Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

“శ్రీ లీలా నమస్తుభ్యం వరదే తెర రూపిణీ!”

April 2, 2024 by Rishi

శ్రీలీల చదివెద దేవా!… ప్రతిష్ఠాత్మక ఐ ఐ టీ ల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే జె ఈ ఈ ఫలితాలొచ్చిన ప్రతిసారీ- ఏ కోచింగ్ సెంటర్ ప్రకటనలో చూసినా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ఒకరికే వచ్చి ఉంటుంది. ఉన్న ఒక ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ పది, పదిహేను పెద్ద కోచింగ్ సెంటర్లకు  సమానంగా పంచే ర్యాంకుల ప్రజాస్వామికీకరణ నూత్న విద్యా విధానం ఏదయినా ఉండి ఉంటే మన అజ్ఞానం క్షమించబడుగాక!

“మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం” అన్నట్లు ఈ ప్రకటనల నిత్య చైతన్య పారాయణ హోరులో ఒకటి- ఒకటి, రెండు- రెండు అన్నట్లు ఒకటి రెండు మంచి విషయాలు కూడా లేకపోలేదు.

భాషలో “సాధ్యం” అన్న మాటకు ఎన్ని పర్యాయపదాలు ఉన్నాయో? ఆ మాటకు వ్యతిరేకార్థాలు ఎన్ని ఉన్నాయో? స్వరపేటికలో స్వర తంత్రులు తెగిపోయేలా గొంతు చించుకుని ఆ మాటను ఎంత తీవ్ర శ్రుతిలో చెప్పవచ్చో? “సాధ్యం” అన్న ఒక్క మాటతో ఆసేతు హిమాచలం వెన్నులో ఎలా వణుకు పుట్టించవచ్చో? ఆ ఒక్క మాటతో మన పిల్లలను మనకు మనమే నిర్దయగా వారికి అప్పగించాలన్న ఆత్రుత ఎలా పెరుగుతుందో? లాంటి కొన్ని విషయాలు ప్రాక్టికల్ గా అర్థం కావాలంటే జె ఈ ఈ ఫలితాలు వచ్చినప్పుడు రేడియో వినాలి. టీ వీ లు చూడాలి. పత్రికలు తిరగేయాలి.

సాధారణ భాషా నియమాల ప్రకారం సాధ్యానికి ముందు “అ” వచ్చి అసాధ్యం అయి వ్యతిరేకార్థ పదం ఏర్పడుతుంది. కానీ వీరి అసాధ్యం కూల!
“ఆలిండియా ఓపెన్ కేటగిరి మొదటి పది ర్యాంకులు మాకే సాధ్యం. ఇంకెవరికీ అసాధ్యం. కలలో కూడా దుస్సాధ్యం. దుర్భేద్యం” అన్న ప్రకటనలో తెలుగు భాషా భాగాలు, వ్యతిరేక పదాలు, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష అర్థాలంకారాలు, అంత్య ప్రాసల శబ్దాలంకారాలు సగటు భాషాభిమానులకు లెక్కలేనన్ని.

పిల్లలకు ఇది పెడితే బలం; ఇది తినిపిస్తే మహా బలం; అవి వేస్తే అందం; ఇవి తొడిగితే మహానందం; ఇక్కడ చేరితే స్వర్గం; అక్కడ ఉంటే పునర్జన్మే లేని మోక్షం…లాంటి ప్రకటనలు ఇక కనబడనే కనపడకూడదని రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ మార్గదర్శకాల ప్రకారం శాస్త్రీయంగా రుజువు కాని ఉత్పత్తుల ప్రకటనల్లో నటించేవారి మీద కూడా చర్యలు ఉంటాయి. అలాంటి ప్రకటనలను తయారు చేసినవారు, ఆ ప్రకటనకు మూలమయిన కంపెనీ లేదా సంస్థ వారు అందరూ అందులో ఉన్న ప్రతి అక్షరానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఉదాహరణకు-
“శ్రీ చైతన్యలో చేరడం వల్లే ఇన్ని వేల మంది మెడిసిన్లో, ఇన్ని లక్షల మంది ఇంజనీరింగ్ లో చేరగలిగారు” అని అల్లు అర్జున్ చెబుతున్న ప్రకటన ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఎన్ని లక్షల మందికి శిక్షణ ఇస్తే…అందులో నుండి ఎన్ని వందల మంది ఎంపికయ్యారో స్పష్టంగా చెప్పాలి. అలా చెప్పనప్పుడు ఎంపికయిన వారి నంబర్లు మాత్రమే చెప్పి పిల్లలను ఆకర్షించడం తప్పు అవుతుంది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ- ఐ అండ్ బి ఆ ప్రకటనలో ఉన్న నటుడు లేదా నటికి, శ్రీ చైతన్య యాజమాన్యానికి, ఆ ప్రకటనను అచ్చేసిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు కూడా నోటీసులు ఇవ్వవచ్చు. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఆ ప్రకటనలను నిషేధించవచ్చు.

ఆచరణలో సాక్షాత్తు నారాయణుడికే విద్యా చైతన్యం ఇవ్వగలిగిన సంస్థలను మానవమాత్రులయిన ఐ అండ్ బి అధికారులు ఏమి చేయగలరు? అన్న నిర్వేదం, వైరాగ్యం ఉండనే ఉంటాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు కూడా ఉండి ఉంటాయి.

అన్నట్లు శ్రీచైతన్యకు ఇక నటి శ్రీలీల బ్రాండ్ అంబాసడర్ అట. ఇక శ్రీచైతన్య నుండి వచ్చే ప్రకటనల్లో-
“శ్రీ లీలా! నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్; నీవు నా ఉల్లంబందున నిల్చి…”
“యా శ్రీ లీలా తుషార హార ధవళా! యా శుభ్ర వస్త్రాన్వితా!”
“శ్రీ లీలా నమస్తుభ్యం వరదే తెర రూపిణీ!”
“శ్రీలీలను చూడండి…జె ఈ ఈ రాయండి!”
“శ్రీలీల ఉండగా…పుస్తకమెందుకు దండగ?”
“మదిలో శ్రీలీల…పరీక్షలో శ్రీచైతన్య లీల!”
అని రాకూడదని మనసా వాచా కర్మణా కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు! అంతా భగవంతుడి లీల! అందులో శ్రీచైతన్యది ఒక లీల! ఆ లీలా చైతన్యంలో శ్రీలీలది మరో అంతర్లీల! అనుకుని మౌనంగా ఉండడమే ఉత్తముల తక్షణ కర్తవ్యం!

నిజంగానే డాక్టరీ చదివిన ఆమె… తెల్లకోటు, మెడలో స్టెత స్కోపుతో డాక్టర్లు కాబోయేవారిని ఆకర్షించడానికి నీట్ ఎగ్జామ్ ప్రకటనకు నీట్ గా శ్రీలీల తయారవ్వడం మాత్రం ముద్దుకే ముద్దొచ్చే సందర్భం.

మొన్న ఒక రోజు శ్రీ చైతన్య- నారాయణ ప్రకటనలు చదివితే రాజకీయ రంగంలో ప్రత్యర్థులు కాస్త శత్రువులై భీకర యుద్ధాలు చేసుకుంటున్నట్లే ఉంది.

మిగతావారెవరూ అందుకోలేని, చేరుకోలేని “ప్రత్యర్థులు” అట నారాయణకు. ఇదే స్ఫూర్తితో చైతన్యకు మిగతావారు శత్రువులే అయి ఉంటారు. వారికి వారే తొడగొట్టి సవాళ్లు విసురుకుంటున్న ఈ ప్రమాణాల ప్రకారం-
1. కాలేజీలు- యుద్ధ సీమలు.
2. విద్యార్థులు- వీరసైనికులు.
3. తరగతి గదుల్లో నేర్పేది- యుద్ధ విద్య.
4. ఒత్తిడి తట్టుకోలేని విద్యార్థుల ఆత్మహత్యలు- వీర మరణాలు.
5. నారాయణకు చైతన్య శత్రు దేశం; వైస్ వర్సా చైతన్యకు నారాయణ రష్యాకు ఉక్రెయిన్ లాంటిది.
6. తల్లిదండ్రులు- విషాద చారికలు.
7. పరీక్షలు- అణుబాంబులు.
8. ఫలితాల ప్రకటనలు- మానవ బాంబులు.
9. చివర ఫలశ్రుతి- యుద్ధం మిగిల్చిన బూడిద…. -పమిడికాల్వ మధుసూదన్     9989090018

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions