రాగం, తాళం, పల్లవి! స్వరసురఝరి… శిశుర్వేత్తి పశుర్వేత్తివేత్తి గానరసంఫణిః సంగీతంలోని మాధుర్యాన్ని శిశువులు, పశువులు, పాములు కూడా ఆస్వాదించి ఆనందిస్తాయి- ఆర్యోక్తి
మ్యూజిక్కంటే చెవి కోసుకునే రసహృదయులకు స్వాగతం! నాకిష్టమైన సంగీతంపై ఒక మంచి రైటప్ రాయాలని ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పటికి కుదిరింది! ఓల్డ్ హిందీ హిట్ సాంగ్స్ ను అమితంగా ఇష్టపడే మా బాపు స్వర్గీయ సుగుణాకర్రావు గారికి, నా ఈ వ్యాసం అంకితం!
చిన్నప్పటి నుంచే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం! మ్యూజిక్కు మ్యాథ్స్ కు లెంక! వీటిలో ఒకదాంట్లో ప్రవేశం ఉన్న వాళ్లు మరొకదాంట్లో ప్రావీణ్యులై ఉంటారని ప్రతీతి! నాకు లెక్కలు రావు, జీవితంలో ఏనాడూ సంగీతం నేర్చుకోలేదు! కానీ, మ్యూజిక్ అంటే మక్కువ ఎక్కువ! బాత్రూంసింగర్ టైపు అనుకోండి పోనీయ్! పొద్దున్నే, మ్యూజిక్ వింటూ రాగాలాపన చేస్తుంటే అదో తుత్తి, రోజు కూడా హుషారుగా మొదలౌతుంది! నేను, ఎర్లీ మార్నింగ్ స్వామీ గౌర్ గోపాల్ దాస్ స్పిరిచువల్ టాక్ తో మొదలు పెట్టి, తరవాత మాంచి మెలోడియస్_మ్యూజిక్కి స్విచ్ఓవర్ ఔతుంటాను!
Ads
స్వరామృతానికి ఎల్లలుండవు, శ్రావ్యమైన సంగీత స్వరఝరిని భాషాహద్దులు సైతం నిలువరించ లేవు! నాకైతే ఓల్డ్ హిందీ సాంగ్స్ చాలా ఇష్టం! పాత తెలుగు సినిమాల్లోని ఆణిముత్యాలు, బ్యాక్ స్ట్రీట్ బాయ్స్, వెస్ట్ లైఫ్, బాన్ జోవి, బ్రిట్నీ స్పియర్స్, మైకేల్ జాక్సన్ల ఇంగ్లీష్ మ్యూజిక్, సికిడిం లాంటి స్పానిష్, రికీ మార్టిన్ ఫ్రెంచ్ సాంగ్స్ ను మహా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను! అలాగే, ఇళయరాజా, ఏఆర్ రెహ్మన్ల తమిళ ఒరిజినల్ ట్యూన్స్ లైక్ చేస్తాను! ఇంకా కన్నడ, హిందీ, పంజాబీ [ప్రైవేట్] సాంగ్స్ వినడం నా హాబీ! నా కార్లో ఒక మంచి ఆడియో సిస్టం, హై క్వాలిటీ స్పీకర్లు, ఎక్స్ ప్లోడ్ వూఫర్ ఉన్నాయి! లాంగ్ జర్నీస్ లో అదిరిపోయే బేస్, ట్రెబల్ సౌండ్ తో డీజే మ్యూజిక్కులా వెహికిల్ మస్ట్ గా మార్మోగాల్సిందే! క్లాస్ ఐతే, కంప్లీట్ లోవాయిస్ లో రోమాంచితంగా ఆస్వాదించాల్సిందే!
సంగీతమంటే శబ్దం, అదొక భావోద్వేగాల పరంపర! ఆస్వాదించే మనసుండాలి అంతే! లయబద్ధమైన సంగీతం వింటుంటే ఒంట్లో అణువణువూ పులకరించిపోతుంది! మనోరంజకమైన ఆ ధ్వని తరంగాలు వీనులను తాకగానే, ఒళ్లు జలదరిస్తుంది! రసగంగలో తానమాడుతూ మనసు ఓలలాడిపోతుంది! సప్తస్వరాలొలికే శాస్త్రీయ సంగీత జీవామృతధారలో పడి మది మత్తుగా ఊయలలు ఊగుతుంది! ఎంతటి వాళ్లైనా, చివరికి కర్కోటకులు సైతం ఏదో ఒక రాగానికి ఆకర్షితులవుతుండటం సహజం! ఆ రాగం వింటూ తన్మయత్వంలో మునిగి తేలుతుంటారు! బండరాళ్లను సైతం కరిగించే శక్తి సంగీతానికి ఉందనేది అందుకే!
If You Want to Find the Secrets of the Universe, then Think in Terms of Energy, Frequency and Vibration- Nikola Tesla.
ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త నికొలా టెస్లా అన్నట్లు ఈ విశ్వం ఉనికికి ఆధారం ప్రకంపనలు! అవి శబ్దం నుంచి వెలువడుతాయి! పంచతన్మాత్రల్లో శబ్దం ఒకటి. అది ఆకాశం నుంచి వస్తుంది. ఆ శబ్దానికి ఆధారం ఓంకారం! ఓంకారం నాదబ్రహ్మం! అంటే శబ్దం దైవంతో సమానం! త్రిమూర్తుల్లో సృష్టికర్త బ్రహ్మ ‘అ’ కారానికి, స్థితికారకుడు విష్ణువు ‘ఉ’ కారానికి, లయకారకుడు మహేశ్వరుడు ‘మ’ కారానికి ప్రతీకలు! శివుడి చేతిలోని ఢమరుకం సంగీత వాయిద్యాలలో ఒకటి. బ్రహ్మదేవుని సతీమణి సరస్వతీ దేవి వీణా వాయిద్యానికి అనుగుణంగా శివుడు ఢమరుకం వాయిస్తాడనేది పురాణ ఉవాచ!
