Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!

October 18, 2025 by M S R

.

సూరజ్ వి. భరద్వాజ్....  విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం! #LeftismMarkNeoExploitation

మావోయిస్టు పార్టీలో అప్రకటిత మేధో, శ్రామిక వర్గాల నడుమ సంఘర్షణ కొనసాగుతోంది. కార్మికుల కోసం మేడేల పేరిట లిబరల్ తాటాకు చప్పుళ్లు ఎన్ని వినిపించినా తాడిత పీడిత జనం పక్షాన నిలబడే మిషలో దశాబ్దాల క్రితమే ఈ నయా వర్గ విభజనకు నాంది పడిందన్నది నిర్వివాదాంశం!

Ads

ప్రాణాలకు సైతం తెగించి చెట్టు పుట్టా తిరుగుతూ విపరీతంగా శ్రమిస్తూ అణగారినవర్గాల [#OppressedClass] పక్షాన నిలబడి ప్రయాస పడే శ్రామిక నక్సలైట్ల దండు వీళ్లలో ఒకటికాగా, సభ్య సమాజంలో ఉంటూ తమ ఆలోచనలతో మేధోపరంగా నక్సలిజాన్ని నడిపించే బ్యాకెండ్ బ్యాచ్ మరొకటి!

వాళ్ల అవసరానికి అనుగుణంగా పని విభజన చేసుకున్నారు సరే! మరి, పరిణామక్రమంలో మానవ సమాజ వికాస తొలినాళ్లలో ఇదే రకమైన పని విభజన ఎవరి ప్రమేయం లేకుండా పూర్తి సహజ సిద్ధంగా జరిగింది! అది కూడా అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సమసమాజ నిర్మాణ లక్ష్యంతో ఏర్పడ్డ వ్యవస్థే కావచ్చు!

మరి, సోకాల్డ్ ప్రోగ్రెసివ్ ఐడియాలజిస్టులు వాటిని ఆధిపత్య, పెత్తందారీ సమాజాలుగా చిత్రీకరిస్తూ ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకించారు! దాన్ని బ్రాహ్మణ భావజాలం అంటూ బ్రాహ్మణులను ఎందుకు ఆడిపోసుకున్నారు!

ఇవాళ విప్లవోద్యమం కేంద్రీకృతంగా వెళ్లూనుకుపోయిన అదే పెత్తందారీ, భావాధిపత్య [#IdeologicalSupremacy] వ్యవస్థను అభ్యుదయవాదులు ఎట్లా జస్టిఫై చేస్తారు? అంటే వాళ్లు అనుసరిస్తే విప్లవ రాజకీయం, పూర్వీకులు పాటిస్తే సనాతన రాక్షసీయమా?

ఇది వామపక్షవాద నయా శ్రమదోపిడీ కాదా? మరి, సదరు అభ్యుదయవాదులు తప్పు పడుతున్న ఆనాటి ఈ వర్గ భేదం, పెత్తనం, ఆధిపత్య ధోరణి ఈనాడు ఎట్లా సమర్థనీయం, మరెట్లా ఆచరణీయం అన్నది ప్రశ్న!

దేశంలో ఒక నిషేధిత విప్లవ సంస్థ [#BannedRevolutionaryOrganisation] గా మనుగడ సాగిస్తున్న మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం శ్రామిక, మేధో వర్గాలు మునుపెన్నడూ లేని విధంగా పరస్పర భిన్న ధోరణులు, విభిన్నమైన అభిప్రాయాలతో రచ్చకెక్కుతున్నాయి!

దళాలుగా కాకుండా కులాల కుంపట్లుగా విడిపోయి బురదజల్లుకుంటున్నాయి! జీవితం అంతా అడవికే ధారబోసిన శ్రామికవర్గ నక్సలైట్లు బాహ్యప్రపంచంలోకి వచ్చి కనీసం నవ్వితే కూడా తట్టుకోలేనంత అక్కసు వెళ్లగక్కే స్థితికి మావోయిస్టు పార్టీ మేధోవర్గం దిగజారిపోయింది!

  • ఆయుధం అవనతం చేయడం అన్న నెపంలో 4 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానాన్ని, పీడిత జనం పక్షాన నిలబడి కొట్లాడిన త్యాగమయ చరిత్రలను సైతం విస్మరించేంత తారాస్థాయికి ఆ వికృత ఆలోచనలు చేరాయి! ప్రతికూల పరిస్థితుల్లో లొంగిపోవడాన్ని ఒక ద్రోహంగా, ఏళ్లకు ఏళ్లు త్యాగాలు చేసి తుపాకులతో రాజ్యానికి ఎదురొడ్డి పోరాటం చేసిన వాళ్లను విప్లవ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది!

కేంద్ర కమిటీ సభ్యుడు, మావోయిస్టు పార్టీలో నెంబర్ 2 గా చెలామణిలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ @ సోనూ @ అభయ్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు, పార్టీ యాక్షన్ టీం సారధి ఆశన్న @ తక్కళపల్లి వాసుదేవరావుల లొంగుబాటు ఈ గడిబిడకు ప్రధాన కారణం ఐంది! ఈ ఇద్దరితో పాటు దాదాపు 270 మంది పై చిలుకు నక్సలైట్లు అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్ ఘడ్లలో ఆయుధాలతో సహా లొంగిపోయారు!

సరిగ్గా ఇదే పరిణామం అనేక పదనిసలకు సెంటర్ పాయింట్ ఐంది! వైరివర్గం భిన్నాభిప్రాయాలు, సానుభూతిపరుల నిష్టూరాల నడుమ ఆ లొంగుబాటు తంతు పూర్తైంది! సరే, ఇంతకీ ఈ సరెండర్ కు మూల కారణాలు ఏంటి? విప్లవ ఉద్యమాలు కొనసాగడానికి ప్రస్తుతం ఉన్న సానుకూల పరిస్థితులు ఏమిటి?

దండకారణ్యంలో శత్రుదుర్భేద్యంగా, నక్సలిజానికి కంచుకోటలా ఉన్న అభుజ్మాడ్ లాంటి ప్రాంతంలో ఏం జరుగుతోంది? విప్లవకారులు ఆయుధం పట్టి సలుపుతున్న ఈ పోరాటంలో రక్తం ఏరులై పారి ఇరుపక్షాల నుంచి వేలాది మంది అమాయకులు సమిధలు ఔతుంటే, ఆ ఫలితాలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి?

ఈ చర్యల వల్ల నిజంగా విప్లవ పంథా అనుసరిస్తున్న పార్టీల లక్ష్యం నెరవేరుతుందా? ఆదివాసీల జీవన విధానంలో ఈ పద్ధతి ఏమైనా మెరుగుదలకు ఆస్కారం ఇచ్చిందా? అన్న ప్రశ్నలు అనేకం సామాన్యుల మెదళ్లను తొలుస్తాయి!

కానీ, వీటన్నిటికీ కలిపి బిగ్ నో [#BigNo] అన్న ఒకేఒక్క సమాధానం రావడం కాస్త బాధను కూడా కలిగిస్తుంది! మరి ఎందుకు ఈ పోరాటం, దాని అంతిమ ప్రయోజనం ఏంటి అన్న తదనంతర సంశయాలు ఉత్పన్నం ఔతాయి!

