సినిమా బాగున్నట్టే అనిపిస్తుంది… కానీ ఏదో వెలితి… ఓ అసంతృప్తి… ఎందుకు..? గంగూబాయ్ కఠియావాడి సినిమా గురించే..! చాలారోజులుగా ఈ సినిమా మీద హైప్ ఉంది… ఎందుకు..? ప్రస్తుతం బాలీవుడ్ పాపులర్ స్టార్ అలియా నటిస్తోంది గనుక… అది కథానాయిక సెంట్రిక్ పాత్ర గనుక… ఓ వేశ్య కథ గనుక… కాదు, వేశ్యల కంపెనీని నడుపుతూ, మాఫియా ప్రోద్బలంతో రాజకీయాల్లోకి, సంఘసేవలోకీ అడుగుపెట్టిన ఓ డిఫరెంట్ కేరక్టర్ గనుక..! అన్నింటికీ మించి అది సంజయ్ లీలా భన్సాలీ సినిమా గనుక..!
ఎవడో ప్రియుడిగా నమ్మినవాడి మోసం… వేశ్యావాటికకు చేరుతుంది అలియా… క్రమేపీ మాఫియా సపోర్టుతో ఆ ఏరియా మీద పెత్తనం సాధిస్తుంది… అనుకోకుండా పరిస్థితులు కలిసొస్తాయి… ఆ ఏరియాకు మహారాణి అవుతుంది, రాజకీయాల్లోకి చేరుతుంది… ప్రధానిని కలుస్తుంది… ఓ సంఘసేవకి అవుతుంది… ఇది భన్సాలీ రాసుకున్న కథేమీ కాదు… గంగూబాయ్ కల్పితపాత్ర కాదు… వాస్తవం… కాకపోతే సినిమాటిక్ మార్పులకు గురైన కథ… ముగ్గురు రైటర్స్ రాసిన ఓ పుస్తకం ఆధారంగా భన్సాలీ రాసుకున్న కథ…
భన్సాలీ సినిమా అనగానే ఓ అంచనా ఏర్పడుతుంది… ఈ సినిమాలో కూడా చాలా సీన్లు తన ప్రతిభను చూపిస్తయ్… కానీ అంచనాలకు దీటుగా సీన్లు ఉత్తేజపరిచేలా లేవు… అదేనా వెలితి..? ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల ఏర్పడిన కొరతేనా..? లేక ఓ రెడ్ లైట్ ఏరియాలోని ఓ కంపెనీ నడుపుకునే వేశ్యను ఉదాత్తంగా ఓ సంఘసేవకురాలిగా చిత్రీకరించడం కౌంటర్ ప్రొడక్ట్ అయిపోయిందా..?
Ads
పాటలు పెద్దగా కనెక్ట్ కాకపోవడం కూడా ఓ కారణం కావచ్చు బహుశా… అంతేకాదు, కథలో మరింత డ్రామాకు, ఎమోషనల్ సీన్లకు స్కోప్ ఉన్నా సరే భన్సాలీ ఇగ్నోర్ చేసినట్టు అనిపిస్తుంది… అజయ్ దేవగణ్, హుమా ఖురేషి, ఇమ్రాన్ హష్మి వంటి అతిథి పాత్రధారులు కూడా కథను పైకి లేపారు… ఐనా ఏదో థ్రిల్ మిస్సయింది… బహుశా సినిమా నిడివి, కనిపించని ఎడిటింగ్ పనితనం కూడా ఓ కారణం కావచ్చు…
అసలు విషయానికొస్తే … ఈ సినిమాకు బలం, బలహీనత రెండూ అలియా, భన్సాలీలే… అఫ్‌కోర్స్, అలియా మెరిట్ ఉన్న నటి… పాత్రలోకి అలవోకగా దూరిపోతుంది… ఈ పాత్రకు తగినట్టు బాడీ లాంగ్వేజీ, గొంతు అన్నీ మారిపోయినయ్… తన మాగ్జిమం ఇచ్చేసింది… పాత్రకు తగినట్టు మౌల్డ్ కావడానికి బాగా కష్టపడింది… కానీ నిజంగా ఆ పాత్రకు అలియా ఎంపిక కరెక్టేనా..? ఇదీ ప్రశ్న,.. అలియా లావణ్యం, పర్సనాలిటీ ఓ వేశ్యల కంపెనీ ఓనర్ పాత్రకు సూటవుతుందా..?
ఒరిజినల్ గంగూబాయ్‌ను ఎవరమూ చూడలేదు కాబట్టి అలియా అయినా ఒకటే, ఇంకొకరైనా ఒకటే… కానీ వేశ్యగా బతికిన రోజుల్నాటి పాత్రకు ఆమె సూటైంది… చాలా వీజీగా చేసింది… కానీ ఏజ్‌బార్ పాత్రకొచ్చేసరికి అలియాకు నప్పనట్టుగా అనిపించింది… ఆమె బదులు ఏ విద్యాబాలనో ఉండి ఉంటే..? అవును, ఇంకాస్త పాత్ర బాగా పండేదేమో… నడుమ ఓ చిన్న లవ్ ట్రాక్ కూడా ఉంటుంది… అదీ రంజింపచేసేలా లేదు పెద్దగా… ఇంతకీ భన్సాలీకి ఏమైంది..?! ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలగలిపి సినిమాలో ఏదో వెలితి ఉన్నట్టు అనిపిస్తయ్… బట్, సినిమా బాగాలేదని కాదు, మనం అంచనా వేసుకున్నంత గొప్పగా లేదని మాత్రమే..!!
Share this Article