ఢమరుకం 14 రకాల లయలున్న ధ్వనిని విడుదల చేస్తుంది. అలాగే, ఋగ్వేదానికి అకారం, సామవేదానికి ఉకారం, యజుర్వేదానికి మకారం సూచికలు! ఈ 3 బీజాక్షరాల సంగమమే ఓంకారం! ప్రాచీనకాలంలో ఋషులు ప్రతికూల వాతవారణ పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకార నాదమే రహస్యం. ఓంకారం ఆరోగ్యసూత్రం! అనేక పరిశోధనల్లో సైతం అది మృత్యుంజయ మంత్రమని బైటపడింది. అందుకే, సంగీతాన్ని సర్వరోగ నివారిణి అంటుంటారు! కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి ఆధునిక వైద్యులు సైతం ట్రీట్మెంట్ కోసం మ్యూజిక్థెరపీ ని సజెస్ట్ చేస్తుంటారు!
ఇక, భారతీయ శాస్త్రీయ సంగీతోద్భవ మూలాలు వేల సంవత్సరాల నాటి సామవేదంలో ఉన్నాయి! సనాతన ధర్మం ప్రకారం భావోద్వేగాలను ప్రేరేపించి మానవాళిని దైవంతో అనుసంధానం చేయడం కోసం ధ్వనిశక్తిని వినియోగించే ప్రక్రియ సామవేదంతోనే ప్రారంభం ఐంది! ఇదే తరవాత క్రమంలో స్వరాల అన్వేషణకు, సంగీత ప్రమాణాల అభివృద్ధికి పునాది వేసింది. ఆ రిథమిక్ మెలోడియస్ సిస్టమే అమృతవాహిని లాంటి మ్యూజిక్ ఫ్రేంవర్క్ ను నాగరిక సమాజానికి అందించింది! శాస్త్రీయ సంగీతాన్ని వర్ణించే విభిన్న రాగాలకు జన్మనిచ్చింది! ప్రతి ట్యూన్ దాని సొంతంగా ఒక ఎమోషన్, టేస్టు, శ్రావ్యమైన అలంకారం [Embellishment] ను కలిగి ఉంటుంది! ప్రశాంతత కోసం చాలామంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు! అదేసమయంలో, శ్రవణానందం కలిగించే శబ్దాన్ని, అంటే సంగీతాన్ని ఆశ్రయించి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యే వాళ్లు కూడా ఉంటారు!
భరతముని ప్రాచీన నాట్యశాస్త్రం, సారంగదేవుని సంగీత రత్నాకరం, మనదేశంలోని శాస్త్రీయ సంగీతానికి రెండు శాఖలైన హిందుస్థానీ, కర్ణాటిక్ సంప్రదాయాలకు ఊపిరిపోసిన గ్రంథాలు! సంగీతానికి శ్రుతిలయలు ఆయువుపట్టు! మానవుని చెవి గుర్తించే స్వరస్థాయిలో చిన్న విరామమే శృతి [Tune]. నాదోపాసకులు వీటిని షడ్జమం, మధ్యమం, పంచమాలుగా విభజించారు. లయ [Rhythm] అనేది సంగీతంలో పునరావృతమయ్యే పల్స్ [Beat] ను ఉపయోగించడం ద్వారా సృష్టించబడి, శ్రావ్యతకు పునాది వేస్తుంది. ఆరోహణ, అవరోహణ క్రమాలతో కూడిన సరిగమ, పదనిసలు పలికే శాస్త్రీయ సంగీతం, మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, లెఫ్ట్ మేజర్, రైట్ మేజర్ అంటూ మ్యూజికల్ నోట్స్ ను ఉటంకించే వెస్ట్రన్ జాజ్ [Jazz] మ్యూజిక్కులు అనేక సారూప్యతలను కలిగి ఉంటాయి!
కాంభోజి, కీరవాణి, శంకరాభరణం, చక్రవాకం, చారుకేశి ఇలా సంగీతంలో 72 రాగాలు ఉన్నాయి! హిందుస్తానీ సంగీతం ప్రాధమికంగా శబ్ద ఆధారితమైతే, కర్ణాటిక్ మ్యూజిక్ రకరకాల భావోద్వేగాల సమాహారం! హిందుస్తానీ గాత్రం భావోద్వేగాలకు అతీతంగా, అవసరమైన విధంగా సరళంగా శబ్దాన్ని ఉపయోగిస్తుంది! కాగా, దక్షిణాది సంగీత విద్వాంసులు, కళాకారులపై 400 ఏళ్లనాటి భక్తి ఉద్యమం తీవ్ర ప్రభావాన్ని చూపింది! ఫలితంగా కర్ణాటక సంగీతం మాత్రం భావోద్వేగాలతో రంగరించబడింది! హాట్స్ ఆఫ్ టు డివైన్ ఇండియన్ మ్యూజిక్!…. [ సూరజ్ వి. భరద్వాజ్ ]
Share this Article