సోనూ సూద్… నిజంగా తను చేపడుతున్న సేవా కార్యక్రమాలు వార్తలు చదివేకొద్దీ…. అవన్నీ నిజమేనా అన్నంతగా ఆశ్చర్యపరుస్తయ్ మనల్ని… ఏడాది కాలంగా ఎన్ని వేల మందికి దేవుడయ్యాడో చూశాం… చివరకు ఇప్పుడు తనే కరోనా బారిన పడి, హోం ఐసొలేషన్‌లో ఉన్నా సరే, తన యాక్టివిటీ ఏమాత్రం ఆగడం లేదు సరికదా… నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాడు… క్షుద్రమైన ఫ్యాన్స్, తాము దేవుడి పుత్రులం అనే మూర్ఖభావనల్లో పడి కొట్టుకుంటూ… ఏతులు తప్ప చేతలకు కొరగాని, కోట్లకుకోట్లు మూలుగుతున్నా రూపాయి ఖర్చుచేయని హీరోలు, సినిమా సెలబ్రిటీలందరూ విభ్రాంతితో సోనూ సూద్ వైపు చూస్తూ కుళ్లుకునే స్థితి… ఒక అక్షయ్, ఒక ప్రణీత, ఒక లారెన్స్… ఇంకెవరి పేరూ వార్తల్లో కనిపించదు… చేస్తే కదా… సరే, సోనూకు సంబందించిన తాజా వార్తేమిటంటే..?
కరోనాతో బాధపడుతున్న ఓ రోగిని నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తరలించాడు… మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల రోగులు, ప్రత్యేకించి తెలంగాణకు దగ్గరగా ఉండే ప్రాంతాల రోగులు ప్రధానంగా హైదరాబాద్‌కే తరలివస్తున్న సంగతి తెలుసు కదా… కరోనా వల్ల భారతి అనే పాతికేళ్ల అమ్మాయి ఊపిరితిత్తులు దాదాపు 85 శాతం దాకా పనిచేయడం లేదు… గంటగంటకూ ఆమె పరిస్థితి విషమిస్తూనే ఉంది… నాగపూర్‌లో వోక్ హార్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు… తండ్రి ఓ రిటైర్డ్ రైల్వే ఆఫీసర్… వోక్ హార్ట్ పెద్ద హాస్పిటలే కానీ ఊపిరి తిత్తులకు సంబంధించి క్రిటికల్ కేసుల్ని డీల్ చేసే ఆధునిక సాంకేతిక పరికరాల్లేవు… ప్రత్యేకించి ఎక్మో (ECMO) … ఇది తెలుసు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చికిత్స సందర్భంగా చెప్పుకున్నాం…
సోనూకు ఈ విషయం తెలిసింది… వెంటనే స్పందించాడు… హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ వాళ్లతో మాట్లాడాడు… కానీ రోడ్డు మార్గాన ఆ రోగిని తీసుకొచ్చేంత టైమూ లేదు, రోగి తట్టుకునే స్థితీ లేదు… ఎయిర్ లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు… అంటే ఎయిర్ అంబులెన్స్… అది వోకే, కానీ హఠాత్తుగా రోగిని ఎక్కించుకుని వచ్చే పొజిషన్ కాదు ఆ అమ్మాయిది… అందుకని ముందుగానే ఈ ఎక్మో చికిత్సతో పరిచయం ఉన్న ఆరుగురు డాక్టర్ల టీం బయల్దేరింది… ఆ రోగిని జాగ్రత్తగా తీసుకొచ్చేశారు… చికిత్స కొనసాగుతోంది… భేష్ సోనూ,.. నిజానికి ఈ ఒక్క పదం నిన్ను మెచ్చడానికి సరిపోదు… ‘‘20 శాతం అవకాశాలు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెప్పారు, కానీ ఆమె పాతికేళ్ల యువతి, తట్టుకోగలదు, ప్రయత్నించాలని అనిపించింది… అందుకే ఈ ప్రయత్నం…’’ అంటున్నాడు సోనూ వినయంగా… చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు..!! నీ చేతులకు మరింత శక్తిని ఇవ్వాలని దేవుడిని కోరతాం సోనూ…
Share this Article