Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొన్ని పాత్రలు, కొన్ని పోరాటాలు ఎన్టీయార్‌కు మాత్రమే సాధ్యం..!!

June 15, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… మూడు సంవత్సరాలు సెన్సార్ బోర్డు మీద న్యాయపోరాటం చేసి విడుదల చేసిన బ్లాక్ బస్టర్ ఈ శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా .

యన్టీఆర్ తన నట విరాట రూపాన్ని ప్రదర్శించిన మరో గొప్ప సినిమా . 1980 లో షూటింగ్ ప్రారంభం చేసి 1981 లోనే పూర్తి చేసారు . వేమన వదిన నగ్నంగా మరిదికి ముక్కెర ఇచ్చే దృశ్యాన్ని తొలగించాలని సెన్సార్ వారు చెపితే ఆ కధకు ఆయువుపట్టు ఆ దృశ్యమే కాబట్టి తొలగించడం కుదరదని భీష్మించుకుని కూర్చున్నారు .

Ads

సుప్రీంకోర్టు వారు కన్విన్స్ అయి అనుమతి ఇచ్చారు . 1984 నవంబర్ 29 న రిలీజయింది . ఆ టైంకు ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు . నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం జరిగాక రెండవసారి ప్రమాణ స్వీకారం కూడా చేసారు . బ్రహ్మం గారు చెప్పిన తెర మీద బొమ్మలు నిజ జీవితంలో తానే ముఖ్యమంత్రి అయి నిజం చేసారు .

ఎపుడో చెప్పెను వేమన గారు , అపుడే చెప్పెను బ్రహ్మం గారు . బ్రహ్మం గారి గురించి తెలియనివారు ఆరోజుల్లో ఎవరూ ఉండేవారు కాదు . ఆయన మీద నాటకాలు చాలా పాపులర్ . మా నరసరావుపేటలో నా చిన్నప్పుడు నేను చూసాను . తెల్లవారుజామున దాకా ఆడేవారు .

మన చుట్టూ ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాలను , వింతలను బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అనటం వింటూ ఉంటాం . ఎన్నో పుస్తకాలు ప్రచురించబడ్డాయి . NOSTRADAMUS OF INDIA గా పిలవబడే బ్రహ్మం గారి మఠాన్ని మేము సందర్శించాం కూడా .

మూడు గంటల సేపు ప్రేక్షకులను కదలనివ్వకుండా షడ్రసోపేతమైన విందుని అందించారు . యన్టీఆర్ని నటుడిగానే కాకుండా నిర్మాతగా , దర్శకుడిగా , కధారచయితగా , స్క్రీన్ ప్లే రైటరుగా కూడా అభినందించాలి . ఆనాటి మనువాద ఆచారాలను , నమ్మకాలను , ఛాదస్తపు సాంప్రదాయాలను ఉతికి ఆరేస్తూ గొప్ప సాహసమే చేసారు . ఆయన భావజాలంతో పయనించే కొండవీటి వెంకటకవి మాటల రూపంలో ధీటుగా సినిమాను రక్తి కట్టించారు .

బ్రహ్మం గారి తర్వాత మూడు వందల సంవత్సరాలకు ఫూలే , అంబేద్కర్ వంటి మహాశయులు బ్రహ్మం గారు పోరాడిన సామాజిక పోరాటాన్ని కొనసాగించారు . క్రీ.శ 1603 లో జన్మించిన బ్రహ్మం గారు 1693 లో సజీవ సమాధి అయ్యారు .

ఆయన సమాధి అయిన వైశాఖ శుధ్ధ దశమి నాడు బ్రహ్మం గారి భక్తులు ఆరాధనోత్సవాలు ఘనంగా చేస్తుంటారు . మా నరసరావుపేటలో మా ఇంటి వద్ద శ్రీరాంపురంలో బ్రహ్మం గారి గుడి ఉంది . సత్తెనపల్లిలో నా చిన్నప్పటి మిత్రులు నన్ను చాలా సార్లు తమ ఊళ్ళో జరిగే ఈ ఆరాధనోత్సవాలకు పిలుస్తుండే వారు .

ఈ సినిమా షూటింగ్ కొరకు సెట్లు వేయకుండా రాయలసీమ ప్రాంతంలోని అహోబిలం , మహానంది వంటి ప్రదేశాలలో షూటింగ్ చేయడం వలన సినిమాకు రిలవెన్స్ బాగా వచ్చింది. ఆ లొకేషన్లు కూడా బాగున్నాయి . సినిమా ప్రారంభమే సామాజిక ఉద్యమకారులయిన బుధ్ధుడు , ఆదిశంకరుడు , రామానుజుడు , వేమనల గురించి అద్భుతంగా వివరించారు . భోగి వేమన యోగి వేమన కావడం చాలా చక్కగా చూపారు .

అరవై ఏళ్ళ వయసులో ఉన్నా ఇరవై ఏళ్ళ యువ వేమనగా యన్టీఆర్ , విశ్వద పాత్రధారిణి ప్రభతో కలసి ప్రేక్షకులను అలరించారు . వారిద్దరి మధ్య పాట , ప్రభ నృత్యం అద్భుతం . ఈ నాట్యాన్ని కంపోజ్ చేసిన నృత్య దర్శకుడు శీనుని తప్పక మెచ్చుకోవలసిందే .

ఈ సినిమా ఘన విజయానికి మరో ప్రధాన వ్యక్తి సుసర్ల దక్షిణామూర్తి . పౌరాణిక సినిమాలలో ఉన్నన్ని పద్యాలు , పాటలు ఉంటాయి ఈ సినిమాలో . ఎక్కడా బోరించకుండా అద్భుతమైన ట్యూన్లను కట్టారు సుసర్ల వారు . ఈరోజుకీ బ్రహ్మం గారి పాత్ర లోని యన్టీఆర్ పాటలు వీర హిట్ . కాలజ్ఞానాన్ని పదాలలో కాకుండా పాటల రూపంలో చెప్పే ప్రక్రియను ఎంచుకున్న యన్టీఆర్ని , సుసర్ల వారిని అభినందించాలి .

బ్రహ్మం గారు కేవలం కాలజ్ఞానం చెప్పిన మహాపురుషుడే కాదు . గొప్ప తత్వవేత్త , సామాజిక విప్లవకారుడు , జ్ఙాని . చిన్న వయసులోనే పెంచిన తల్లికి నీవెవరో నీ జన్మం ఏమిటో నిజం తెలుసుకో జీవా అనే పాటలో పిండోత్పత్తి గురించి శాస్త్రీయంగా వివరిస్తారు .

అలాగే మరో పాట మాయదారీ మరలా బండిరా అనే పాటలో షడ్చక్రాలయిన మూలాధార , స్వాధిష్ఠాన , మణిపూరక , అనాహిత , విశుధ్ధి , ఆజ్ఙా చక్రాల గురించి , వాటి క్రియల గురించి , వాటి అధిస్టాన దేవతల గురించి చిన్న పిల్లాడికి కూడా అర్థం అయ్యేలా వివరిస్తారు .

శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద , వినరా వినరా నరుడా బ్రహ్మం మాట పొల్లు పోదురా , చెప్పలేదని అనకపోయేరు నా మాట వినక తప్పుదారిన నడిచిపోయేరు , చిలకమ్మ పలకవే పలుకు పాటల ద్వారా కాలజ్ఙానాన్ని చెప్పడం అద్భుతంగా ఉంది .

ఇవన్నీ కాకుండా మరో రెండు పాటలు సామాజిక స్ఫూర్తితో ఊగిపోతాయి . పంచముడని నిన్ను కించపరిచెరని బాధ పడకురా కక్కా పాటలో కక్కడిని ఓదార్చే పాట అద్భుతం . ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు అని పండితులను నిలేసే పాట కొంతమందికి నచ్చితే మరి కొంతమందికి చాలా కోపమూ తెచ్చింది . ఈ రెండు పాటల్లో విభిన్నమైన నటనను చూపుతాడు యన్టీఆర్ .

యన్టీఆర్ తర్వాత చెప్పుకోవలసింది బాలకృష్ణ గురించే . ఈ సినిమా షూటింగ్ సమయానికి అతను ఇంకా సోలో హీరో కాలేదు . సిధ్ధయ్యగా బాగా నటించాడు . క్లైమాక్స్ సీనుల్లో మరీనూ . ఇతర ప్రధాన పాత్రల్లో కవిత , సత్యనారాయణ , కాంచన , ఒకనాటి యన్టీఆర్ జోడీ దేవిక , రుష్యేంద్రమణి , పి జె శర్మ , మాస్టర్ హరీష్ , అల్లు రామలింగయ్య , రాళ్ళపల్లి , ముక్కామల , మిక్కిలినేని , అన్నపూర్ణ , చలపతిరావు , ప్రభృతులు నటించారు .

సుసర్ల వారి సంగీతంతో పాటు కొసరాజు , సి నారాయణరెడ్డి గారి పాటలు , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , వాణీ జయరాం , రామకృష్ణ , లీల గాత్రం , కొండవీటి వెంకట కవి సంభాషణలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ని చేసాయి .

రాముడిగా , కృష్ణుడిగా , రావణుడిగా , దుర్యోధనుడిగా , భీష్ముడిగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన యన్టీఆర్ బ్రహ్మం గారిగా కూడా మెస్మరైజ్ చేసారు . బ్రహ్మం గారి చరిత్ర అప్పట్లో చాలామందికి తెలుసు . ప్రధాన ఘట్టాలకు న్యాయం చేస్తూ బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారుచేసుకున్నారు యన్టీఆర్ .

ఈతరంలో చూడని వారు ఎవరయినా ఉంటే తప్పక చూడండి . యూట్యూబులో ఉంది . ఇది కేవలం సినిమాయే కాదు . ఆనాటి సామాజిక పరిస్థితుల మీద ఓ పరిశోధన గ్రంధం కూడా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శ్రీశ్రీ… ఒక తీరని దాహం… మ హా ప్ర స్థా నం… A CLASSIC AND MASTERPIECE …
  • చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?
  • రంగు పూసల దండల ఫేక్ జ్యోతిష్కులతో జాగ్రత్త; జాగ్రత్త; జాగ్రత్త…
  • కొన్ని పాత్రలు, కొన్ని పోరాటాలు ఎన్టీయార్‌కు మాత్రమే సాధ్యం..!!
  • నల్గొండ గోర్కీ… కృష్ణమూర్తి దేవులపల్లి… తెలంగాణ కథల తంగేడు చెట్టు…
  • ఎలెవన్..! 11 మార్కులు మాత్రమే… యాభైకా..? వందకా..? అదే ప్రశ్న..!!
  • పుష్ప2 బ్యాటింగుతో బుల్లితెర పగిలిపోయింది… ఆల్ టైమ్ హై రేటింగ్స్…
  • టెంబా బావుమా… నల్ల జాతి చేతిలో ఓ అపురూప విజయపతాక…
  • ఏమాటకామాట… కన్నప్ప భారీ నిర్మాణ విలువలకు తగినట్టే ట్రెయిలర్…
  • ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions