.
. ( Shanthi Ishaan… ) .. … పగలంతా నువ్వు మరోలా ఉండొచ్చు. నీ అనుభూతులను, నీ భావోద్వేగాలను దాచి ఉండొచ్చు. కానీ ఉన్నట్టుండి ఏ నడిరాతిరో నీకు మెలకువ వస్తుంది. నువ్వు కప్పుకున్న ముసుగు వీడిపోతుంది. నువ్వు పోగొట్టుకున్న నువ్వు నీకు బాగా గుర్తొస్తావు. నీలో నిద్రాణంగా ఉన్న జ్ఞాపకాలు మేలుకొంటాయి.
నీ మనసు పట్టు తప్పుతుంది. నువ్వు మరిచిపోయిన మల్లెల పరిమళం తాజాగా మారి నీ మనసు నిండా అలుముకుంటుంది. తొలి ప్రేమ తాలూకు తీపి ఆనవాలో, ప్రియురాలి చిరునవ్వో నీ మస్తిష్కాన్ని కలవరపరుస్తాయి. తీరని కోరికలేవో తీపి మంట రేపుతాయి. ఇలాంటి ఒక అర్థరాత్రినే వస్తువుగా తీసుకుని వసంత్ దేవ్ ఎంత అందమైన పాట రాశారో చూడండి!
మన్ క్యో బెహ కా రీ బెహ్ కా ఆధీ రాత్ కో
బేలా మెహ్ కా రీ మెహ్ కా ఆధీ రాత్ కో
నడిరాతిరి వేళ మనసెందుకో పట్టు తప్పింది
మల్లెలు గుప్పుమన్నందుకో ఏమో మరి!
కిస్ నే బన్సీ బజాయీ ఆధీ రాత్ కో
జిస్నే పల్కే చురాయీ ఆధీ రాత్ కో
ఈ జామున ఎవరో వేణువూదుతున్నారు
Ads
కనురెప్పల మాటు నిద్రను కాజేసేవారే అయి ఉంటారు!
1984లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సవ్’ సినిమాలోని పాట ఇది. లతా మంగేష్కర్, ఆశా భోస్లే కలిసి పాడిన అతి తక్కువ పాటల్లో ఇదీ ఒకటి. శృంగారభరితమైన ఈ పాటను వసంత్ దేవ్ అశ్లీలత అన్నదే లేకుండా భావుకతతోను, భావగర్భితంగాను రాసుకొచ్చారు.
శూద్రకుడు రాసిన ‘మృచ్ఛకటిక’ అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అలా చెప్పే కంటే చారుదత్తుడు, వసంత సేన ప్రేమ కథ అంటే ఇంకా బాగా అర్థమవుతుందేమో! (ఇంటర్మీడియెట్ లో second languageగా Sanskrit తీసుకున్నవాళ్ళకు ఈ ఇద్దరి కథ బాగా తెలుసు). ఈ సినిమాను నిర్మించిన శశి కపూర్ కి అప్పట్లో కోటిన్నర నష్టం వచ్చిందట. అయితేనేమి, కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కళాత్మకతకు, సంగీతానికి మంచి మార్కులే పడ్డాయి. ఆర్ట్ డైరెక్షన్ కి జాతీయ అవార్డు గెలుచుకుందీ సినిమా.
చారుదత్తుణ్ణి మోహించిన వసంతసేన (రేఖ) అతని ఇంటికొస్తుంది. అక్కడ అతని భార్య అదితిని, కొడుకును చూస్తుంది. వసంతసేన సంగతి తెలిసి కూడా అదితి ఆమెను సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. వసంతసేన తన నగలను అదితికి అలంకరిస్తుంది. ఆ కాసేపూ ఇద్దరు ఆడవాళ్ళు తమ మనసుకు నచ్చిన జీవితాన్ని గడుపుతారు.
వసంతసేన ఒక సాధారణ స్త్రీగా సంతృప్తిపడితే అదితి ఖరీదైన నగలు ధరించి మురిసిపోతుంది. ఆ సందర్భంగా పాడుకునే పాట ఇది. ఇద్దరూ ప్రేమించింది ఒకరినే అని తెలిసినా స్నేహితుల్లా చెణుకులు విసురుకుంటూ అల్లరిగా, అందంగా పాడుకుంటారీ పాట. ఒకరు ప్రశ్న వేస్తే మరొకరు జవాబు చెప్పేలా ఒక సంవాదంలా సాగిపోతుంది.
ఝాంఝర్ ఝమ్ కే సున్ ఝమ్ కే ఆధీ రాత్ కో
ఉస్కో టోకో న రోకో, రోకో న టోకో
టోకో న రోకో ఆధీ రాత్ కో
నడిరాతిరి వేళ మువ్వలు మోగాయి విన్నావా అని వసంత సేన అడిగితే…
ఆ సడిని సద్దుమణగనివ్వద్దు అని అదితి బదులిస్తుంది.
లాజ్ లాగే రే లాగే ఆధీ రాత్ కో
దేనా సిందూర్ కేసౌ ఆధీ రాత్ కో
బేలా మెహ్ కా రే మె కా ఆధీ రాత్ కో
నడి రాతిరి వేళ సిగ్గు ముంచుకొస్తుంది అని అదితి సిగ్గుపడితే వసంత సేన సిందూరం చేతికిచ్చి ఆ నడి జామునే ఈ సిందూరంపై ఒట్టు వేయించుకో, మల్లెలు గుప్పుమనేది అప్పుడే కదా అంటుంది. అంటే ఇలాంటప్పుడే నీ భర్తను కొంగున కట్టేసుకోమని సలహా ఇస్తుంది.
బాత్ కెహ్ తే బనే క్యా ఆధీ రాత్ కో
ఆంఖ్ ఖోలేగీ బాత్ ఆధీ రాత్ కో
హమ్ నే పీ చాందినీ ఆధీ రాత్ కో
చాంద్ ఆంఖోం మే ఆయా ఆధీ రాత్ కో
బేలా మెహ్ కా రీ మెహ్ కా ఆధీ రాత్ కో
అర్థ రాత్రి పూట అనుకోకుండానే మాట కలిసిందేమో!
నడిరాతిరిలోనే కదా ఊసులన్నీ మేలుకుంటాయి
నేను వెన్నెల తాగేశాను
కళ్ళల్లోకి చందమామ వచ్చి చేరిపోయింది
మల్లెలు గుప్పుమన్నాయి మరి!
ఈ పాటలో లతా మంగేష్కర్ గొంతు అందంగా, హాయిగా సాగిపోతే ఆశా స్వరంలో మాత్రం ఒక రకమైన విరుపు, మెరుపు పలుకుతాయి. ‘హమ్ నే పీ చాందినీ’ అన్నప్పుడు నిజంగానే వెన్నెల తాగేసిందా అన్నంత కవ్వింపు కనిపిస్తుందా స్వరంలో. ఈ పాట మొత్తంలోకీ ఈ లైన్ నాకు చాలా నచ్చుతుంది. అసలు వెన్నెల తాగడమేంటి?
కవి వెన్నెలను అమృతంతో పోల్చాడేమో అనిపిస్తుంది. అమృతం తాగితే ఎంతటి ఉత్సాహము, ఉల్లాసమో వెన్నెల తాగితే అంతే మత్తు, గమ్మత్తు అని చెప్పడం ఆయన ఉద్దేశమై ఉంటుంది. కళ్ళల్లోకి చందమామ వచ్చి చేరడమంటే ఆ ఆనందం తాలూకు మెరుపు కాబోలు!
రాత్ గున్తీ రహేగీ ఆధీ బాత్ కో
ఆధీ బాతోంకీ పీర్ ఆధీ రాత్ కో
బాత్ పూరీ హో కైసే ఆధీ రాత్ కో
రాత్ హోతీ షురూ హై ఆధీ రాత్ కో
తీరని కోరికలను రాతిరి నెమరువేసుకుంటూనే ఉంటుంది. ఆ సగం సగం ఊసుల తాలూకు బాధ అర్థరాతిరి వేళ వేధిస్తుంటుంది. మరి ఆ కోరికలు తీరేదెలా అని వసంతసేన బాధపడిపోతుంటుంది. వెంటనే అదితి అందుకుని అసలు రాతిరి మొదలయ్యేదే అర్థరాత్రి కాబట్టి తీరని కోరికలేమైనా ఉంటే అప్పుడే తీర్చేసుకోమంటుంది.
మరాఠీ కవి అయిన వసంత్ దేవ్ హిందీలో కొన్ని parallel సినిమాలకు పాటలు, మాటలు రాశారు. వాటిలో ఈ పాట , ‘Saanjh dhale ‘అన్న పాట ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ పాట అయితే పేరుతో పాటే ఫిలింఫేర్ అవార్డు కూడా సాధించి పెట్టింది.
పాట ఆసాంతం “ఆధీ రాత్” అన్నఒక్క మాటనే తిప్పి తిప్పి వాడుతూ ఏమాత్రం అర్థం చెడకుండా కవి ఒక rhythm సృష్టించారు. ఆ పదాల సొగసు చెడకుండా లక్ష్మీకాంత్-ప్యారేలాల్ అతి తక్కువ వాయిద్యాలు వాడుతూ బాణీలు కట్టారు. ఘటం, ఢోలక్, సంతూర్, మువ్వల సన్నటి సడితో అర్థరాత్రి వాతావరణాన్ని పాటలో recreate చేశారు.
అద్భుతమైన లిరిక్స్, మనసును మీటే సంగీతం, అక్కాచెల్లెళ్ళ వీనులవిందైన జుగల్బందీ, రేఖ అందం, అనురాధా పటేల్ అమాయకత్వం అన్నీ కలగలిసి ఈ పాటకు aesthetic sense ఇచ్చాయి. జనం సినిమాను ఎప్పుడో మరిచిపోయినా ఈ పాట ఇప్పటికీ మన వెన్నంటే వస్తుండడానికి బహుశా ఈ ఈస్థటిక్సే కారణమేమో!
Share this Article