Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…

August 20, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. కొంతమంది కొన్ని పాత్రల కోసమే పుడతారేమో ! సినిమా రంగంలో విభిన్న పాత్రల్లో నటించిన విజయచందర్ నిలదొక్కుకోలేకపోయారు . ఆ టైంలో కరుణామయుడు సినిమాతో ఏసు క్రీస్తు అయి క్రైస్తవుల హృదయాలలోనే కాదు ; హిందువుల హృదయాల్లో కూడా నిలిచిపోయాడు .

ఆ పాత్ర నటిస్తే ఆ నటుడు చివరదాకా బతకడు అనే భయం ఉన్న రోజుల్లో ధైర్యం చేసి , అష్టకష్టాలు పడి సినిమాను విడుదల చేసి రాముడు కృష్ణుడు అంటే యన్టీఆర్ లాగా, ఏసు క్రీస్తు అంటే విజయచందర్ అనేలా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు .

Ads

మరలా అలా కలకాలం నిలిచిపోయే మరో పాత్ర షిర్డీసాయి పాత్ర రూపంలో ఆయనకు లభించింది . 1986 మార్చి 23 న విడుదలయిన ఈ శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం సూపర్ హిట్టయి కనక వర్షం కురిపించింది . 1986 కే షిర్డీసాయి తెలుగు నాట ఓ గొప్ప ఆరాధ్యుడు అయ్యాడు . బహుశా షిర్డీసాయి గుడి లేని గ్రామం , పట్టణం , నగరం రెండు తెలుగు రాష్ట్రాలలో లేదేమో !

హైందవం , సనాతన హైందవం చాలా చాలా లిబరల్ . ఇతర మతాల్లాగా రిజిడ్ గా ఉండదు . రాళ్ళను , రప్పల్ని , చెట్లను , పుట్లను , ప్రకృతిని , మనిషిని , జంతువుల్ని , ప్రతీ దానిని ప్రేమించే , పూజించే , ఆరాధించే వెసలుబాటు ఇచ్చింది . లేకపోతే ఇంత మంది బాబాలు , స్వాములు , అవధూతలు , పీఠాధిపతులు ఎక్కడ నుండి వచ్చారు , వస్తారు !

ఈ ధర్మ రహస్యాన్ని తెలుసుకోలేని పరిపూర్ణానంద స్వామి వంటి వారు భంగపడ్డారు . హిందూ దేవాలయాల ప్రాంగణాలలో ఆయన ఉపాలయాలు ఉండకూడదని హూంకరించి తోటి హిందూ ఆస్తికుల నుండి ప్రతిఘటన చవిచూసారు . ఈ సంకుచిత వివాదాలు ఎలా ఉన్నా షిర్డీలో ఉన్న సాయిబాబా దేవాలయం , దాని నిర్వహణ అమోఘం .

నేను సాయిబాబా భక్తుడిని , విశ్వాసిని కాదు . అలా అని విమర్శించేవాడిని అంత కన్నా కాదు . అయినా నా సతీమణి కోసం షిర్డీ వెళ్ళాను . ఆమె షిర్డీసాయి భక్తురాలు , నేను ఆమె భక్తుడిని . ఆ ఊరు , దేవాలయం చాలా బాగా నచ్చాయి . ఇంక సినిమాలోకి వద్దాం .

గోగినేని ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు కె వాసు . ప్రధాన పాత్రలో విజయచందర్ , సహ ప్రధాన పాత్రల్లో చంద్రమోహన్ , శరత్ బాబు , మురళీమోహన్ , అంజలీదేవి రమాప్రభ , కాంతారావు , త్యాగరాజు , రామకృష్ణ , రాజా , కాంచన , ప్రభృతులు నటించారు . షిర్డీసాయి చుట్టూ ఉండే పాత్రలు సాయి భక్తులకు అందరికీ సుపరిచితమే . విజయచందర్ తర్వాత నాకెప్పుడూ గుర్తుండేది చంద్రమోహన్ పాత్ర , ఆయన నటన .

ఈ సినిమా ఘన విజయానికి ఇళయరాజా సంగీతం , ఆత్రేయ పాటలు , వాటిని పాడిన బాలసుబ్రమణ్యం , జేసుదాస్ , రామకృష్ణ , సుశీలమ్మ , జానకమ్మలు కారణం . శ్లోకాలను దండకాలను విద్వాన్ కోట సత్య రంగయ్య శాస్త్రి వ్రాసారు . జై షిర్డీ నాధా సాయీ దేవ ప్రభో దండకం బాగుంటుంది .

టైటిల్ సాంగ్ దైవం మానవ రూపంలో అవతరించునీ లోకంలో చాలా శ్రావ్యంగా ఉంటుంది . ప్రారంభమే భక్తి లోకంలోకి తీసుకుని పోతుంది . అదో ట్రాన్స్ . హే పాండురంగ హే పండరినాధ శరణం శరణం శరణం , సాయి చరణం బాబా శరణం శరణం సాయీ శరణం గంగా యమున సంగమ సమానం సూపర్ హిట్ పాట . అన్ని బాబా ఆలయాల్లో మారుమోగిపోతూ ఉంటుంది . అలాగే స్వామి సాయినాధాయ దివ్య మంగళం షిరిడి క్షేత్ర వాసాయ దివ్య మంగళం గీతం చాలా చాలా శ్రావ్యంగా ఉంటుంది .

నువ్వు లేక అనాధలం బ్రతుకంత అయోమయం బాబా , బాబా సాయిబాబా నీవూ మావలె మనిషివని అంటూ సాగే పాటలు తెలుగు నాట ఇంటింటి పాటలు అయ్యాయి .

హిందీ , తమిళ భాషల్లోకి డబ్బింగ్ అయిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా , మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . షిర్డీసాయి మీద సినిమాలు , సీరియల్స్ కుప్పలుకుప్పలు . ఈమధ్యనే ఈటివిలో పూర్తయింది ఓ సీరియల్ . ఆ టైంకు మా ఇంట్లో అన్ని ఇతర చానల్స్ బంద్ అంటే బంద్ .

2012 లో నాగార్జున సినిమా కూడా వచ్చింది . అన్నమయ్యలాగా సక్సెస్ కాలేకపోవటానికి ముఖ్య కారణం ప్రేక్షకులు నాగార్జునని విజయచందర్ తో పోల్చటమే . నేను ముందే చెప్పినట్లు కొందరు కొన్ని పాత్రల కోసమే పుడతారేమో ! ఈ 1986 సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడనివారు తప్పక చూడండి . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు #తెలుగు_సినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…
  • ‘‘నేనెందుకు బాధపడాలి… బాధపడితే శోభన్‌బాబు పడాలి గానీ…’’
  • గుడిమల్లం..! ఉల్కశిల నుంచి చెక్కిన తొలి శివలింగ మూర్తి..?!
  • తాజా ఏబీసీ ఫిగర్స్… ఈనాడు- సాక్షి- ఆంధ్రజ్యోతి… ఏది ఎక్కడ..!!
  • ఒక మీడియా హౌజ్… ఆఫీస్ క్లోజ్… అందరూ కలం పోరాటయోధులే మరి..!!
  • Mirai..! భిన్నమైన ఓ కథకు రక్తికట్టించే ప్రజెంటేషన్… గుడ్ ఔట్‌పుట్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions