Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రతి పాత్రధారి వీర పర్‌ఫామెన్స్… కామెడీ టైమింగులో పర్‌ఫెక్షన్…

December 5, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……. ఫక్తు వంశీ సినిమా ఈ శ్రీకనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ . వంశీ , బాపు లాంటి కళాత్మక దర్శకులు కధానాయిక కళ్ళను నమ్ముకుని సినిమాలు తీస్తారేమో అని అనిపిస్తుంది . బాపు ఫౌండ్ సంగీత కావచ్చు , వంశీ ఫౌండ్ భానుప్రియ కావచ్చు .

తమిళ మళయాళ సినిమాల్లో అప్పటికే పాపులర్ అయిన మాధురిని ఈ సినిమాకు నాయికగా ఎంపిక చేసుకున్నారు వంశీ . మొత్తం తెలుగులో ఆమె నటించింది ఇది కాకుండా మరొక్క సినిమానే ఏమో ! (పోలీస్ రిపోర్ట్, అందులోనూ నరేషే లీడ్ రోల్..?)…

  • తమిళంలో , మళయాళంలో అందరి హీరోల సరసన నటించింది . ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి యం కె స్టాలిన్ నటించిన ఒరు రత్తం సినిమాలో కూడా నటించింది .

సినిమాలో సందేశాలు , సూక్తులు , ప్రవచనాలు , గట్రా ఏమీ ఉండవు . ఓ సాదాసీదా గోదావరి జిల్లా అమ్మాయి మేనమామ చాటు ఓ ముద్ద పప్పు గోపాలం అని పిలవబడే నరేషుని ఇష్టపడుతుంది . ఆ మేనమామకో కూతురు కూడా ఉంటుంది . అవన్నీ దాటుకుని ఆ ముద్ద పప్పు నరేషుని పెళ్ళాడాలంటే అతను రికార్డింగ్ డాన్సాడే ట్రూపులో చేరటమే మార్గమని నాయనమ్మని ఒప్పించి చేరుతుంది .

Ads

పెద్ద కళ్ళ నాయిక మీద మనసు పారేసుకున్న ట్రూప్ ఓనర్ మేనల్లుడు తనికెళ్ల భరణి ఆమెను పెళ్లి చేసుకోవాలని మామకు చెప్పటం , నాయనమ్మ నిర్మలమ్మని ఒప్పించటం , తనకు అంతకుముందే గోపాలంతో పెళ్ళయిపోయిందని సీత చెప్పటం , అందరూ బలవంతంగా నాయిక సీతకు , భరణికి పెళ్లి ఏర్పాట్లు చేయటం , ట్రూప్ ఓనర్ దుష్టాలోచనలను తెలుసుకున్న అతని స్టెపినీ గోపాలాన్ని విడిపించి , నాయిక సీతను పెళ్లి పీటల మీద నుండి కాపాడుకోవటంతో సినిమా సుఖాంతం అవుతుంది .

ఇది కధాంశమే అయినా సినిమా అంతా తనికెళ్ళ భరణి కామెడీ డైలాగులే . సర్కస్సులో జోకర్ల గోలలాగా ఈ ట్రూపులో అందరూ అల్లరోళ్ళే . ఒక్కొక్కరికి ఓక్కో ఊతపదం . బట్టల సత్యం మల్లికార్జునరావుకు ఏదో ఫ్రెండ్షిప్ మీద చెపుతున్నా అనే పదం .‌సిలోన్ సుబ్బారావు పాత్రలో రాళ్ళపల్లికి చీపుగా అనే ఊత పదం . ఇలా అన్ని కేరెక్టర్లూ వంశీ మార్కు , జంధ్యాల మార్కు కేరెక్టర్లే .

గోదావరి జిల్లాలలో రికార్డింగ్ డాన్స్ ట్రూపులు వీర పాపులర్ . ఆ రికార్డింగ్ డాన్సులను చూసీ చూసీ మనసు పారేసుకున్న వంశీ అలాంటి ట్రూప్ చుట్టూ ఓ ప్రేమ కధను అల్లారు . ఆ కధను తనికెళ్ల భరణి , వేమూరు సత్యనారాయణలతో కలిసి వినోదాత్మక స్క్రీన్ ప్లేనీ తయారుచేసుకున్నారు .

తనకెంతో ప్రియమైన గోదావరి ప్రాంతంలోని రాజోలు , నరసాపురం , అంతర్వేది , మానేపల్లి , శివకోడు , తాటిపాక గ్రామాల్లో షూటింగ్ చేసారు . గోదావరి అందాలను , నాయిక మాధురి కళ్ళందాలను హరి అనుమోలు చేత అద్భుతంగా కేప్చర్ చేయించుకున్నారు .

