మన నేతలు ఇక్కడ జాతిప్రజలు అత్యంత గర్వపడేలా… అద్భుత పరిణత వ్యక్తిత్వాలతో గాండూ, సాలే, గూట్లే, సన్నాసీ, ఎదవ, చవట అని రకరకాలుగా తిట్టుకుంటూ ఉంటారు… ఈమధ్య ఏపీ నేతల ‘జోష్’ తగ్గిపోయింది ఎందుకో… మళ్లీ కొడాలి పూనుకోవాల్సిందే… ఇక మాకేం తక్కువ అంటూ తెలంగాణ నేతలు అందుకున్నారు ఆ ఘన సాంస్కృతిక పోకడను..! ఏపీ నేతలే విస్తుపోయే రేంజులో రెచ్చిపోతున్నారు… మన రాష్ట్రాల్లో విపక్ష నేతలపై కేసులు పెట్టేస్తుంటారు… ప్రతిపక్షానికి పేరొచ్చే పాత ప్రజా పథకాలను పడుకోబెడుతుంటారు… పెద్ద ప్రాజెక్టులైనా సరే… నేతల ఆర్థిక మూలాలపై దాడులు చేస్తుంటారు… కక్ష, కక్ష, కక్ష… సరే, గుర్తుందా మీకు..? అఖిలేష్ ఫోటో ముద్రించి ఉన్న కొన్ని లక్షల బ్యాగుల్ని యోగి యథాతథంగా పంపిణీ చేశాడు… నాన్సెన్స్, పాత సీఎం ఫోటో ఉంటే నేనెందుకు పంపిణీ చేయాలి అనుకోలేదు… ఇది చిన్న విషయమే కానీ మనిషి పోకడను పట్టిస్తుంది… రాజకీయం వేరు, ప్రజాధన సద్వినియోగం వేరు… స్టాలిన్ ధోరణి ఈకోణంలో ఇప్పటివరకైతే ఉన్నతంగానే కనిపిస్తోంది… మరీ ప్రతిపక్షాలను పురుగుల్లా నలిపేయకుండా… తీసిపారేయకుండా… ప్రజాధన వినియోగంలో ఆచితూచి వ్యవహరిస్తూ డిఫరెంటుగా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడు…
అధికారంలోకి రాగానే… జయలలిత పేరు, బొమ్మలుండే అమ్మ క్యాంటీన్లను మూసేయాలని డీఎంకే కేడర్ నుంచి ప్రెజర్… కానీ స్టాలిన్ లొంగలేదు… అమ్మ పేరయితేనేం, అన్న పేరయితేనేం, ఈ కరోనా కష్టకాలంలో పేదల కడుపులు నింపే అమ్మ క్యాంటీన్లను యథాతథంగా నడిపించాలని ఆదేశించాడు… తన ధోరణికి తటస్థుల నుంచి చప్పట్లు పడ్డయ్… ఇప్పుడు తాజాగా జయలలిత, మాజీ సీఎం పళనిస్వామి ఫోటోలున్న 65 లక్షల స్కూల్ బ్యాగుల్ని యథాతథంగా పంపిణీ చేయాలని ఆదేశించాడు… రాజకీయ సర్కిళ్ల నుంచి మళ్లీ అభినందనలు అందుకున్నాడు… ఆ బ్యాగుల బదులు కొత్త బ్యాగుల్ని ఇస్తే 13 కోట్ల ఖర్చు అవుతుంది… కానీ స్టాలిన్ వద్దన్నాడు… ‘‘జయలలిత బొమ్మ ఉంటే, మాజీ సీఎం బొమ్మ ఉంటే అదేమైనా రాజకీయంగా నష్టదాయకమా…? వాటిని చూసి జనం వోట్లేస్తారా..? ఆ భ్రమతో కోట్ల ప్రజాధనాన్ని మట్టిపాలు చేయాలా..?’’ ఇదీ స్టాలిన్ ఆలోచన… గుడ్… అన్ని అంశాల్లోనూ ఈ మెచ్యూరిటీ కనిపించాలనే ఆశించాలి మనం…
Ads
మనం తరచూ చెప్పుకునేదే… రాజకీయ నాయకుడు వేరు, రాజనీతిజ్ఞుడు వేరు అని… స్టాలిన్ వ్యవహార ధోరణిని ఈ కోణంలోనే చూడాలి… అధికారంలోకి రాగానే అన్ని పార్టీల నాయకులతో మీటింగ్ పెట్టి కరోనా నియంత్రణపై అభిప్రాయాలు తీసుకున్నాడు, ఎవరినీ తక్కువ చేయలేదు, అందరికీ ఆ భేటీలో సమగౌరవాన్ని ఇచ్చాడు… తన మంత్రుల పక్కన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడు… ‘‘కరోనాకు మన రాజకీయ విభేదాల గురించి తెలియదు కదా… అందరినీ ఒకేలా చూస్తుంది… అందుకే కలిసే దానిపై పోరాడదాం రండి’’ అన్నాడు. అన్ని పార్టీలతో కూడిన రాష్ట్ర స్థాయి అడ్వయిజరీ ప్యానెల్ ఏర్పాటు చేశాడు… అందులో మాజీ ఆరోగ్యమంత్రినీ వేశాడు… ఆమధ్య ఓ అన్నాడీఎంకే లీడర్ చనిపోతే అందరికన్నా ముందు స్టాలినే అక్కడికి చేరుకున్నాడు… తన పదవీ ప్రమాణ సమయంలో మాజీ సీఎంలు ఈపీఎస్, ఓపీఎస్‌లను తన టేబుల్ వద్దే కూర్చోబెట్టుకున్నాడు… 317 కోట్ల ఓ ప్యాకేజీ ప్రకటించాడు నిన్న… శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చి, క్యాంపుల్లో దుర్భరంగా జీవిస్తున్న శరణార్థుల కోసం ఈ ప్యాకేజీ… ఇందులో ఇళ్ల పునర్నిర్మాణం, సబ్సిడీలు, సంక్షేమ పథకాలున్నయ్… అంతేకాదు, తిరిగి శ్రీలంకకు వెళ్లాలనుకునేవాళ్లు, పౌరసత్వ సమస్యలపై పనిచేయడానికి ఓ హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు… 1983 నుంచి దాదాపు 3 లక్షల మంది ఇండియాకు వచ్చారు… ఇది మానవీయ కోణం… సర్కారీ స్కూళ్లలో చదివే పిల్లలకు ఉన్నత విద్యావకాశాల్లో రిజర్వేషన్లను ప్రకటించాడు… ఇది ఖచ్చితంగా ప్రభుత్వరంగంలోని విద్యకు ఓ బూస్టప్… స్టాలిన్ నడకను, నడతను ఇంకా పరిశీలించాలి… అవసరముంది… ఉంది…!!
Share this Article