———————————————–
జోకులు పలు విధంబులు.
కొన్ని నవ్వుకునేవీ, కొన్ని కన్నీళ్లు తెప్పించేవీ,
గుర్తు చేసుకున్నకొద్దీ తెగ నవ్వించేవీ,
పగలబడి నవ్వించేవి కొన్నీ, పొట్ట చెక్కలయ్యేలా దొర్లించేవి యింకొన్ని… కొద్దిపాటి హాస్యదృష్టి వుంటే ఈ దరిద్రపు బతుక్కూడా కొంత బావుంటుంది. పేదవాళ్ళలోకెల్లా పేదవాళ్లేవరంటే రవ్వంత కూడా హాస్యదృష్టి లేనివాళ్ళే. మనమీద మనమే జోకు వేసుకోగలగడం సంస్కారానికి పైమెట్టు.
బాపు తన ఫ్లాపు సినిమాల మీద తానే జోకేసుకుంటూ, ‘నేడే చూడండి’ అంటే రేపు వుండకపోవచ్చు అని అన్నారు.
హాస్యం… కథనో, నవలనో, నాటకాన్నో పండిస్తుంది. నల్లని మబ్బుకు silver lining లాగా మెకానికల్ రొటీన్ చేదు జీవితానిక్కూడా కమ్మని రుచి యిస్తుంది. సిగిరెట్ కాల్చడం దురలవాటు. ఐనా, రేలంగి సరదా సరదా సిగిరెట్టూ … అని పాడుతుంటే థియేటర్లు మోగిపోయాయి. దివాలా తీసి బతుకు బస్టాండ్ అయిపోయినా, అయ్యయో జేబులొ డబ్బులు పోయెనే అని రమణారెడ్డి అండ్ కో పాడుతుంటే సినిమా హాళ్లు ఈలలూ చప్పట్లతో హోరెత్తిపోయేవి!
గురజాడ కన్యాశుల్కం లో వున్నంత హాస్యం, జోకులు, వ్యంగం, ఛలోక్తులు, అధిక్షేపం….
తెలుగులో మరో నాటకంలో గానీ, నవల్లో గానీ వున్నాయనుకోను. ‘లొట్టిపిట్టలు…’ అంటూ సావిత్రితో తెగ నవ్వించి మనల్ని దూదిపింజల్లా తెలిపోయేట్టు చేసింది దర్శకుడు పి. పుల్లయ్య గారు.
క్షణాల్లో జోకులు పేల్చగలిగే వాళ్లలో ఆరుద్ర, రావిశాస్త్రి, శ్రీశ్రీ, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, స్పెషలిస్టులు. నాకు బాగా సన్నిహితంగా తెలిసిన వాళ్లలో పతంజలి, మోహన్, చందు సుబ్బారావు, అదృష్ట దీపక్, బండారు సత్యనారాయణ, జొన్నలగడ్డ రాధాకృష్ణ, తల్లావఝుల శివాజీ మరి కొందరున్నారు. వీళ్లు క్షణంలో సగంలో జోకేస్తారు. ఎంత ఫాస్ట్ గా జోక్ కట్ చేస్తారంటే ఆ timing ఎక్కువ నవ్వు తెప్పిస్తుంది. నాకు తెలిసినవీ, గత రెండు రోజులుగా గుర్తు చేసుకున్నవీ కొందరు పెద్దవాళ్ల జోకులు చదవండి. ఇది covid fun – పూర్తిగా పాజిటివ్ గా తీసుకోండి.
