ఆ దేవదేవుడికి వేయి నామాలు. అందుకే విష్ణువును… విశ్వం, విష్ణు, వశాట్కర, భూతకృద్, ప్రభు, ప్రభవా, శ్రీమాన్, కేశవ, ఆదిత్య, పుష్కరాక్ష, హృషీకేశ, పద్మనాభ, కృష్ణ, అమరప్రభు, వెంకటేశ్వర, వెంకటరమణ, శ్రీనివాస… మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్ని, విన్నవి కొన్ని, విననివి మరికొన్ని నామాలతో ఎవరికి తోచినట్టుగా వారు కొలుస్తూనే ఉంటారు. సహస్రాధిక నామధేయుడు మరి…
అయితే, ఈ పేర్లలో ప్రధానంగా మనకు కృష్ణ, విష్ణు, వెంకటరమణ, గోవింద, వెంకటేశ్ వంటివాటితో పాటు… ఎక్కువలో ఎక్కువగా వినిపించే హిందూ పేర్లలో చెప్పుకోవాల్సింది శ్రీనివాస్. అయితే, అలాంటి ఓ శ్రీనివాస్ కు ఒక ఐడియా వచ్చింది. తనలాంటి తనకు తెలిసిన ఎందరో శ్రీనివాసులున్నారు కదా… వారంతా కలిస్తే ఎంత మందవుతారనే ఒక డౌట్ నుంచి… సదరు శ్రీనివాస్ కు ఓ సరదా ఐడియా పుట్టుకొచ్చింది.
అలా ఐడియా పుట్టుకొచ్చిందే తడవు… తన మిత్రులైన తోటి శ్రీనివాసులందరికీ నిన్న సాయంత్రం వాట్సప్ లో ఓ డివోషనల్ రియాల్టీ గేమ్ ప్లాన్ చేసి వాళ్లందరి ముందుంచాడు. వాట్సప్ సందేశంతోనే సరిపెట్టకుండా.. అందరికీ ఫోన్ కాల్స్ చేసి మరీ తన ప్రణాళికేంటో చెప్పాడు.
Ads
కట్ చేస్తే శనివారం ఫైన్ మార్నింగ్.. అంతా ఒక్క చోట గుమిగూడారు. ఏ శుభకార్యంలో కూడా కలవని శ్రీనివాసులంతా ఒక్క దగ్గర చేరారు… అందుకు కరీంనగర్ విద్యానగర్ లోని వెంకటేశ్వరాలయం వేదికైంది. అలా మొత్తం 150 మంది శ్రీనివాస్ పేర్లున్న శ్రీనివాసులంతా ఆ వెంకన్న సన్నిధిలో ఒక్కటయ్యారు. ఒకరికొకరు యోగక్షేమాలడిగి ఉభయకుశలోపరి పలకరింపులయ్యాక.. విద్యానగర్ వెంకటేశ్వరాలయంలోని ఆ శ్రీనివాసుడికి ఈ నూటా యాభై మంది శ్రీనివాసులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీనివాసులంతా ఒక్కటై మూకుమ్మడిగా 150 మంది వచ్చేసరికి… విద్యానగర్ శ్రీనివాసుడి గుళ్లో పూజారి సైతం ముచ్చటపడి మరించ ముచ్చటగా అర్చనలు చేశాడు. ఆ తర్వాత తీర్థ, ప్రసాదాలు పుచ్చుకున్న శ్రీనివాసులంతా కలిసి ఆపద మొక్కులవాడా వేంకటరమణ గోవిందా గోవిందా.. వడ్డీకాసుల వాడా ఆనాథరక్షకా గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు.
అయితే, దైవజ్ఞ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ శ్రీనివాసులంతా మూకుమ్మడి కావడానికి ప్రధాన కారకుడు. ఆయన సూచన మేరకు శ్రీనివాసులంతా కలిసి కరీంనగర్ లోనే మూడు వాట్సప్ గ్రూపులుగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి సుమారు 2 వేల 300 మంది ఈ మూడు గ్రూపుల్లో ఉన్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఎంత మంది ఉంటారో ఓసారి లెక్కేసి… వారందరినీ ఏకం చేసి… ఆంధ్ర మహాసభలు, హిందీ మహాసభల తరహాలో శ్రీనివాసుల మహాసభలేర్పాటు చేయాలన్నది వీరి లక్ష్యం.
అందుకోసం వీరొక ఎజెండాను కూడా ఏర్పాటు చేసుకున్నారు. శ్రీనివాసులంతా కలిసి ఓ ట్రస్టుగా ఏర్పడి.. అనాథలకు సేవ చేయడంతో పాటు.. రక్తదానం వంటి సమాజహిత స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలని తీర్మానించుకున్నారు. అంతేకాదు, వీరంతా కలిసి ప్రతీ ఏటా తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వెళ్లే రైలు కూడా తమ కోసమే ప్రత్యేకంగా శ్రీనివాసుల రైలును ఏర్పాటు చేసుకోవాలనీ నిర్ణయించుకున్నారు.
మొత్తంగా ఆ దేవదేవుడికి వెయ్యి నామాలున్నా… శ్రీనివాస్ అనే పేరుకు దక్కిన ప్రాధాన్యత.. మిగిలిన 9 వందల 99 పేర్లకెందుకు దక్కలేదో ఇక ఆ శ్రీనివాసుడికే తెలియాల్సి ఉండగా… మొత్తంగా శ్రీనివాసులంతా కలిసి ప్లాన్ చేసిన ఈ డివోషనల్ రియాల్టీ షో మాత్రం భలే ఆకట్టుకుంది…. (రమణ కొంటికర్ల)
Share this Article