Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాబితాలో చిట్టచివరన మూలుగులు కాదు… టాప్ రేంజులో ఉరుకులాట…

May 19, 2024 by M S R

(జాన్ కోరా)…. ఒక జట్టుకు కెప్టెన్ ఎంత ముఖ్యమైన వ్యక్తో.. అతడు జట్టుపై చూపే ప్రభావం ఏంటో ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)ను చూస్తే అర్థం అవుతుంది. పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఎవరూ ఊహించని రీతిలో ఆడుతోంది. గతంలో ఇదే జట్టు.. ఇదే ఆటగాళ్లు.. కానీ ఒక్క కెప్టెన్ మార్పుతో సరికొత్త జట్టులా కనపడుతోంది. అసలు గత మూడు సీజన్లను గమనిస్తే.. ఎస్‌ఆర్‌హెచ్ ఈ సీజన్‌లో కూడా టేబుల్‌లో చివరనే ఉంటుందని భావించారు. కానీ ఈ సీజన్‌లోనే ప్రత్యర్థుల పాలిట అరవీర భయంకరమైన జట్టుగా తయారయ్యింది.

ఐపీఎల్ 2022లో 12 పాయింట్లతో 8వ స్థానంలో.. 2023లో మరింత దారుణంగా 10వ స్థానంలో నిలిచింది. అయితే గతేడాది చివర్లో జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్‌ యాజమాన్యం పాట్ కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అతనితో పాటు ట్రావిస్ హెడ్ (రూ.6.80 కోట్లు), వానిందు హసరంగ (రూ.1.5 కోట్లు)ను కూడా మినీ వేలంలో జట్టులోకి తెచ్చుకున్నది. అయితే పాట్ కమ్మిన్స్‌కు 20 కోట్లకు పైగా వెచ్చించడంపై సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చాలా ట్రోలింగ్‌కు గురైంది. పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియాకు కప్ అందించినంత మాత్రాన అతడికి అంత పెట్టడం అవసరమా అని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు కూడా విమర్శించారు.

అయితే సన్‌రైజర్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన పాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్‌లే ఈ సీజన్‌లో హీరోలుగా నిలిచారు. అంతకు ముందు సీజన్లలో సరైన కెప్టెన్ లేక సన్‌రైజర్స్ చాలా ఇబ్బందులు పడింది. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్‌గా తప్పించిన తర్వాత హైదరాబాద్ జట్టుకు సరైన నాయకుడు లేకుండా పోయాడు. కేన్ విలియమ్‌సన్ కొంత కాలం కెప్టెన్‌గా వ్యవహరించినా.. సరైన ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఆడెన్ మార్క్‌రమ్ అయితే కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా విఫలమయ్యాడు. అలాంటి పరిస్థితిలో జట్టుకు పాట్ కమ్మిన్స్ అతిపెద్ద అస్సెట్ అయ్యాడు.

Ads

kavya

ఒక కెప్టెన్‌గా పాట్ కమ్మిన్స్ జట్టును కూర్చడంలో సఫలమయ్యాడు. విదేశీ, స్వదేశీ ఆటగాళ్లను సరిగా ఎంపిక చేసుకొని జట్టును ముందుకు నడిపించాడు. ఎస్‌ఆర్‌హెచ్ అంటే తక్కువ స్కోర్లు, స్లో బ్యాటింగ్ అనే ముద్రను ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ చెరిపేసుకుంది. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2013లో 263 పరుగులు చేసింది. ఈ సీజన్ ప్రారంభం వరకు ఇదే అత్యధిక స్కోరు. కానీ 2024లో ఈ స్కోర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు సార్లు అధిగమించింది. ముంబై ఇండియన్స్‌పై 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ జట్టు.. పక్షం రోజుల తర్వాత తన రికార్డును తానే బద్దులు కొట్టుకుంది. ఈ సారి ఆర్సీబీపై ఏకంగా 287 పరుగులు చేసింది. ఆ తర్వాత ఐదు రోజులకే ఢిల్లీ క్యాపిటల్స్‌పై 267 పరుగులు చేసింది.

srh

ఈ సీజన్‌లో మూడు టాప్ స్కోర్లు సన్‌రైజర్స్‌వే కావడం గమనార్హం. సన్‌రైజర్స్ జట్టు ఈ దూకుడికి ట్రావిస్ హెడ్, అభిషేక్‌శర్మ, హెన్రీ క్లాసెన్‌లే కారణం. ఇక తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి కూడా ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్నాడు. ఒకప్పుడు ఓపెనర్లు త్వరగా అవుటైతే.. ఆ తర్వాత జట్టు కుప్పకూలేది. కానీ ఇప్పుడు సన్‌రైజర్స్ మిడిల్ ఆర్డర్‌ కూడా పటిష్టంగా మారిపోయింది. ఇక పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో బౌలర్లు కూడా రాణించారు. రాజస్థాన్ రాయల్స్‌పై ఒక పరుగు తేడాతో గెలవడంలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన కనపర్చడం వల్లే సన్‌రైజర్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోగలిగింది. కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్.. సపోర్టింగ్ స్టాఫ్ డానియల్ వెటోరీ, ముత్తయ్య మురళీధర్ కృషిని కూడా ఏ మాత్రం తగ్గించలేము. ముంబై, చెన్నై, బెంగళూరు, రాజస్థాన్ వంటి పటిష్టమైన జట్లను కూడా ఓడించి ప్లేఆఫ్స్‌కు మేము అర్హులమే అని సన్‌రైజర్స్ చాటుకుంది.

ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌లో ఆడింది. బౌలర్లు తడబడినా.. బ్యాటర్లు మాత్రం 215 టార్గెన్‌ను 19.1 ఓవర్లలోనే ఛేదించారు. ట్రావిస్ హెడ్ అవుటైనా.. ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా, నిలకడైన బ్యాటింగ్‌తో టార్గెట్ ఛేజ్ చేశారు. కీలకమైన ప్లేఆఫ్స్ ముందు విజయంతో ముగించడం సన్‌రైజర్స్ జట్టుతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

ఇదే నిలకమైన ప్రదర్శన చేస్తే సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరి.. కప్ గెలవడం కష్టమేమీ కాదు. జట్టు రెండో స్థానంలోనే ఉంటే కోల్‌కతాతో, మూడు స్థానానికి చేరితే బెంగళూరుతో ఆడాల్సి ఉంటుంది. రెండు కూడా పటిష్టమైన జట్లే. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్‌కు వెళ్లకుండా ఆడితే జట్టు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుంది.

ఫ్యాన్స్… గత సీజన్లతో పోలిస్తే ఈ సారి సన్‌రైజర్స్ ఫ్యాన్ బేస్ పెరిగింది. గతంలో హైదరాబాద్‌లో మ్యాచ్ ఆడినా సొంత జట్టుకు సపోర్ట్ చేసే ఫ్యాన్స్ గ్రౌండ్‌లో కనిపించే వాళ్లు కాదు. కానీ ఈ సారి హైదరాబాద్ జట్టుకు సపోర్ట్ చేయడానికి ఫ్యాన్స్ భారీగా స్టేడియంకు వచ్చారు. చెన్నై, బెంగళూరు, ముంబై వంటి చోట్ల కూడా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ పోటెత్తడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ కూడా జట్టులో నూతనోత్సాహాన్ని నింపింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions