.
ఎయిడ్స్ పై డాక్టర్ యనమదల కృషికి భారతీయ వైద్యుల జర్నల్ మన్నన
గత 27 సంవత్సరాలుగా ఎయిడ్స్ రంగంలో విశేషమైన కృషి చేస్తున్న తెలుగు వైద్యులు డాక్టర్ యనమదల మురళీకృష్ణకు భారతదేశపు అతిపెద్ద వైద్యుల సంఘం యొక్క వృత్తిపరమైన ప్రచురణ ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (జిమా) ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది.
Ads
1997 నుండి డాక్టర్ మురళీకృష్ణ ఎయిడ్స్, ప్రజారోగ్య రంగాలలో కృషి చేస్తున్నారు. హెచ్ఐవి జబ్బులో క్షయ వ్యాధి గురించి చేసిన పరిశోధనతో తెలుగు రాష్ట్రాల నుండి ఈయన సమర్పించిన మొదటి, ఏకైక శాస్త్రీయ పరిశోధన సారాంశం 2000 సంవత్సరంలో జరిగిన 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సులో ప్రచురితమై, ప్రపంచవ్యాప్త పరిశోధనలలో విశిష్టమైన 25 పరిశోధనలలో ఒకటిగా నిలిచింది.
ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో 1996 నుండి ప్రపంచ వ్యాప్తంగా మూడు ఔషధాల కాంబినేషన్ అనుసరిస్తున్నారు. దాని స్థానంలో డాక్టర్ మురళీకృష్ణ తాను అనుసరిస్తున్న రెండు ఔషధాల మిశ్రమం చికిత్స గురించిన పరిశోధన సారాంశం 2004లోనే అంతర్జాతీయ సదస్సులో ప్రకటించారు. 2022 చివరి నుంచి అమెరికా, యూరోపియన్ చికిత్స మార్గదర్శకాలలో రెండు ఔషధాల చికిత్స కూడా చోటు చేసుకుంది.
జన బహుళ్యంలో ఎయిడ్స్ గురించి అవగాహన పెంచడానికి డాక్టర్ మురళీకృష్ణ జనాదరణ కలిగిన పత్రికలలో వ్యాసాలను రాశారు. 2000 సంవత్సరంలో డాక్టర్ మురళీకృష్ణ తెలుగులో ఎయిడ్స్ పుస్తకాన్ని ప్రచురించారు. కోవిడ్ పీడ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ భరోసానిచ్చారు. 2022 జనవరిలో వెలువరించిన ‘కోవిడ్ ఎయిడ్స్ నేను’ పుస్తకం విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది మార్చిలో ‘హెచ్ఐవి ఎయిడ్స్’ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించారు.
ఎయిడ్స్ వ్యాధి విస్తృతంగా వ్యాపించి ఉన్న అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వ్యాధి యొక్క తీరు తెన్నులను గురించి 2024 మే నెలలో ప్రచురించిన ‘హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్’ పుస్తకాన్ని దేశంలోని అతి పెద్ద వైద్యుల జర్నల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నవంబరు 2024 సంచికలో విశేషంగా ప్రస్తావించారు.
మన కాలపు ప్రపంచ ఆరోగ్య సమస్య అయిన ఎయిడ్స్ గురించి డాక్టర్ మురళీకృష్ణ విస్తృతమైన అధ్యయనం, లోతైన అవగాహన, గంభీరమైన అనుభవాలతో డాక్టర్ మురళీకృష్ణ రాసిన ఈ పుస్తకం వైద్యులు, ఆరోగ్య విధానకర్తలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా తప్పక చదవాల్సిన పుస్తకం అని కొనియాడారు. ఎయిడ్స్ కి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్న నిపుణులు ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సి ఉందన్నారు.
క్లిష్టమైన ఈ సమస్యపై ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల దృక్కోణం నుంచి వచ్చిన ఈ పుస్తకం వైద్య సాహిత్యానికి గొప్ప చేర్పు అన్నారు. హెచ్ఐవి సాహిత్యంలో కీలకమైన అంతరాన్ని మురళీకృష్ణ పుస్తకం పూరించిందని పేర్కొన్నారు…. మన కాకినాడ డాక్టర్‌కు అభినందనలు…
Share this Article