హైదరాబాద్ లో 2012లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన శాస్త్రవేత్తలు మూడు రోజులపాటు జీవ వైవిధ్య పరిరక్షణ గురించి శాస్త్రీయంగా వివరించారు. శాస్త్రీయ విషయాలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో మన నిర్లక్ష్యం హిమాలయంకంటే ఎత్తయినది. దీపంలో ఒత్తి కుడి వైపు ఉండాలా? తూర్పును చూడాలా ? ఒక ప్రమిదలో రెండు ఒత్తులు వేయాలా? రెండు ప్రమిదల వెలుగు ఎదురెదురుగా చూసుకోవాలా? అన్నవే మనకు పరమ శాస్త్ర, ప్రాణాధార విషయాలు. భక్తి ఛానెళ్లు, యూ ట్యూబులు వచ్చాక ప్రతివాడు వేదానికి భాష్యం చెప్పేవాడే. వెలుగుకు దిక్కేమిటి? అన్ని దిక్కులకు దిక్కయిన దేవుడికి ఒక దిక్కేమిటి? అన్న చిన్న లాజిక్ మిస్సయిపోయాం. జీవ వైవిధ్య సదస్సులో ఒక శాస్త్రవేత్త సమర్పించిన పత్రం ప్రకారం- ప్రకృతి తనను తాను చాలా సహజంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది. మార్చుకుంటుంది. మన ఇళ్లల్లో పై కప్పు మీద ఒక బల్లి ఉంటే- రాత్రిళ్లు అది తిరుగుతూ మన కంటికి కనిపించనంత చిన్న పురుగులను గంటకు ఆరొందల చొప్పున తింటుంది. మనకు బల్లి అసహ్యం. కానీ వేలకొద్దీ కంటికి కనిపించని పురుగులతో సహజీవనం చేస్తూ చాలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం.
ప్రవహించే నదిలో మునక వేయాలే కానీ- నూనెలు, సోపులు, షాంపూలతో స్నానం చేయనే కూడదని మన ఆచారం స్పష్టంగా చెబుతోంది. ఎంతమంది పాటిస్తున్నారు? కొమ్మల్లో పువ్వులను గోళ్లతో గిల్లకుండా వేళ్లతో తీయాలని శాస్త్రం చెప్పింది. ఎంతమంది పాటిస్తున్నారు? నిజానికి అంత సున్నితమయిన పూరెమ్మను గోళ్లతో గిల్లితే ఆ చెట్టుకు మన గోళ్లల్లో ఉన్న విషమో, మలినమో ఎక్కుతుందనే వేళ్లతో సున్నితంగా తీయాలని ప్రకృతిని రక్షించే, గౌరవించే ఆచారంగా పెట్టారు.
“నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాంపతయే నమః”
Ads
శివుడి నమకంలో ఈ మాట ఉంది. చెట్టుగా ఉన్నది శివుడే. చెట్టు కొమ్మగా ఉన్నది శివుడి తల వెంట్రుకలే. మనకు ఆహారభిక్ష పెట్టే ఆ చెట్టుకు, కాయలు, పండ్లు ఇచ్చే ఆ చెట్టు కొమ్మకు, ఆ చెట్టులో- కొమ్మలో ఉన్న ప్రాణశక్తి అయిన శివుడికి నమస్కారం. ఇలా పూజిస్తే చెట్టు కొమ్మను నరకగలమా? తీగను గోళ్లతో గిల్లగలమా?
ఒక్కో భౌగోళిక ప్రాంతంలో కొన్ని అలవాట్లు ఆచారాలుగా స్థిరపడతాయి. అవే సంప్రదాయాలుగా మారతాయి. ఇంతకంటే లోతుగా వెళ్లడం ఇక్కడ అనవసరం. ప్రకృతి మొత్తాన్ని దైవంగా చూస్తూ వేద ఇతిహాస పురాణాలన్నీ పరవశించి గానం చేశాయి. ప్రకృతిని శక్తిగా ఆరాధించడమే మంత్రాల సారం. మనం వికృతిలో జీవిస్తూ ప్రకృతి మంత్రాలను పఠిస్తుంటాం. అందుకే ఫలితం సహజసిద్ధంగా అందదు.
హైదరాబాద్ ఐఐటీలో తాజాగా ఒక పరిశోధన జరిగింది. మనం రోజూ వాడే రసాయనాలతో కూడిన సబ్బులు, టూత్ పేస్టులు, డియోడరెంట్ల వల్ల నాడీవ్యవస్థ నిర్వీర్యమవుతోన్నది ఈ పరిశోధన సారాంశం. శరీరంలో ఒక అవయవానికి మరో అవయవానికి లింక్ నాడీ వ్యవస్థే. రక్తం, ప్రాణ వాయువు సరఫరాకు కీలకం నాడులే. అందుకే ఏ మాత్రం తేడా ఉన్నా ముందు నాడి పట్టి చూసేవారు. సబ్బులు, పేస్టులు, డియోడరెంట్లలో వాడే, లేదా అవి ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి వాడే రసాయనాలు శరీరంలో జీర్ణమై నాడీ వ్యవస్థను బలహీనపరుస్తోందట.
ఇదివరకు బొగ్గుపొడి, వరిపొట్టు కాల్చిన బూడిద, ఉప్పు, వేప పుల్లలతో పళ్లు తోమేవారు. కుంకుడుకాయతో తలంటే వారు. ఒంటికి సున్నిపిండితో నలుగు పెట్టుకునేవారు. సంతూర్ సబ్బు వాడిన అమ్మాయిని ప్రిన్స్ మహేష్ బాబు కాలేజీ నవ యవ్వన లావణ్యవతి అనుకుని వెంటపడితే ఆమె కూతురు వచ్చి మమ్మీ అనగానే మహేష్ బాబుతోపాటు మనం కూడా అవాక్కవుతున్నాం. అక్కినేని నాగసమంతమ్మ చెప్పే ఉప్పు జ్ఞానం ఉప్పు సముద్రంకంటే లోతయినది. ఫాగ్ డియోడరెంట్ చల్లుకోగానే ఊళ్ళో అమ్మాయిలంతా ఇల్లు, ఒళ్లు మరిచి ఆ డియోడరెంట్ చల్లుకున్నవాడి వెంటపడతాడు.
ఐఐటీలో ఇలాంటి పరిశోధనలు జరుగుతున్నందుకు సంతోషం. కృత్రిమ రసాయనాలను దట్టించి నోట్లో పళ్లు, ఒంట్లో నాడులను నాశనం చేసే పేస్టులు, సబ్బులను ప్రచారం చేసే ప్రకటనలను, ఆ ప్రకటనల్లో పరవశించి నటించే సెలెబ్రిటీలను అడ్డుకోవడానికి ఏ పరిశోధన జరగాలి? ఏ పరిశ్రమ జరగాలి?
అన్నట్లు- ఫెయిర్ అండ్ లవ్లీలో ఫెయిర్ పదం తీసేసి గ్లో అండ్ లవ్లీ అని పెట్టారు. పైగా మామూలు గ్లో- కాంతి కాదట. హై డెఫినిషన్- హెచ్ డి కాంతట. నెక్స్ట్ 4కె . ఆపై 8కె . అందచందాల్లో మన బుద్ధిమాంద్యమే మనకు శ్రీరామరక్ష!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article