రాష్ట్ర ప్రథమ పౌరురాలు గవర్నర్… సాంకేతికంగా ఆమెదే ప్రభుత్వం… కానీ యాదాద్రి ప్రారంభానికి గానీ, సచివాలయ ప్రారంభోత్సవానికి గానీ ఆమెకు ఆహ్వానం ఉండదు… అవి పార్టీ కార్యక్రమాల్లా నిర్వహిస్తారు… వేరే ప్రతిపక్షాలూ ఆవైపు వెళ్లవు… ప్రజాధనంతో నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పార్టీ రంగులు దేేనికి..? ఇది కరెక్టేనా..? ఇక్కడ కట్ చేయండి సీన్…
దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి… సాంకేతికంగా ఆమే అన్నింటికీ అధికారిణి… ఆమెదే ప్రభుత్వం… కానీ పార్లమెంటు కొత్త భవన ప్రారంభానికి ఆమె నోచుకోదు… ప్రధాని ప్రారంభిస్తాడు… ఇది తప్పేనంటారా..? తప్పే అయితే మరి తెలంగాణ గవర్నర్‌ను ముఖ్య ప్రారంభోత్సవాలకు దూరం పెట్టడం తప్పు కాదా..? వ్యక్తిని బట్టి పోస్టుకు విలువ లెక్కిస్తారా..? ఇదెక్కడి చోద్యం..?
పార్లమెంటు కొత్త భవనాన్ని స్పీకర్ లేదా రాష్ట్రపతి ప్రారంభించాలని చెబుతున్న మజ్లిస్… గవర్నర్‌ను పరాభవించే తెలంగాణ ప్రభుత్వ ధోరణిపై ఎందుకు మాట్లాడలేదు..? సచివాలయ ప్రారంభోత్సవ ప్రొటోకాల్, ఆహ్వానాలను ఎందుకు విశ్లేషించలేదు..? కేసీయార్ ఏది చేసినా రైటేనా..? మోడీ ఏది చేసినా రాంగేనా..? మోడీ చేసేది తప్పయితే కేసీయార్ చేసిందీ తప్పే కదా… పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడానికి నిర్ణయం తీసుకున్న 19 ప్రతిపక్ష పార్టీలు పరోక్షంగా కేసీయార్ ధోరణినీ తప్పుపడుతున్నట్టే లెక్కించాలా..? బీఆర్ఎస్ వద్ద ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా..?
Ads
సరే, పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలనే నిర్ణయం వెనుక హేతుబద్ధత కనిపించదు… ఓ మిత్రుడు విసురుగా చేసిన వ్యాఖ్య ఏమిటంటే…? ‘‘బహిష్కరిస్తారు సరే, పార్లమెంటులోకి కూడా అడుగు పెట్టరా మరి..? మోడీ ప్రధానిగా ఉన్నన్నిరోజులూ పార్లమెంటుకు హాజరు కారా..?’’
ఇది ప్రజాధనంతో నిర్మించిన ఓ కొత్త భవనం… అంతే… అంతకుమించి విశేషం ఏమీ లేదు… జస్ట్, ఓ కొత్త భవనం… దీన్ని రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటే… దాన్ని మోడీ ప్రారంభిస్తున్నాడు కాబట్టి… మోడీ ఏం చేసినా వ్యతిరేకించాలి కాబట్టి… అంతేతప్ప ఓ మాన్యుమెంట్ వంటి ప్రజాభవన ప్రారంభోత్సవంలో పాల్గొనడమే మర్యాద అనే సోయి లోపించింది కాబట్టి… మోడీని ఇక్కడ బీజేపీ మనిషిగా కాదు, కోట్లాది మంది భారతీయులు ఎన్నుకున్న ప్రధానిగా ఎందుకు చూడరు..? లోకసభ సభ్యత్వం రద్దయిన రాహుల్ ఈ కూటమికి లీడర్..? లోకసభ లీడర్ మాత్రం అస్పృశ్యుడయ్యాడా..?
ఆ 19 పార్టీల్లో యూపీఏలో భాగస్వామ్యం లేని పార్టీలు కూడా ఉన్నాయి… చిన్నాచితకా పార్టీలు కూడా కలిసి ఉన్నాయి… ఇక్కడ మరో కోణం కూడా చూడాలి… 25 పార్టీలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటామని ప్రకటించాయి… అంటే ఏమిటర్థం..? ఈ దేశం మోడీ, యాంటీ-మోడీ క్యాంపులుగా చీల్చబడిందా..? రాజకీయరంగులు పూయబడకుండా ఉండాల్సిన కార్యక్రమాలకు సైతం ఈ రంగుపూతలు, ఏదో ఓ సాకుతో ‘రాజకీయం’ చేయడం తప్పదా..? అది తప్పేనా..?
వోకే, మేం వస్తాం అని ప్రకటించిన ఈ 25 పార్టీల్లో ఎన్డీయే పార్టీలే కాదు, నాన్ ఎన్డీయే పార్టీలు కూడా ఉన్నాయి… వాటికీ జనంలో ఆదరణ ఉంది… ఎటూ తేల్చుకోలేని గాలివాటాల బీఆర్ఎస్ కూడా అటూఇటూ గాని స్థితిలో నిలబడింది… ఇది వేరే కథ… ఈ 25 పార్టీల్లో ఎఐడీఎంకే, శివసేన, ఎన్పీపీ, ఎన్పీఎఫ్, అప్నాదళ్, రిపబ్లికన్ పార్టీ వంటివి ఉన్నాయి… అదేసమయంలో బిజూజనతాదళ్, టీడీపీ, వైసీపీ వంటి తటస్థ పార్టీలు కూడా ఉన్నాయి… మాజీ ఎన్డీయే భాగస్వామి శిరోమణి అకాలీదళ్, జేడీఎస్‌లతో పాటు బహుజన సమాజ్ పార్టీ కూడా ఉంది…
ఎవరు ప్రారంభిస్తేనేం గానీ… ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లోెకసభ స్పీకర్ కూడా హాజరవుతారు… కొత్త భవనంలోని తమ సీట్లలో కూర్చుంటారు… నెహ్రూ వాకింగ్ స్టిక్‌గా భ్రష్టుపట్టించబడిన సెంగల్, అనగా రాచదండం లేదా ధర్మదండాన్ని పార్లమెంటు కొత్త భవనంలోకి తీసుకొస్తారు… దానికి ఓ మార్మిక విశిష్టతను ఆపాదిస్తున్నారు… ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్లు, రాజ్యసభ మాజీ ఛైర్మన్లు, ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపిస్తున్నారు…
ఈ భవన ప్రధాన ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్‌తోపాటు ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాను కూడా పిలిచారు… బహుశా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తమ సందేశాలను పంపిస్తారు… (నిజానికి రాజ్యసభ ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరవడమే మర్యాద)… ఫిలిమ్ స్టార్లు, ప్రముఖులు, క్రీడాకారుల్ని కూడా పిలిచారు… (జీ20 సదస్సులో పాల్గొన్న ఏకైక సినిమా సెలబ్రిటీ, హీరో రాంచరణ్‌ను పిలిచారో లేదో తెలియదు…) చివరగా… కొత్త భవనంలోని లోకసభలో 888 సభ్యులు కూర్చోవచ్చు… రాజ్యసభలో 384 మంది కూర్చోవచ్చు… ప్రస్తుతం లోకసభలో సభ్యుల సంఖ్య 545… రాజ్యసభలో సభ్యుల సంఖ్య 250… ఈ సీట్ల పెంపు దేనికి సంకేతమో…!!
Share this Article