ఒక్క మాట… అనాలోచితమైన ఒకే ఒక్కమాట… నోరు దాటితే చాలు… ‘పెదవి దాటితే పృథివి దాటినట్టే’ అంటాం కదా… అలా ప్రపంచమంతా చక్కర్లు కొట్టీ కొట్టీ, బదనాం చేసి, ఇక దిద్దుకోలేనంత నష్టాన్ని మూటగట్టేస్తుంది… సోము వీర్రాజు అనాలోచిత వ్యాఖ్యలు తన బట్టలిప్పి తననే బజారున పెట్టేశాయి… రోజూ రాజకీయ నాయకుల పిచ్చి వ్యాఖ్యలు ఎన్నో పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం, జాతి ఖర్మ అని బాధపడుతూ ఉంటాం… ఇక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోని బోసిడికే, రండ టైపు బూతులు మన అద్భుతమైన, మానసిక స్థితిని, మన పురోగమన స్థాయిని చెబుతుంటయ్… కుల గజ్జి పాలిటిక్స్ చూస్తూనే ఉన్నాం… ఈ తెలివిమంతుల విషయంలో ఏ పార్టీ కూడా తక్కువేమీ కాదు… ఆ దిశలో చూసినప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యమేమీ కలిగించవు… కానీ తనపై సానుభూతిని కలిగిస్తయ్… బీజేపీ దురవస్థ మీద జాలి కలిగిస్తయ్… కీలకస్థానాల్లో ఉండే నాయకుల నిజస్థాయి పట్ల ఏవగింపును కలిగిస్తయ్…
ఇప్పటికే మన నాయకులు, మన పాలకులు మనల్ని వేగంగా వెనుక యుగాల వైపు తీసుకుపోతున్నారు… పంచుడు పథకాలు, లక్షలాది కోట్ల అప్పులు, కేవలం వోట్లు, స్వార్థం ప్రేరేపిత పథకాలు, అక్రమ సంపాదనలతో జాతి సంపదను పారబోస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం… వీటికి తోడు వాళ్ల వ్యాఖ్యలు, తెలివి ప్రదర్శనలు సరేసరి… నిజానికి సోము వీర్రాజుది కాస్త డిఫరెంట్… అది ఏపీబీజేపీ చేసుకున్న అదృష్టమేమో… అసలే ఆ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోతోంది… మోడీ ఆశలు, అమిత్ షా ప్రణాళికలేమీ ఏపీలో పనిచేయవ్… ఈ స్థితిలో ఇదుగో ఇలాంటి నేతలు పార్టీ అదృష్టానికి అదనపు విలువ అన్నమాట… అంటే, వాల్యూ యాడిషన్…!! మీకు అత్యంత చీప్‌గా *చీప్ లిక్కర్* సరఫరా చేస్తామంటూ వాగ్దానం చేసిన మొట్టమొదటి రాజకీయ నేత బహుశా సోము వీర్రాజే కావచ్చు… (ఆ వ్యాఖ్యలపై వెంటనే ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన వ్యంగ్య కథనం ఇదీ…)
ఏపీ ప్రజలకు ఫుల్లు కిక్కు… జస్ట్, బీజేపీకి వోటేస్తే చాలు… తాగినోడికి తాగినంత…
Ads
నిజానికి నాయకులు ఏవో పిచ్చి కూతలు కూయడం, ఆ వెంటనే నాలుక కర్చుకుని అబ్బెబ్బే, నా వ్యాఖ్యలను వక్రీకరించారు, తప్పుడు బాష్యం చెప్పారు అని సమర్థించుకుని తప్పించుకునే ప్రయత్నం చేయడం పరిపాటే… సమర్థన కూడా ఓ తెలివి… అసలు దానికే ఎక్కువ తెలివి కావాలి… కానీ టీవీల్లో అంత స్పష్టంగా వినిపిస్తుంటే, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెక్కిరింపుల పోస్టులు కనిపిస్తుంటే… ‘‘నా మాటల్ని వక్రీకరించారు’ అని ఎవరైనా సమర్థించుకోజూస్తే జనం మరింత నవ్విపోతారు… సోము వీర్రాజు విషయంలో జరిగింది ఇదే… ఈరోజుకూ తన ఏమంటాడంటే… మహిళల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఆ వ్యాఖ్య చేశాను… ఇది మరింత నవ్వు పుట్టించేది… (జనాన్ని దోపిడీ చేస్తున్న జగన్ చీప్ లిక్కర్ పాలసీ మీద వ్యంగ్యంగా ఇలా అన్నాను అనే మాటకు కట్టుబడి ఉన్నా బాగానే ఉండేది… కానీ మహిళల ఆర్థికప్రయోజనాల కోసమే అని నాలుకను మడతేసి మరింత పలుచన అయిపోయాడు తను)…
మందు తాగే కుటుంబాల్లో ‘‘చీపెస్ట్ సర్కారీ చీప్ లిక్కర్’’ కారణంగా రోజుకు 200 ఆదా జరిగినా నెలకు 6 వేల ప్రయోజనం సమకూరినట్టే కదా అంటున్నాడు… ఇక తన వ్యాఖ్యలపై విశ్లేషణలే వేస్ట్… మహిళల ఆర్థిక ప్రయోజనాలు, కుటుంబ అభ్యున్నతి, పేదరిక నిర్మూలనల మీద ఈ రేంజ్ ఔట్ లుక్ ఉన్న నాయకుడిని ఇక చూడబోం… ఈ చీప్ లిక్కర్ వ్యాఖ్యల్లోని డొల్ల మేధస్సును యాంటీ బీజేపీ సెక్షన్లు వెంటనే పట్టేసుకున్నయ్… రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చాలామంది వెక్కిరింపులకు దిగారు… బీజేపీ సెక్షన్లు కిక్కుమంటే ఒట్టు… అబ్బే, మా నాయకుడి ఉద్దేశం అది కాదు అంటూ ఏవో బాష్యాలకు, సమర్థనలకు కూడా ఎవరూ సాహసించలేదు… అందులో వెనకేసుకురావడానికి ఏమైనా ఉంటే కదా… వెరసి కమలం సిగ్గుతో ముడుచుకుపోయింది..!!
Share this Article