సినిమాలో ప్రత్యేకత రికార్డింగ్ డాన్సులే . పాత సినిమాల నుంచి చాలా పాపులర్ పాటల్ని వాడేసుకున్నారు . యన్టీఆర్ గా రాంబాబు , అక్కినేనిగా వీర్రాజు , చిరంజీవిగా వెంకటేష్ డాన్సుల్ని వేసారు . ప్రేక్షకులకు కనువిందు చేసారు . జూనియర్ కృష్ణగా నరేష్ సరేసరి…

madhuri

ప్రధాన పాత్రల్లో నటించిన ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ఓ థీసిస్సే అవుతుంది . రావణుడి లాంటి విలన్ పాత్రలో కోట శ్రీనివాసరావు , మేనల్లుడుగా తనికెళ్ళ భరణి , కోట స్టెపినీగా వయ్యారాల వై విజయ , సిలోన్ సుబ్బారావుగా రాళ్ళపల్లి , అతని భార్యగా సంధ్య , వేన్ డ్రైవర్ మస్తానుగా ఆనంద మోహన్ , బట్టల సత్యం , మాట్లాడితే చీపురు తిరగేసే నాయనమ్మగా నిర్మలమ్మ , మరెంతో మంది తూర్పు గోదావరి ఔత్సాహిక కళాకారులు తళుక్కుమంటారు .

రీమిక్స్ పాటల చిత్రీకరణ ఒక ఎత్తు అయితే ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఈ సినిమా పాటలు అత్యద్భుతంగా చిత్రీకరించబడ్డాయి . సిరివెన్నెల వారితో పాటు వంశీ , ఇళయరాజాలు కూడా పాటల రచనలో ఓ చెయ్యేసారు .

బాలసుబ్రమణ్యం , జానకమ్మ , శైలజ చాలా శ్రావ్యంగా పాడారు . వెన్నెలై పాడనా నవ్వులే పూయనా మల్లెలే పొదగనా , ఏనాడు విడిపోని ముడి వేసెనో , కలలా కరగనా , మల్లికా పొగడకు అంటూ సాగే పాటలు చాలా బాగుంటాయి .

  • నెల్లూరు వాసులయిన డా పి రమేష్ రెడ్డి , డా పి విజయ కుమార్ రెడ్డి శ్రీ తేజ ఆర్ట్ మూవీస్ బేనరుపై నిర్మించారు . వ్యాపారపరంగా లాభాలు వచ్చాయో లేదో తెలియదు కానీ సినిమా మాత్రం ఓ క్లాసిక్కుగా నిలిచింది . బాపు సాక్షి సినిమా గుర్తుకొస్తుంది .

రికార్డింగ్ డాన్సులు అనగానే గుర్తు వచ్చేందుకు మా నరసరావుపేట జ్ఞాపకాలు నాకు పుష్కలంగా ఉన్నాయి . మా బజారుకు దగ్గరలోనే చాకలి సులోబు , శ్రీరాంపురం , వరకట్ట దగ్గర నా చిన్నప్పుడు ఎన్ని రికార్డింగ్ డాన్స్ ట్రూపులు ఉండేవో !

నర్సు కుమారి , వసంత కుమారి , మరెంతో మంది కుమారిలు ఉండేవారు . బహుశా వాళ్ళందరూ ఇప్పుడు జీవించి కూడా ఉండరేమో ! కోటప్పకొండ తిరునాళ్ళ , చుట్టుపక్కల తిరునాళ్ళల ద్వారా పొట్ట పోసుకునే వారు . నరసరావుపేట వాడినయి ఉండి ఈ ట్రూపుల గురించి చెప్పకపోతే పాపం చుట్టుకుంటుంది నాకు.

ఈ క్లాసిక్ సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూసి ఉన్నా కూడా మరలా మరలా చూడొచ్చు . చక్కని హిలేరియస్ , కామెడీ , ఫీల్ గుడ్ , మ్యూజికల్ మూవీ .

నేను పరిచయం చేస్తున్న 1185 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రతి పాత్రధారి వీర పర్‌ఫామెన్స్… కామెడీ టైమింగులో పర్‌ఫెక్షన్…
  • బాలయ్య ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ..! అఖండ తాండవం ఆగింది హఠాత్తుగా..!!
  • తనూజకు సంజన వెన్నుపోటు… తోడుగా భరణి… ఏం ఆటరా భయ్…
  • అందుకే అమెరికాను నమ్మకూడదు… పుతిన్‌ రాకను స్వాగతిద్దాం…
  • తప్పులు కేసీయార్‌వి… తిప్పలు రేవంత్‌‌వి… కాళేశ్వరం అక్రమాల కథలు మరిన్ని
  • ప్రాప్తకాలజ్ఞతకు నిర్వచనం… ఆ రైల్వే మాస్టర్- వందల ప్రాణాలకు రక్ష..!
  • అవునూ.., ఈమె గుర్తుందా..? ఈ చిత్తవికారి ఏం చేస్తోంది ఇప్పుడు..?
  • ఆ 19 దేశాల వారికి ఇక అమెరికాలోకి నో ఎంట్రీ…! ఏమేం చర్యలు అంటే..?!
  • బాలు విగ్రహవివాదం..! అనేక ప్రశ్నలు- జవాబులు దొరకని నిశ్శబ్దం..!!
  • స్టింగ్ ఆపరేషన్ పేరుతో హనీట్రాప్… మలయాళీ చానల్ అత్యుత్సాహం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions