ఒక టీవీ చానెల్ అయిదారొందల కోట్లతో కొనడం కాదు… కోట్లకుకోట్ల కాయలు కోసుకోవడం కాదు… పాత్రికేయంలో ఓ టేస్ట్ ఉండాలి, ఆ టీవీ నడుస్తున్న తీరుపై ఓ నిఘా ఉండాలి… అత్యంత భారీ ప్యాకేజీలతో పనిచేస్తున్న ముఖ్యుల పనితీరు మీద విశ్లేషణలుండాలి… వార్తల నాణ్యతపై సొంత పరిశీలన ఉండాలి… పెద్ద తలకాయలతో మహిళా ఉద్యోగినులకు ఏమైనా సమస్యలొస్తున్నాయా చూసుకోవాలి… ఎవరికైనా అమ్ముడుబోతున్నారా చెక్ చేసుకోవాలి… అన్నింటికీ మించి చానెల్ కవరేజీ తీరుపై ప్రజలు, ప్రేక్షకుల స్పందన ఏమిటో తెలుసుకోవాలి……. ఎహె, ఈ నీతులన్నీ దేనికి అంటారా..? ఏమో, నిన్న సాయిధరమ్ తేజ ప్రమాదంపై టీవీ9 ప్లస్ ఇతర తెలుగు చానెళ్ల ఓవరాక్షన్ మీద తెలుగు సోషల్ మీడియా బూతులతోనే దాడి చేసింది… మీమ్స్, పోస్టులు, వ్యంగ్య వ్యాఖ్యలు, తిట్లు… ఈ స్థాయిలో టీవీ9 మునుపెప్పుడూ జనం నుంచి ఛీత్కారం ఎదుర్కోలేదేమో…
ఇంతకుముందు వేరు, ఎవరు ఏం పిచ్చిప్రయోగాలు చేసినా నడిచింది… ఇప్పుడలా కాదు, ఏ టీవీ ఏ అంశంపై ఏ లైన్ తీసుకుంటున్నదో తక్షణం పట్టేసుకుని, నచ్చకపోతే ఇరగేస్తున్నారు నెటిజనం… ఏబీఎన్, టీవీ5, టీన్యూస్, సాక్షి టీవీ తమ రాజకీయ అనుబంధాలు, ధోరణుల కారణంగా ఎప్పుడూ సోషల్ మీడియా నిఘాలోనే, తిట్లలోనే ఉంటుంటాయి… టీవీ9 కథ వేరు… దరిద్రగొట్టు బార్క్ రేటింగుల పుణ్యమాని మస్తు డబ్బు చేసింది దానికి ఒకప్పుడు… ఇప్పుడేమిటో తెలియదు… కానీ ఇప్పుడు కడిగేందుకు సోషల్ మీడియా ఉంది… ఎదవ్వేషాలు వేస్తే ఎక్కీదిగుతున్నది సోషల్ మీడియా… బట్టలిప్పేస్తోంది… శ్రీదేవి చనిపోయినప్పుడు ఆ చానెల్ ముఖ్యుడొకరు అటాప్సీ ఏమిటో కూడా తెలియకుండా… ‘ఆటో స్పై‘ టెక్నాలజీ అన్నప్పుడు గానీ, ఓ బాత్ టబ్‌లో రిపోర్టర్‌ను పడుకోబెట్టి స్టోరీ ప్రజెంట్ చేసినప్పుడు గానీ… మొన్నీమధ్య ఓ లేడీ జర్నలిస్టు ఆకాశాన్ని రుధిరం అనే అజ్ఞానప్రదర్శన చేసినప్పుడు గానీ, అంతకుముందు నీటి గురుత్వాకర్షణ శక్తిని బోధించినప్పుడు గానీ… అనేక సందర్భాల్లో టీవీ9 మీద ఏ రేంజ్ ఏవగింపు ప్రదర్శించారో చూశాం, ఈమధ్యే అఫ్ఘన్‌లో పంజ్ షీర్ యుద్దం అంటూ టీవీ9 హిందీ చానెల్ ఏదో వీడియో గేమ్ సీన్స్ ప్రసారం చేసిందట…
Ads
ఎస్.., సాయిధరమ్ తేజ ఎదుగుతున్న హీరో, పైగా పాపులర్ మెగా క్యాంప్ సభ్యుడు… నిజానికి అది కాదు, వ్యక్తిగతంగా తను మంచివాడు… విజయవాడలో వృద్ధుల కోసం ఓ హోం కట్టించాడు… తెలుగు సినిమా మందలో కనిపించే ఓ రేర్ పీస్… ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు ఈవిషయాన్ని… అందుకే తన క్షేమం పట్ల అందరికీ ఓ ఆరాటం… తప్పో, పొరపాటో ఏదో ఒకటి, తన