.
“సోనియా గాంధీ… తన 21 ఏళ్ల వయస్సులో ఈ దేశపు కోడలిగా, అత్యంత శక్తివంతమైన కుటుంబంలోకి అడుగుపెట్టింది… ఇప్పుడు ఆమె వయస్సు 79 ఏళ్లు. పదేళ్లు దేశాన్ని పరోక్షంగా పాలించి, దశాబ్దాలుగా ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించిన ఆమె ఆత్మకథ (Autobiography) లేదా జ్ఞాపకాల దొంతర (memoir) లోని అంశాలు ఖచ్చితంగా ప్రధాన వార్తాంశాలే….
కాకపోతే ఎవరి ఆటో బయోగ్రఫీ అయినా సరే… తమ పాత నిర్ణయాలకు, ఆలోచనలకు, అడుగులకు జస్టిఫికేషన్లు, వివరణలు, క్లారిటీలు ఇచ్చే ప్రయత్నం మాత్రమే చేస్తాయి… ఆత్మస్తుతి, పరనింద… సోనియా పుస్తకమూ దీనికి అతీతంగా ఏమీ లేదనిపించింది… చాలా అంశాల్లో ఆమె నిజాయితీగా రాసుకోలేదు అనిపించింది… కొన్ని తప్ప!
Ads
అనేక ఉదాహరణలు… ముందుగా మన తెలుగువాడు, మాజీ ప్రధాని, అపర చాణుక్యుడు పీవీ నరసింహారావు సంగతే తీసుకుందాం… పీవీతో విభేదాల్లేవు, రాజనీతిజ్ఞుడు, గౌరవం ఉంది అని రాసుకుంది… రాజీవ్ మరణం కేసు దర్యాప్తు మీద మాత్రమే వైరుధ్యం అంటోంది… కానీ అబద్ధం… తనను ఎంత వేధించిందో చరిత్రకు తెలుసు… చివరకు తను చనిపోతే కాంగ్రెస్ కార్యాలయ గేట్లు తెరుచుకోలేదు… ఢిల్లీలో సమాధికీ నిరాకరించిన నిర్వాకం ఎవరిది..? అన్నీ తెలుసు లేమ్మా…

ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావాలనే ఆశ ఉండేదని రాసుకుంది… సో వాట్, తప్పేముంది..? ప్రణబ్ ముఖర్జీ వంటి అత్యంత సీనియర్‌కు ఆ ఆలోచన లేకపోతేనే ఆశ్చర్యపడాలి… చిదంబరం, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ, పీవీ నరసింహారావు… ఎవరికి ఎవరు తక్కువ..?
మరోచోట… షెడ్యూల్ మారింది గానీ రాహుల్ పెరంబుదూరులో రాజీవ్ పక్కన ఉండాల్సింది అని రాసింది… అదేమిటి..? అప్పటికి అసలు రాహుల్ రాజకీయాల్లోకెే రాలేదుగా… బహుశా అప్పటికి తన వయస్సు 20 దాటి ఉంటుందేమో… తను ఆ సమయంలో అమెరికాలో ఉన్నట్టు గుర్తు… ఏమో, ఇదంతగా నమ్మేట్టుగా లేదు… ఇందిర ముక్కోపి అని రాసింది… కావచ్చు…

మోదీ తన కళ్లల్లోకి చూడడు… ముక్తసరి మాటలు… జస్ట్, నమస్కారాలే అని ఓ విమర్శలా రాసింది… తప్పేముంది..? తనకు నచ్చితే మనసు విప్పి మాట్లాడతాడు… చాలా కలుపుగోలు మనిషి తను… విదేశాలకు వెళ్లినా సరే, ఆయా దేశాల రాజకీయ ప్రముఖులను ఆలింగనం చేసుకుంటాడు… ఆడవాళ్లయితే చాక్లెట్లు ఇచ్చి స్నేహాన్ని చాటుతాడు… సోనియా పట్ల ముభావంగా ఉన్నాడంటే సోనియా రాజకీయ పోకడలు ఏమత్రం నచ్చలేదేమో…

ప్రధాని కావాలని లేదు, మిత్రపక్షాలు ఒత్తిడి తెచ్చాయి, కానీ వెంటనే రాహుల్, ప్రియాంక వద్దన్నారు అని రాసుకుంది ఆమె… కానీ ప్రధాని కావాలనే ఉద్దేశంతోనే కదా రాష్ట్రపతిని కలిసింది… బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది… సుష్మా స్వరాజ్ అయితే ఏకంగా గుండు గీయించుకుని, జీవితాంతం విధవలా బతుకుతాను అని ప్రకటించింది… ఈ దేశంలో మగాళ్లు మరణించారాా అనే అర్థంలో… సేమ్, ఉమాభారతి, గోవిందాచార్య… వెల్లువెత్తిన నిరసన, వ్యతిరేకతతో వెనక్కి తగ్గిన మాట నిజం…
సిక్కుల ఊచకోత దుర్మార్గం అంటోంది… ఓ మహావృక్షం కూలిపోయినప్పుడు కొన్ని ప్రకంపనలు సహజం అని రాజీవ్ గాంధీయే చెప్పాడు, మరిచిపోయిందేమో… ఆపరేషన్ బ్లూస్టార్ చూసి ఇందిర కన్నీళ్లు పెట్టుకుంది అని మరోచోట రాసింది… కానీ ఆ ఆపరేషన్ తప్పనిసరై ఆమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… అది చరిత్ర…

“నేను సంస్కృతం నేర్చుకున్నాను, వేదాలు చదివాను” అని రాసుకుంది… అసలు ఇప్పటివరకు సరిగ్గా హిందీయే మాట్లాడలేదు ఆమె… నేను బ్యాక్ సీట్ డ్రైవర్‌ను కాను అని మరోచోట… మన్మోహన్ సింగ్ రిమోట్ ప్రధాని… పాలించింది సోనియా నివాసమే… ఆంటోనీ, ప్రణబ్, అర్జున్ సింగ్, అహ్మద్ పటేల్ సమక్షంలో ప్రతి వారం సోనియాతో ప్రధాని సమన్వయ సమావేశం ఉండేది… దాన్ని బట్టే మన్మోహన్ ఆచరణ… ఒప్పుకోకపోవచ్చు కానీ తప్పు రాయడం దేనికి..?

సంజయ్- రాజీవ్ విభేదాలు మేనకా గాంధీ వల్లే… ఆమె ఆర్ఎస్ఎస్ అనుకూలత, అసభ్య పదజాలం, వ్యవహార శైలి వల్లే గొడవలు, అసలు సంజయ్ చెప్పినందుకే ఎమర్జెన్సీ పెట్టారు అట… అర్ధరాత్రి మేనకా గాంధీని ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా కొడుకుతోసహా వీథుల్లోకి తరిమేశారు కదమ్మా… ఆమె నోరు విప్పి, ఆమె కూడా మొమైర్ రాస్తే అసలు నిజాలు తెలుస్తాయేమో…
ఎమర్జెన్సీ నిర్ణయాన్ని సంజయ్ గాంధీ మీదకు తోయడం దేనికి..? కొడుకు చెబితే ఎమర్జెన్సీ పెట్టేంత అమాయకురాలా ఇందిర..? ఆమె ఉక్కుమహిళ… అమెరికా అధ్యక్షుడినే ఫోఫోవోయ్ అని ధిక్కరించిన సాహసి, రాజకీయ పరిణతి కలిగిన నాయకురాలు… కొడుకు చెబితే ఎమర్జెన్సీ పెట్టిందని ఆమెను తక్కువ చేయడం దేనికి..?
…. ఇది మొత్తం పుస్తకం మీద సమీక్ష కానే కాదు… ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తల కవరేజీ పరిశీలించాక అనిపించిన విషయాలు… ఈ మెతుకులు చాలు కదా… కానీ కొన్ని అంశాలు కదిలించేలా ఉన్నాయి, అది నిజం…
ఉదాహరణకు తనకు రాహుల్ కన్నా ముందు బాబు పుట్టాడు, కానీ తనను జలసమాధి చేయడానికి ఒప్పుకోలేదు… ఇది కేవలం కుటుంబ విషాదం కాదు. ఆమె మనసులో చాలాకాలం మిగిలిపోయిన బాధ… రెండుసార్లు కేన్సర్ పై విజయం సాధించింది… ఇలాంటివి… కొన్నిరోజులపాటు ఆ పుస్తకంలోని అంశాల మీద విశ్లేషణ, విమర్శ నడుస్తాయి సహజంగానే..!!
అన్నాహజారే 2012లో చేపట్టారని సోనియాగాంధీ రాసింది… వాస్తవానికి 2011 ఏప్రిల్‌లో ఆ ఉద్యమం ఊపందుకుంది… రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) 1921లో ఏర్పడిందని పేర్కొంది… నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించింది 1925 సెప్టెంబరులో… అహ్మద్ పటేల్ 2022లో మరణించాడని ఉంది… అయితే అహ్మద్ పటేల్ 2020లోనే మరణించాడు… ఐతే ఇవి పాక్చువల్ ఎర్రర్స్…
- ఒక వ్యక్తి తన జీవితాన్ని తన కోణంలో రాసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ దశాబ్దాల భారత రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి తన జ్ఞాపకాలను రాసేటప్పుడు, తనకు అనుకూలమైన అంశాలనే ఎంచుకుని, అసౌకర్యం కలిగించే చారిత్రక ప్రశ్నలను పక్కన పెట్టవచ్చా?
Share this Article