.
2014లో ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవిని ఆశించడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని సోనియా తన బిలాంగింగ్ పుస్తకంలో రాసుకుంది… అదేదో ఆయన అత్యాశాపరుడు, అనర్హుడు అన్నట్టుగా… నిజానికి ప్రణబ్ ముఖర్జీకి ఏం తక్కువ..? ప్రధాని కావాలని కోరుకోవడంలో తప్పేముంది..? కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు… ట్రబుల్ షూటర్… ఎప్పుడు పార్టీకి ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడ వాలేది ఆయనే…
ప్రధాని కావాలని ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు..? గుజ్రాల్, చంద్రశేఖర్, దేవెగౌడ… వీళ్లేమైనా జాతీయ నాయకులా..? ఎంపీల బలముందా..? క్రౌడ్ పుల్లర్లా..? నంబర్లాటలో, అనిశ్చిత స్థితుల్లో ప్రధాని కుర్చీ ఎక్కారు… వాళ్లతో పోలిస్తే ప్రణబ్ బోలెడు బోలెడు బెటర్… నిజమే, తనకు నాలుగుసార్లు ప్రధాని కుర్చీ దక్కినట్టే దక్కి, దక్కకుండా పోయింది…
Ads
నిజానికి సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్టు వినడు అనే కదా, చెప్పినట్టు నడుచుకునే మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసింది… ఇందిరా గాంధీ హయాం నుండి సోనియా గాంధీ వరకు పార్టీని భుజాన మోసిన ఈ అత్యంత ప్రతిభావంతుడైన నాయకుడికి నాలుగు సార్లు ప్రధాని పీఠం చేతికి అందినట్లే అంది చేజారిపోయిన ఆ సందర్భాలు ఓసారి చూద్దాం… ఆ నాలుగు సార్లూ కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను అత్యంత నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేసింది!
1. 1984 – మొదటి అవకాశం (ఇందిర మరణం తరువాత): ఇందిరా గాంధీ హత్యానంతరం తదుపరి ప్రధాని ఎవరు అనగానే అందరి నోటా వినపడిన పేరు ప్రణబ్ ముఖర్జీ. అప్పటి కేబినెట్లో అత్యంత సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు ఆ పదవి దక్కడం దాదాపు ఖాయమనుకున్నారు. కానీ, రాజకీయ సమీకరణాలను తిరగరాస్తూ అరుణ్ నెహ్రూ, ఎం.ఎల్. ఫోతేదార్, జైల్ సింగ్ కలిసి అదే రోజు సాయంత్రం 6 గంటలకే రాజీవ్ గాంధీని ప్రధానిగా పీఠంపై కూర్చోబెట్టారు.
రాజీవ్‌కు ప్రత్యామ్నాయంగా తన పేరు వినిపించినందుకు ప్రణబ్ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇందిర కేబినెట్లో ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పిన ప్రణబ్‌కు రాజీవ్ తన మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదు. కాలక్రమేణా పార్టీలో ఆయన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించేశారు.
2. 1991 – రెండో అవకాశం (రాజీవ్ మరణం తరువాత): రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు ప్రణబ్‌కు మరో అవకాశం ఎదురైంది. కానీ కాంగ్రెస్ నాయకులంతా సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రధాని పదవిని, పార్టీ పగ్గాలను చేపట్టాలని ప్రాధేయపడ్డారు. కానీ కారణాంతరాల వల్ల ప్రణబ్ స్థానంలో పి.వి. నరసింహారావు పేరు తెరపైకి వచ్చింది. అప్పటికే రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్న పీవీకి ప్రధాని పదవి దక్కింది. రాజీవ్‌తో ఉన్న పాత విభేదాల కారణంగానే సోనియా ప్రణబ్ పేరును తొక్కిపెట్టారనే ప్రచారం జరిగింది.
పీవీ ప్రభుత్వంలోనూ ప్రణబ్‌కు కేబినెట్ హోదా దక్కలేదు; మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి కాగా, ప్రణబ్ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

3. 2004 – మూడో అవకాశం (సోనియా ‘నో’ చెప్పినప్పుడు): 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా ప్రధాని పదవిని తిరస్కరించిన వేళ, ప్రణబ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కానీ ఇక్కడ కూడా సోనియా ఆయనను వ్యూహాత్మకంగా పక్కన పెట్టింది. గతంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీఐ (RBI) గవర్నర్‌గా తాను సంతకం చేసి నియమించిన మన్మోహన్ సింగ్‌ను తెచ్చి ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టారు! అయినా ప్రణబ్ ఏనాడూ పార్టీపై తిరుగుబాటు చేయకుండా మౌనంగా ఉండిపోయాడు…
4. 2009 – చివరి అవకాశం (యూపీయే సంక్షోభం): ఆదర్శ్, బొగ్గు కుంభకోణాలు, అమెరికా అణు ఒప్పందం వంటి అంశాలతో యూపీఏ సర్కార్ ఊగిసలాడుతున్న సమయమది. బయటి నుంచి మద్దతిస్తున్న వామపక్షాలకు మన్మోహన్ సింగ్‌పై విశ్వాసం సన్నగిల్లడంతో, ప్రత్యామ్నాయంగా ప్రణబ్ ముఖర్జీ పేరుకు వారు ఆమోదం తెలిపారు.
అయితే, 2009 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్యంగా ఎక్కువ సీట్లు సాధించడంతో మళ్లీ మన్మోహనే ప్రధాని అయ్యారు. దాంతో ప్రణబ్ ప్రధాని కావాలన్న చిరకాల స్వప్నం శాశ్వతంగా సమాధి అయిపోయింది… 1969లో రాజ్యసభ ఎంపీ దగ్గర నుంచి 2012లో రాష్ట్రపతి అయ్యే దాాకా… అనేక పార్టీ, కేంద్ర కేబినెట్లో కీలక పోర్ట్‌ఫోలియోలు, అధికార పదవులు… ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉన్న ఒక భారతరత్నం ప్రధాని పదవి ఆశించి ఉంటే, అందులో తప్పేముంది..?
Share this Article