ఈటీవీలోని జబర్దస్త్… జీటీవీలోని బొమ్మ అదిరింది… సేమ్, ఆ షోల్లో కనిపించే తరహాలోనే ఒక స్కిట్ తీసుకొండి… పెళ్లి పరమ అరిష్టం అని ఉద్యమాన్ని నిర్మించే హీరో చివరకు తనే బొక్కబోర్లాపడిపోవడం అనేది కాన్సెప్టు… మరి తెలుగు హీరో కాబట్టి, ఫైట్లు తప్పవు కాబట్టి, అవీ యాడ్ చేయండి… మరి డాన్సుల్లేకపోతే హీరో ఎలా అవుతాడు..? సో, పాటలు పెట్టేయండి… ఐనా ఓ తెలుగు సినిమా నిడివి రావడం లేదా..? మాటీవీ కార్తీకదీపం స్క్రిప్ట్ రైటర్‌ను తీసుకొచ్చి, కాస్త ముందూవెనుకా సాగదీసి, సాగదీసి, సెట్ చేస్తాడు… అంతే… సినిమా రెడీ… దాని పేరు సోలో బ్రతుకే సో బెటర్…
నిజానికి ఇంత వ్యంగ్యంగా చెప్పాల్సిన అవసరం లేదు… కానీ దర్శకుడు సుబ్బు ఇలాగే ఈ సినిమా తీసేశాడని ఏదో గట్ ఫీలింగ్… పోనీ, ఇంకోరకంగా చెప్పుకోవచ్చు… స్టవ్వు, పోపు, బియ్యం, కూరగాయలు, మసాలా… సరిపడా ఉప్పు, కారం… ఉడికింది… తీరా దింపి పళ్లెంలో పెట్టుకుంటే ఉప్మాలాగే కొడుతోంది తప్ప బిర్యానీ లుక్కు లేదు, వాసన లేదు… రుచి లేదు… ఈ సినిమా కూడా అంతే…
Ads
ఒక సగటు తెలుగు సినిమాకు ఏమేం కావాలో అన్నీ ఉన్నయ్… కానీ నాలుకకు కొత్తగా తగిలే రుచి లోపించింది… పాటలు సోసో… ఎమోషన్స్ సోసో… స్టన్నింగ్ క్లైమాక్స్ లేదు… సెకండాప్ మంచి ట్విస్టులు లేవు… సరే, ఒక సినిమా ప్రజెంట్ ఆడియెన్స్‌కు పట్టుకోవాలంటే ఏం చేయాలి..? పాత కథనైనా కొత్తగా చెప్పాలి… లేదా కొత్త కథ చెప్పాలి… ఇదేమీ కొత్త కథ కాదు… కొత్తగా కూడా చెప్పలేదు…
కరోనా లాక్ డౌన్ల అనంతరం మళ్లీ థియేటర్లు తెరుచుకున్నవేళ… రిలీజయిన పెద్ద సినిమా… కానీ మరీ అంత ఆతృతగా ఉరికీ ఉరికీ, మాస్కులు కట్టుకుని మరీ చూడాల్సినంత థ్రిల్లింగ్ సినిమా ఏమీ కాదు… అసలు కంటెంటు దగ్గరే ఓ యాంబిక్విటీ ఉంది… సోలో బ్రతుకు సో బెటర్ అన్నవాడు థెరిసా దగ్గర్నుంచి నటుడు నారాయణమూర్తి దాకా ఉదాహరణలు చెప్పేసి, ఒంటరి బతుకులే వాళ్లను గొప్పవాళ్లను చేశాయి అని బిల్డప్ ఇస్తాడు హీరో…
రావు రమేష్ అనే కేరక్టర్ చెప్పగానే పెళ్లి మీద అంత విముఖత పెంచేసుకుని, పుస్తకాలు రాసి, ఉద్యమాలు నిర్మించేంత వివాహద్వేషిగా మారతారా..? పోనీ, తనకు అంత గాఢమైన వ్యతిరేకత పెరిగాక, హఠాత్తుగా పెళ్లి మీద మనసెందుకు మళ్లింది..? బలంగా ఎస్టాబ్లిష్ చేయనట్టుగా అనిపించింది… అంతా పెరిఫెరల్ టేకింగ్…
ఓన్లీ కామెడీతో లాగించొచ్చు అనుకోవడంలోనే ఓ తప్పుంది… కామెడీని హీరోయిజాన్ని మిక్స్ చేసి కొట్టాలంటే… ఈమధ్య అనిల్ రావిపూడి చేస్తున్నాడు అలా… ప్యూర్ జబర్దస్త్ తరహా స్కిట్‌ను అటూఇటూ లాగదీసి, తెలుగు హీరోయిజాన్ని కాస్త అద్ది మరీ కొడుతున్నాడు… టైంపాస్… లేదా మంచి దుమ్మురేపే పాటలు… అల వైకుంఠపురంలో టైపు… ఈ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ రెంటికీ చెడ్డ రేవడి…
నిజానికి మంచి పాత్ర దొరకాలే గానీ ధరమ్ తేజ్ ఇరగదీయగలడు… ((ఈమధ్య బరువు కూడా పెరిగాడు కదా, బరువైన పాత్రలు కూడా పోషించగలడు…)) డాన్సులు, ఫైట్లు, ఎమోషన్స్, కామెడీ టైమింగు… ఏ అంశం తీసుకున్నా తను వంక పెట్టలేని తెలుగు పాపులర్ హీరో… కానీ ఇది తనను పైకి లేపే పాత్రేమీ కాదు… నభా నటేష్ విషయానికొస్తే ఆమె వచ్చేదే ఇంటర్వెల్ ముందు… ఉన్నవే నాలుగైదు సీన్లు… మిగతా నటీనటుల గురించి పెద్దగా ప్రస్తావన అనవసరం… ఒక్క వెన్నెల కిషోర్ మినహా… తను అలవాటైన ధోరణిలో, సహజంగానే బాగా చేశాడు…
చివరగా :: ఇది థియేటర్ రన్ సినిమా ఏమీ కాదు… ఓటీటీ మార్క్ సినిమాయే… ఆ పాటలు గట్రా వచ్చినప్పుడు, తిక్క కామెడీ సీన్లు వచ్చినప్పుడు… మౌజ్ ఉపయోగించి… జంపులు చేస్తూ… ఎలాగోలా సినిమా చూశాం అనిపించేయవచ్చు వేగంగా…!!
డిస్క్లయిమర్ :: సినిమాల రివ్యూలు ఒకే ఫార్మాట్లో ఉండాలని ఏమీ లేదు… ప్రొఫెషనల్ రివ్యూయర్ కోణం వేరు… ఇది జస్ట్, ఓ సగటు ప్రేక్షకుడి కోణం… ఫీల్…! అవును సుబ్బూ… నారాయణమూర్తిని మరీ కలాం, వాజపేయి లెవల్‌కు తీసుకుపోయావు సరే గానీ… ఇంతకీ సోలోగా ఉండటం వల్లే గొప్పవాళ్లయ్యారా..? గొప్పవాళ్లు కాబట్టే సోలోగా బతికారా..? అసలు జీవితంలో గొప్పవాళ్లు కావడానికీ, పెళ్లి అనే బంధం లేకపోవడానికీ లంకె ఏమిటి..? వాళ్ల జీవితాల్లోనూ నభా నటేషులు ఎంటరై ఉంటే, వాళ్ల కథలూ వేరేగా ఉండేవా..? ఈ సినిమాలాగే…!!
Share this Article