నిజానికి ఈ వార్తలన్నీ పాతవే… కొన్ని జాతీయ మీడియా న్యూస్ సైట్లు మళ్లీ ఎందుకు ఈమధ్య తెర మీదకు తీసుకొస్తున్నాయో తెలియదు… శ్రీదేవి చెల్లెలి గురించి..! నేను డీఎన్‌ఏ సైటులో చదివినట్టు గుర్తు…
బోనీకపూర్ తాటతీస్తాడేమో తెలియదు గానీ… ఒకవేళ తను అత్యంత అధికంగా పిచ్చిగా ప్రేమించిన శ్రీదేవి బయోపిక్ గనుక రాంగోపాలవర్మ తీస్తే… అందులో శ్రీదేవికి దీటైన పాత్ర, ప్రాధాన్యం బహుశా ఆమె చెల్లెలి పాత్రకు కూడా ఇవ్వాల్సి ఉంటుందేమో…
నిజానికి చాలామందికి శ్రీదేవి చెల్లెలి గురించి తెలియదు… నాలుగేళ్ల వయస్సు నుంచే వెండి తెరపై కనిపిస్తూ, ఫస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్ దాకా, హయ్యెస్ట్ పెయిడ్ నటిగా ఎదిగింది శ్రీదేవి… కానీ ఆమె చెల్లెలు అనామకంగానే మిగిలిపోయింది… ఆమెకూ సినిమాలపై ఆసక్తి ఉంది, కానీ మొదట్లోనే క్లిక్ కాలేదు…
Ads
ఆ చెల్లెలి పేరు శ్రీలత… తనకు ఈ సినిమా ఫీల్డ్ తెరపై కనిపించడానికి, సొంతంగా ఎదగటానికి పనికిరాదని అర్థమైందో ఆమె ఇక శ్రీదేవి నీడలాగా మారిపోయింది… ఆమెతోపాటు షూటింగ్ స్పాట్లకు, స్టూడియో సెట్లకు వెళ్లేది, మేనేజర్‌గా వ్యవహరించేది… నమ్మకస్తురాలు…
కానీ శ్రీదేవి ఏం చేసింది..? ఒక దశలో శ్రీదేవి తల్లికి ఏదో కార్పొరేట్ హాస్పిటల్‌లో వైద్యం చేయిస్తే, డాక్టర్ తప్పు వల్ల ఆమె మెమొరీ కోల్పోయింది… తరువాత 1996లో ప్రాణాలే పోయాయి… శ్రీదేవి ఆ హాస్పిటల్ మీద కేసు పెట్టింది… 7.2 కోట్ల పరిహారం గుంజింది… అప్పట్లో ఆ సొమ్ము చాలా ఎక్కువ…
కానీ శ్రీలతకు ఒక్క పైసా ఇవ్వలేదు అందులో… అక్క దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నా సరే, తనకు అంతిమంగా మిగిలేది ఏమీ లేదనే నిజం అర్థమైంది… సినిమా ఫీల్డ్‌ను దగ్గర నుంచి చూస్తున్నది కాబట్టి ఇక్కడ ఆర్థిక కోణాలు తప్ప హార్దిక కోణాలు ఏమీ ఉండవని ఆమెకూ తెలుసు… దాంతో అక్క మీదే కేసు పెట్టింది…
కోర్టు శ్రీలత వాదనలతో ఏకీభవించింది… శ్రీదేవికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది… దాంతో శ్రీదేవి అనివార్యంగా 2 కోట్ల రూపాయల్ని శ్రీలతకు ఇవ్వాల్సి వచ్చింది… ఆ మొత్తం శ్రీదేవికి ఆఫ్టరాల్, కానీ శ్రీలతకు అదే పెద్ద మొత్తం… తరువాత ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకోలేదు… కానీ శ్రీదేవికి పద్మశ్రీ వచ్చిన టైమ్‌లో, అంటే 2013 ప్రాంతంలో బోనీకపూర్ ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ల నడుమ సయోధ్య కుదిర్చాడు…
ఎప్పట్లాగే ఇద్దరూ కలిసిపోయారు… అప్పట్లో వార్తలు ఏమిటంటే..? శ్రీదేవి దుబాయ్‌లో 2018లో బాత్‌టబ్‌లో పడి మరణించిన టైమ్‌లో చెల్లెలు శ్రీలత కూడా దుబాయ్‌లోనే ఉందట… శ్రీదేవి మరణం తాలూకు మిస్టరీ ఈరోజుకూ అలాగే ఉండిపోయింది, చాలామందికి బోనీకపూర్ మీదే డౌట్లు… ఆమె మరణం తరువాత శ్రీలత పెదవి విప్పలేదు…
మీడియా ఎంత ట్రై చేసినా ఆమె దొరకలేదు… చెన్నైలో జరిగిన శ్రీదేవి సంతాప స్మారక సమావేశానికి కూడా హాజరు కాలేదు… శ్రీలత ఎక్కడా కనిపించకూడదనీ, వినిపించకూడదనీ బోనీకపూర్ ఆంక్షలు పెట్టడంతోపాటు చెన్నైలోని శ్రీదేవి బంగ్లాను శ్రీలత దంపతులకు ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి… శ్రీలత మౌనంపై వచ్చిన వార్తలకు ఆమె భర్త సంజయ్ రామస్వామి ఏదో వివరణ ఇస్తూ ఇందులో సందేహాస్పద విశేషం ఏమీ లేదనీ, తమ కుటుంబం మొత్తం బోనీకపూర్‌తోనే ఉందనీ చెప్పాడు…
ఈమధ్య మరో వార్త వచ్చింది… చెన్నైలోని శ్రీదేవి మాన్షన్‌ను రోజువారీ అద్దెకు ఇవ్వనున్నట్టు ఎయిర్ బీఎన్‌బీ సంస్థ ప్రకటించింది… బోనీకపూర్‌ను పెళ్లి చేసుకున్నాక శ్రీదేవి కొన్న మొదటి లగ్జరీ ఇల్లు ఇదేనట… ఇందులో శ్రీదేవి జ్ఞాపకాలున్నయ్… ఆమె పెయింటింగ్స్ గట్రా… అది చదివాక చకచకా శ్రీలతతో శ్రీదేవి తగాదాలు, అక్క మరణంపై ఈరోజుకూ పెదవివిప్పని వైనం గుర్తొచ్చాయి… అవునూ, శ్రీలతకు బోనీకపూర్ త్యాగం చేసిన ఇల్లు మరొకటా..? ఇదేనా..?!
Share this Article