సంపన్నుల పెళ్లిళ్లతో స్టార్ హోటళ్లు బిజీ!
———————-
సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి. కరోనా కొట్టిన దెబ్బ భాషలో చెప్పలేనంత పెద్దది. విషపు ముళ్ల బంతి కరోనా చేసిన ఈ గాయం ఎప్పటికి మానుతుందో కూడా తెలియడం లేదు.
Ads
భారతదేశంలో అత్యంత సంపన్నులు కొద్ది మందే ఉంటారు. కానీ వారిదగ్గర పోగయిన సంపద పది పదిహేను దేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది. అది వారి కష్టార్జితం. తినీ తినక, ఎండనక వాననక రిక్షాలు తొక్కి తొక్కి రెండు మూడు లక్షల కోట్లు వెనకేసుకుని ఉంటారు. అది వారి చెమటలో నుండి పుట్టిన స్వేదజనిత సంపద. దానికి మనం అసూయపడితే వారి పూచీ ఏమీ ఉండదు. దానికి మనం బాధపడితే మన ఆరోగ్యాలే పాడవుతాయి. అప్పుడు కూడా వారి పూచీ ఏమీ ఉండదు. అదే వారి సంపదకు మనం పొంగిపోతే వారికి మనకు ఉభయారోగ్యం. ఆరోగ్యమే మనకు మహాభాగ్యం!
మొదటి నుండి లక్ష్మీదేవి డబ్బున్నవారి దగ్గరే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండి, అక్కడే ఎక్కువ టైమ్ ఉండిపోతున్నట్లుంది. అది ఆ మహా తల్లి సర్వం సహా అధికారం. మనం ప్రశ్నించడానికి వీల్లేనిది.
సాధారణంగా బాగా డబ్బున్నవారు విదేశీ వాచి పెట్టుకోవాలి. విదేశీ కారు వాడాలి. విదేశీ సెంటు కొట్టుకోవాలి. విదేశీ కళ్లజోడుతోనే స్వదేశాన్ని చూడాలి. దేశీయ భాషలను విదేశీ యాసతోనే మాట్లాడాలి. విదేశీ తిండి తినాలి. మొత్తంగా విధిలేక స్వదేశంలో ఉంటూ- ఎప్పుడూ విదేహంగా దేశంతో డిటాచ్ అయి ఉండాలి. పెళ్లికి పేరంటానికి లండన్, దుబాయ్, మారిషస్, ఇటలీ, స్విట్జర్లాండ్ లాంటి దూర దూర దేశాలకు సొంత విమానాల రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి. మన ఊరి అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఫంక్షన్ హాల్లో పెళ్లి చేస్తే- వారు రాకూడదని మనసులో కోరుకునేవారందరు రానే వస్తారు.
అదే స్విస్ ఆల్ఫ్స్ పర్వతం మంచు కొండమీద ఎముకలు కొరికే చలిలో మంటల నెగళ్ల మధ్య మూడు ముళ్ల డెస్టినేషన్ వేడుక చేస్తే- వారు ఎవరు రావాలనుకుంటారో వారు మాత్రమే వస్తారు. ఎవరి అభిరుచులు వారివి. వారి జేబులో డబ్బు వారిష్టం. కనీసం ఆ పెద్ద పెళ్లేదో ఇక్కడ చేస్తే మేళతాళాలు, పూల డెకరేషన్ వాళ్లు, వంటలవాళ్లు, ఇంకెన్నో ఈవెంట్ల వాళ్లు వేల, లక్షల మందికి పట్టెడన్నం దొరుకుతుంది కదా? అన్నది సమసమాజ నిర్మాణ ఆదర్శమే కానీ- తప్పనిసరి కాదు.
కరోనావల్ల దేశంలో అత్యంత సంపన్నులు విదేశాలకు వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ లు చేసుకునే అవకాశం లేక- విధిలేక, బరువెక్కిన గుండెతో ఇండియాలోనే సెవెన్ స్టార్, ఫైవ్ స్టార్ హెటళ్లలో పెళ్లిళ్లు చేసుకోవాల్సివస్తోంది. దాంతో ఢిల్లీ, బాంబే, కలకత్తా, చెన్నయ్, హైదరాబాద్, గోవాతో పాటు అన్ని స్టార్ హోటళ్లు అడ్వాన్సుగా బుక్ అయి ఉన్నాయి.
అయ్యా! బడాబాబులూ!
జరగాలి మీ ఇళ్లల్లో పెళ్లి మళ్లీ మళ్లీ!
ఆ పెళ్లిళ్లు చూసి లోకం కళ్లింత చేసుకోవాలి కుళ్లి కుళ్లి!
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article