.
-శంకర్‌రావు శెంకేసి (79898 76088) ….. రాష్ట్ర విభజన- తెలంగాణకు వరమైతే, భద్రాచల రామయ్యకు మాత్రం శాపం!
భద్రాచలం.. భూలోక వైకుంఠం. సీతారాములు నడయాడిన నేల. తెలంగాణలో యాదగిరి గుట్ట, వేములవాడ రాజన్న తర్వాత అంతటి ఆధ్యాత్మిక వైభవానికి వేదికగా నిలుస్తున్న క్షేత్రం. ప్రతీ ఏటా శ్రీరామ నవమి రోజున పాలకులు సీతారాముల ఎదుట పాదాక్రాంతమవుతారు.
Ads
అధికారికంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి జగదభిరాముడి కల్యాణాన్ని తిలకించి పులకించి పోతారు. భక్త రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలు, కబీర్‌దాస్ కృతులు భద్రాచలంతో పాటు, సీతారాముల చరితను వీనుల విందు చేస్తాయి.
నిలువెల్లా భావోద్వేగాలను కలిగించి తన్మయభరితం చేస్తాయి. సీతారాముల కల్యాణ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించడం కొందరికి భాగ్యమైతే, రేడియోలోనో, టీవీ చానెళ్లలోనో వినిపించే వ్యాఖ్యానానికి చెవి ఒగ్గడం మరికొందరికి ఒక అనుభూతి. నిజానికి ఆ ప్రవచనకారుల వ్యాఖ్యానం ఒక అద్భుతమైన గళ కళ.
భద్రాచలం తెలుసు కదా.. భౌగోళికంగా తెలంగాణకు తూర్పున చివరి భాగాన వుంటుంది. చెంతనే పారుతున్న గోదావరి సాక్షిగా, భద్రగిరిపై వెలిసిన సీతారాములు నిత్యపూజలు అందుకుంటూ ఉంటారు. ‘అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి…’ అనే పాట ఎంతో ప్రసిద్ధం. గోదావరినే భద్రాచలం వద్ద గౌతమి అని పిలుస్తారు.
క్షేత్రపరమైన ప్రాధాన్యం వల్ల యూపీలోని అయోధ్యకు సరిసమానంగా… భద్రాచల క్షేత్రం దక్షిణ అయోధ్యగా పేరుపొందింది. ఏటా 40 లక్షల మంది భక్తులు, పర్యాటకులు భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారని లెక్కలు చెబుతున్నాయి. ప్రతీ ఏటా ఈ ఆలయానికి రూ. 40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
దేవాదాయశాఖ పరంగా 6ఏ కేటగిరీలో ఉంది. ఇప్పుడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉంది గానీ, ఒకప్పుడు ఖమ్మం జిల్లా అనగానే ఎవరికైనా భద్రాచలమే స్పురించేది. ప్రతీ ఏటా ఇక్కడ నట్టనడి ఎండాకాలంలో సీతారాముల కల్యాణ వేడుక జరుగుతుంది.
సింగరేణి గనులు, పరిశ్రమలు, ఇతర భౌగోళిక కారణాల రీత్యా ఇక్కడ ఎండల తీవ్రత ఎక్కువ. అయినా సకల అధికార యంత్రాంగంతో పాటు, వేలాది మంది భక్తులు ‘కల్యాణం చూతము రారండి..’ అని పాడుకుంటూ భద్రాద్రి చేరుకుంటారు. ఇది చరిత్ర, వర్తమానం కూడా.
ఈ నేపథ్యం, ఘనత జగద్విఖ్యాతం. భద్రాచల ఆధ్యాత్మిక వైభవం తెలుగు రాష్ట్రాలకే కాదు, ప్రపంచానికంతటికీ సుప్రసిద్ధం. అశేష భక్తజనం ఆదరణ ఉన్న, ఎందరికో ఆరాధ్యమైన దేవుడు కొలువైన ఉన్న ఈ క్షేత్రం పట్ల పాలకులు సున్నితంగా, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వ్యహరించాలి. కానీ, ‘రాష్ట్ర విభజన’ రాజకీయాల్లో పాలకులు భద్రాద్రిని పావుగా వాడుకున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలో, రాజకీయ ప్రయోజనాలో గానీ భద్రాచలానికి తీవ్రమైన అన్యాయం చేశారు. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. అప్పటికే ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీ(బీ)ఆర్‌ఎస్ ఎన్నికల్లో గెలిచి వున్నాయి. జూన్ 2న కేసీఆర్, జూన్ 8న చంద్రబాబు అధికారం చేపట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ తొలిసారిగా ప్రధాని అయ్యారు. అప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా టీడీపీ వుంది.
