Bharadwaja Rangavajhala……… [ 90528 64400 ] …. అన్నపూర్ణతో శ్రీశ్రీ…. తెలుగు సినిమా చరిత్రలో అన్నపూర్ణ సంస్ధకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దుక్కిపాటి మధుసూదనరావు గారి మానసపుత్రికగా ప్రారంభమైన అన్నపూర్ణా వారి తొలి చిత్రం దొంగరాముడు. ఈ అన్నపూర్ణ అక్కినేని వారి అర్ధాంగి కాదు. దుక్కిపాటి సవతి తల్లట. సవతి తల్లంటే గయ్యాళి అని సినిమా వాళ్లు బోల్డు ఉదాహరణలు తీశారు గానీ … దుక్కిపాటి వారికి మాత్రం సవతి తల్లి మీద బోల్డు భక్తి. అందుకే తన సంస్ధకు అన్నపూర్ణ పిక్చర్స్ అని పేరు పెట్టారు.
అన్నపూర్ణా వారి రెండో సినిమా తోడికోడళ్లు. ఆ సినిమా దర్శకుడుగా ఆదుర్తికి కూడా రెండో సినిమానే. అన్నపూర్ణా కాంపౌండులో మాత్రం తొలి సినిమా. ఆ సినిమా నుంచే అన్నపూర్ణ సంస్ధకు శ్రీశ్రీతో స్నేహం కుదిరింది. ఈ స్నేహం కడవరకు కొనసాగింది. ఇంతకీ విషయం ఏమిటంటే … అన్నపూర్ణకు మహాకవి రాసిన పాటల విశేషాలు మీతో ముచ్చటించాలనుకున్నాను…. దాట్టిజ్ సంగతి…
దుక్కిపాటి వారికి సంగీత, సాహిత్యాభిరుచి ఉంది. సినిమాల్లో మంచి సంగీతం, సాహిత్యం ఉండాలి. వీటితో పాటు విలువలతో కూడిన కథ చెప్పగలగాలి. ప్రజలకు ఏదో ఒక సందేశం ఇవ్వగలగాలి. ఇవన్నీ కళకు పరమ ప్రయోజనాలుగా ఆయన భావించేవారు. అందుకే ఆయన తీసిన ప్రతి సినిమాలోనూ ఓ ప్రబోదాత్మక గీతం ఉండితీరుతుంది. అలాగే సాహిత్యానికి పెద్ద పీట వేసే పాటలూ ఉంటాయి.
Ads
తోడికోడళ్లు చిత్రంలో మహాకవి శ్రీశ్రీతో ఓ ప్రబోదాత్మక గీతం రాయించుకున్నారు దుక్కిపాటి. పొరుపులు మరచీ నలుగురు కలసి చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం అంటూ సాగుతుందీ గీతం. అన్నపూర్ణ కంపెనీ తొలి దర్శకుడు కె.వి.రెడ్డి తో ఎన్నడూ పనిచేయని సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు. వారి కాంబినేషన్ లో ప్రారంభమైన మాయాబజార్ గట్టెక్కలేదు.
ఆ తర్వాత ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. అలాగే శ్రీశ్రీతోనూ కె.వి. ఎప్పుడూ రాయించుకోలేదు. కె.వితో సెట్ కాని ఈ ఇద్దరూ అన్నపూర్ణ కంపెనీలో అనేక అద్భుతమైన పాటలు కూర్చారు. ఉదాహరణకి డాక్టర్ చక్రవర్తిలో శ్రీశ్రీ రాసిన మనసున మనసై పాటల్లాంటివి. అలా అన్నపూర్ణ సంస్ధ వల్ల అంతకు ముందుగానీ… ఆ తర్వాత గానీ శ్రీశ్రీతో పనిచేయని దర్శకులు కూడా ఆయనతో పాట రాయించుకోక తప్పేది కాదు. ఆ లిస్టులో కళాతపస్వి కె. విశ్వనాథ్ కూడా చేరుతారు.
విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవంలో వలపులు విరిసిన పూవులే… పాట మహాకవి రాసిందే. ఆ తర్వాతెప్పుడూ నాకు తెలిసి తన సినిమాల్లో శ్రీశ్రీతో రాయించుకోలేదు విశ్వనాథ్. శ్రీశ్రీ తన సినిమా పాటలను ఓ సంకలనంగా వెలువరించారు. అందులో అన్నపూర్ణ సంస్ధ గురించి చాలా గొప్పగా రాశారు. తను రాసిన సినిమా పాటల్లో అధికంగా అనువాద గీతాలే ఉంటాయన్న శ్రీశ్రీ తను రాసిన స్ట్రెయిట్ గీతాల్లో అత్యధికం అన్నపూర్ణా వారికే రాశానని కాస్తంత గర్వగానే చెప్తారు.
ఈ జాబితాలో మాంగల్యబలంలోని ఆకాశవీధిలో అందాల జాబిలీ లాంటి కమనీయ గీతాలనేకం కలవు. వెలుగునీడలు చిత్రంలో సందర్భోచితంగా వచ్చే ఓ ప్రబోదాత్మక గీతం రాశారు శ్రీశ్రీ. ఆ పాట విని ఒక వ్యక్తి ఆత్మహత్యా ప్రయత్నం మానేశాడంటారు. జీవితం మీద అనురక్తి కలిగించడమే కాదు… నిరాశను దగ్గరకు రానీకుండా… ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తిని స్ఫూర్తిని యువతకు అందించడం లక్ష్యంగా కనిపించే పాట అది. ఏదీ తనంతతానై నీ దరికి రాదు… శోధించి సాధించాలి అదియే దీరగుణం… కలకానిదీ విలువైనదీ.
అన్నపూర్ణ బ్యానర్ లోనే వచ్చిన జై జవాన్ చిత్రంలోనూ ఓ సందేశాత్మక గీతం రాశారు శ్రీశ్రీ. సినిమాలకు పద్యాలు, హరికథలు, బుర్రకథలు రాయడం తనకు చాలా ఇష్టమైన పని అని శ్రీశ్రీయే చెప్పుకున్నారు. ఆ వరసలో జై జవాన్ కోసం వీర భారతీయ పౌరులారా అంటూ ఓ బుర్రకథను రాశారు శ్రీశ్రీ.
అన్నపూర్ణా సంస్ధ కోసం శ్రీశ్రీ అద్భుతమైన డ్యూయట్లు రాశారు. ఆరోగ్యవంతమైన సాహిత్యాన్ని కోరుకునే దుక్కిపాటి వారి హృదయాన్ని అర్ధం చేసుకుని ఆహ్లాదకరమైన గీత రచన చేశారు శ్రీశ్రీ. అందుకే పారితోషికం విషయంలోనూ శ్రీశ్రీకి పెద్దపీట వేసేవారు దుక్కిపాటి. ఈ అనుబంధం శ్రీశ్రీ కన్నుమూసే వరకు కొనసాగడం విశేషం.
శ్రీశ్రీ మహాప్రస్తానాన్ని ఆయన చేతి రాతతో విదేశాంధ్ర ప్రచురణల పేరుతో అచ్చేశారు కృష్ణమూర్తి. అందులో మహాప్రస్తానం కవితలకు బాపుతో బొమ్మలు వేయించారు. అంతకు మించి శ్రీశ్రీతో బాపు కల్సి పనిచేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఆయన ఆరుద్రతో పనిచేయించుకోడాన్నే ఎక్కువ ఎంజాయ్ చేశారు. అయితే శ్రీశ్రీ సాహిత్యంతో బాపుకి విస్తృతమైన పరిచయం ఉంది. తన సినిమాలకు మాత్రం ఆరుద్రతోనే రాయించుకోడానికి ఇష్టపడేవారు.
అయితే అన్నపూర్ణ బ్యానర్ లో బాపు చేసిన పెళ్లీడు పిల్లలు సినిమా కోసం రెండు పాటలు శ్రీశ్రీతో రాయించుకున్నారు. అది కూడా దుక్కిపాటి వారి చిత్రం కావడాన్నే . అందులో ఒక పాట ముసి ముసి నవ్వుల రుసరుసలూ … చిరు చిరు అలకలే సరదాలూ … నడి వయసులో శృంగారం ఆ వెలుగు నీడలే సరసాలూ …ఇలా సాగుతుంది.
పెళ్లీడు పిల్లలకు సంబంధించి మరో విశేషం. ఆ సినిమాకు ఎమ్.ఎస్.విశ్వనాథన్ సంగీతం అందించడం. బాపుకి ఎమ్మెస్వీతో పనిచేయడం కూడా తొలిసారే. అలాగే ఆత్రేయతో పాటలు రాయించుకోడమూ తొలిసారే. అందులో శ్రీశ్రీ రాసిన మరో గీతం పరువపు వలపుల సంగీతం. బెరుకుమాని ముందడుగు వేయమని యువతరానికిది సందేశం అంటూ సాగే ప్రేమ సందేశపు గీతం అందంగా రాశారు.
ఆ పాటలోనే … లైలా మజ్నూ దేవదాసులా కాలం చెల్లిపోయింది … జూలీ బాబీ లౌ నిలిచే కాలం వచ్చిందీ అంటారు శ్రీశ్రీ. అదే సిన్మాలో ఆత్రేయలా అనిపించే పాటొకటి శ్రీశ్రీ రాశారు. అదేమన…. వయసే వెల్లువగా వలపే వెన్నెలగా… అనే పాట అన్నమాట… ఇవండీ అన్నపూర్ణాలో శ్రీశ్రీ గీతాల విశేషాలు. ఉంటాను మరి…
Share this Article