Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నట సౌందర్యం… ద్వీప..! ఇదీ వుమెన్ ఓరియంటెడ్ సినిమా అంటే…!

October 19, 2023 by M S R

ఆమె ఒక ఒంటరి ద్వీపం … భారతీయ మహిళల్లో దాదాపు 75 శాతం మంది ఏదో ఒక రూపంలో వ్యవసాయానికి తమ తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. కానీ అందులో ఎంతమంది పేరిట భూమి ఉందనేది ఒక ప్రశ్న. దేశంలో నాలుగు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే, అందులో రెండు కోట్ల మంది మహిళలే. వారిలో ఎంతమందికి సొంత ఇల్లు ఉందనేది మరో ప్రశ్న. శ్రామికులు అనే పదానికి ఉండే పర్యాయ పదాల్లో మహిళలు అనే పదం కూడా చేర్చాలి. తనది కాని భర్త ఇంటికోసం, తనది కాని భర్త ఊరి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. కానీ హక్కులు? గుర్తింపు?

… 2002లో నటి సౌందర్య తన స్వీయ నిర్మాణ సంస్థ ‘సత్య మూవీ మేకర్స్’ ద్వారా తొలి ప్రాజెక్టుగా ‘ద్వీప’ అనే కన్నడ సినిమా తీశారు. ద్వీప అంటే తెలుగులో ‘ద్వీపం’ (Island). అదే పేరుతో కన్నడ రచయిత నా డిసౌజా రాసిన నవల ఈ సినిమాకు ఆధారం. దర్శకుడు గిరీష్ కాసరవెల్లి‌. సినిమాలో ఉండేదంతా ఒక ద్వీపం, నాలుగు ప్రధాన పాత్రలు. వర్షాల కారణంగా డ్యామ్ నిండితే, అందులో మునిగిపోయే సీత పర్వతం పైన జరిగే కథ‌ ఇది. ఆ ఊరిని, తమ ఇంటిని విడిచి వెళ్లలేని భార్యాభర్తల కథ.

… “పుట్టిన ఊరిని విడిచి పెట్టడం అంత సులభం కాదు” అంటాడు సౌందర్య పాత్రతో ఆమె భర్త. “అది నాకు తెలియదా? నేను పుట్టిన పట్టణాన్ని వదిలి నీకోసం ఈ పల్లెకు రాలేదా?” అంటుందామె. ఎంత గొప్ప మాట అది? మునిగిపోతున్నా సరే, తమది అనుకున్న భూమిని వదిలి మరెక్కడో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు నిరాకరించే మగవాళ్లు, ఎప్పుడైనా భార్య గురించి ఆలోచించారా? ఆమెకంటూ మిగిలిన భూమి ఎక్కడుంది, ఏమిటని ఆలోచన చేశారా? ఇది నాదే అని ఆమె అనుకుని భర్త ఇంటిని చూసుకోకపోతే పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో గమనించారా?

Ads

… ద్వీపం చుట్టూ నీరు ఉంటుంది. చూసేందుకు తప్ప తాగేందుకు పనికి రాదు. అలాంటి స్థితే నిజజీవితంలో ఎదురైనప్పుడు మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఒకే ఇంటి కప్పు కింద భార్యాభర్తలు పరాయి మనుషుల్లా బతకాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది? చక్కగా బతికే జనాన్ని పునరావాసం పేరిట మరెక్కడో తరలించినట్టు, చక్కగా ఉన్న స్త్రీ మనసును అనుమానాల పేరిట గాయపరుస్తారెందుకు? అపార్థాలతో ఆమెను దూరం పెడతారెందుకు? ఆమెను ఒంటరి ద్వీపంగా మారుస్తారెందుకు? కనిపించని దేవుణ్ణి నమ్మినంత సులువుగా పక్కనే ఉన్న భార్యని నమ్మరెందుకు? ఆమె కృషికి కనీస గుర్తింపు ఇవ్వరెందుకు? ప్రకృతి వైపరీత్యాలను, స్త్రీల మనసునూ ఏకకాలంలో ప్రతీక చేసిన ఈ కథ చెప్పడం కన్నా చూడటం బాగుంటుంది.