స్పోర్ట్స్ బైక్ స్కిడయింది, ప్రమాదం జరిగింది… ఇక పదే పదే అవే వార్తలు, ఇంటి దగ్గర ఓ కెమెరా, హాస్పిటల్ దగ్గర ఓ కెమెరా, ఆ బ్రిడ్జి దగ్గర ఓ కెమెరా, ఆ బైకుల వివరాలు చెప్పేందుకు ఓ షోరూం దగ్గర ఓ కెమెరా, పోలీస్ స్టేషన్ దగ్గర ఓ కెమెరా… ఏందిర భయ్ ఇది..? టీవీ9 చూసి మేమెక్కడ వెనకబడతామో అన్నట్టుగా ఇతర చానెళ్లు కూడా బోలెడన్ని వాతలు అర్జెంటుగా పెట్టుకున్నయ్… ఇక్కడ ఎవడూ తక్కువ కాదు.., ఓ సెలబ్రిటీకి సంబంధించిన వార్తలకు వ్యూయర్‌షిప్ ఉంటుంది నిజమే, కానీ మరీ ఇంత ‘అతి’ అవసరమా..? సిటీలోనే, సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ల అమ్మాయిని ఎవడో పిశాచి రేప్ చేసి చంపేశాడు… నిజానికి అదెంత విషాదం, పిండేసే దారుణం కదా… తెలుగు మీడియా స్పందన చూస్తే జాలేసింది… కోపమొచ్చింది… అందుకే సోషల్ మీడియా ఇది కూడా ప్రస్తావిస్తూ మరింత తిట్టేసింది… తెలుగు టీవీలు ఈ తిట్లకు వంద శాతం అర్హమైనవే…
సాయి కోలుకుంటున్నాడు, గుడ్… కోలుకున్నా సరే, బ్లడ్ క్లాట్ కావొద్దని ఏమీలేదు అని ఒకడు రాస్తాడు, ఇంతకన్నా నీచం ఏముంది..? అంటే ఈ టీవీలు సాయికి ఏం జరగాలని కోరుకుంటున్నయ్..? టీవీలే అలా అంటే ఒకరిద్దరు సినిమావాళ్లకు సిగ్గూశరం లేదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు… వోకే, నరేష్ ఏదో అన్నాడు, నా బిడ్డలాంటివాడు, జాగ్రత్తగా వెళ్లండిరా అని చెప్పాలనుకున్నాను, మా ఇంటి నుంచే బయల్దేరాడు, మా అబ్బాయి కూడా వెళ్లాడు అని చెప్పాడు… తప్పేముంది..? పోనీ, తప్పే అనుకుందాం… దానికి నటుడు శ్రీకాంత్ అలా మాట్లాడడం కరెక్టు కాదు అంటాడు… చిల్లర వ్యాఖ్యలకు పేరొందిన బండ్ల గణేష్ కూడా అలాగే స్పందించాడు… మరో నిర్మాత ఎవరో సేమ్…అసలు వీళ్లెందుకు కెలికి కెలికి దాని మీద రచ్చో, చర్చో జరిగేలా చేయడం..? ఓ గతిమాలిన సంగీత దర్శకుడు ఏకంగా ఆ బ్రిడ్జి కట్టినోడిపై కేసు, కార్పొరేషన్‌పై పెట్టాలంటాడు… ఎక్కడి నుంచి ఊడిపడ్డారురా భయ్ మీరు..? ఈ గడ్డ మీద ఎప్పుడైనా, ఏ సంఘటనకైనా, ఏ విషాదానికైనా, ఏ పరిణామానికైనా స్పందించారా మీరు..? నిర్దేశిత స్పీడ్ మెయింటెయిన్ చేసేవాళ్లు ఒక్కరూ దాని మీద స్కిడ్ కాలేదనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా..? హరీశ్ శంకర్ అని మరో మెంటల్ కేస్, తప్పుడు వార్తల్ని అమ్ముకుంటున్నారు అంటూ మీడియాను తిట్టేస్తున్నాడు… ఇప్పుడే పొడుచుకు వచ్చింది ఈ దర్శక వజ్రానికి..!! మీ సినిమా వాళ్లకు ఆ తిట్టే అర్హత లేదులే తమ్మీ, జెర సైసు..!! ఇలాంటి మెదళ్లు మనకు ఓ ఖర్మ, మన టీవీలు రెట్టింపు ఖర్మ…!!
Share this Article