.
ఎన్టీఆర్ 57 వ పుట్టినరోజున 1979 మే 28 వ తారీఖున ఈ శ్రీ మద్విరాటపర్వము సినిమా విడుదలయింది . అప్పటివరకు మూడు పాత్రల్ని వేసిన NTR ఈ సినిమాలో నాలుగు పాత్రలను పోషించారు . శ్రీకృష్ణుడు , దుర్యోధనుడు , కీచకుడు , అర్జునుడు . బృహన్నలది కూడా అదనపు పాత్రగా పరిగణిస్తే అయిదు పాత్రలు . అప్పటికి అదో సంచలనం . ఆ రికార్డుని పది పాత్రలు వేసి కమల్ హాసన్ బ్రేక్ చేసారు .
తనకే కాదు ; కైకాల సత్యనారాయణకు కూడా ద్విపాత్రాభినయం చేసే అవకాశాన్ని కల్పించారు . భీముడు , ఘటోత్కచుడు . తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్ నటించినన్ని ద్విపాత్రాభినయం సినిమాలు మరెవరూ నటించలేదు . సుమారు 30 సినిమాల దాకా ఉన్నాయి .
Ads
స్క్రీన్ ప్లే , దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ , సినిమాను నిర్మిస్తూ , అయిదు పొత్రలను ధరించటం పని రాక్షసుడు అయిన ఆయనకే చెల్లు .
ఇంత ప్రయాసతో తీసిన ఈ సినిమా , అందులో ఎన్టీఆర్ పౌరాణికం ప్రేక్షకులకు నచ్చలేదు . బహుశా సినిమా అంతా సర్వాంతర్యామిగా ఆయనే కనిపించటం కారణం కావచ్చు . శ్రీకృష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ వంటి సూపర్ హిట్ సినిమాలతో పోల్చిచూడటం కూడా కారణం కావచ్చు .
ఆయన ఆస్థాన రచయిత కొండవీటి వెంకట కవి సంభాషణలను వ్రాసారు . ఆయన డైలాగులు అప్పటికే తెలుగు ప్రజలకు సుపరిచితం . సుసర్ల దక్షిణామూర్తి సంగీతం అద్భుతం . బాల మురళీకృష్ణ గాత్రం ఎప్పటిలాగానే చెవుల తుప్పు వదిలిస్తుంది .
ఇప్పటికీ ఈ సినిమాలో ఎన్టీఆర్ని ప్రశంసించకుండా ఉండలేనిది మరొకటి ఉంది . 56 ఏళ్ళ వయసులో బృహన్నలగా ఆయన నృత్యించిన తీరు . వయసులో ఉన్నప్పుడు నర్తనశాల సినిమాలో బృహన్నలగా ఆయన ఎలా నృత్యించారో అదే బిగువుతో ఈ వయసులో కూడా నృత్యించారు .
వేటూరి వ్రాసిన జీవితమే కృష్ణ సంగీతము పాట బాలమురళీ కృష్ణ గాత్రంతో చరితార్ధం అయింది . ఈ పాట వీడియో యూట్యూబులో ఉంది . సంగీత ప్రియులు తప్పక వినాలి .
మరో శ్రావ్యమైన , కనులకు విందైన పాట , నృత్యం ఉత్తర పాత్రధారి భవాని మీద చిత్రీకరించబడింది . నీరాజనం జయ నీరాజనం పాట . ఈ పాటను సి నారాయణరెడ్డి వ్రాయగా యస్ జానకి పాడారు . చాలా బాగుంటుంది . యూట్యూబులో ఉంది . ఆస్వాదించండి .
మరో పాట వేటూరి వ్రాసిందే . వాణీ జయరాం పాడగా ఊర్వశి పాత్రధారి ప్రభ మీద చిత్రీకరించబడింది . రమ్మని పిలిచిందిరా ఊర్వశి పాట . వీడియో లేదు . ఆడియో మాత్రమే ఉంది . మిగిలిన పాటలు కూడా శ్రావ్యంగానే ఉంటాయి .
దురదృష్టవశాత్తు ఈ సినిమా యూట్యూబులో లేదు . అలాగే పాటల వీడియోలు కూడా లేవు . NTR అభిమానులు ఇలాంటి సినిమాను తర్వాత తరం వారికి అందించకపోతే ఎలా ! ఎలాగోలా యూట్యూబులోకి ఎక్కించండి . ప్రయత్నించండి .
ఈ సినిమాతో నాకో మెమరీ ఉంది . నాకు సినిమాలంటే ఇష్టం . అందులో NTR సినిమాలంటే ఇంకా ఇష్టం . రిలీజ్ రోజు నాజ్ టాకీసుకు వెళ్లేసరికి బాల్కనీ , కుర్చీ టికెట్లు అయిపోయాయి . నేల , బెంచ్ కుర్చీలు మాత్రమే ఉన్నాయి . బెంచ్ టిక్కెట్ తీసుకుని జనంలో కూర్చుని , జనంతో చూసేసా . పాపం ! నా కొలీగ్ నాతో పాటు అంత రష్ లో బెంచిలో గోలగోలలో సినిమా చూసాడు . నాకు అలా చూడటం కొత్తేం కాదు .
నర్తనశాల సినిమాలాగా సూపర్ డూపర్ హిట్ కాలేకపోయింది . ఎన్టీఆర్ , వాణిశ్రీ , బాలకృష్ణ , సత్యనారాయణ , ప్రభ , విజయలలిత , ప్రభాకరరెడ్డి , ముక్కామల , మిక్కిలినేని , ధూళిపాళ , రాజనాల , మాడా , ఛాయాదేవి , పుష్పలత , తదితరులు నటించారు .
సినిమా సక్సెస్ కాకపోయినా చూడదగ్గ సినిమాయే . యూట్యూబులో లేదు కాబట్టి ఎప్పుడైనా టివిలో వస్తే చూడండి . సుసర్ల వారి సంగీత నేపధ్యంలో పాటలు అద్భుతం . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు….. ( — దోగిపర్తి సుబ్రహ్మణ్యం )
Share this Article