దండకారణ్యంలో నడుస్తున్న జనతన సర్కారు చేయాల్సింది ఒకటి, చేస్తున్నది మరొకటి అన్నది ఒక ప్రధాన ఆరోపణ! ఇందుకు అఙ్ఞాత జీవనాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చిన వాళ్లే రెండు ప్రధాన ఉదాహరణలను ప్రస్తావిస్తుంటారు! పిల్లలకు బాలశిక్ష నేర్పే క్రమంలో మామూలు పాఠశాలల్లోని ఉపాధ్యాయులైతే ‘అ’ అంటే అమ్మ అని చెప్తూ విద్యా బోధన మొదలు పెడతారు! అదే, అభుజ్మాడ్ లోని జనతన సర్కారు బళ్లలో ‘ఆ’ అంటే ఆయుధం అని నూరిపోసే పాఠాలే చెప్తుంటారని అభియోగం!

అలా దారి తప్పిన బోధనతో అక్కడ 10 వ తరగతి వరకు చదివినా, అడవికి ఆవల ఉన్న మైదాన సమాజాల్లో ఏమాత్రం చెల్లుబాటు కాదు! ఫలితంగా జనతన సర్కారు బళ్లలో చదివినా ఫలితం లేక, ఆ విద్య నిరుపయోగంగా మారుతుంది! పైగా, అలాంటి అక్కరకురాని సిలబస్ తో పాఠశాల విద్య పూర్తి చేసినా, అది కాలేజీ స్థాయికి ఏమాత్రం సరిపోదు!

ఇదిలా ఉంటే, ఆదివాసీలు ప్రభుత్వం ఇచ్చే ఆధార్ కార్డులు తీసుకోవద్దని జనతన సర్కార్ జారీ చేసిన ఫత్వా అట్టర్ ఫ్లాప్ అవడం దండకారణ్యం కేంద్రంగా సాగుతున్న విప్లవ ఉద్యమంలో ఒక పెద్ద మలుపు! మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అంతగా గుర్తింపునకు నోచుకోని అభుజ్మాడ్ వాసులు భారత పౌరసత్వానికి ప్రతీకగా ఇచ్చే ఆ గుర్తింపు కార్డును తీసుకోవద్దనడం తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది!

  • ఆఖరుకు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పార్టీ నాయకత్వానికి తెలియకుండా దొంగతనంగా ఆదివాసీలు ఆధార్ కార్డుల కోసం క్యూలైన్లలో నిలబడటం షాకింగ్ టర్న్! నక్సలైట్లు గిరిజనులను విప్లవోద్యమం వైపు నడిపించే దిశలో పట్టు కోల్పోయారనడానికి ఇదే ఒక పెద్ద సంకేతం! ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సైతం గిరిజన తండాల్లో అమలు కాకుండా చేసే ప్రయత్నంలో నక్సలైట్లు విఫలం అయ్యారు!

ఇక్కడ మరో సంగతి కూడా ప్రధాన ప్రస్తావనీయాంశం! ఊ., అంటే బడాబాబుల దోపిడీ నుంచి సహజవనరుల సంరక్షణ అని మాట్లాడే నక్సలైట్ నాయకత్వం, కేవలం తమకు షెల్టర్ జోన్లుగా ఉన్న అటవీ ప్రాంతాల్లో నెలకొల్పిన పరిశ్రమల ప్రస్తావనే చేస్తారు! కానీ, మైదాన ప్రాంతాల్లో వెలికి తీస్తున్న ఇతర సహజ ఖనిజ సంపద పరిరక్షణ గురించి ఊసెత్తరు, పోరాటం చేయరు!

విస్మయానికి గురి చేసే మరొక సంగతి ఏంటంటే, చోటా, బడా, ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థ, ఇలా వాటి స్థాయి, యాజమాన్యం ఏవైనా, ఆయా కంపెనీల్లో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో ట్రేడ్ యూనియన్లు ఏర్పాటవడం సర్వసాధారణం! శ్రామికవర్గం తరఫున నిలబడి హక్కులను కాపాడటం, వాళ్ల తరఫున పోరాడి సమస్యలను పరిష్కరించడం ఆ యూనియన్ల ప్రధాన విధి!

కానీ, ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లా బైలడిల్లా ముడి ఇనుము [#BailadilaIronOre] ఉత్పత్తి కంపెనీ మొదలు, నక్సల్ ప్రభావిత [#NaxalAffected] ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క జాతీయ [#National], బహుళజాతి [#MultiNational] కంపెనీలో ఇలాంటి లేబర్ యూనియన్లు లేకపోవడం ఇక్కడ ట్విస్ట్!

మరి, ఆ సంస్థల్లో కార్మికులు లేరా, వాళ్లకు సమస్యలు లేవా? అంటే., కచ్చితంగా ఉంటాయి, ఉన్నాయి! కానీ, వాటిని పట్టించుకునే నాథుడే ఉండడు! అదేంటి నక్సలిజం మూల సిద్ధాంతమే వాళ్ల హక్కుల రక్షణ కదా అనుకుంటే, తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే, అక్కడ ఏమాత్రం అలజడి జరిగినా, ప్రతి ఏటా వాళ్లకు రావలసిన కోట్లాది రూపాయల మామూళ్లు హుష్ కాకి!

కానీ, ఆ ఆమ్యామ్యాలు రావడంలో ఏమాత్రం జాప్యం జరిగినా, యంత్రాల కాల్చివేతలు, నిర్మాణాల కూల్చివేతలు వెరీ కామన్ అంటే షరామామూలే! ఉన్నట్టుండి హింస పెట్రేగిపోతుంది!

అమాయక ఆదివాసీలు ఇవన్నీ ప్రశ్నించరు, కనుకనే నక్సలైట్లు వెళ్లి వాళ్ల పంచన చేరుతారన్నది ఒక అభియోగం! చివరగా, కేవలం, భావజాల వ్యాప్తి, సిద్ధాంత సూత్రీకరణల లాంటి మేధోపరమైన అంశాలకే పరిమితమయ్యే ఒక వర్గం, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడే శ్రామిక నక్సలైట్ వర్గ నిర్ణయాధికారాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సబబు!

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చే ఆ ఫీల్డ్ నక్సలైట్ల చర్యలను వీళ్ల దుర్భిణీల్లో పెట్టి చూడటం, మంచి చెడులను విశ్లేషించడం ఎంతవరకు సమంజసం! ఆయుధం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్న విప్లవకారుల పట్ల నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్న సో కాల్డ్, సానుభూతిపరులు తమలో తాము ఒకసారి తర్కించుకోవాలి!

దశాబ్దాలపాటు నరక ప్రాయమైన అటవీ జీవనాన్ని విధిలేని పక్షంలో అనేక ప్రతికూల పరిస్థితుల్లో వదిలిపెట్టి పోలీసులకు లొంగిపోయిన వాళ్లను కార్లలో తిరుగుతూ, ఏసీల్లో బ్రతుకే మేధావివర్గం తప్పు పట్టడం, పరుష పదజాలంతో తూలనాడటం సమంజసమా?

ఇది కూడా ఒకరకమైన ఆధిపత్య ధోరణి [#HighHandedness] కాదా? ఆలోచించుకోవాలి! సిద్ధాంతాలకు ఏముంది బొచ్చెడు చెప్పొచ్చన్నది స్వయాన మాజీలు వినిపిస్తున్న వాణి! తుపాకీ పట్టి అడవిబాట పడితే కానీ, అసలు విషయం బోధపడదు అంటారు వాళ్లు!

ఫ్రంట్ లైన్ యాక్టివిటీని ఎంచుకొని సేఫ్ పాకెట్లలో ఉంటూ, సర్వ సుఖాలను, సకల భోగాలను అనుభవిస్తూ, ఈజీగా కామెంట్లు చేసి, ఒపీనియన్స్ వెలిబుచ్చే పంథాను వీడి, సదరు లెఫ్టిస్ట్ ఇంటెలెక్చువల్ క్లాస్ వాళ్లను వాళ్లు రీ డిఫైన్ చేసుకోవాలి!

