కామెడీ చేస్తూ జనాన్ని నవ్వించడంలో బాగా పేరు సంపాదించిన వాళ్లు హీరోగా తెర మీద కనిపించడానికి ప్రయత్నిస్తే భంగపాటు తప్ప జనం పెద్దగా యాక్సెప్ట్ చేయరు… ఈ నిజం అనేకసార్లు నిరూపితమైంది… అందుకే హీరోలు అవుదామని ప్రయత్నించి, జనం యాక్సెప్ట్ చేయక, చేతులు కాల్చుకుని, అన్నీ మూసుకుని కామెడీ, కేరక్టర్ వేషాలకు పరిమితమైన వాళ్లు ఎందరో మనకు తెలుసు…
వెన్నెల కిషోర్… తను లేనిదే తెలుగు సినిమా లేదు… ఒకప్పుడు బ్రహ్మానందం అనుభవించిన స్టార్ కమెడియన్ హోదాను తను ఎంజాయ్ చేస్తున్నాడు… గుడ్, తనకు టైమింగ్ ఉంది, కామెడీ బాగా చేయగలడు… కానీ హీరో కావాలనుకున్నాడు, లేదా తను హీరోగా చేయాలని ఎవరో నిర్మాతలు అనుకున్నారు… గతంలో కూడా రెండుసార్లు ఫెయిలయినట్టున్నాడు… మూడోసారి చారి111 పేరిట వచ్చాడు, చతికిలపడ్డాడు…
గూఢచారి001 కు ఓ స్పూఫ్ రూపమే చారి111… నిజమే, స్పై, జేమ్స్ బాండ్ తరహా సినిమాలకు సంబంధించి ఓ పేరడీ కామెడీ స్పూఫ్ ఈ సినిమా… ఎప్పుడైతే స్పూఫ్ అనుకున్నామో, ఇక సినిమా కథ చివరిదాకా అలాగే నడవాలి… కానీ ఫస్టాఫ్‌లో కాస్త ఉడికీఉడకని కామెడీ సీన్లు వడ్డించిన దర్శకుడు సెకండాఫ్‌లో సీరియస్ నోట్‌లోకి వెళ్లిపోయాడు…
Ads
స్పూఫ్‌లో ప్రేక్షకుడు లాజిక్కులు వెతకడు, ఏదోలే కామెడీ కోసం ఏదేదో చూపిస్తున్నారులే అనుకుంటాడు, నవ్వొస్తే నవ్వుకుంటాడు… కానీ ఈ సినిమా అటూఇటూ గాకుండా పోయింది… జనం నవ్వొచ్చి కాదు, ఈ ధోరణి చూసి నవ్విపోయారు… ఇక్కడ వెన్నెల కిషోర్ తప్పేమీ లేదు… ఆ కథ, కథనం అలా ఉన్నయ్, తనేం చేయగలడు… ఇందులో చాలామంది నటీనటులున్నారు… అవును, ఉన్నారంటే ఉన్నారు…
జాతిరత్నాలు సినిమా ఓసారి గుర్తుతెచ్చుకొండి… ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సరదా సరదా పంచులు, సీన్లు… ఎక్కడా వీసమెత్తు లాజిక్కు ఉండదు, జనం నవ్వుతూ సినిమా చూశారు తప్ప లాజిక్కుల కోసం చూడలేదు… ఆ కొద్దిసేపు నవ్వామా లేదానేదే ప్రధానం… ఆ సినిమా టార్గెట్ కూడా అదే… సో, ఈ చారి111 సినిమాలో కూడా లాజిక్కులు లేకపోయినా వోకే… కనీసం నవ్వించే ప్రయత్నమైనా సీరియస్‌గా చేశారా అంటే అదీ లేదు…
ఇదేమీ కొత్త జానర్ కాదు… స్పై కామెడీ లేదా స్పూఫ్, పేరడీ… పేరు ఏదయితేనేం తెలుగులో కొత్త… కానీ క్లిక్ కాలేదు… ఇలాంటి పేరడీలకు సంపూర్ణేష్ బాబు పెట్టింది పేరు… నిజం చెప్పాలంటే ఈ చారి111 సినిమా తనే చేస్తే ఇంకాస్త బెటర్‌గా ఉండేదేమో… వెన్నెల కిషోర్‌కు అస్సలు సూట్ కాలేదు… ప్రేక్షకులకూ నచ్చలేదు…!!
Share this Article