……….. By…. పార్ధసారధి పోట్లూరి……….. మన పొరుగు దేశం శ్రీలంక తీవ్ర సంక్షోభం లో చిక్కుకుంది ! కరొన వల్ల దెబ్బతిన్న దేశాల సరసన శ్రీ లంక కూడా చేరబోతున్నది. దిగుమతుల మీద ఆంక్షలు విధించింది శ్రీలంక ప్రభుత్వం. అత్యవసరం అయితే తప్పితే ఎలాంటి దిగుమతులకి అనుమతి ఇవ్వబోమని ఒక ప్రకటనలో దేశ పౌరులని, పారిశ్రామికవేత్తలని ఉద్దేశించి తెలిపింది. గత సంవత్సరం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లో ఉండగా శ్రీ లంక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే వరి, తేయాకు, ఉల్లిపాయలతో పాటు ఇతర పంటలని ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం ఆర్గానిక్ వ్యవసాయమే చేయాలని ఆదేశించింది. దాంతో గతిలేక అందరూ ఆర్గానిక్ వ్యవసాయమే చేశారు. గత సంవత్సరం మొదటి ఆర్గానిక్ పంట బయటికి వచ్చింది కానీ దిగుబడి సగానికి సగం పడిపోయింది. అయితే ప్రభుత్వమే ఆర్గానిక్ కాంపొస్ట్ ని సరఫరా చేస్తామని వాగ్దానం చేసింది కానీ రెండో పంటకి కూడా సరిగా సరఫరా చేయలేక పోయింది. దాంతో రెండో పంట కూడా సగానికి సగమే దిగుబడి వచ్చింది. ఫలితంగా ఆహార సంక్షోభం ఏర్పడింది. ఉల్లిపాయల కొరత ఏర్పడింది దానికి తోడు వరి దిగుబడి సగం పడిపోవడంతో బియ్యం రేట్లు ఆకాశాన్ని అంటాయి. ఇక ఇతర తృణ ధాన్యాల దిగుబడి కూడా పడిపోవడంతో వాటి దిగుబడి తగ్గి కొరత ఏర్పడి వాటి ధరలు కూడా పెరిగాయి.
ఒక ప్లానింగ్ లేకుండా దేశం మొత్తం ఆర్గానిక్ వ్యవసాయం చేయమని ఎందుకు ఒత్తిడి తెచ్చినట్లు ? గత సంవత్సరం మొదటినుండి శ్రీలంక దగ్గర విదేశీ మారక ద్రవ్యం కొరత [Forex] తీవ్రంగా ఉండడంతో హడావిడిగా నిపుణులని సంప్రదించించింది ప్రభుత్వం. వాళ్ళ సూచన ఏమిటంటే దిగుమతులు తగ్గిస్తే విదేశీ మారక ద్రవ్యo ఆదా చేయవచ్చు అని. వాళ్ళ చూపు ముందు ఎరువులు, పురుగు మందుల మీద పడింది. శ్రీలంక ఎరువులు, పురుగుమందులు దాదాపుగా మొత్తం దిగుమతి చేసుకుంటుంది. దాంతో ముందు ఎరువులని, పురుగు మందులని దిగుమతి మీద నిషేధం విధించాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. సంవత్సరం తిరిగే సరికి రెండు పంటల దిగుబడులు సగానికి పడిపోయాయి. ఈ సంవత్సర కాలంలో ఆర్గానిక్ కాంపొస్ట్ ని తగినంత ఉత్పత్తి చేసి సరఫరా చేయలేకపోయింది శ్రీలంక ప్రభుత్వం. దాంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఒక్క వ్యవసాయo మీదనే కాదు చివరకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదయిన తేయాకుని ఉత్పత్తి చేసే శ్రీలంక దానిని ఎగుమతి చేస్తుంది కానీ దిగుబడి సగానికి పడిపోవడంతో దేశ అవసరాలకి సరిపోయేంత మాత్రమే వచ్చింది. దాంతో ఎగుమతులు లేక ఆదాయం పడిపోయింది. తేయాకుతో పాటు నాణ్యమయిన దాల్చిన చెక్క, మిరియాలు లాంటివి కూడా దిగుబడులు పడిపోయాయి. ఎగుమతులు చేసేంత పంట చేతికి రాలేదు. చివరికి ఆటోమొబైల్ విడిభాగాలని కూడా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. భారత దేశం నుండి లేలాండ్ బస్సులు, ట్రక్కులు దిగుమతి చేసుకుంటుంది శ్రీలంక. ఇక ఆటోలు అయితే మొత్తం భారత్ నుండే దిగుమతి అవుతాయి. ద్విచక్ర వాహానాలకి వస్తే TVS, HERO అత్యధికంగా అమ్ముడుపోతాయి అక్కడ. అలాంటిది వీటి మీద కూడా నిషేధం విధించింది.
Ads
ఏ దేశానికి అయినా అతిపెద్ద ఖర్చు ఉంటుంది అంటే అది క్రూడ్ ఆయిల్. 2019 లో శ్రీలంక ఫారిన్ రిజర్వ్ $7.5 బిలియన్. అయితే అది ప్రస్తుతం శ్రీలంక దగ్గర 2.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మాత్రమే ఉంది. ఇది మరో సంవత్సరం వరకు పొదుపుగా వాడుకుంటే బండి లాగించవచ్చు కానీ అలా కుదిరెట్లుగా లేదు. దాంతో అత్యవసరం అయితే కానీ వాహనాలు బయటికి తీయొద్దు అంటూ తమ దేశ పౌరులకి విజ్ఞప్తి చేస్తున్నది శ్రీ లంక ప్రభుత్వం. మరో పక్క సైన్యం పౌర వాహనాల మీద రేషన్ విధించి శని, ఆదివారాలు రవాణా వాహానాలకి మాత్రమే అనుమతి ఇవ్వమని కోరుతున్నది. 2012 నుండి ఇప్పటి వరకు శ్రీలంక అభివృద్ధి రేటు అనేది ఫ్లాట్ గా ఒకే లైన్ మీద ఉంటూ వస్తున్నది అంటే పెరుగుదల కానీ తరుగుదల కానీ లేకుండా అని అర్ధం. మరో పక్క గత సంవత్సరంన్నర కాలం నుండి టూరిజం ఆదాయం పడిపోయింది శ్రీలంకకి. శ్రీలంకకి వచ్చే విదేశీ మారక ద్రవ్యంలో సింహాభాగం టూరిజం నుండే వస్తుంది. కోవిడ్ వల్ల టూరిజం ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇది కూడా మరో కారణం. మరో పక్క కూరగాయలు పండించే రైతులు రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. తమకి ఎరువులు, పురుగుమందులు సరఫరా చేస్తేనే కానీ లాభాలు రావు అని. ఇప్పటికే శ్రీలంకలో కూరగాయల ఉత్పత్తి కూడా సగానికి పడిపోయి వాటి రేట్లు కూడా కొండెక్కాయి కానీ రైతులకి లాభాలు లేవు. మరో పక్క ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ రాయుళ్ళు విజృంభించారు. బియ్యం, పప్పు దినుసులు, నూనెలు లాంటి నిత్యావసరాలని బ్లాక్ చేసి రేట్లు మరింత పెరగడానికి కారకులు అయ్యారు. దాంతో సైన్యం ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకె అమ్మాలని, అంతకి మించి అమ్మడానికి వీలులేకుండా ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వాన్ని కోరింది. గత ఆగస్ట్ నెల 30 న ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ చేయకుండా అన్నీ నిత్యావసరాల మీద ధరల పట్టికని రూపొందించి ఆ ధరకే అమ్మాలని ఆదేశించింది. మరో వైపు ఆహారం, నూనెలు,మందుల కొరత ఉంది కానీ దిగుమతి దారులు మాత్రం మేము బాంక్ కి వెళితే ఫారెక్స్ ఇవ్వలేము అని చెప్పేస్తున్నారు అని వాపోతున్నారు. చివరకి భారత దేశం నుండి పసుపు దిగుమతి మీద కూడా నిషేధం విధించింది. మనలాగే శ్రీలంక ప్రజలు కూడా పసుపుని వంటలలో వాడతారు.
ఇప్పుడు శ్రీలంక ముందు మూడు అవకాశాలు ఉన్నాయి. మొదటిది ప్రపంచ బాంక్ దగ్గరికి అప్పు కోసం వెళ్ళడం. కానీ ప్రపంచ బాంకు షరతులు విధిస్తుంది. అన్నీ రేట్లు పెంచమని లేదా పన్నులు ఎక్కువ చేయమని అడుగుతుంది. కానీ అలా చేస్తే రాజకీయంగా రాజపక్షే కి అది ఓటమిని తెచ్చిపెడుతుంది కాబట్టి ప్రపంచ బాంక్ కి వెళ్లలేడు. ఇక ఆసియా అభివృద్ధి బాంక్ [ADB] దగ్గర దేశాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలి లేదా చైనా దగ్గర నుండి ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకొని ఆపై అవి తీర్చలేక దేశాన్ని చైనాకి అమ్మాలి. ఇప్పటికే భారత దేశం నుండి 239 మిలియన్ డాలర్లని అప్పుగా తీసుకుంది శ్రీలంక మరో వైపు 6 నెలల క్రితం బాంగ్లాదేశ్ నుండి 100 మిలియన్ డాలర్లని అప్పుగా తీసుకుంది. ఇప్పుడు మళ్ళీ అప్పు కోసం ఎదురుచూస్తున్నది. శ్రీలంక పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ లో కొంతభాగమ్ ముందు మనకి, తరువాత జపాన్ కి ఇచ్చింది. చైనా వత్తిడి వల్ల రెండు ప్రాజెక్టుల నుండి భారత్, జపాన్ లని తీసివేసి మొత్తం చైనాకి అప్పచెప్పింది శ్రీలంక. రాజపక్షే భారత్ వచ్చి తిరుమల శ్రీ వారి దర్శనం చేసుకొని, అటు నుండి ఢిల్లీ వెళ్ళి, పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ భారత్, జపాన్ లకే ఇస్తానని మాట ఇచ్చి, కొలంబో వెళ్ళిన నెల రోజులకే రెండు ప్రాజెక్టులు కాన్సిల్ చేసి చైనాకి అప్పచెప్పాడు రాజపక్షే. ఇప్పుడేమో సిగ్గులేకుండా భారత్ ఇచ్చిన $239 మిలియన్ డాలర్ల అప్పుని రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్తగా అప్పు ఇవ్వమని కోరుతున్నాడు. అదే కనుక జపాన్ కి ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటే $5 బిలియన్ డాలర్లు తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చిఉండేది. ఏతావాతా అవినీతి రాజకీయ నాయకులు దేశాన్ని ఏలితే ఏమవుతుందో శ్రీలంక ఒక ఉదాహరణ. ప్రస్తుతం శ్రీలంక ఆర్ధిక ఎమర్జెన్సీ విధించింది. డాలర్ తో శ్రీలంక రూపాయి 20% పడిపోయింది. మరో పక్క కోవిడ్ మరణాలు అంతకంతకూ పెరిగిపోవడం వలన ఈ నెల మొత్తం లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. మందులు దిగుమతి చేసుకోవాలంటే డాలర్లు లేవు. ముందు ఆ చైనాని దేశం నుండి బయటికి పంపిస్తే సగం దరిద్రం వదిలిపోతుంది రాజపక్షే !
Share this Article