమే… ప్రత్యేకించి ఆది హోస్టా, ముఖ్యఅతిథా, జడ్జా అర్థం కాదు… ఆది చెప్పినట్టుగానే ఈటీవీ క్రియేటివ్ టీమ్స్ ఎందుకు నడుస్తాయో, ఎందుకంతగా మోస్తాయో అస్సలే అర్థం కాదు…
మాటీవీలో 12 గంటలకు ఓ స్పెషల్ షో… ప్రోగ్రాం పేరు మా ఇంటి పండుగ… 12 ఫ్యామిలీస్‌తో హడావుడి… మాటీవీలో స్పెషల్ అంటే తెలుసు కదా… బిగ్‌బాస్ కొనసాగింపు యవ్వారాలు అన్నట్టుగా ఉంటుంది… సీరియల్ నటులు కొందరు సరేసరి… చెప్పాల్సిన పనేముంది..? అవినాష్ సందడి ఎక్కువ ఉంటుంది… ఈసారి పండుగ స్పెషల్‌లో రామాచారి అనే కేరక్టర్‌ను చూడొచ్చు… ఆయన ఎవరంటే..?
వర్తమాన సినీగాయకుల్లో అధికులకు శాస్త్రీయం, గమకాలు గట్రా ఏమీ తెలియవు… ఏ జానర్ పాట ఎలా పాడాలో బేసిక్స్ చెబుతాడు ఈ రామాచారి… అనేకమంది గాయకులకు ఆయన గురువు… ఆయన చెప్పిన చిట్కాలతో వీళ్లు పాపులర్ అయిపోతుంటారు… సునీత, కల్పన వంటి కొందరి శిక్షణ, అనుభవం, సాధన వేరు… ఈసారి పండుగ షోలో ఓ తాత, ఓ బామ్మ పెళ్లి (ఓ టీవీ ఆర్టిస్టు సొంత తాత, బామ్మ అయి ఉంటారు) సరదాగా బాగున్నట్టు కనిపిస్తోంది… ఇక నాని దసరా ప్రమోషన్ సరేసరి… కాకపోతే విశ్వనాథ్ పాటల సంస్మరణ, ఆర్టిస్టుల పాటలకు నర్తన బాగున్నయ్…
చెప్పడం మరిచాను… ఆమధ్య కాంతార స్పూఫ్ ఈటీవీలోనే నూకరాజు చేశాడు… ప్రభావవంతంగా ప్రజెంట్ చేశాడు… ఇప్పుడు ఎవరో డాన్స్ మాస్టర్ తన టీంతో మాటీవీ పండుగ స్పెషల్ షోలో ఓ బిట్ చేసినట్టున్నాడు… నిజానికి కాంతార వేషధారణతో బలంగా ప్రజెంట్ చేయడం కష్టమైన పనే… ప్రోమో చూస్తే మాత్రం బాగానే రక్తికట్టించినట్టుగా కనిపిస్తోంది…
Share this Article