కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయింది… పట్టాభిషేకం కూడా జరిగిపోయింది… తరువాత ధర్మరాజుకు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగింది… తనకు తోడు రావల్సిందిగా శ్రీకృష్ణుడిని ఆహ్వనిస్తాడు…
‘నువ్వు వెళ్లు యుధిష్టిరా… నాకు ద్వారకలో చక్కబెట్టుకునే రాచకార్యాలు బోలెడున్నాయి… నావల్లే యుద్ధం, లక్షల ప్రాణహననం జరిగిందని అన్న కోపంగా ఉన్నాడు… పైగా అసలే అష్ట భార్యల సంసారం… చాన్నాళ్లయింది కదా, ఇల్లూ చక్కదిద్దుకోవాలి… కనుక నేను రాలేను’ అంటాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో… లేదు, రావాలి బావా, తప్పదు అంటూ మొహమాటపెడతాడు ధర్మరాజు…
‘సరే, నేను రాలేను గానీ, నా ప్రతినిధిగా ఇదుగో దీన్ని నీతోపాటు తీసుకువెళ్లు’ అని ఓ సొరకాయను ఇస్తాడు… కృష్ణుడి ప్రతి మాట, ప్రతి చేష్ట వెనుక ఏదో మర్మం ఉంటుందని ధర్మరాజుకు తెలుసు కదా… ‘ఊరక చెప్పడు మహాత్ముడు’ అనుకుని ధర్మరాజు దాన్ని తీసుకుని, తన పరివారంతో తీర్థయాత్రలకు వెళ్తాడు… తను ఏ నదిలో, ఏ సముద్రంలో మునిగినా సరే, తన వెంట ఉన్న ఆ శ్రీకృష్ణ ప్రతినిధి సొరకాయను శ్రీకృష్ణుడిగానే భావిస్తూ దాన్ని కూడా ముంచి తీసి, తుడిచేవాడు… భద్రపరిచేవాడు…
Ads
తిరిగి వచ్చాక, ఆహార సమారాధన నిర్వహించడానికి నిర్ణయించాడు ధర్మరాజు.., కనీసం దీనికైనా హాజరు కావాలని ద్వారకకు ప్రత్యేక దూతలతో కబురు పంపిస్తాడు… తీర్థయాత్రలకు ఎలాగూ రాలేదు, దీనికైనా రాకపోతే ఎలా అని అలుగుతాడు, అడుగుతాడు… ఐనా కృష్ణుడు రాడు, ఆ సొరకాయను వండి, అందరికీ ప్రసాదంగా పెట్టాలని కోరతాడు… ధర్మరాజుకు ఇక తప్పలేదు… తనతోపాటు తీర్థయాత్రలు చేసిన ఆ సొరకాయను కళ్లకు అద్దుకుని వంటవాళ్లకు అప్పగిస్తాడు…
కటిక చేదు… తిన్న వాళ్లంతా వాంతులు చేసుకున్నారు… అంతా గందరగోళం… ఈ దశలో అక్కడికి ప్రవేశిస్తాడు కృష్ణుడు… ‘ఇదేం కృష్ణా, నీవిచ్చిన సొరకాయనే కదా, నేను ప్రసాదంగా పంపిణీ చేశాను, ఇలా చేశావేమిటి, ఇదిలా అయ్యిందేమిటి..?’ అనడుగుతాడు ధర్మరాజు…
‘అది కటిక చేదు సొరకాయ, అది నాకు ముందే తెలుసు… అరెరె, అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి, అన్ని తీర్థాల్లో మునిగినా దాని చేదు పోలేదా..? నిజం బాబా, దాని చేదు పోతుందని నమ్మాను, కానీ విచిత్రంగా ఉంది సుమా’ అని తనదైన ఓ నవ్వు విసురుతాడు కృష్ణుడు… ధర్మరాజుకి ఆ నవ్వులో మర్మం అర్దమైంది… శ్రీకృష్ణపరమాత్మకి తల వంచి తనూ నవ్వుతూ నమస్కరిస్తాడు…
(రచయిత ఎవరో తెలియదు… ఇది వాట్సప్ సేకరణ… నేను అర్థంతరంగానే ఈ కథను ముగించాను… ఈ కథలో నీతి ఏమిటో ఎవరికి వారే బాష్యం చెప్పుకొండి… ఇంతకీ ధర్మరాజుకు అర్థమైన ఆ మర్మం ఏమిటో..?)
Share this Article