.
Kondal Reddy …… చాలా సంతోషాన్ని , మనసుకు తృప్తి కలిగించే ఒక కార్యక్రమం , అత్యంత సమస్యలో ఉన్న 18 రైతు ఆత్మహత్య కుటుంబాలకు జీవనోపాధి సహకారం ….. ఒక్కో బాధిత కుటుంబం వారి భర్త రైతుగా ఎన్ని కష్టాలు పడ్డారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి పరిస్థితి ఏమిటి అనే దాని గురించి వివరిస్తూ ఉంటే దాదాపు అందరి హృదయం బరువెక్కింది.
పూర్తి వివరాలు……..
తెలంగాణలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకి సహాయం అందించి వారి జీవనోపాధికి తోడ్పడే కార్యక్రమం రూరల్ డెవలప్మెంట్ సర్విస్ సొసైటీ (ఆర్.డి.ఎస్.ఎస్.) సంస్థ చేపడుతున్నది. దానిలో భాగంగా ఈరోజు తార్నాకలో “రైతు ఆత్మహత్య బాధితులతో సంఘీభావ కార్యక్రమం” ఏర్పాటు చేసి 18 బాధిత కుటుంబాలకు సహాయం అందించారు. ఈ కార్యక్రమం తార్నాకలోని సెయింట్ ఆన్స్ జెనరలేట్ లో 11 గంటల నుండి 2 గంటల వరకు జరిగింది.
Ads
బాధిత కుటుంబ సభ్యులు పాల్గొని, వ్యవసాయ సమస్యల వలన ఏ విధంగా రైతు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చినది, ఆ తర్వాత వారి కుటుంబం ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో వివరించారు. వచ్చిన వారందరూ కౌలుకి భూమి తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నవారే. కౌలు రైతులకు ఏ ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో అప్పుల పాలు అవడం, ప్రకృతి అనుకూలించక పంట నష్టపోవడం, పంట బీమా లేకపోవడం – ఇటువంటి కారణాలు తెలిపారు.
అత్యంత విషాదకరమైన కథలతో బాటు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా కొందరు వ్యక్తం చేశారు. 11 జిల్లాల నుండి (జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబాబాద్, పెద్దేపల్లి, కుమరం భీమ్ ఆసిఫాబాదు, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నల్గొండ, నాగర్ కర్నూల్) ఈ కుటుంబాలు వచ్చాయి.
ప్రతి కుటుంబానికి జీవనోపాధి ఏర్పాటుకి 40 వేల రూపాయలు వారి అకౌంటులో డిపాజిట్ చేయడం జరిగినది. ఈ సహాయాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటామో బాధితులు వివరించారు. కొందరు మేకలు, గొర్రెలు కొనుక్కుంటామని, కొందరు బర్రెలు కొనుక్కొని పాలు అమ్ముకుంటామని, కొందరు కిరాణా షాప్ పెట్టుకుంటామని లేదా కుట్టు మెషీను ఏర్పాటు చేసుకుంటామని తెలిపారు.
ఈ కుటుంబాలకు స్ఫూర్తిగా గతంలో 2015లో రైతు ఆత్మహత్య బాధితురాలుగా ఉండిన మంజుల, తనకు లభించిన 30 వేల రూపాయల సహాయంతో తాను చిన్న దుకాణం పెట్టుకొని, కుట్టు మెషీన్ కొనుక్కొని అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు 40 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, ఒక జ్యూట్ సంచీలు కుట్టే టెయిలరింగ్ యూనిట్ ను, ఒక కేటరింగ్ సర్వీస్ ను నడిపే స్థాయికి వచ్చినట్లు వివరించారు.
ఒంటరి మహిళగా కూడా ధైర్యంగా ఉండి, కృషి చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు అనే నమ్మకంతో ముందుకి సాగాలని అక్కడికి వచ్చిన బాధిత మహిళలకి ఆమె గట్టిగా చెప్పారు. ఈ సహాయానికి నిధులను అసోసియేషన్ ఫర్ ఇండియాస్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ వారు అందించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో ఏర్పాటు అయిన ఎయిడ్ సంస్థలో వాలంటీర్లు థాంక్స్ గివింగ్ పండగ సందర్భంగా “రైతులకు కృతజ్ఞత తెలుపుదాం” అని కాంపైన్ నిర్వహించి నిధులు సేకరించినట్లు నిర్వాహకులు వివరించారు.
రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు అందవలసిన ఆరులక్షల ఎక్స్ గ్రేషియా అందరికీ లభించే విధంగా తాము చేస్తున్న కృషిని వివరించి, ఇటీవల కోర్టు కేసు ద్వారా 141 బాధిత కుటుంబాలకు రూ.6 లక్షల చొప్పున నిధులు విడుదల కావడం వెనక జరిగిన ప్రయత్నం గురించి తెలిపారు. ఇక్కడికి వచ్చిన కుటుంబాలన్నింటికీ కూడా ప్రభుత్వ సహాయం అందే విధంగా తాము ప్రయత్నిస్తామని ధైర్యం చెప్పారు.
రైతు ఆత్మహత్య బాధితులు నిరాశ, నిస్పృహలకు లోను కావద్దని, వారి గురించి ఆలోచించి తపన పడే వారు అనేక మంది, అన్నీ ఊళ్ళలో, దేశాలలో ఉన్నారని, ఏ సమస్య వచ్చినా తమను కుటుంబ సభ్యులుగా భావించి పంచుకోవాలని వక్తలు సూచించి ధైర్యం చెప్పారు. కార్యక్రమాన్ని రైతు ఆత్మహత్యల అంశంపై 18 ఏళ్లుగా పని చేస్తున్న బి.కొండల్ నిర్వహించారు….
Share this Article