*** *** ***
అవి పాత బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజులు. పగలంతా షూటింగ్ ముగించుకుని కోయంబత్తూరు లోనో, ఊటీ లోనో చీకటిపడే వేళకి గెస్ట్ హౌజ్ కి చేరుకున్నారు హీరో అక్కినేని నాగేశ్వరరావు, దర్శకుడు బాపు, రచయిత ముళ్ళపూడి వెంకట రమణ. మేడ పైగదిలో నాగేశ్వరరావు వున్నాడు. హాల్లో బాపు, ముళ్ళపూడి తాగడం మొదలుపెట్టారు. హీరో మేనేజరు గబగబా మెట్లెక్కి పైకి వెళ్లడం, నాగేశ్వరరావు తో మాట్లాడి కిందికి రావడం, మళ్లీ పైకి వెళ్లడం ఇలా నాలుగైదుసార్లు అయ్యేసరికి బాపు, ముళ్ళపూడి రెండు పెగ్గులు పూర్తి చేశారు. మూడో పెగ్గు పోసుకున్న బాపు, మేనేజర్ని ‘ఇలారా’ అని పిలిచారు. ఏంటి సార్ అన్నాడు. మన హీరో గారు తాగుతారా, తాగరా అని బాపు అడిగారు. మేనేజర్ కొంత నసిగి, తాగుతారు గానీ, చాలా తక్కువండీ. మహా అయితే పెగ్గున్నర. అంటే నైంటీ అంతే అని చెప్పాడు. బాపు గారు చిన్న సిప్ వేసి, “అదేంటోయ్, పెగ్గున్నర తాగడమేంటి దరిద్రంగా, ఎక్సర్సైజ్ కోసం – క్స్ చేసినట్టు” అన్నారు…
*** *** ***
బాపు అభిమాని ఒకాయన ఎప్పుడు మద్రాసు వచ్చినా జున్ను తెచ్చి యిచ్చేవాడు. అతను ఇరవై మూడోసారి జున్ను పట్టుకు వచ్చినపుడు, బాపు సీరియస్ మొహంతో, “ఏవయ్యా, మీవూళ్ళో గేదెలకు మరో పనేం లేదా” అన్నారుట.
*** *** ***
1993 అనుకుంటాను. ఒక సాయంకాలం ఆర్టిస్టు మోహన్ ఆఫీసులో ఐదారుగురం కూర్చుని వున్నాం. మోహన్ తలవొంచుకుని దీక్షగా బొమ్మ వేస్తున్నాడు. ఇద్దరు పుస్తకాలు, ఇద్దరు పేపర్లూ చదువుతున్నారు. ఖాళీగా కూర్చుని వున్న బండారు సత్యనారాయణ, హరిపురుషోత్తమరావు గారు ఆఫీసులోకి వస్తుండడం గమనించి, “అరె – హరిపు” అన్నాడు. అందరం గొల్లున నవ్వాం. ఇందులో మీకు అశ్లీలం అనిపిస్తే మీరే కరెక్ట్. అదే మా నవ్వుకి కారణం. హరి గారు కూడా తేలిగ్గా నవ్వేశారు. బండారు సత్యనారాయణ దాసరి నారాయణ రావు క్లాస్ మేట్. ‘ఉదయం’ ఉద్యోగి.
*** *** ***
రచయిత పతంజలి గారి ఒక నవల “దెస్టోయ్ దైద్రమోయ్!” అనే మాటలతో మొదలవుతుంది. పతంజలి మేనమామ ఒకరు ఎప్పుడూ ఆ మాట అనేవారు. ఆ మేనమామ విశాఖ వచ్చి కలిసినపుడు, పతంజలి “దెస్టోయ్ దైద్రమోయ్ నువ్వొస్తే” అన్నారు. “నా మాటలు నాకే చెప్తున్నావేటీ?” అన్నారాయన. “నీకైతేనే అర్థమవుతుందనీ” అన్నారు కొంటె పతంజలి. చాలా ఏళ్ల క్రితం పతంజలి నాతో మాట్లాడుతూ అమెరికా చాలా నీచంగా బిహేవ్ చేస్తోందని వివరంగా చెబుతున్నారు.
అప్పుడు నేను ‘వెస్టోయ్ దైద్రమోయ్’ అన్నాను. ఆయన నా భుజం మీద కొట్టి గట్టిగా నవ్వారు.
*** *** ***
1976లో ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ పెట్టినపుడు విశాఖలో విప్లవ కేకలు వేసే రావిశాస్త్రి, చలసాని ప్రసాద్, తుమ్మల వేణుగోపాలరావులను అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైల్లో పెట్టారు. వాళ్ళున్న జైలు గదిలోనే చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి ని తెచ్చి పడేశారు. శాస్త్రి గారు ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసరు. ఆయన భార్య శాంత ఫిజిక్స్ ప్రొఫెసరు. సుబ్రహ్మణ్య శాస్త్రి అప్పట్లో ఆర్.ఎస్.ఎస్ కి ఆంధ్రప్రదేశ్ అధిపతి. అందుకే అరెస్ట్ చేశారు. శాస్త్రి గారికి రోజూ పెద్ద క్యారేజీలో ఘుమఘుమలాడే బ్రాహ్మణ భోజనం వచ్చేది. దాన్ని యీ ముగ్గురు విప్లవకారులూ లొట్టలేసుకుని తినేవాళ్లు. క్షమాపణ పత్రం రాసి యిచ్చిన రావిశాస్త్రి, వేణుగోపాలరావులు ఆరు నెలలకే జైలు నుంచి విడుదల అయ్యారు. చలసాని ప్రసాద్, చిలుకూరి శాస్త్రి గారూ 13 నెలలు జైల్లోనే వున్నారు. ఆరెస్సెస్ చీఫ్ తో సహజీవనం ఎలా వుందని తుమ్మల వేణుగోపాలరావుని ప్రొఫెసర్ చందు సుబ్బారావు ఒకసారి అడిగితే, ‘శాస్త్రి గారికేం, వ్యక్తిగా మహోన్నతుడు. వ్యక్తి వేరు, సిద్ధాంతం వేరు. ఆయన భోజనమంతా మేమే తినేవాళ్లం’ అన్నారట. ఇందులో జోకేం లేదు. చిన్న ఐరనీ, సంస్కారం మాత్రమే వున్నాయి.
*** *** ***
అన్యాయమైన, దారుణమైన జోకులు వెయ్యడంలో రాచకొండ విశ్వనాథ శాస్త్రిది అందె వేసిన చెయ్యి. పురాణం సుబ్రహ్మణ్యశర్మ తను రాసిన ఒక పుస్తకాన్ని రావిశాస్త్రికి అంకితం యిచ్చారు. విశాఖలో ఆ పుస్తకం ఆవిష్కరణ సభలో రావిశాస్త్రి మాట్లాడుతూ, “నేను వైదీక బ్రామ్మణ్ణి. పురాణం వారు నియోగి బ్రామ్మలు. వారిది పెట్టే చెయ్యి. మాది పుచ్చుకునే చెయ్యి. వారిచ్చారు, నేను పుచ్చుకుంటున్నాను” అన్నారు.
రావిశాస్త్రి చివరి నవల ‘ఇల్లు’.
అందులో ఒక పాత్రతో యిలా అనిపించారు : ఏనుగుకి కళ్ళు చిన్నవిగా వుండడం వల్లా, నియోగులు అనైక్యంగా వుండడం వల్లా
మనమంతా బతికిపోయాం.
ఇది చదివి తీవ్రంగా హర్టయిన బందరులోని నియోగులు కొందరు గట్టిగా ప్రొటెస్ట్ చేశారు.
“ఈ వయసులో కొందరిని హర్ట్ చేశో, గాయపరిచో నేను పట్టుకుపోయేదేమీ లేదు. సరదాకి మాత్రమే అలా రాశాను. ఎవరినైనా నొప్పించినట్టయితే మన్నించండి” అని రావిశాస్త్రి రాశారు.
*** *** ***
ఎం. రామకోటి అనే పేరు గుర్తుందా?
