భానుమతి రామకృష్ణ… నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, రచయిత్రి, సంగీత దర్శకురాలు, స్టూడియో ఓనర్… తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం… తండ్రి శాస్త్రీయ సంగీత విద్వాంసుడు… అయితేనేం..? తప్పు పాడొద్దని ఏముంది..? మానవ మాత్రురాలే కదా… ఓ పాత వీడియో చూస్తుంటే… బాలు నిర్మొహమాటంగా ఓ పాటలో ఆమె కొన్ని పదాల్ని ఉచ్చరించిన తీరును తప్పుపట్టాడు… అదీ శాస్త్రబద్ధంగానే… అఫ్‌కోర్స్, బాలు మాత్రం తప్పులు పాడడా..? బోలెడు… అంతెందుకు తనకు బాగా పేరు తెచ్చిపెట్టినది, శంకరాభరణం సినిమాలోని శంకరా, నాదశరీరా పరా పాటలో తప్పులు బాగా దొర్లినట్టు తనే చెప్పుకున్నాడు… అందరూ క్షమించాలని అడిగాడు ఓసారి…
ఉదాహరణకు ఆ పాటలో ధ్యానవిలక్షణ బదులు గానవిలక్షణ అని ఉచ్చరిస్తాడు తను… ధిక్కరీంద్రజిత అంటాడు మరోచోట… అంటే ఏదో ధిక్కారం అనే పదం గుర్తొచ్చేలా… నిజానికి అక్కడ దిక్కులు అనే అర్థమొచ్చేలా ఉచ్చరించాలి… సరే, సంగీతపరంగా కూడా తప్పులు దొర్లి ఉండవచ్చు… మనం చెప్పుకునేది మాత్రం పాటలో సంగీతం వర్సెస్ సాహిత్యం సబ్జెక్టు…
తొమ్మిదేళ్ల క్రితం… పాడుతా తీయగా ప్రోగ్రాం ఫైనల్స్… దాసరి నారాయణరావు ముఖ్యఅతిథి… ప్రజెంట్ సింగర్ దామిని అప్పట్లో ఫైనలిస్టు… ఆమె ఎంచుకున్న పాట 1954 నాటి చక్రపాణి మూవీలో భానుమతి కలహరప్రియరాగంలో పాడిన త్యాగరాయ కీర్తన… దామిని బాగా పాడింది… కానీ అప్పట్లో భానుమతి చేసిన ఉచ్ఛరణ దోషాల్నే తనూ పాటించింది… అదుగో అక్కడ బాలు భానుమతికి తగు మర్యాద చూపిస్తూనే, గౌరవం ఇస్తూనే… అందరికీ ఓ సూచన చేశాడు… సంగీతం, రాగం, సంగతులు, తాళం గట్రా ఎంత ప్రధానమో పదాల ఉచ్ఛరణ కూడా అంతే ప్రధానమని తన భావన… కరెక్టే…
Ads
ఆ కీర్తనలో ఓచోట… పక్కాల నీలబాడీ అని పాడుతుంది ఆమె… నిజానికి అది పక్కల నిలబడి… కానీ పాడుతుంటే ఎటెటో దీర్ఘాలు తీయబడ్డాయి… గొలిచే మూచ్చట అంటుంది ఓచోట… నిజానికి అది కొలిచే అనే పదం… అంతకు ముందు పదంతో సంధిలో భాగంగా గొ వచ్చింది… కానీ దాన్ని విడగొట్టి గొలిచే అని పాడటం ద్వారా అసలు అర్థమే లేకుండా పోయింది… అలాగే బాగా దెల్పగ రాదా అంటుంది ఇంకోచోట… అది తెలుపగా అనే పదం… మనసున దలిచిమై మరిచీ యున్నానురా అని పాడుతుంది మరోచోట… నిజానికి అక్కడ దలిచిమై మరిచీ కాదు… దలిచి, మైమరిచి… రెండు వేర్వేరు పదాలు…
నిజమే కదా… పాట ఏదో చెప్పాలి, చెప్పాలంటే పదాలు సరిగ్గా ఉచ్చరించబడాలి… శ్రోతకు సరైన అర్థంలో వినిపించాలి… అదే జరగనప్పుడు పాటకు అర్థమే లేదు… వాస్తవానికి ఇప్పుడు కాస్త నయం… ఇరవై, ముప్ఫయ్ ఏళ్ల క్రితం… తెలుగు పాటలో అసలు పదాలే సరిగ్గా వినబడేవి కావు… ధడధడలాడిపోయేది సంగీతం… రేకు డబ్బాల్లో రాళ్ల మోత… ఇప్పుడు మాస్, ర్యాప్ తరహా పాటలతోపాటు మంచి మెలొడీ పాటలు కూడా వస్తున్నాయి… పదాల ఉచ్ఛరణ పట్ల వర్తమాన గాయకులు మంచి శ్రద్ధ చూపిస్తున్నారు… ఐనా సరే, కొందరికి ఈ విషయంలో శ్రద్ధ లేదు… వాళ్లందరికీ బాలు సూచన అనుసరణీయం, ఆచరణీయం..!!
Share this Article