Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టీవీ న్యూస్..! వార్తల విశ్వసనీయతను చంపేస్తున్న వేగం…! ఓ ఉదాహరణ..!

January 11, 2026 by M S R

.

Bhavanarayana Thota …….. ఒక హైజాకింగ్ కలకలం… పాతికేళ్లనాటి మాట. కచ్చితంగా చెప్పాలంటే 2000 సంవత్సరం ఫిబ్రవరి 26. మధ్యాహ్నం ఒకటిన్నర. చెన్నైలో సన్ నెట్ వర్క్ ఆఫీస్.

శనివారం కావడంతో అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది హాఫ్ డే ముగించుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. న్యూస్ స్టాఫ్ మాత్రమే మిగిలాం. ప్రశాంతంగా ఉన్న ఫ్లోర్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. “చెన్నై రావలసిన జెట్ ఎయిర్‍వేస్ విమానం బెంగళూర్ విమానాశ్రయంలో హైజాక్ అయింది. విమానాన్ని సింగపూర్ తరలించేందుకు హైజాకర్లు నిర్ణయించుకున్నారు.” ఇదీ యుఎన్ఐ ఫ్లాష్ న్యూస్.

Ads

అది చూడగానే అందరం అలర్ట్ అయ్యాం. చెన్నై సన్ నెట్‍వర్క్ కార్యాలయంలోని నాలుగు చానల్స్.. సన్ (తమిళం), జెమిని (తెలుగు), ఉదయ (కన్నడం), సూర్య (మలయాళం) న్యూస్ విభాగాల్లో హడావిడి మొదలైంది. ప్లే ఔట్ వైపు పరుగులు. క్షణాల్లో ఆ ఫ్లాష్ వార్త బుల్లితెర మీద పరుగులు తీస్తూ కనిపించింది. సంఘటన జరిగింది బెంగళూరులో అయినా ఉదయ (కన్నడ) చానల్ తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మలయాళ చానల్స్ లో స్క్రోల్ మొదలైంది.

*****
అప్పటికి సరిగ్గా రెండు నెలల క్రితం (1999 డిసెంబర్ 24 న) ఖాఠ్మండు నుంచి 178 మందితో ఢిల్లీ బయలుదేరిన విమానాన్ని తీవ్రవాదులు కాందహార్ కు హైజాక్ చేసి తీసుకెళ్ళారు. దేశ భద్రతను సవాలు చేస్తూ, దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన ఘట్టమది.

కరడుగట్టిన ముగ్గురు తీవ్రవాదులను విడిపించుకోవటానికి తీవ్రవాదులు ఈ హైజాకింగ్ కుట్రపన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో హైజాకర్ల డిమాండ్ కు తలొగ్గి స్వయంగా విదేశాంగమంత్రి జస్వంత్ సింగ్ కాందహార్ వెళ్ళి మరీ .. మసూద్ అజార్ సహా ముగ్గురు తీవ్రవాదుల్ని అప్పగించి వచ్చారు.

డిసెంబర్ 31 న వాళ్ళను ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళి అప్పగించి, బందీలను విడిపించుకొని రావటం అప్పట్లో విమర్శలకు దారితీసింది. కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టబోయే ముందు వారం రోజులపాటు దేశాన్ని అతలాకుతలం చేసిన ఘటన అది.

  • (ఈ హైజాక్ చేసినవాడు ఆరోజు తన అన్న మౌలానా మసూద్ అజార్ ను విడిపించుకున్నాడు. అలా విడుదలైన మసూద్ అజార్ ఆ తరువాత కాలంలో జైషే మహమ్మద్ పేరిట ఒక తీవ్రవాద సంస్థను ప్రారంభించటం, భారతదేశం మీద ఉగ్రదాడులు జరపటం తెలిసిందే. మొన్నటి ఆపరేషన్ సిందూర్ లో భాగంగా అజార్ శిబిరం మీద జరిగిన దాడిలో అజార్ తప్పించుకున్నా, ఆరోజు హైజాక్ చేసిన అజార్ తమ్ముడు హతమయ్యాడు)

*****
ఆ విధంగా కాందహార్ హైజాకింగ్ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ప్రజలు ఈ ఘటనను మరిచిపోకముందే.. రెండు నెలల్లో ఈ హైజాకింగ్ వార్త. అందుకే దీనికంత ప్రాధాన్యం. ఒకే తెర మీద తన నాలుగు దక్షిణాది చానల్స్ చూస్తున్న సన్ నెట్‍వర్క్ అధిపతి కళానిధి మారన్ కి ఉదయ టీవీ (కన్నడ) తెర మీద ఫ్లాష్ కనిపించలేదు.