పోనీ విన్నట్టు అనిపిస్తోందా? రామకోటి విశాఖలో లాయరు. మంచి కథా రచయిత. ఇది 1971 – 80 నాటి మాట. రామకోటి శ్రీశ్రీ, ఆరుద్రల మీద
రెండు పద్యాలు రాశారు.
శ్రీరంగం సినీవాస – మృదుపద లాలిత్య భాస
ప్రాసహాస రసవిలాస – చేయబోకు రసాభాస !
సమగ్ర వాంగ్మయ సముద్ర – కూనలమ్మ కవిరుద్ర
అంత్యానుప్రాసముద్ర – పారద్రోలు తెలుగు నిద్ర
అంత చక్కని రామకోటికీ, రావిశాస్త్రి కీ ఎక్కడో చెడింది. ఒక మిత్రుడు రామకోటి …. అనగానే రావిశాస్త్రి, “పాపం అతను చాలా చదివాడు గానీ ఏటీ అర్థం కాలేదు. పుస్తకాలన్నీ బుర్రలోకి వెళ్లకుండా, భుజాలమీదనే వుండిపోయినయ్” అనేశారు.
*** *** ***
సెల్ ఫోను అనేది వూహకి కూడా రాని రోజుల్లో రచయిత్రి కుప్పిలి పద్మ విశాఖ వెళ్లారు.
ఆమె దగ్గర కేమెరా వుంది. రావిశాస్త్రి ని కలిసినపుడు, ఒక ఫోటో తీసుకుంటా అన్నారు. “గడ్డం చేసుకోలేదమ్మా” అన్నారు రావిశాస్త్రి. మర్నాడు పద్మగారికేదో పనివుండి, ఆ మర్నాడు మళ్లీ శాస్త్రి గారిని కలిశారు. “అయ్యో. నిన్న రాలేదేమమ్మా. గడ్డం చేసుకున్నాను. ఇవ్వాళ గడ్డం చేసుకోలేదు” అన్నారు రావిశాస్త్రి. “గడ్డం, మీసాల్తో మగాళ్ళకున్న యిబ్బంది, ఆడవాళ్లకుండదు. మీరు ఎప్పుడన్నా ఫోటో దిగొచ్చు. ఆ విషయంలో మాత్రం మీదే పైచేయి” అని సరదాగా అన్నారు చాత్రిబావు.
కవి, తెలుగు హైకూ లకు ఆది గురువు అన దగ్గ చెట్టు ఇస్మాయిల్ గారు 2001లో హైదరాబాద్ వచ్చారు. ఆయన్ని కలిసిన రచయిత్రి కుప్పిలి పద్మ, ఇస్మాయిల్ గారికో వోడ్కా బాటిల్ ప్రెసెంట్ చేశారు. నాకోసం ఓ హైకూ రాయరూ? అని అడిగారు. కాకినాడ వెళ్ళాక, ఇస్మాయిల్ గారు లెటర్ రాస్తూ, పద్మ గారు మీకోసం ఒక హైకూ:
నత్త
ప్రియురాలి ఇల్లు చేరేటప్పటికి
ఆమె ముసలిదైపోతుంది!
నత్తలు ఉత్తరాలు రాయవా
అన్నారు ఇస్మాయిల్…
*** *** ***
(Chandu Subbarao, Patanjali, Arudra, Sri Sri, Raavi Sastry, Bapu)
సినీనటుడు బాలకృష్ణ ఎవర్నో కాల్చిచంపినట్టు వార్తలు వచ్చి, బాగా గొడవై, అంతా సద్దుమణిగి పోయింతరువాత, కామ్రేడ్ బాలగోపాల్ ఒక వ్యాసం రాస్తూ, “చట్టం తనపని తాను చేసుకుంటూ బాలకృష్ణ పనికూడా చేసుకుపోతుంది” అని రాసారు. ఆ ఒక్క వాక్యంతోనే బాలగోపాల్ చట్టాన్నీ, తుపాకీ గొట్టాన్నీ ఒకే సారి ఉరి తీశారు.
