.
మొన్న చిన్న వివాదం… శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని ఓ సినిమా వచ్చింది కదా… దానికి ట్యాగ్‌లైన్ చంటబ్బాయ్ తాలూకా…
పుష్ప2 తరువాత మాదే ఇక వసూళ్ల జాతర అనీ వేదికల మీద సరదాగా ప్రకటించారు కదా నిర్మాతలు… పైగా టైటిల్ రోల్ వెన్నెల కిషోర్… సో, గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయ్ తరహాలో హాస్యంతోకూడిన అపరాధ పరిశోధన కథ అనుకున్నారు అందరూ…
Ads
నిజానికి ఒకప్పుడు బ్రహ్మానందం లేని తెలుగు సినిమా ఉండేది కాదు… అంత గాకపోయినా తరువాత ఆ రేంజ్ చేరుకున్నది వెన్నెల కిషోర్… ప్రతి సినిమాలోనూ ఉంటాడు… చిన్నదో పెద్దదో ఏదో ఓ రోల్… స్క్రిప్టు బాగుంటే బాగానే నవ్వించగలడు… మంచి టైమింగ్… ఆమధ్య చారి 111 అనే సినిమాలో హీరోగా కూడా చేశాడు… హీరో కాదు, టైటిల్ రోల్… ఫ్లాప్, రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అవీ ఫెయిల్…
ఈ షెర్లాక్ హోమ్స్ ప్రమోషన్లకు రాలేదు అనేది ఓ వివాదం… దీని మీద అమెరికాలో ఉన్న తను స్పందిస్తూ, అందులో తను హీరో కాదనేశాడు… నా ఒక్కడి ప్రమోషన్ వల్ల సినిమాకు వచ్చే ఫాయిదా కూడా ఏమీ లేదనేది తన భావన… కానీ టైటిల్ రోల్ పాత్రధారే ప్రమోషన్లలో లేకపోతే ఇక బజ్ ఎలా వస్తుంది..? ప్రమోషన్ బాపతు ఒప్పందం లేదనే వాదనలు కూడా అబ్సర్డ్…
కానీ నిజానికి తను హీరో కాదు… పేరుకు టైటిల్ రోల్ తనదే అయినా అసలు ఆ పాత్ర కేరక్టరైజేషనే పేలవం… నాసిరకం… తను శోధించి కనిపెట్టి సాధించేదేమీ లేదు సినిమాలో… ఇందులో హీరో, షీరో అని చెప్పాలంటే అనన్య నాగళ్ల… కాస్త డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర, ఉన్నంతలో బాగానే చేసింది… కానీ స్క్రిప్టు, బలమైన ప్రజెంటేషన్ లేకపోవడంతో ఆమె ప్రయాస కూడా వేస్టయిపోయింది… ఆమె పాత్రకు తగిన ఇంకేదైనా టైటిల్ ఎంచుకుని ఉండాల్సింది…
వరుసగా సినిమాలు వస్తున్నాయి గానీ, ఆమెను బలంగా తెర మీద ప్రొజెక్ట్ చేయగల పాత్రలు ఇంకా ఇండస్ట్రీ బాకీ పడింది… నిజానికి ఈ సినిమా కథను రాజీవ్ గాంధీ హత్యతో మొదలుపెట్టడమే వేస్ట్… దానికి కథలో ఇంపార్టెన్సే లేదు… పైగా వారం రోజుల్లో ఓ హత్య కేసును చేధిస్తానని ఒక జర్నలిస్టుతో ఛాలెంజ్ చేసిన ఓ పోలీసు చివరకు చేతకాక, వీలుకాక, టైమ్‌లేక ప్రైవేటు డిటెక్టివ్‌ను ఎంగేజ్ చేసుకోవడమే పనికిమాలిన స్టోరీ లైన్…
పేరుకు చంటబ్బాయ్ తాలూకా అని చెప్పుకున్నారు గానీ… వెన్నెల కిషోర్‌ను పెట్టుకున్నారు గానీ… కామెడీ ఉందా అని మనమూ ప్రైవేటు డిటెక్టివ్‌లా కళ్లను భూతద్దాలుగా చేసుకుని చూడాల్సిందే… పోనీ, థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయా అవీ లేవు… నడుమ పిట్టకథల్లా మెయిన్ కథకు ఉపకథలు… సదరు డిటెక్టివ్ కథతో సహా… ప్చ్, ఏవీ పనికిరాలేదు… అందుకే చివరకు చిరాకేసి ఎహె, నేను హీరోనే కాదు అని డిస్‌ఓన్ చేసుకున్నాడేమో సదరు వెన్నెల కిషోరుడు..!!
Share this Article