A. Saye Sekhar…….. ఈసారి గులాబీల జెండలమ్మ… గురుతుల గురుతుంచుకో రామక్క… అనే “బీఆర్ఎస్” వాళ్ళ పాట తెలంగాణలో దుమ్ము రేపుతోంది. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే పాట కూడా బాగానే ప్రచారం పొందింది… ప్రచారంలో పాటది ఎప్పుడూ ప్రధానస్థానమే… ఎన్నికలే కాదు, ఉద్యమాలు, విప్లవాలు, ఉత్సవాలు… ఏది తీసుకున్నా మన జీవితంలో పాట ప్రభావం అంతా ఇంతా కాదు… 2019లో రాసిన ఓ కథనం… ఈ ఎన్నికల రామక్క పాట జోరు నేపథ్యంలో…
ఎన్నికల్లో పాటల ప్రభావం, ప్రాభవం… నాకు గుర్తున్నంతవరకూ తెలుగులో (ఇటీవలి కాలంలో మన రెండు రాష్ట్రాల్లో ) కొన్ని ఎన్నికల పాటలూ, ప్రభుత్వ పథకాల పాటలూ చాలా పాపులర్ అయ్యి…రాజకీయాలను వివిధ పార్టీల ఫలితాలనూ ప్రభావితం చేశాయ్.
* రైతు నాగలి గురుతే మన జనత పార్టీ (చిలక కొట్టుడు కొడితే … చిన్నదానా style లో ) – 1978 అసెంబ్లీ ఎన్నికలు – జనతా పార్టీ టిక్కెట్ మీద చాలా మంది శాసన సభ్యులు గెలిచి కాంగ్రెస్ లో చేరారు
Ads
* 1983 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయలనే కాకుండా యావద్భారత రాజకీయాల్నే ఒక మలుపు తిప్పాయ్…ఆ ఎన్నికల్లో ఎన్నోపాటలు వచ్చాయ్
– నందామయా గురుడ నందామయా … (ఈ పల్లవితో తెలుగుదేశం, కాంగ్రెస్ రెంటికీ పాటలున్నాయ్..);
– ఇది తెలుగు గడ్డా, గాండ్రించు పులిబిడ్డా …నీ గొంతులో పిల్లి కూతొద్దురా … నీ గుండెలొ గొర్రె దాటొద్దురా … (TDP)
– మా తెలుగు తల్లికీ మల్లెపూదండా (కొత్త రాగంలో స్వరపరిచారు). ఇది ఎన్ టీ ఆర్ చైతన్యరథం రాకను సూచించే సిగ్నేచర్ సాంగ్ లా కూడా వాడే వాళ్ళు – ఈ పాట 1989 & 1991 (లోక్ సభ) ఎన్నికల్లోనూ 1994 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూడా వాడారు.
– 1989 లో కాంగ్రెస్ ని అందలమెక్కించిన పాటేంటో గుర్తు లేదు.
– 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం వాళ్ళు మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ‘పుణ్యభూమి నా దేశం నమోనమామీ …” విస్తృతంగా వాడారు. ఆ పాట ఎన్ టీ ఆర్ ప్రచారంలో ప్రముఖం గా వినిపించింది.
నిజానికి ఇక్కడొక ఆసక్తికరమైన అంశం. “మల్లెమాల” గా ప్రసిద్ధికెక్కిన ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని పాటలు చేయించారు. ఆ పాటలన్నీ ఆయనే రాశారు.
ప్రతీ పాట ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ రెండు నుంచీ నాలుగు నిముషాల పాటు సాగుతుంది. ఆరో , ఏడో పాటలు రాసి వాటిని చిత్రీకరించారు. ఇవి సినిమా హాళ్ళలో సినిమాలకి ముందు అడ్వర్టైజ్మెంట్ల లాగా వెయ్యడానికి ఉద్దేశించినవి . ప్రతీ పాటకీ ఒక మకుటం (సిగ్నేచర్ లైన్) పెట్టారు మల్లెమాల. అదేంటంటే … “ముఖ్యమంత్రి కోట్లకు మంగళహారతి పాడుట తథ్యం…” అని ముగుస్తుంది ప్రతీ పాటా.
ఈ పాటల ప్రివ్యూ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి గారూ, ఏపీసీసీ అధ్యక్షుడు కమాలుద్దీన్ అహ్మద్ గారూ, కొందరు కాంగ్రెస్ నాయకులూ, మంత్రులూ, ప్రముఖ నటుడు డా. అక్కినేని నాగేశ్వర రావు గారూ, కొందరు ఎంపిక చేసిన పాత్రికేయుల ముందు అన్నపూర్ణా స్టుడియోస్ ప్రివ్యూ థియేటర్లో ప్రదర్శించారు.
అందరూ చాలా బాగుందని పొగిడారు. ప్రస్తుత “ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్” దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ Krishna Rao Chirravuri గారు (అప్పట్లో ఆంధ్రప్రభ దినపత్రిక బ్యూరో చీఫ్ ) ఆ మకుటంలో “మంగళ హారతి పాడుట తథ్యం” అనే వాడకం “ముగింపు” “చరమగీతం” వంటి అర్థాలు స్ఫురింపజేస్తోందని, కనుక దాన్ని “విజయ హారతీ” అనో మరోవిధంగానో మార్చాలని సూచించారు.
మల్లెమాల గారు చందోబద్ధంగా వ్రాసిన వాటిని మార్చడం కుదరదనీ, పైగా తన భాషా ప్రావీణ్యాన్ని ప్రశ్నిస్తున్నారన్న ధోరణిలో దబాయించేశారు. అందరూ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు.
తరువాత స్కూటర్ స్టాండు దగ్గర నేను, కృష్ణారావు గారితో “మంగళహారతి తథ్యం” అన్నాను. మాకు పబ్లిక్ పల్స్ బానే అందింది. కాంగ్రెస్ ఓడిపోతుందని తెలుస్తూనే ఉంది. ఆయన ఒక నవ్వు నవ్వి, ఇలాంటి మకుటాలు వాడి, వీళ్ళే మాకు ఓట్లు వెయ్యొద్దు అని కోరుకుంటుంటే ఎవరూ రక్షించలేరు అన్నారు. ఎన్ టీ ఆర్ 220 సీట్లు గెలిచారు. కాంగ్రెస్ 26 సీట్లకి పరిమితమైంది.
– 1996 లోక్ సభ ఎన్నికలకు చంద్రబాబు కొన్ని పాటలు ప్రచారం కోసం చేయించారు. ఇవి వీడియో వెర్షన్ కూడా చేయించారు. వీడియో పాటలు చూసిన తొలి ఎన్నికలు ఇవే. సినీ నటులు శారద, మురళీ మోహన్ తదితరులు వీటిలో నటించారు. చాలా పాటలు చేయించారు. కానీ నాకు గుర్తున్న రెండూ ఇక్కడ ఇస్తున్నా.
“అన్నమాట తప్పడు మన చంద్రబాబు నాయుడూ… ఆయనకే ఓట్లేద్దాం అందరమూ ఇప్పుడూ…”
ఇంకోటి “కొత్తదనం, కొత్తదనం చంద్రబాబు ప్రభుత్వం…ప్రజలే ప్రభుత్వమై కదిలాడు చంద్రబాబూ…”
ఇవి మరీ పాపులర్ కాలేదు. 1998 లోక్ సభ ఎన్నికలకి ఏం పాటలు వాడారో గుర్తులేదు.
– 1999 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకి తెలుగుదేశం రెండు సెన్సేషనల్ సాంగ్స్ దించింది. ఒకటి ప్రభుత్వ పథకానికి సంబంధించిన ప్రభుత్వ పాట. అదే చంద్రబాబు నాయుడు గారి రాకపోకలని సూచించే సిగ్నేచర్ సాంగ్… “తరలుదాము రండి మనం జన్మభూమికీ… తల్లిపాల ఋణం కొంత తీర్చడానికీ …”
– ఇంక తెలుగుదేశం రిలీజ్ చేసిన పాట ఇంకో సెన్సేషన్. “కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా… త్యాగాలకి వెనుదీయని దేశభక్తులారా… నందమూరి ఆశయ రథసారథ్యం మీదే… చంద్రబాబు స్వర్ణాంధ్రకి నిర్మాతలు మీరే…” మాంచి ఊపు తెచ్చినా ఎన్నికల్లో ఓడిపోయిన వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు వాడిన పాట గుర్తులేకపోవడం నా తప్పు కాదు. తెలుగుదేశం ఘనవిజయం సాధించింది.
– ఇంక 2004. అనితర సాధ్యమైన విజయాన్ని సాధించిన రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్… గోరటి వెంకన్న రాసిన “కుబుసం” సినిమాలో పాటని వాడుకుంది. ఆ పాటే కొంతవరకూ తెలుగుదేశం కొంప ముంచింది.
“పల్లె కన్నీరు బెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంది అయ్ పోతుందో కనిపించని కుట్రలా “
దీని ముందు తెలుగుదేశం పాటలేవీ నిలబడలేదు. TDP ఈ ఎన్నికల్లో 50 సీట్లు కూడా గెలవలేదు. నాకు గుర్తున్నంతవరకూ 2009 ఎన్నికల్లో పాటల ప్రాభవం, ప్రభావం రెండూ లేవు. రాజశేఖర రెడ్డి అత్తెసరు మార్కుల్తో చావుతప్పి కన్ను లొట్టపోయి గెలిచారు.
– 2014 కి ఆంధ్ర ఎన్నికల్లో తెలుగుదేశం 1999 పాటలు మళ్ళీ వాడింది. వయ్యస్సార్ కాంగ్రెస్ ఏం పాటలు ప్రచారం చేసిందో నాకు గుర్తు లేకపోవడం మళ్ళీ నా తప్పుకాదు.
– తెలంగాణ రాష్ట్ర సమితి గద్దర్ పాడిన “పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా… పోరు తెలంగాణమా… కోట్లాది పానమా…” వాడుకున్నట్టు గుర్తు.
– 2018 అసెంబ్లీ ఎన్నికలకి “తెలంగాణ గడ్డ మీద గులాబి జెండా… మన గులాబి జెండా… ఎగురుతుంది కేసియారు గులాబి జెండా… కారు గుర్తూ జెండా …” టీఆరెస్ కి సిగ్నేచర్ సాంగ్ అయింది. కే సీ ఆర్ ఘన విజయం సాధించారు. ఇతరులు సోదిలో లేరనే చెప్పొచ్చు.
– 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం మళ్ళీ “కదలిరండి తెలుగు దేశం కార్యకర్తలారా…” అనే పాట బయటికి తీసింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ “రావాలి జగన్ … కావాలి జగన్” అనే పాట పాపులర్ చేసింది. లోక్ సభ ఎన్నికల్లో TRS మళ్ళీ గులాబి జెండా పాటనే నమ్ముకుంది. ఇలా ఎన్నికల్లో పాటల ప్రభావం, ప్రాభవం ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంది.
Share this Article