*** *** ***
1970వ దశకంలో కవి అద్దేపల్లి రామ్మోహనరావు, శ్రీశ్రీ కవిత్వాన్ని misinterpret చేసి అవాకులూ, చెవాకులూ రాసినపుడు, కడుపు మండిన విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి,
“అద్దేపల్లి వారి అజ్ఞాన కవచాన్ని ఛేదించగల ఆయుధమేదీ నాదగ్గర లేదు. ఇది చదివిగనక ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి నా బాధ్యత లేదు” అని ఒక క్రూయల్ జోకు వేశారు.
***
1940వ దశకం. తెలంగాణ ఉద్రిక్తంగా వుంది. ఎగిరెగిరి పడుతున్న కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు. కవీ, కమ్యూనిస్ట్ నాయకుడైన మఖ్దూం మొహియుద్దీన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. మఖ్దూం ని ఎలాగైనా కాపాడుకోవాలి. అండర్ గ్రౌండ్ ఒక్కటే మార్గం. అజ్ఞాతంగా వుంచాలి. మెదక్ జిల్లా కావచ్చు. అక్కడో వూరికి మఖ్దూం ని తీసికెళ్లి ఒక ఇంట్లో దాచారు. ఇంటి ముందు రోడ్డు దాటితే, పాన్ డబ్బా వుంది. తోడుగా వెళ్లిన కామ్రేడ్ ఒకరు మఖ్దూం తో ఇలా అన్నాడు. “నీకెలాగూ సిగిరెట్లు కావాలి. యీ రోడ్డు దాటి పాన్ డబ్బా దగ్గరికి వెళతావు. వెళితే, వాళ్లు నీ పేరేంటి? అని అడుగుతారు. వెంకటేశ్వర్లు అని చెప్పు. తర్వాత నీ కులం అడుగుతారు. మీరేవుట్లు అంటారు. ‘వెలమ’ అని చెప్పు అని హితబోధ చేశాడు. వెంకటేశ్వర్లు, వెలమ అని మఖ్దూం నాలుగైదుసార్లు అనుకుని బట్టీ పట్టారు. Ok అని కామ్రేడ్ వెళిపోయాడు. మూడు రోజులకే సిగిరెట్లు అయిపోవడంతో, మఖ్దూం రోడ్డు దాటి పాన్ డబ్బా దగ్గరికి వెళ్లాడు. పేరు అడిగారు. చెప్పాడు. మీరేవుట్లు అనడిగారు. మఖ్దూం తడబడ్డాడు. ఉర్దూ బాగా, తెలుగు తక్కువగా తెలిసిన మఖ్దూం, తన కులం ‘విమల’ అని చెప్పాడు. వెలమ అనేమాట మఖ్దూం కి రిజిస్టర్ కాలేదు.
తర్వాత ఏమైందో నాకైతే తెలీదు.
*** *** ***
మోహన్, నేనూ హిమాయత్ నగర్లో ఒక అరసం మీటింగ్ కి వెళ్లాం. మాముందు కమ్యూనిస్ట్ వృద్ధ నాయకుడు రాజ్ బహదూర్ గౌర్ కూర్చుని వున్నారు. 20 ఏళ్ల వయసుండే ముగ్గురు ఆడపిల్లలు రాజ్ బహదూర్ ని చనువుగా పలకరించి, వాళ్ల పేర్లు చెప్పి, గుర్తుపట్టారా సారూ.. అని అడిగారు. దానికి రాజ్ బహదూర్, లేదమ్మా, పోల్చుకోలేకపోతున్నాను. యవ్వనంలో ఈ కళ్ళని బాగా దుర్వినియోగం చేశాను” అని చెప్పారు.
మఖ్దూం, రాజ్ బహదూర్ గౌర్ వెటకారాలు ఎంత బావుంటాయో అసలు చెప్పలేం!