… 2000లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ని వీరప్పన్ అపహరించిన నేపథ్యంలో, ఆ గొడవల కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 2002 నాటికి మళ్లీ మొదలైంది. కర్ణాటకలోని సగర పట్టణానికి సమీపంలోని లింగనమక్కి జలాశయం పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. సినిమా 70 శాతం వానలోనే సాగుతుంది. కెమెరామెన్ రామచంద్ర హల్కరే‌ అసలైన వానలోనే ఆ మొత్తం సన్నివేశాలను చిత్రీకరించడం విశేషం. ఆయన పనితీరును మెచ్చి జాతీయ పురస్కారం అందించింది అవార్డుల కమిటీ.

… తెలుగులో అద్భుతమైన పేరు తెచ్చుకున్న సౌందర్య తన మాతృభాష కన్నడంలో మాత్రం అంత గొప్ప పాత్రలు చేయలేదు. ఈ విషయం ఆమే ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఆ కొరతను ఈ సినిమా కొంత పోగొట్టిందని అంటారు. సౌందర్య గారు ఈ సినిమాలో కనిపించినంత అందంగా మరే సినిమాలోనూ నాకు కనిపించలేదు. ఆమె ఉన్న ప్రతి ఫ్రేమ్ పెయింటింగ్‌లా ఉంటుంది. ఇందులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొన్నారు. 2002లో జాతీయ పురస్కారాల ప్రకటన సమయంలో ఉత్తమ నటిగా ఆమెకు అవార్డు దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో అది కాస్తా శోభన (‘మిత్ర్ మై ఫ్రెండ్’ సినిమాకి), టబు (‘చాందినీ బార్’ సినిమాకి)లకు దక్కింది. అయితే ఉత్తమ చిత్రంగా ‘ద్వీప’ జాతీయ పురస్కారం అందుకుంది.

… ‘ద్వీప’ తర్వాత తెలుగులో సౌందర్య ఒక సినిమా నిర్మించాలని అనుకున్నారు. అందుకోసం కథ కూడా విని ఓకే చేశారు. ఆ తర్వాత ఆమె మరణించారు. కొన్నాళ్ళకు అదే కథలో సౌందర్య చేయాల్సిన పాత్ర నటి నందితాదాస్ పోషించారు. ఆ సినిమా పేరు ‘కమ్లి’. (‘ద్వీప’ చిత్రం YouTubeలో English Subtitlesతో అందుబాటులో ఉంది) — (విశీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీ కరెక్ట్… ఒవైసీ చెబితే వింటాడు… టీబీజేపీ ఎంపీలు తలో దిక్కు…
  • డియర్ రామ్మోహన్ నాయుడూ… ఓసారి ఈ పైలట్ లేఖ చదువుతావా…
  • నిలువు దోపిడీ..! నేతి లడ్డూలో నెయ్యి లేదు… పట్టు శాలువాలో పట్టు లేదు..!!
  • తెర మీద మాయమై… పోలాండ్‌లో హోటల్ వ్యాపారిగా రూపాంతరం…
  • వివాహ భోజనంబు..! షడ్రుచుల విందు… కాస్త కామెడీ డోస్ మెండు..!!
  • ‘కక్క’ వేముల ఎల్లయ్య ఒక్కడే… ఒక మహోద్యమం..! ఓ అవలోకనం..!!
  • పానీపూరి అమ్మిన లాభాలతో ఏకంగా హెలికాప్టర్ కొనేశాడా..? నిజమేనా..?!
  • ఆ ఊళ్లో ఎవరింట్లోనూ వంటశాల ఉండదు, ఎవరూ వండుకోరు…
  • డబ్బు పంచం, మందు తాపం.,. వోట్లు కొనం…… తరువాత మీ ఇష్టం…
  • పావలా శ్యామల..! ఇలాంటోళ్లను ‘మా’ ఆదుకోదా…? ఏమీ చేయలేదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions