ఈటీవీ… 16.1.2022… ఆదివారం… మధ్యాహ్నం… పన్నెండు గంటల నుంచి ఒంటి గంట… ప్రోగ్రాం పేరు పాడుతా తీయగా… తాజా హైదరబాద్ బార్క్ రేటింగ్స్ ఎంతో తెలుసా..? ఊహించలేరు… 0.79… నమ్మలేక, ఒకటికి పదిసార్లు చెక్ చేసినా అదే కనిపిస్తోంది… మరీ ఇంత ఘోరమా అనుకోనక్కర్లేదు… ఈ టీఆర్పీ రేంజ్ ఏ ప్రోగ్రాంకు వచ్చినా సరే, ఇక చాల్లేగానీ మూస్కోవోయ్ అని టీవీ ప్రేక్షకుడు చెబుతున్నట్టు లెక్క… అడ్డంగా తిరస్కరించినట్టు లెక్క…
ఏమీ ఆశ్చర్యం అక్కర్లేదు… సింగర్ సునీత ఉంది, రైటర్ చంద్రబోస్ ఉన్నాడు, మరో సింగర్ (పేరెప్పుడూ గుర్తుకురాదు… ఏ కన్నడ జయప్రకాషుడో, విజయప్రకాషుడో అయి ఉండాలి)… సింగర్ కమ్ ఆర్గనైజర్ ఎస్పీ చరణ్ ఉన్నాడు… మరీ ఈ స్థాయిలో ప్రేక్షకులు ఛిఛీ అనేశారా..? అవును, అసలు ఎస్పీ చరణే బాధ్యుడు అనుకోవాలి మనం… ఎస్పీ బాలు ఈటీవీ కోసం ప్లస్ తన కోసం మంచి టేస్టున్న, క్వాలిటీ ఉన్న ప్రోగ్రామ్స్ చేసిపెట్టాడు… దేశదేశాలు తిరిగాడు… ఇప్పుడు సింపుల్‌గా చరణ్ ఆ పేరంతా చెడగొడుతున్నాడు…
మంచి కొడుకు అంటే తండ్రి పేరును మరింతగా ఉద్దరించనక్కర్లేదు… ఆ పేరు చెడగొట్టకపోతే అదే పదివేలు… తండ్రి రుణం తీర్చుకున్నట్టు… కానీ ఆ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే పనిలో పడ్డాడు చరణ్… ఎస్, స్వరాభిషేకం ప్రోగ్రామ్‌ను భ్రష్టపట్టించేసి, ఇక పాడుతా తీయగా కొత్త సీజన్ స్టార్టింగ్ అనగానే ‘ముచ్చట’ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టేసింది… బాలు ప్రోగ్రాం నడిపించే విధానం వేరు, అది అందరికీ రాదు… బోలెడు భాషలు, వేల పాటలు, సుదీర్ఘ ప్రయాణంలో ఎందరెందరో అతిరథ మహారథులతో కలిసి పనిచేసిన బాలు ఈటీవీ మ్యూజిక్ ప్రోగ్రాముల్లో తప్పులు దిద్దుతూ, పాటల వెనుక నేపథ్యాలు చెబుతూ రక్తికట్టించేవాడు… ఎంత తోపులు అనుకున్నా సరే, వాళ్ల ముక్కు పట్టుకుని, వాళ్ల తప్పులు ఎత్తి పట్టుకుని దిద్దేవాడు, మళ్లీ పాడించేవాడు… ఒకసారి ఈ లింక్ చదవండి…
Ads
పాడుతా తీయగా..! చివరకు ఈ షోను కూడా భ్రష్టుపట్టిస్తారన్నమాట..!!
ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజైన అక్టోబరులోనే చెప్పుకున్నాం… సరికొత్త సంచిక, సురాగ విపంచిక అంటూ కొత్త పదాల్ని జతచేసి, సునీతను తెచ్చి, చంద్రబోస్‌ను తెచ్చి కూర్చోబెట్టినా… ఆ పాడుతా తీయగా ప్రోగ్రాం దరిదాపుల్లోకి కూడా పోలేరురా భయ్ అని తేల్చేశాం… ఇప్పుడు అక్షరాలా జరుగుతున్నది అదే… కాసేపు కూడా చూడలేకపోతున్నాం… ఆ స్వరాభిషేకానికి పట్టిన గతినే దీనికీ పట్టించారు… డబ్బులొస్తున్నాయని ఎగేసుకుని వచ్చి కూర్చున్నారు తప్ప, బాలు అనితరసాధ్యంగా నిర్వహించిన ఆ షోకు మేం అర్హులమా కాదా కూడా సునీత, చంద్రబోస్ ఆలోచించలేదు…
హిహిహి అని సునీత ఎల్లప్పుడూ నవ్వితే సరిపోదు… నాలుగు పడికట్టు పదాలతో చంద్రబోస్ ఏవేవో మాట్లాడేస్తే అస్సలు సరిపోదు… చరణ్ ఏదీ చెప్పలేడు… ఇదేకాదు, టీవీల్లో వచ్చే సంగీత కార్యక్రమాలు ఓ ఛాలెంజ్… ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం, కట్టేసుకోవడం అంత వీజీ కాదు… అప్పట్లో మాటీవీలో రేలారేలా వచ్చేది, ఉర్రూతలూగించేది… తరువాత కొన్నాళ్లు సూపర్ సింగర్… మొన్నమొన్నటిదాకా జీలో సరిగమ వచ్చేది, అట్టర్ ఫ్లాప్… ప్రదీప్ కామెడీ ప్రోగ్రాంను మరీ కామెడీ షో చేసింది… ఇదే చంద్రబోసుడు, శైలజ ఏమీ చేయలేక చేతులెత్తేశారు… ఇప్పుడు మళ్లీ ఆడిషన్లు స్టార్ట్ చేశారు…
ది ఎవరెస్ట్ యాంకరిణి సుమ హోస్ట్ చేసే స్టార్ట్ మ్యూజిక్ మరో దరిద్రం… అదసలు సంగీత ప్రధాన షో కానేకాదు… సుమ కేవలం కిట్టీ పార్టీలు మాత్రమే చేయగలదు టీవీలో… అంతకుమించి వేరే జానర్ ఆమెకు చేతకాదు… చేసినా క్లిక్ కావు… అవి ఆమెకూ తెలుసు… ఈ స్టార్ట్ మ్యూజిక్ రేటింగ్స్ ఎంతో తెలుసా..? 1.12… అంటే అమ్మా, తల్లీ, మమ్మల్ని కరుణించి, ఇక ఆ షో ఆపేయమ్మో అని ప్రేక్షకుడు పరోక్షంగా మొరపెట్టుకున్నట్టు లెక్క… సరే, ఇవన్నీ పక్కన పెడితే… అయ్యా, చరణూ… మీ డాడీ మీద నీ ప్రేమ గురించి, ఇలా ఆయన పేరును చెడగొట్టడం గురించి ఇక మేమేమీ అనలేం, అనబోం, అన్నా వేస్టు గానీ… కాస్త స్వరజ్ఞానం, స్వరాసక్తి, స్వరప్రేమ ఉన్న స్వరస ప్రేమికుల తలలు తినొద్దు… పాడతా చేదుగా షో కొనసాగింపు గురించి ఓసారి సీరియస్‌గా సమీక్షించుకో… అసలే ఈటీవీలో ‘‘మంచి నిర్ణయాలు’’ తీసుకునే పెద్దతలకాయలు కనిపించడం లేదు…!!
Share this Article