*** *** ***
ఒకరోజు, శ్రీశ్రీ బాత్రూంలో స్నానం చేస్తుండగా, అటుగా వెళ్లిన విశ్వనాథ సత్యనారాయణ, “మహాకవి నీళ్ళాడుచున్నట్టున్నారు” అని జోకేశారు. శ్రీశ్రీ మెరుపువేగంతో “కవిసామ్రాట్టులవారు కనుచుండగా” అని శ్లేషించారు.
ఆనాడు ఏనాడో … కవి గుర్రం జాషువా సభకి అతిథిగా వెళ్లిన విశ్వనాథ సత్యనారాయణ సహజమైన అహంకారంతో
“గుర్రాన్నీ, గాడిదనీ ఒకేగాట కట్టేశారేంటో…?” అన్నారు. దొరికాడు విశ్వనాథ అనుకున్న జాషువా, నేను ఎలాగూ గుర్రాన్ని, మరి గాడిద ఎవరో మీరే తేల్చుకోండి – అని రిపార్టీ యిచ్చారు.
*** *** ***
40 ఏళ్ల క్రితం విజయవాడ నుంచి వచ్చిన “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో శ్రీశ్రీ ప్రశ్నలూ జవాబులూ శీర్షిక సూపర్ హిట్టు. పురాణం ఎడిటర్.
మీ శిష్యరత్నం ఆరుద్ర గురించి ఏమంటారు? అని ఒక పాఠకుడు శ్రీశ్రీని అడిగాడు.
శ్రీశ్రీ జవాబు : శిష్యుడంటే అతనొప్పుకోడు. రత్నమంటే నేనొప్పుకోను.
*** *** ***
2015. మధ్యాహ్నం ఒంటి గంటన్నర.
బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12లో ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసులో అయిదుగురం భోజనం చేస్తున్నాం.
ఫోన్ మోగింది. మోహన్ తీశాడు.
విశాఖ నుంచి ఫోన్ చేసిన చందు సుబ్బారావు,
ఏం చేస్తున్నారోయ్ – అని అడిగాడు.
లంచ్ చేస్తున్నాం అని మోహన్ చెప్పాడు.
తర్వాత మోహన్ పెద్దపెట్టున నవ్వాడు.
భోజనం చేస్తున్నాడేమో పొలమారింది.
ఫోన్ పెట్టేశాక మోహన్ చెప్పాడు.
“వోరి లంచ్ కొడుకుల్లారా, ఆ తినేది ఎప్పుడన్నా తినొచ్చు, ముందు నేను చెప్పేది వినండి”
అన్నాడట చందు సుబ్బారావు.
*** *** ***
పులికళ్ళు, మేకగడ్డం వున్నంతమాత్రాన ప్రతివాడూ చంద్రబాబు నాయుడు కాలేడు అని పతంజలి ఒకచోట రాశారు.
*** *** ***
హైదరాబాద్ ప్రెస్ క్లబ్. ఒక చల్లని సాయంకాలం. మందు పార్టీ. రెండు పెగ్గుల తర్వాత రచయిత పతంజలి లేచి నిలబడి, “టాయ్ లెట్ కెళ్తున్నా. పోసుకోస్తా” అన్నారు. మరో పెద్దాయన ( పేరెందుకులెండి ) లేస్తూ, నేను సాలిడారిటీ ప్రకటిస్తున్నా అన్నాడు. ఫైనల్ పంచ్ యిస్తూ ఆర్టిస్ట్ మోహన్, నేను లిక్విడారిటీ ప్రకటిస్తున్నా అన్నాడు.
మరిన్ని జోకులు మరోసారి.
*** *** ***
నిఖార్సయిన పచ్చి vulgar, బూతు తెలుగు సినిమాల్ని జబర్దస్త్ ని కుటుంబ సమేతంగా చూస్తున్న మనకి ఈ జోకుల్లోని కొద్దిపాటి అశ్లీలం లెక్కలోకి రాదనే నమ్మకంతో…
TADI PRAKASH — 9704541559
Share this Article