ముందుగా వార్త తెలియాల్సిన కన్నడ ప్రజలకు ఉదయ చానల్ ద్వారా తెలియక పోవటం సహజంగానే ఆయనకు కోపం తెప్పించింది. అందుకే కన్నడ న్యూస్ విభాగాధిపతి ‘ముంజానే సత్యా’ కి ఫోన్ చేశారు. అదేంటి ఫ్లాష్ వేయటానికి ఇంత ఆలస్యం అని అడిగినట్టున్నారు. “మా రిపోర్టర్ తో కన్ఫర్మ్ చేసుకుంటున్నా”నని సత్యా గారు చెప్పారు.

రెండు నిమిషాలాగి కళానిధి మళ్ళీ ఫోన్ చేస్తే ఇక్కడ సత్యా గారి ఫోన్ బిజీ. ఆయన బెంగళూరులో ఉన్న ఉదయ రిపోర్టర్ కి ఫోన్ చేయటం మీద దృష్టి పెట్టారే తప్ప యుఎన్ఐ ఫ్లాష్ గురించి పట్టించుకోవటం లేదు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన కళానిధికి బిజీ టోన్ సమాధానమయింది.

మరోవైపు సత్యా గారి అసిస్టెంట్లు ఫ్లాష్ న్యూస్ రాసిన పేపర్ పట్టుకొని ఆయన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫోన్ పెట్టేసిన సత్యా గారు ఆ వార్త వేయవద్దని తన జూనియర్లకు తేల్చి చెప్పారు. మాకర్థం కాలేదు. ఏజెన్సీ వార్త కనుక ఒకవేళ తప్పయినా మా బాధ్యత ఉండదనేది మా ధీమా.

అంతలో ఆయనకు ఫోన్ రానే వచ్చింది. ఒకసారి చెప్పినా ఇంకా వేయలేదేమిటని కళానిధి మారన్ గట్టిగా అడుగుతున్నారు. బెంగళూరులోని ఉదయ రిపోర్టర్ ఆ వార్తను ధ్రువీకరించలేదనేది సత్యా గారి వివరణ. అవతలివైపున కళానిధి చాలా అసహనంతో ఉన్నారు. ఇక్కడ సత్యా గారు మాత్రం ఎలాంటి తొట్రుబాటూ లేకుండా నింపాదిగా సమాధానమిస్తున్నారు.

తాను చేస్తున్నది సరైనదేనన్నట్టు ఆయన ధీమాగా కనిపించారు. ఇద్దరి సంభాషణ బైటికి వినిపిస్తూనే ఉంది. “హైజాక్ జరగలేదని మా రిపోర్టర్ చెబుతున్నారు” అని సత్యా గారు చెబితే, “యుఎన్ఐ కంటే మీ రిపోర్టర్ గొప్పవాడా” అన్నారు కళానిధి వెటకారం, కోపం కలిసిన స్వరంతో… ” రిపోర్టర్ కాదని చెప్పినా వేస్తే ఎలా ? అయినా, మన రిపోర్టర్ ని మనమే నమ్మకపోతే….” అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేయబోయారు గానీ కళానిధి వినిపించుకునేట్టు లేరు.

విసుగ్గా ఫోన్ పెట్టేశారు. అయినా ఏమాత్రం తొణకని సత్య గారిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. తెలుగు వాడైన ఉదయ అసిస్టెంట్ ఎడిటర్ ప్రకాశ్ చంద్రను కదిలిస్తే.. “మా సార్ అంతే. రిపోర్టర్ మీద అంత నమ్మకం ఆయనకు” అన్నాడు.

ముంజానే సత్య వయసు అరవై ఏళ్లకు తక్కువుండదు. కర్నాటకలో ఆయన కాకలు తీరిన జర్నలిస్టు. స్వచ్ఛమైన తెల్లటి జుట్టుతో నిజంగానే తలపండింది. ఆయన పనిచేసిన పత్రిక ‘ముంజానే’ పేరుతోనే ఆయన పేరు ప్రసిద్ధమైంది. ఉదయ టీవీలో ప్రసారమయ్యే ప్రతి వార్తా, ప్రతి అక్షరం తానే చదివి దిద్దుతారు. వయసు పెరగటం వలన వచ్చిఉంటుందనుకునే ఆ చాదస్తం మీద జోక్ చేస్తే ఆయన కూదా సరదాగా నవ్వేస్తారు. తన పద్ధతిలో ఏ మాత్రం మార్పుండదు.

  • ( టీవీకి వృద్ధులను తీసుకుంటే కాలంతో పరుగెట్టటం వీళ్ళకు తెలియదని మారన్ పదే పదే చెప్పే మాటలు కూడా మళ్ళీ గుర్తుకొచ్చాయి. 2000 సంవత్సరం నాటికి సన్ టీవీ ఉద్యోగుల సగటు వయసు 30 మాత్రమే. కళానిధి మారన్ సహా రకరకాల డిపార్ట్ మెంట్స్ హెడ్స్ గా ఉన్నవాళ్ళు ఆయన స్కూల్ ఫ్రెండ్స్. అందరూ 1964 లో పుట్టినవాళ్ళు. అంటే వాళ్ళ వయసు 36 ఏళ్ళు).

ఆ రోజు సత్యా గారి ధోరణి మీద నవ్వు రావటం లేదు.. చిరాకు పుట్టింది. ఎందుకంత మొండిగా వ్యవహరిస్తున్నారో అంతు చిక్కటం లేదు. మరో వైపు యుఎన్ఐ కనెక్షన్ లేని ఈటీవీ అసలా వార్తనే ప్రసారం చేయలేకపోయింది. జెమినీలో మాత్రమే వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది.

సత్యా గారు బెంగళూరు రిపోర్టర్ రుద్రప్పకు మళ్ళీ ఫోన్ చేశారు. కనీసం బెంగళూరులో ఆయనకు తెలిసిన మరెవరైనా రిపోర్టర్ కు ఫోన్ చేయకుండా మళ్ళీ అదే రుద్రప్పను పట్టుకొని ఎందుకు వేళ్ళాడుతున్నారో అర్థం కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మొత్తం కళానిధి గారి కోసం ఇంగ్లీష్ లో రాసి ఫాక్స్ పంపమన్నారు రుద్రప్పను.

హైజాక్ జరగలేదని చెబుతూ ఉంటే ఆ రిపోర్టర్ ఇంకా రాసి పంపటానికేముంటుందని ఆయన వినేలా పైకే అనేశా. చూద్దామన్నట్టు చిన్నగా తలూపారు తప్ప ఆయనేమీ మాట్లాడలేదు. పదినిమిషాల్లోపే రుద్రప్ప నుంచి ఫాక్స్ అందింది. ఇంగ్లిష్ లో ఉన్న ఆ ఫాక్స్ సారాంశం తెలుగులో ఇలా ఉంది…

  • ‘‘ఈరోజు మధ్యాహ్నం 1.06 నిమిషాలకు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పోలీసు కమిషనర్ టి. మడియాల్ కు ఫోన్ చేసి విమానం హైజాక్ అయినట్లు చెప్పారు. అప్పుడు నేను ఎయిర్‍పోర్ట్ లోనే ఉన్నా. పోలీస్, ఫైర్, అంబులెన్స్ లాంటి విభాగాలు ఎంత అప్రమత్తంగా ఉన్నాయో చూడాలని ఒక మాక్ ఎక్సర్ సైజ్ కోసం అలా ఫోన్ చేశారు.అలా ఫోన్ అందుకున్న పోలీస్ కమిషనర్ ఎయిర్‍పోర్ట్ కు బయలుదేరుతూ యుఎన్ఐ కి ఫోన్ చేసి చెప్పినట్టున్నారు. వాళ్ళు ఆ ఫ్లాష్ వార్తను మీడియా మీదికి వదిలారు. నేనిక్కడ ఉండగానే మడియాల్ వచ్చారు. అది ఉత్తుత్తి హైజాక్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆయన చేసిన ఫోన్ తో యుఎన్ఐ రేపిన లేనిపోని కలకలం గురించి పట్టించుకోలేదనుకుంటా. అందుకే ఈ గందరగోళం. దయచేసి అది ఉత్తుత్తి హైజాక్ అనే విషయం వెంటనే ప్రజలకు తెలియజేస్తే మంచిది…’’

*****
సత్య ఈ ఫాక్స్ మెసేజ్ చదివి వినిపించగానే మేం మళ్ళీ స్క్రోల్ దగ్గరికి పరుగులు తీశాం. హైజాకింగ్ ఉత్తుత్తిదేనని, స్క్రోల్ మార్చాం. విమానం హైజాక్ అయినట్టు వస్తున్న పుకార్లు నమ్మవద్దంటూ ఉదయ టీవీ స్క్రోల్ నడిపింది.

సరిగ్గా అప్పుడే ఈటీవీలో స్క్రోల్ … బెంగళూరు విమానాశ్రయంలో విమానం హైజాక్ అయిందని. వాళ్ళకున్న పిటిఐ కనెక్షన్ అప్పుడే మేల్కొంది మరి. చెన్నైలో ఈటీవీకి పీటీఐ మాత్రమే ఉండేది. హైజాకింగ్ మాక్ ఎక్సర్సైజ్ మాత్రమేనని జెమినీలో, విమానం హైజాక్ అయినట్టు ఈటీవీలో దాదాపు పావుగంట సేపు పోటాపోటీగా స్క్రోల్స్ నడిచాయి. ఈటీవీ మళ్ళీ తప్పుదిద్దుకునేసరికి చాలా టైం పట్టింది.

నేను సత్యా గారి వైపు చూడలేకపోయా. అంతలోనే ఆయనకు కళానిధి మారన్ నుంచి ఫోన్. అభినందించినట్టు తెలుస్తూనే ఉంది. రుద్రప్ప నంబర్ కూడా అడిగి తీసుకుని మారన్ అతనికి ఫోన్ చేసి అభినందించారు. నేను వెళ్ళి సత్య గారి ముందు కూర్చున్నా. ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు.

“రుద్రప్పను ఫాక్స్ పంపమని ఎందుకడిగారు?” అన్నాను. ” నిజంగా హైజాకింగ్ జరిగి ఉంటే అతని ఉద్యోగం పోయేది. నైతిక బాధ్యత తీసుకుని నేనూ తప్పుకునేవాణ్ణి” అన్నారాయన చాలా దృఢంగా. నాకు నోట మాట రాలేదు.

“వేగమే కాదు విశ్వసనీయత కూడా ముఖ్యం కదా మనకు. తప్పుడు సమాచారంతో ప్రేక్షకులను భయపెట్టి తప్పుదారిపట్టించటం తప్పు కదా” అన్నారు. ఎంతయినా అనుభవం అనుభవమే కదా! ఒక రిపోర్టర్ ఏదైనా వార్త పంపితే మారు మాట్లాడకుండా అది టెలికాస్ట్ చేయవచ్చని ఎడిటర్ అనుకోవటం, ఎడిటర్ అలా అనుకునేంతగా రిపోర్టర్ నమ్మకం సంపాదించటం ఆషామాషీ వ్యవహారాలు కావు. అలాంటి విశ్వసనీయత ఇద్దరి బాధ్యతా మరింత పెంచుతుంది.

*****

  • 2007 లో సత్యా గారు ఉదయా టీవీకి రాజీనామా చేశారు. అప్పుడు ఆయన బకాయిలు ఎగ్గొట్టటానికి ఆయన హోదా చీఫ్ ఎడిటర్ కాదని, చీఫ్ సూపర్ వైజర్ అని బుకాయించబోయిన సన్ నెట్ వర్క్ మీద కేసు వేసి వడ్డీతో సహా వసూలు చేశారు. ఆయన ఎంత నిక్కచ్చిగా ఉంటారో సన్ టీవీకి ఇలా కూడా రుచి చూపించారు.

ఉదయ నుంచి వెళ్ళిపోయాక కూడా సత్యా గారు చాలా కాలం చురుకైన వృత్తి జీవితం గడిపారు.. కర్నాటక ప్రజలు అత్యంత విశ్వసనీయమైనదిగా భావించే ” సంయుక్త కర్ణాటక” లో చేరినప్పుడు రుద్రప్ప కూడా ఆయనతో కలసి పనిచేయటం యాదృచ్ఛికం కాదు…. – తోట భావనారాయణ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగన్ వ్యాఖ్యల్ని సొంత మీడియాయే ఎందుకు దాచిపెట్టినట్టు..!?
  • టీవీ న్యూస్..! వార్తల విశ్వసనీయతను చంపేస్తున్న వేగం…! ఓ ఉదాహరణ..!
  • అనేక భాషల్లో తీసినా… తెలుగులోనే సూపర్ బ్లాక్ బస్టర్… ఎందుకు..?!
  • ఒక వేదన నుంచి ‘వేదాంతం’… ఒక వైరాగ్యం నుంచి ఔదార్యం..!!
  • ఉభయ తారకం..! సిద్దిపేట జిల్లాపై BRS, Cong నేతల ప్లానింగు..!!
  • యండమూరి గారూ… మీరే మరిచిన మీ వ్యక్తిత్వ వికాస పాఠం ఇది..!!
  • బుద్ధుడి చితాభస్మం ఆధ్యాత్మిక సంపద… రేవంత్‌రెడ్డి ప్రొటెక్ట్ చేయాలి..!!
  • మేడారంపై ప్రభుత్వ వీడియో… అందులో కాపీ కంటెంటు… ఓ వివాదం..!!
  • జననాయగన్..! విజయ్ సినిమా సెన్సార్ సమస్యలకు రాజకీయ రంగు..!!
  • రాజా సాబ్‌కు మరో అప్రతిష్ట… నాచే నాచే ట్యూన్ పక్కా చోరీ అట..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions