నటి శ్రీలీలను శ్రీచైతన్య గ్రూపు బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నారనే వార్తావివరాలు చదువుతూ ఉంటే మరో వార్త కనిపించింది… ఆమె రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లూ స్క్వేర్ సినిమాలో హీరోయిన్‌గా చేసే అవకాశాన్ని చేజేతులా వద్దనుకుందట… గుడ్… మంచి పని చేసింది… లేకపోతే భ్రష్టుపట్టిపోయేది… అంటే అది దరిద్రమైన ఆఫర్ అని కాదు, తనకు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏమాత్రం సూట్ కాని వెగటు పాత్ర అది…
అనుపమ పరమేశ్వరన్ కథ వేరు… మొదట ఈ చాన్స్‌కు వోకే చెప్పింది, తరువాత ఆ కథ, ఆ సీన్ల వివరాలు, తను బోల్డ్‌గా నటిస్తూ లెక్కలేనన్ని లిప్ లాకులతో చెలరేగిపోవాలని తెలిసి, ఇప్పుడున్న ఇమేజీకి భంగం అనుకున్నదో ఏమో వద్దని చెప్పింది… తరువాత డబ్బు మహత్యమే కావచ్చు, లేక భిన్నమైన ఇమేజీ కావాలనే కోరిక కావచ్చు, అనుపమ అన్నీ చేయగలదు అనే ముద్ర కోసమే కావచ్చు, కారణాలేవైనా మళ్లీ ఈ ప్రాజెక్టులోకి వచ్చింది…
కథకు తగ్గట్టే చెలరేగిపోయింది… జొన్నలగడ్డ సిద్ధూ సినిమా అంటే కాస్త స్పైసీ కదా, సినిమా బ్లాక్ బస్టరే అయినా పలుచోట్ల సీన్లు ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇబ్బందిగానే ఉంటయ్… కాకపోతే వన్ లైనర్స్‌తో సినిమా దడదడలాడిపోయింది… అనుపమ ఏం కోరుకుందో గానీ ఈ పాత్రతో ఆమెకు లభించిన అదనపు ఫాయిదా శూన్యం, పైగా దారుణమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది… భారీ ట్రోలింగ్‌తో ఒకటీరెండు ప్రమోషన్ మీట్లనూ అవాయిడ్ చేసిందని సిద్ధూయే చెప్పినట్టు చదివాను…
Ads
సరే, మెజారిటీ ప్రేక్షకులకు నచ్చింది, దాన్నలా వదిలేస్తే… శ్రీలీల నిజంగానే ఆ పాత్ర చేసి ఉంటే…?
తను గనుక ఆ పాత్ర చేసి ఉంటే, నో డౌట్, అనుపమ స్థాయిలో రెచ్చిపోయేది కాదు… పైగా తన మెయిన్ ప్లస్ పాయింట్ డాన్సులకూ సినిమాలో స్కోప్ లేదు, సిద్ధూ పెద్ద డాన్సరూ కాదు, ఆమె స్పీడ్, స్టెప్పుల రేంజ్ తట్టుకోలేకపోయేవాడు… అంటే కృత్రిమంగా ఓ డ్యూయెట్ డాన్స్ కోసం పెట్టినా సరే అది అంతగా అతక్కపోయేది… పైగా ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో ఆమె వేసిన ‘వెర్రి డాన్సులు’ ఆమెకు బోలెడంత చెడ్డపేరు తీసుకొచ్చాయి…
ఆ ఎనర్జీ, ఆ స్టెప్పులు ఆమెకు నిజంగా ప్లస్ కావాలి, దర్శకుడైతే సందర్భం లేకుండా మిర్చి గోదాంలో ఆమెతో రికార్డింగ్ డాన్స్ చేయిస్తాడు, కేవలం ఆమె డాన్స్‌ను గరిష్టంగా ట్యాప్ చేయడం కోసం..! అసలే తను నటన పర్‌ఫామెన్స్‌కు పెద్దగా చాన్స్ లేని, కేవలం డాన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తూ తన ఇమేజీని తానే మైనస్ చేసుకుంటోంది… మొదట్లో ఉన్నంత క్రేజ్ ఇప్పుడామె మీద లేదు, ఈ స్థితిలో జొన్నలగడ్డ సిద్ధూ మీదపడి లిప్ లాకులు ఇస్తూ, అల్లుకుపోయి ఉంటే మరింతగా తనకు మరకలు అంటేవి… పైగా అలాంటి పాత్రలు ఆమెకు అస్సలు సూట్ కావు…
సో, ఆమె ఆ పాత్ర వద్దని చెప్పి మంచి పనిచేసినట్టే… ఆ ఫైనలియర్ మెడిసిన్ పూర్తి చేసి, అప్పుడు కాస్త మెరిట్‌కు స్కోప్ ఉన్న పాత్రల్ని ఎంపిక చేసుకుంటే నాలుగు రోజులు ఇండస్ట్రీలో నిలబడుతుంది, లేకపోతే మన సినిమా పెద్దలు ఫుల్లు డాన్సులు చేయించి, తరువాత కరివేపాకును చేస్తారు… ఎంతమంది రాలేదు, ఎంత త్వరగా నిష్క్రమించలేదు…?!
Share this Article