.
( రమణ కొంటికర్ల )
…… కుల, మతాలు అస్తిత్వాలుగా… కొట్లాటలకు వేదికలుగా.. మేథో ప్రదర్శనకు క్యాన్వాస్ గా మారుతున్న కాలంలో మతం నుంచే పక్కకు అడుగులేస్తున్న ఓ దేశం గురించి కాస్త తెలుసుకుందాం.
ఆస్తికత్వం, నాస్తికత్వం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివి. నాస్తిక సమాజం.. ఆస్తిక సమాజాన్నీ మార్చడమూ అంత సులభమూ కాదు. ఆస్తిక సమాజం నాస్తికులను గుడులు, మఠాల బాట పట్టించడమూ అంత వీజీ కాదు. వాదనలు, భిన్నాభిప్రాయాలు, విభేదాలు, ఇప్పట్లో తెగేవీ కావు.
Ads
వ్యక్తిగత స్థాయిలో ఆయా వాతావరణాలు, సమాజాలు, వ్యక్తులను బట్టి ఏర్పడే భావజాలాల్ని పారద్రోలడమూ అంత సులువేమీ కాదు. సరే ఈ ఎడతెగని చర్చను కాస్తా పక్కనబెడితే .. పూర్తిగా మతానికి దూరంగా అడుగులేస్తున్న ఓ సమాజం గురించి మాత్రం ఇప్పుడు కాస్త చెప్పుకుందాం.
ప్రపంచ టెక్ దిగ్గజాలకు, లగ్జరీ కార్లకు, మోబైల్ ఫోన్స్ కు, రికార్డ్ స్థాయిలో వేగవంతమైన సర్ఫింగ్ తో అందుబాటులో ఉండే ఇంటర్నెట్ కు… మొత్తంగా ఒక నిశ్శబ్గ విప్లవానికి నాయకత్వంలా కనిపించే దక్షిణ కొరియా రానురాను పూర్తిగా మతరహిత దేశంగా మారిపోతోందట.
ఆర్థికంగా కూడా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా చెప్పుకునే దక్షిణ కొరియా.. అసలు ఎలాంటి మతాచారాలతో సంబంధం లేకుండా.. దూరంగా ఉండటం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తించే విషయం. 2024 డేటా ప్రకారం 60 శాతం మంది దక్షిణ కొరియన్లు ఏ మతంతోనూ సంబంధాల్లేకుండా జీవిస్తున్నారట.
అయితే, ఈ నాటకీయ మార్పు రాత్రికి రాత్రే జరిగిందేం కాదు. దశాబ్దాల నుంచి ఆధునీకరణ వైపు అడుగులేస్తున్న సమాజంలో మతాలు, మత సంస్థల పట్ల భ్రమలు తొలిగిపోతుండటం, వాటి విలువల పట్ల చర్చలు జరగుతుండటంతో దక్షిణ కొరియా మొత్తం నెమ్మదిగానే మొదలైనా.. చాలా దృఢంగా ఈ వ్యవస్థీకృత మార్పు జరుగుతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి.
తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతం కావడంతో.. ఉన్నపళంగా ఒక ఆధ్యాత్మిక ఆచరణకు అలవాటైన దక్షిణ కొరియా.. మెల్లిగా బౌద్ధం, క్రైస్తవం వంటి మతాలతో విరాజిల్లింది. కానీ, ఇప్పుడు మళ్లీ అదే సమాజం మతానికి దూరంగా ఎటువంటి మతాచారాలు పాటించని సొసైటీగా వార్తల్లోకెక్కుతోంది.
- కొన్ని సర్వేల ప్రకారం నేడు దక్షిణ కొరియాలో కేవలం 31 శాతం మంది మాత్రమే క్రైస్తవాన్ని ఆచరిస్తుండగా.. అందులో ప్రొటెస్టంట్లు 20 శాతం, క్యాథలిక్కులు 11 శాతమున్నారు. 17 శాతం మంది బౌద్ధాన్ని ఆచరిస్తున్నారు. మిగిలిన మెజారిటీ మొత్తం ఎటువంటి మత సంబంధమైన ఆచారాలు పాటించకపోవడంతో దక్షిణ కొరియా ఇప్పుడు మిగిలిన ప్రపంచంతో పోలిస్తే ప్రత్యేకంగా చర్చల్లో నిలుస్తోంది.
కేవలం మతాచారాలను పట్టించుకోకపోవడం వల్ల మాత్రమే దక్షిణ కొరియా గురించి చెప్పుకోవడం లేదు. ఆచార, వ్యవహారాల పట్ల వారి స్వేచ్ఛ, చైతన్యం వంటివి శాస్త్రీయ విజ్ఞానం వైపు అడుగులేసే సమాజాన్ని ఆలోచింపజేసేవి. ఉత్తర కొరియా తరహాలో మతపరమైన కట్టుబాట్లు, వాటిని ఆచరించే వ్యవహారాల్లో కనిపించే కఠిన నిబంధనలూ దక్షిణ కొరియాలో కనిపించవు.
అందుకు బదులుగా ఇక్కడ సంక్లిష్ఠమైన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల తమకిష్టమైన రీతిలో వ్యవహరించే ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కనిపించడమే దక్షిణ కొరియా ప్రత్యేకత.
దక్షిణ కొరియా మతపరమైన అంశాలు, కట్టుబాట్లకు దూరంగా.. ఆర్థిక ఎదుగుదలతో దూసుకుపోతున్నది. సుమారు ఐదున్నర దశాబ్దాల కాలంగా నాటి యుద్ధాల్లో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి నేడు హైటెక్ పవర్ హౌజ్ గా రూపాంతరం చెందింది. వేగవంతమైన పారిశ్రామికీకరణ, దాంతో పాటే పెరిగిన పట్టణీకరణ.. మతపరమైన సంప్రదాయాలను బలహీనపరుస్తూ వస్తోంది.
నేటి ఆధునిక దక్షిణ కొరియా యువత ఫోకస్ అంతా ఇప్పుడు విద్య, కెరీర్ పైనే పెడుతున్నారు. తమ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వంతో మిగిలిన సమాజంతో ముందు వరుసలో ఉంచాలన్న తపన ఇప్పుడక్కడ కనిపిస్తోంది.
విద్య, దాంతో పాటే పెరుగుతున్న నేటి డిజిటల్ జీవనశైలి వంటివి మతపరమైన ఆచారాలను వెనక్కు నెట్టి.. తార్కికమైన ఆలోచనల దిశగా దక్షిణ కొరియా సమాజాన్ని మళ్లిస్తున్నాయి. ఆధ్యాత్మికత వేరు.. మతాచారాలు వేరు అనే స్పష్టమైన విభజన రేఖను గుర్తించిన అధిభౌతిక సమాజస్థితికి దక్షిణ కొరియా ఇప్పుడో ఉదాహరణ.
సౌత్ కొరియాలో మతాచారాలకు జనం దూరం జరగడం విషయంలో అక్కడ పెరుగుతున్న శాస్త్రీయ ఆలోచనా విధానాలతో పాటు.. అక్కడ మతసంస్థలను లీడ్ చేసే నాయకత్వం విశ్వాసాన్ని కోల్పోవడం, లైంగిక వేధింపులెదుర్కొవడం వంటి ఘటనలు కూడా మరో ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.
అలాగే, ఆయా ప్రొటెస్టంట్ మెగా చర్చీల్లో పన్నుల ఎగవేతలు, కుంభకోణాలు, పలువురి అపహరణలు వంటివి ఈ దశాబ్ద కాలంలో పెరిగిపోవడం కూడా దక్షిణ కొరియా సమాజానికి మతపరమైన సంస్థలపై ఓ చిన్నచూపు ఏర్పడటానికి మరో కారణం.
కోవిడ్ 19 వ్యాప్తిలో భాగంగా 2020లో జరిగిన కొన్ని ఘటనలు కూడా మతసంస్థలపైనున్న నమ్మకం వమ్ము కావడానికి కారణమైంది. షిన్చియోంజి చర్చ్ ఆఫ్ జీసస్ అనే మత సంస్థ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కానీ, దాన్ని ఆ మతసంస్థ దాచిపెట్టిందనే ఆగ్రహం కూడా దక్షిణ కొరియా వ్యాప్తంగా నాడు వెల్లువెత్తింది. అదే సమయంలో మత సంస్థల పట్ల అనుమానాలనూ మరింత బలపర్చింది.
బౌద్ధమతాన్ని అనాదిగా ఆచరిస్తూ వచ్చిన దక్షిణ కొరియన్లు.. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఆ మతాచారాలకూ దూరంగా జరుగుతూ వస్తున్నారు. ముఖ్యంగా టెంపుల్ టూరిజం పెరిగిపోవడం.. మన భారతదేశంలోని హిందూ ఆలయాల్లాగే కమర్షియల్ పంథా సంతరించుకోవడం.. ఫక్తూ టూరిజం స్పాట్స్ గా మారిపోవడంతో.. ఆయా మతసంస్థలు, ఆలయాల ఆధ్యాత్మికత విషయంలోనూ దక్షిణ కొరియన్ల నమ్మకాన్ని పలుచన చేసింది.
మతం నుంచి దక్షిణ కొరియన్లు పక్కకు జరగడం విషయంలో.. మరో ప్రధాన కారణమూ సౌత్ కొరియాలో కనిపిస్తుంది. రాజకీయాల్లో కూడా మతం కీలక పాత్ర పోషించడంతో.. దాని ప్రభావం తగ్గిపోతూ వస్తుంది.
1980లు, 90ల కాలం నుంచి ప్రొటెస్టెంట్ కిమ్ యంగ్ సామ్.. అలాగే, క్యాథలిక్ కిమ్ డే జంగ్ తో సహా అనేకమంది క్రైస్తవ నాయకులకు రాజకీయంగా పెరిగిన ప్రాధాన్యత… పెద్ద పెద్ద చర్చీలన్నీ ఆయా రాజకీయ పార్టీలతో పెట్టుకునే పొత్తులు.. వారి ప్రచారాలకు నిధులు సమకూర్చడం.. స్వేచ్ఛాయుత ఓటింగ్ పద్ధతిని అనుసరించకుండా లాబీయింగ్ జరిపే తీరువంటివి కూడా మత సంస్థలపై దక్షిణ కొరియన్లలో చర్చకు తెరలేపి భిన్నాభిప్రాయాలకు వేదికను చేశాయి.
అదే సమయంలో మతసంస్థల నాయకత్వాలు పాలనలో కీలకంగా మారే బదులు.. అధికారంలోకి వచ్చిన పార్టీలు హ్యాండ్ ఇవ్వడంతో ఎదురుదెబ్బలూ తప్పలేదు. ఆ విధంగా కూడా మతసంస్థలు విశ్వసనీయతను కోల్పోయాయి.
మతసంస్థల నిర్వాహకుల కుంభకోణాలు, పాలనలో వారి జోక్యం వంటివి కూడా సామాన్య జనాన్ని మతసంస్థల నాయకత్వంపై ఏవగింపుకు కారణమయ్యాయి. ఓటు బ్యాంకుల కోసం.. మతపరమైన ఓట్ల పోలరైజేషన్ వంటివి కూడా దక్షిణ కొరియన్లు అత్యంత చైతన్యవంతంగా పరిశీలిస్తూ వస్తున్నారు.
ఇప్పుడు దక్షిణ కొరియా ప్రజాస్వామ్యం మతం.. అలాగే, రాజకీయం మధ్య స్పష్టమైన విభజన రేఖను గుర్తించగల్గాయి. అందుకే, ఆసియాలోనే దక్షిణ కొరియా లౌకిక రాజ్యానికి ఓ ప్రత్యేక స్థానమేర్పడింది. టెక్నాలజీ విషయంలో దక్షిణ కొరియాకు ఏమాత్రం తీసిరాజని దూసుకుపోయే పొరుగున ఉన్న జపాన్ కూడా లౌకిక రాజ్యమే అయినప్పటికీ.. దక్షిణ కొరియాతో పోలిస్తే.. ఇక్కడ మతాచారాలు హెచ్చుగా కనిపిస్తాయి.
ఇక మరో పక్కదేశమైన ఉత్తర కొరియా కిమ్ నియంతృత్వ పాలనలో ఏకంగా నిరంకుశంగానే నాస్తికత్వాన్ని అమలు చేస్తోంది. మతపరమైన కార్యకలాపాలపై కఠినమైన శిక్షలనూ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అటు మతాచారాలకు కేరాఫ్ లా కనిపించే సాంకేతిక దేశమైన జపాన్.. ఇటు అసలు మతాచారాలే నిషిద్ధంగా నియంతృత్వాన్ని అమలు చేస్తున్న ఉత్తర కొరియా మధ్య.. దక్షిణ కొరియా లిబరల్ విధానం కేవలం ఆసియా ఖండంలోనే కాకుండా.. ప్రపంచంలోనే ఓ చర్చకైతే తెరలేపింది.
మతం, మతాచారాలపై నిషేధం పాటించకుండా.. దాన్ని ఆ సమాజంలో పౌరుల స్వేచ్ఛకు వదిలేసిన ఓ ఛాయిస్ గా ఇప్పుడు దక్షిణ కొరియా మిగిలిన ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
ముఖ్యంగా స్వీడన్, నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాల మాదిరిగానే మతాన్ని కేవలం ఓ సాంస్కృతిక నేపథ్యంగా మాత్రమే చూస్తూ.. శాస్త్రీయ ఆలోచనలతో భవిష్యత్ వైపు అడుగులేస్తోంది దక్షిణ కొరియా. ముఖ్యంగా రేషనల్ మెచ్యూర్డ్ థింకింగ్ లేని మెజారిటీ మానవ సమాజంలో.. దక్షిణ కొరియా అడుగులు కచ్చితంగా చర్చనీయాంశమే!
Share this Article