అప్పుడు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ముఖ్యమైన ఎజెండా. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానిస్తూ ప్రస్తుత ఏలూరు జిల్లా పోలవరం వద్ద భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. అయితే ఈ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ఖమ్మం జిల్లా సరిహద్దున వన్న మండలాలకు విస్తరిస్తుండటంతో.. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో పోలవరం ముంపు మండలాల పేరిట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐదు మండలాలను పూర్తిగా, బూర్గంపాడు, భద్రాచలంలోని కొన్ని గ్రామాలను ఏపీలో విలీనం చేయాలని నిర్దేశించారు.
ఈ క్రమంలోనే 2014లో కేంద్రలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేలేరుపాడు, కుక్కునూరు, కూనవరం, వరరామచంద్రాపురం, చింతూరు మండలాలను పూర్తిగా, బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలను, భద్రాచలం మండలంలోని భద్రాచలం రెవెన్యూ పంచాయతీ మినహా మిగతా గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ చర్యపై తెలంగాణలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలు చెలరేగినా, అప్పటి కేసీఆర్ సర్కారు విభజన ఒప్పందాలకు కట్టుబడి ఉండటం అనే పేరిట మిన్నకుండి పోయింది. (నామమాత్ర నిరసన ప్రకటించి…)
రాష్ట్ర విభజనలో తెలంగాణలోని ఏ జిల్లా కూడా ఇంచు జాగా కోల్పోలేదు. కానీ, ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రం దాదాపు 7 మండలాలను కోల్పోయి తన అస్తిత్వాన్ని బలహీనపర్చుకుంది. ఈ విలీన ప్రక్రియను అడ్డుకునేందుకు స్థానికంగా ఆశించిన స్థాయిలో ఉద్యమాలు తలెత్తకపోవడం నిరాశపరిచే అంశం.
విలీన ప్రక్రియలో భద్రాచలం మండల పరిధిలోని ఐదు ఊళ్లను ఏపీలో కలపడం భద్రాద్రి క్షేత్రానికి తీరని నష్టాన్ని కలిగించింది. భద్రాచలాన్ని ఆనుకొని ఉండే ఎటపాక, గుండాల, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం పంచాతీయలను ఏపీలో కలపడంతో భద్రాచలం మండలం చిన్నపాటి పంచాయతీ స్థాయికి కుచించుకుపోయింది.
దీనివల్ల భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి తీసుకునే చర్యలకు అనేక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టెంపుల్ టౌన్‌గా విస్తరించేందుకు ప్రణాళికలు వున్నా స్థలం అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
భద్రాచల అలయానికి చెందిన 900 ఎకరాల భూమి పురుషోత్తపట్నంలో ఉంది. ఇప్పుడీ గ్రామం ఏపీలో అంతర్భాగంగా ఉంది. ఇక్కడ ఏవైనా నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతులు, పరిధుల విషయంలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. పైగా అక్కడి అధికారులు పట్టించుకోకపోతుండటంతో రామాలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి.
భద్రాచలం పట్టణం 2 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 80 వేల జనాభా ఉంది. పట్టణ పరిసర గ్రామాలు ఏపీలో కలవడంతో ప్రస్తుతం పట్టణంలో సత్రాల నిర్మాణానికి, భక్తులు సేదదీరేందుకు పార్కుల ఏర్పాటుకు, వాహనాల పార్కింగ్‌కు, డంపింగ్ యార్డుకు చివరాఖరుకు శ్మశానవాటికకు సైతం స్థలాలు లేకుండా పోయాయి.
భద్రాచలం ప్రసిద్ద క్షేత్రం కావడంతో రోజురోజుకూ విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ క్షేత్రం అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉత్తర భారతంతో కనెక్టివిటీ కల్పించేందుకు తాజాగా కేంద్రం రైల్వే లైన్ కూడా ప్రతిపాదించింది. మరోవైపు కొత్తగూడెంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రాబోతోంది. ఇలా అనేక సానుకూల పరిణామాల వల్ల భద్రాచలం ఆధ్యాత్మిక పర్యాటకం విస్తరించబోతోంది.
