Padmakar Daggumati………. ఒక విధంగా జీవితం పెళ్లితో ఫిక్స్ అయ్యాక, అది ఏ కారణాలతో ఐనా చెదిరి కొత్తగా జీవితం జీవించే అవకాశాలు ఇండియాలో తక్కువ. ఆడకైనా మగకైనా. ఇక్కడే ఫ్రస్టేషన్ పెరగడానికి అవకాశం ఉంది.
సమాజం లో ఒక కొత్తమార్పు వచ్చిందంటే అది ఎక్కడో వొకచోట పాత పునాదులను పెకలిస్తుంది. ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వశాఖలు పట్టించుకోవాలి అనడం పెద్ద జోక్ అవుతుందేమో. కుటుంబ సంక్షేమశాఖ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏం చేస్తుందో నాకు పెద్దగా తెలీదు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కుటుంబ జీవితాలలోని సమస్యలు గురించి కొత్తగా ఆలోచించి కొత్త పథకాలు తెచ్చినవారిలో ఒకరు. వాటిలో ఊయల పథకం, అమ్మ క్యాంటీన్ అనేవి ముఖ్యమైనవి.
Ads
టెక్నాలజీ మరియు వస్తు ప్రపంచం పెరిగేకొద్దీ కలిసి జీవించే ప్రతి ఇద్దరిమధ్య ఘర్షణలు పెరిగే అవకాశాలు పెరుగుతుంటాయి. విడిపోతే కొత్త జీవితానికి దారులు కనపడవు. కలిసి ఉండడం కుదరదు. వేగవంతమైన మార్పులు ఎదురవుతున్న కాలంలో పరిష్కారం సాహిత్యంలో కూడా ఇదమిద్దంగా సూచించలేని పరిస్థితి.
సుప్రీంకోర్టు అయితే వయోజనులైన ఏ ఇద్దరు అయినా కలిసి బతకొచ్చు అని తీర్పు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, కుటుంబ సంక్షేమ శాఖలు తీర్పు వచ్చాక ఐనా మేలుకోలేదు. పైగా చూసి చూడనట్టు, కనపడి కనపడనట్టు జయమాలిని డ్యాన్సులు చేస్తున్నాయి.
నిజానికి ఇలాంటి కుటుంబ ఘర్షణల నివారణకు వందలాది కౌన్సెలింగ్ సెంటర్స్ అవసరం ఉంది. అందులో కులపెద్దలతో, విమెన్ పోలీసులు, లోకల్ కార్పొరేటర్లు, రచయితలు, డాక్టర్లు, లాయర్లు వంటి వారు ఉండాలి. ఇవేవీ లేకపోతే కేవలం పోలీసు (దిశ చట్టం కూడా) కేసులు పెరిగి మగవాళ్ల మీద తప్పుడు కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇది కూడా మగవాళ్ల ఫ్రస్టేషన్ కి దారితీస్తున్నాయి. హింసాత్మక కుటుంబ నేరాలలో మగవాడిది అంతిమం, మరియు బయటకి కనపడేది కూడా మగ వాళ్ల హింస మాత్రమే. కానీ అంతిమంగా నష్టం కుటుంబం మొత్తానికి జరుగుతుంది.
ఇది ఒకకోణం మాత్రమే. కుటుంబ సమస్యలలో అనేక రకాలుగా, అనేక వేరియేషన్స్ తో కూడుకుని ఉంటాయి. చదివి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ కలతలతో కొనసాగుతున్న వీరి జీవితాలు అంతం కావడంలో కొత్త జీవితాల మొదలుకు ఆస్కారం లేకపోవడమే అనిపిస్తుంది. అందులో మళ్లీ పిల్లలదొక ఆటంకం అనిపించడం. డబ్బులతో అయినా సరే నడిపే హాస్టళ్లు కూడా ఘర్షణాత్మక వాతావరణంలో పిల్లలు పెరగకుండా ఉండే ఏర్పాట్లు కూడా కుటుంబ సంక్షేమ శాఖలే చూసుకోవాలి.
ప్రభుత్వాలు చాలాచాలా వేగంగా మారాల్సి ఉంది. ప్రతి శాఖ కూడా స్వయంప్రతిపత్తితో నడవగలగాలి. కానీ కులాల సమీకరణలతో వచ్చే మంత్రి పదవులు ఎంత స్వతంత్రంగా పనిచేస్తాయి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. కనీసం దేశంలోని మంత్రులు తమతమ శాఖల గురించి ఆధునిక దృష్టితో ఎంత ఆలోచిస్తారు అనేది కూడా నిరాశాజనకమే.
Share this Article