ఒకవేళ, వాళ్లే ఆ స్థానంలో ఉంటే, కాదు కాదు, ఇన్ని చెప్పేవాళ్లు, ముందు వాళ్లెందుకు ఆ స్థానంలో లేరో ఆత్మపరిశీలన చేసుకోవాలి అన్న చురకలు కూడా కొందరు అంటిస్తున్నారు! ఫీల్డ్ లో ఉంటే తమ పరిస్థితి ఏంటని [#Empathetic] థింక్ చేయాలి అన్న బలమైన అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు!

అలా కాదు, విప్లవోద్యమంలో వాళ్లు లీగల్ గా పట్టణ ప్రాంతాల్లో [#UrbanAreas] ఉండి, అజ్ఞాతం [#UnderGround] లో ఉన్న వాళ్లకు మద్దతుగా ఉంటామని తీర్మానించుకున్నారు అంటారా? కేవలం మేధోపరమైన సహకారం అందిస్తామని అనుకున్నారా? అలా ఐతే, వాళ్లకు వాళ్లు కొన్ని పరిధులు [#Barriers] పెట్టుకొని పరిమితులు [#Limitations] నిర్దేశించుకున్నారని దానర్థం!

సో, ఇట్ ఈజ్ క్లియర్! వాళ్లది పూర్తిస్థాయి త్యాగం [#Sacrifice] కాదు! వాళ్లకు పెద్దగా రిస్క్ లేదు! కానీ, ఆయుధం ధరించి, అడవుల బాట పట్టిన వాళ్లు వాళ్లలా పరిమితులు పెట్టుకోకుండా, పరిధులు ఏర్పరచుకోకుండా, ఎలాంటి భేషజాలు, శషబిషలకు తావులేకుండా, నిర్ద్వంద్వంగా ప్రజల కోసం కఠినమైన త్యాగాల బాట పట్టారు! లైఫ్ రిస్క్ తీసుకున్నారు!

అలాంటి వాళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫ్రంట్ లైనర్స్, వాళ్ల పరిధులకు లోబడి మాత్రమే స్పందించాలి! అంతేకానీ, నిస్వార్థంగా ఉద్యమబాట పట్టిన వాళ్ల కదలికలను, నిర్ణయాలను శాసించే విధంగా ఏమాత్రం వ్యవహరించకూడదని సైతం జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ నక్సలైట్లు సూచిస్తున్నారు.

  • అఙ్ఞాత జీవితంలోని సాధకబాధకాలు, అడవులు, తండాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులు, మారిన స్థానిక ఒరవడులు [#LocalTrends], సాయుధపోరాట [#ArmedStruggle] ప్రస్థానం, లక్ష్యసాధన దిశలో ఎదురవుతున్న అడ్డంకులు [#Obstacles], అవాంతరాలు [#Disturbances], సమస్యలు, సంక్లిష్ట సంగతులు గట్రా ముమ్మాటికీ ఫీల్డ్ లో ఉండే విప్లవకారులకు మాత్రమే తెలుస్తాయి!

బైట ఉండి అంజనం వేసినంత మాత్రాన వర్గశత్రువు శక్తియుక్తులు, సాయుధ బలగాల [#ArmedForces] దాడుల ధాటి, వాటి బలం [#Strength], బలహీనత ఇతర వాస్తవ పరిస్థితులు [#RealisticConditions] దోహదపడతాయి అనుకోవడం తప్పు! స్థానిక కాలమాన నేపథ్యాల ఆధారంగా ఇకపై ఎలాంటి పంథా [#Method] ను అనుసరించాలన్నది పూర్తిగా సాయుధపోరాటం చేస్తున్న నక్సలైట్ల విచక్షణాధికారమే!

