ఎప్పుడూ పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు, టీవీలు, ఓటీటీ, సెలబ్రిటీలు… ఇవేనా..? టూరిజం, ఫుడ్, డ్రెస్సింగ్, ఫ్యాషన్స్ ఎట్సెట్రా కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చకు, సంవాదాలకు కారణమవుతుంటాయి… పెద్దగా ట్రోలింగ్ ఉండవు ఆ ట్వీట్లపై, పోస్టులపై… సరదాగా వాదాలుంటయ్… సోషల్ ట్రోలింగ్ పిచ్చోళ్లకు ఇందులో ఎలా జొరబడాలో తెలియక సైలెంటుగా ఉండిపోతారు…
ఇలాంటి ఫన్నీ డిబేట్లకు, ఇంట్రస్టింగు చర్చలకు ఒక ఉదాహరణ… గబ్బర్‌సింగ్ అనే ఒక ట్విట్టరుడు కడక్ జిలేబీ, పోహా (అటుకులు, పోపేసిన చుడువా టైప్) ఫోటో పెట్టేసి, సారీ సౌతిండియా, ఇదే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ అని ట్వీటాడు… తను తినేదేదో పెట్టేస్తే మజా ఏముంది..? ఏదో ఒకటి గోకాలి కదా… ఇలా సౌత్ ఇండియాను గోకాడు… నేచురల్లీసుధ అనే ట్విట్టరిణి రెండు వడలు, రెండు మసాలా దోశల ఫోటో పెట్టేసి ‘సారీ నార్త్ ఇండియా, ఇదుగో ఈ బ్రేక్ ఫాస్ట్‌ను ఎవరూ బీట్ చేయలేరు’ అని కౌంటర్ వేసింది…
Ads
ఇక దీని మీద పడ్డారు అందరూ… సౌత్ ఫుడ్ వర్సెస్ నార్త్ ఫుడ్ అన్నట్టుగా సరదా సంవాదం కొనసాగింది… ఈ కథనం రాసే సమయానికి గబ్బర్ సింగ్ ఒరిజినల్ ఫోటోను 67 లక్షల మంది చూశారు… 21 వేల మంది లైకారు… ఆ సంవాదం ఎలా ఉంటుందంటే… గబ్బర్ ట్వీట్‌కు రెండు వడలు, రెండు మసాలా దోశలకు రెండు ఇడ్లీలు, కాస్త ఉప్మాను కూడా జతచేసి, సాంబారు, మూణ్నాలుగు చట్నీలను జతచేసి, ఇదీ బ్రేక్ ఫాస్ట్ అంటే అని ఓ ట్విట్టరిణి రిప్లయ్ ఇచ్చింది… ఆ ఫోటోలో కోక్ గ్లాస్‌ను ప్రస్తావిస్తూ ఓహో, కోక్ కూడా సౌతిండియా ఫుడ్డేనా అని గబ్బర్ కౌంటర్ వేశాడు…
ఒకావిడ బ్రేక్ ఫాస్ట్ చర్చను కాస్తా ఫుల్ మీల్స్ వైపు దారి మళ్లించి. అరిటాకులపై సౌత్ భోజనం ఫోటో కూడా పెట్టేసి సౌత్ వర్సెస్ నార్త్ అంటూ నార్త్ ఫుడ్‌ను సూచించే పరోటాలు, రోటీలు, స్వీట్ల ప్లేటు ఫోటోను పెట్టేసింది… మరొకాయనకు ఈ డిబేట్ చదువుతూ చిరాకేసి, ఓ ఒడిశా బ్రేక్ ఫాస్ట్ ప్లేటు ఫోటో పెట్టేసి, మీరు ఎన్నయినా చెప్పండి, మా ఒడిశా టిఫిన్లకు తిరుగులేదుపో అనేశాడు… అందులోనూ ఇడ్లీలు, వడలు (సౌత్‌కు కాస్త డిఫరెంటు లుక్) చట్నీలు, సాంబారు ఫోటో పెట్టాడు… ఓ మహారాష్ట్రీయుడు జిలేబీ, కచోరీ, అలూ కూర ఫోటో పెట్టేసి, ప్రపంచంలోకెల్లా బెటర్ బ్రేక్ ఫాస్ట్ అని తేల్చిపడేశాడు… ఓ సిక్కాయన బటర్ రోటీ, పన్నీర్ కరీ ఫోటో పెట్టేసి… టేస్టుకు బస్తీమే సవాల్ అనేశాడు…
నిజానికి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తరహా బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది… చాలా నార్త్ రాష్ట్రాల్లో పొద్దున్నే జిలేబీలు లాగించేస్తారు… అబ్బో, మనవల్ల కాదు… అలాగే మహారాష్ట్రంలో పావ్ బజ్జీని పొద్దున్నుంచే లాగిస్తారు… (బజ్జీయే బాజీ (కూర) ఇక్కడ)… వెరయిటీ టిఫిన్లు అంటే మన తెలుగు రాష్ట్రాలు ప్లస్ తమిళనాడు… ఇడ్లీ, వడ, పూరి, దోశ, ఉప్మా, పొంగల్, ఇడియాప్పం, పెసరట్లు, మైసూరు బజ్జి, ఆలూ బోండా, వరి అట్లు, పోపేసిన అటుకులు ఎట్సెట్రా ఎన్నెన్నో… అఫ్‌కోర్స్, సగటు తమిళుడికి సాంబారు పైన గుమ్మరించిన ఇడ్లీలు ఉంటే ఇక ఏమీ అక్కర్లేదు… సాంబారు లేని తమిళ ఆహార సంస్కృతి లేదు… ప్లేట్ గులాబ్ జామ్ అడిగినా పైన సాంబరు పోసి తీసుకొస్తాడు వెయిటర్… అతిశయోక్తే అయినా దాదాపు అలాగే ఉంటుంది…
కొన్ని ఏరియా స్పెసిఫిక్ ఉంటయ్… కర్నాటకలో బిసిబెలి బాత్ వంటివి… ఎందుకో ఇంత పెద్ద చర్చ జరిగినా సరే, ఎక్కడా సర్వపిండి, గట్క, అంబలి ఎట్సెట్రా తెలంగాణ స్పెసిఫిక్ ఫుడ్ వెరయిటీలు ప్రస్తావనకు రాలేదు… మనవాళ్లు ఇలాంటి వృథా టైమ్ వేస్టు చర్చల్లోకి రారు… ఓ పట్టు పట్టడమే… అంతే… అవునూ, ఈరోజు మీ ఇంట్లో టిఫినీలు ఏం చేసుకున్నారు వదిన గారూ…
Share this Article