కానీ, ఆ స్థాయిలో క్షేత్రాన్ని అభివృద్ధి పరిచేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్నా స్థలలేమి ప్రధాన సమస్యగా మారింది. అలాగే గోదావరి వరదల నుంచి భద్రాద్రిని రక్షించుకునేందుకు గోదావరికి ఇరువైపులా కరకట్టలు కట్టాలనే ప్రతిపాదన కూడా ఉంది.
అయితే కరకట్ట ఐదు పంచాయతీల మీదుగా వెళ్లాల్సి ఉండటంతో అనుమతులు అంత సులభంగా లభించే పరిస్థితులు లేవు. అంతెందుకు రామాలయానికి అనుబంధంగా ఉండే పర్యాటక ప్రాంతాలైన పర్ణశాల, ఉష్ణగుండాల వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఏపీ గ్రామాల మీదుగా అడ్డంకులు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు వున్నాయి.
వాస్తవానికి ఏపీలో ఉన్నారన్న మాటేగానీ, ఐదు పంచాయతీల ప్రజల బతుకుదెరువు అంతా భద్రాచలంతోనే ముడిపడి ఉంది. పదేళ్ల క్రితం వరకు ఇక్కడి ప్రజలు తెలంగాణ వాసులుగా ఉండగా, ప్రస్తుతం ఏపీ ప్రజలుగా మారిపోయారు.
విద్య, ఉద్యోగాల విషయంలో, రిజర్వేషన్ల విషయంలో వీరు అనేక సమస్యలకు లోనవుతున్నారు. అన్యాయానికి గురవుతున్నారు. ఈ పంచాయతీలు ప్రస్తుతం ఏపీలోని పాడేరు (పూర్వం పశ్చిమగోదావరి) జిల్లా పరిధిలో వున్నాయి. ఇక్కడి నుంచి పాడేరు జిల్లా కేంద్రం 450 కి.మీ. దూరంలో ఉంది.
విలీన గ్రామాల ప్రజలు ఏదైనా అవసరం కోసం జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 450 కి.మీ. ప్రయాణించాలి. ఈ అగత్యం దేశంలో ఈ ఏ జిల్లా ప్రజలకు ఉండదేమో. భౌగోళికంగా భద్రాచలమే తమకు అనుకూలంగా ఉంటుందని, తమను తెలంగాణలో కలపాలని ఐదు పంచాయతీలు గతంలోనే ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశాయి…
గత పదేళ్లుగా ఐదు పంచాయతీల సమస్య రెండు రాష్ట్రాల మధ్య రగులుతూనే ఉంది. పోలవరం బ్యాక్‌వాటర్ పరిధిలోకి రాకున్నా చంద్రబాబు ఆనాడు అత్యుత్సాహంతో ఐదు పంచాయతీలను తీసుకున్నారనే వాదన కూడా ఉంది. ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు కూడా తరుచూ ప్రస్తావిస్తూ వస్తున్నారు.
అయితే ఏపీ ఉన్నతాధికారులు మాత్రం పంచాయతీలను తిరిగి ఇచ్చేయడం అనేది తమ పరిధిలో లేదని, అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని సెలవిస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కరించుకునే పేరిట గత ఏడాది జూలైలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఐదూళ్ల సమస్య కూడా వారి చర్చల్లో ఒక అంశంగా చోటుచేసుకుంది. కానీ సమస్య పరిష్కారంలో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేదు.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 రూపొందించిన కాంగ్రెస్ మేధావులు, వాటిలోని అంశాలను అమలు చేయడంలో రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికగా వ్యవహరిస్తున్న నేటి కమలనాథులు.. ఈ ఐదూళ్ల సమస్యకు ప్రధాన కారకులు.
ప్రాంతాలను భౌగోళికంగా విడగొట్టే సమయంలో భవిష్యత్తులో తలెత్తే సమస్యలను, ప్రజల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకోక పోవడం అన్యాయం. భద్రాచలం వంటి ఆధ్యాత్మిక క్షేత్రం విషయంలో అలా చేయడం మరీ దారుణం.
రాష్ట్ర విభజన… తెలంగాణకు భౌగోళిక అస్తిత్వాన్ని, స్వయం పాలనను అందుబాటులోకి తీసుకువచ్చింది. కానీ, భద్రాచల రాముడికి మాత్రం శాపాన్ని మిగిల్చింది…
రామా కనవేమిరా..? రాముడి కల్యాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్నట్టు వార్తలు కనిపిస్తున్నాయి… సనాతన పరిరక్షకుడిగా చెప్పుకునే తనకు ఈ రాముడి గుడి కష్టాలు ఎవరైనా చెబితే బాగుండు..!!
Share this Article