విప్లవోద్యమానికి సానుభూతిపరులుగా ఉన్నవాళ్లకే ఇన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఉంటే, మరి, పద్మవ్యూహం లాంటి ఎత్తుగడల నడుమ రాజ్యంతో ఎదురొడ్డి నేరుగా పోరాటం చేస్తున్న వాళ్లకు ఆమాత్రం విజ్ఞత [#Wisdome], విచక్షణ [#Discretion] ఉండవా? అన్న ప్రశ్నలను కొందరు సామాజికవేత్తలు సంధిస్తున్నారు!

అసలు ఆయుధాలు ధరించి వర్గ శత్రువుతో ప్రత్యక్షంగా పోరాడుతున్న వాళ్ల త్యాగాల ముందు లెఫ్టిస్ట్ మేధావుల పరోక్ష సిద్ధాంత, రాద్దాంతాలకు విలువే లేదన్న సంగతిని గుర్తించాలన్నది కొందరి అభిప్రాయం! చివరగా, అంతర్గతభద్రత [#InternalSecurity] ని కాపాడటం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తరవాత మావోయిస్టు పార్టీ కూసాలు కదులుతున్నాయని టాక్!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన మార్చి 2026 డెడ్ లైన్ కూడా ఆ పార్టీలో ప్రకంపనలకు కారణమైంది! తదనంతర పరిణామాల్లో ఆ పార్టీ ఏకంగా ప్రధాన కార్యదర్శి నంబళ్ల కేశవరావు @ బసవరాజ్ నే ఎన్ కౌంటర్లో కోల్పోయింది! ఆ తరవాత వందలాది మంది నక్సలైట్లు భద్రతా బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు!

నిజం చెప్పాలంటే, సాయుధపోరాటాల యుగం ముగిసిపోయింది. దట్టమైన అడవుల్లో కాలిబాటన గాలింపులు జరిపే కూంబింగ్ టీంలకు ఏరియల్ దాడులు చేసేందుకు దోహదపడే హెలికాఫ్టర్లు, డ్రోన్ [#Drone] ల లాంటి అత్యాధునిక సాధనాలు, చిట్టడవులను సైతం జల్లెడ పట్టగలిగే శాటిలైట్ సర్వేలెన్స్ టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి రావడం, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆదివాసీ అనుకూల విధానాలు, యూత్ లో జడలు విచ్చుకుంటున్న నవీనపోకడలు, ప్రపంచీకరణ [#Globalisation] ద్వారా విస్తరిస్తున్న బహుళజాతి కంపెనీల వ్యాపారకలాపాలు, నవయుగపు వాణిజ్య సమాజంలోకి అవి పంప్ చేస్తున్న యాస్పిరేషన్స్, లావిష్ అండ్ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయాలనే సగటు యువత ధోరణులు నక్సలిజాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తున్నాయి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకరు యోగి సిస్టర్, మరొకరు మోడీ సిస్టర్… ఈ ఫోటో చెప్పే నీతి ఏమనగా..!!
  • ముద్దాయిల సంస్కరణ సగటు తెలుగు సినిమా తీసినంత వీజీయా…!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • నా చిన్నప్పటి ప్రియురాలు ఆమె… ఈరోజుకూ కలలోకి వచ్చి పలకరిస్తుంది…
  • KCR పాలనలో లక్ష మంది బోగస్ ఉద్యోగులు… వేల కోట్ల ప్రజాధనం గోవిందా…
  • కన్నుమూసి అప్పుడే 39 ఏళ్లు..! ఇంకా కళ్లల్లోనే కదలాడే జ్ఞాపకం..!!
  • తుపాకీకి జ్ఞానోదయం… విప్లవ రాజకీయం – సనాతన రాక్షసీయం!
  • కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణ! 2 లక్షల ఓటర్ల ఫోటోలు మిస్ యూజ్!
  • డ్యూడ్… ఎవడ్రా నీకు సర్టిఫికెట్ ఇచ్చేది… ఖచ్చితంగా హీరో మెటీరియలే..!!
  • Dirty Tollywood… మీ పీకుడు సంస్కార భాష ఏమిట్రా కుయ్యా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions