.
మొన్నటి నుంచీ సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు, విమర్శలు…
1) తెలంగాణ పాట పాడనన్నవాడు, తెలంగాణేతరుడికి ప్రభుత్వ సాంస్కృతిక వేదిక రవీంద్రభారతిలో విగ్రహం ఏమిటి..? 2) తెలుగు గానగంధర్వుడికి హైదరాబాదులో అవమానం ఏమిటి..? 3) ఇంకా ఈ ప్రాంతీయ, సంకుచితవాదం ఏమిటి..? 4) పెడితే ప్రజాగాయకులు అందెశ్రీ, గద్దర్ విగ్రహాలు పెట్టాలి గానీ బాలు విగ్రహం ఏమిటి..?
Ads
5) అంత ప్రేమ ఉంటే అమరావతిలో పెట్టుకొమ్మనండి, ఇప్పటికే ఆంధ్రా విగ్రహాల బరువు భరిస్తున్నాం, ఇంకా ఇంకా ఆంధ్రా విగ్రహాలా..? 6) మరి రవీంద్రనాథ్ ఠాగూర్ తెలంగాణవాడా..? రవీంద్రభారతి పేరు కూడా మార్చేయండి… 7) రవీంద్రభారతిలో కాదు, ట్యాంక్ బండ్ మీద పెట్టాలి బాలు విగ్రహాన్ని… 8) బాలు ఆంధ్రుడు కాదు, అందరివాడు, ఈ సంకుచిత భావన తెలంగాణతనానికే అప్రతిష్ట…
9) అసలు ఇంకా తెలంగాణవాదం ఏమిటి..? 10) బాలు విగ్రహాన్ని వద్దనడం తెలుగుతనానికే అవమానం…
……… ఇదుగో ఇలా బోలెడు వాదనలు, విమర్శలతో తెలుగు సోషల్ మీడియా వేడిగా ఉంది… నిజమే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం తప్పేమీ కాదు, తెలుగు ఘనగాయకుడే, డౌట్ అక్కర్లేదు… కానీ అసలు ఇక్కడ కొన్ని జవాబులు దొరకడం లేని, నిశ్శబ్దమే వినిపిస్తున్న కొన్ని ప్రశ్నలు ఉన్నాయి…
1) అసలు బాలును తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైనా ఓన్ చేసుకున్నాయా..? చెన్నై ఘనంగా ఓన్ చేసుకుంది తనను… హఠాత్తుగా హైదరాబాదులో విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది ఎవరు..? ఎవరి అనుమతితో..? ఎందుకిప్పుడు ఈ వివాదాల తుట్టెను కదిలించింది..?
2) రేప్పొద్దున అదే రవీంద్రభారతిలో ఫలానా ఫలానా విగ్రహాలు ఏర్పాటు చేయాలని కొత్త డిమాండ్లు, ఒత్తిళ్లు వస్తాయి… దానికి ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా..?
3) ప్రభుత్వం తరఫున విగ్రహం ఏర్పాటు చేస్తుంటే, అక్కడ శుభలేఖ సుధాకర్ దాష్టీకం కనిపిస్తున్నది ఎందుకు..? అది వాళ్ల ప్రైవేటు వ్యవహారం కాదు కదా… ఇంత రచ్చ జరుగుతుంటే ప్రభుత్వం తరఫున క్లారిటీ ఏది..? ఎవరు బాధ్యులు..?
4) జయజయహే గీతం పాడనంటూ బాలు తిరస్కరించాడనే ప్రచారం నిజమే కావచ్చు… రసమయి కూడా పలు సందర్భాల్లో చెప్పినట్టుంది… ఐతే ఆంధ్రా- తెలంగాణ నడుమ విద్వేషాల వాతావరణంలో… తాను అనవసరంగా ఇందులోకి లాగబడుతున్నానని అనిపించిందేమో, పాడలేనని చెప్పి ఉండవచ్చు… ఐనంతమాత్రాన తను తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణకు వ్యతిరేకంగా తనేమీ ఎప్పుడూ మాట్లాడలేదు, సమైక్యవాది కూడా కాదు… ఫలానా పాట పాడాలా వద్దానేది ఆయన ఇష్టం.
రెండు పదాలు తీసేస్తే పాడతానని అన్నాడని మరో ప్రచారం… తన కోసం ఆ పాటలో పదాల్ని మార్చాల్సిన అవసరం గానీ, దురవస్థ గానీ తెలంగాణ పాటకు పట్టలేదు, అది వేరే సంగతి…
5) అసలు చంద్రబోస్, సుద్దాల వంటి రచయితలే తెలంగాణవాదం కొరవడి, ఒక్క పదం లేదు, పాదం లేదు… ఆంధ్రా సినీపెద్దల దాస్యం అనే విమర్శలున్నాయి… తెలంగాణవాళ్లే ఇలా ఉంటే ఓ మద్రాసీపై ఆ విమర్శలు ఏల..?
6) నిజానికి ప్రస్తుతం బాలు విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నవాళ్ల ఆగ్రహం బాలు మీద కాదు… బియాండ్ దట్… నాడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాన్ని కూల్చేసిన కోపమే… తరతరాల తెలంగాణ పీడన తాలూకు ఆగ్రహమే… ఇప్పుడూ అంతే… ఓ పెద్దాయన మాటల్లో చెప్పాలంటే… ‘‘వాడవాడనా వైఎస్, ఎన్టీయార్ విగ్రహాలు, బోలెడు ఆంధ్రావాళ్ల విగ్రహాలు… ఏదీ ఆంధ్రాలో ఒక్క తెలంగాణవాడి విగ్రహం చూపమనండి…’’
7) ప్రభుత్వం కిక్కుమనడం లేదు… పవన్ కల్యాణ్ దిష్టి వ్యాఖ్యల మీద కస్సుమనే కాంగ్రెస్ నేతలూ మాట్లాడరు, ఈవెన్ తెలంగాణవాదం చాంపియన్లమని చెప్పుకునే బీఆర్ఎస్ కూడా… బీజేపీకి ఏ విషయంలోనూ ఓ స్టాండ్ ఉండటం లేదు కాబట్టి దాన్ని వదిలేయవచ్చు… కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం… కానీ పొలిటికల్ పార్టీకి ఓ స్టాండ్ అక్కర్లేదా..? తెలంగాణవాదం అయిపోలేదు, అయిపోదు, పాత పీడనల జ్ఞాపకాలు ఉన్నన్నిరోజులూ ఉంటుంది…
8) ఇంతకీ బాలు విగ్రహం ఏర్పాటు చేయవచ్చా..? దీనికి జవాబులు పలురకాలు… ఫక్తు తెలంగాణ ద్రోహుల విగ్రహాలు వేలల్లో ఉన్నాయి రాష్ట్రంలో… వాటితో పోలిస్తే బాలు విగ్రహం ఎంత..? ఉంటే తప్పేమిటి..? అదేమీ ఆంధ్రాతనాన్ని రుద్దే చర్య కాదు…
కాకపోతే గద్దర్ అవార్డులు, అందెశ్రీ స్మృతివనం, తెలంగాణ వైతాళికులు అంటూ కోటి, ఇంటిస్థల సంతర్పణలు సాగుతున్నవేళ హఠాత్తుగా ఈ బాలు విగ్రహం ఆలోచన ఎలా వచ్చింది ప్రభుత్వానికి..? వచ్చెనుపో.., ఓ వివరణ, ఓ జస్టిఫికేషన్ స్పష్టత ఏది..?! పోనీ, జగం మెచ్చిన తెలుగు గళానికి మా నివాళి అని ప్రకటించవచ్చుకదా..!! నిర్ణయం తీసుకున్నప్పుడు సమర్థన లేకపోతే ఎలా..?
.
ఏపీ వల్ల కాలేదు, చెన్నై వల్ల కాలేదు... ఎస్, అందరినీ కలుపుకుపోయే ఘన తెలంగాణ సంస్కృతి మాది, మాదే నిర్ణయం, కట్టుబడి ఉంటాం అనే సమర్థన ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు రావడం లేదు..?! పోనీ, నిర్ణయం నుంచి వెనక్కి తగ్గుతారా..? నిశ్శబ్దం ఏ చర్చకు, ఏ విమర్శకు జవాబు కాదు..!!
Share this Article