జగన్ ఈ రేంజు ఘోర పరాజయం ఎవరూ ఊహించనిదే… చంద్రబాబు కూటమి అఖండ విజయం ఈ స్థాయిలో ఉంటుందని కూడా ఎవరూ అనుకోలేదు… జనంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా సరే, కేసీయార్ మరీ జీరోకు పడిపోతాడనీ అంచనా వేయలేదు… ఇవేనా..? ఈ ఎన్నికల్లో అనూహ్యాలు ఇంకా చాలా ఉన్నాయి…
మొదటిది 350 నుంచి 400 వరకు ఎన్డీయే గెలుస్తుందని చెప్పిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అడ్డంగా బోల్తాకొట్టాయి… ఇండియాటుడే- మైయాక్సిస్ ఇండియా సర్వే లీడ్ చేసిన ప్రదీప్ గుప్తా బహిరంగంగా, టీవీ రిజల్ట్ ప్రసారంలోనే కన్నీళ్లు పెట్టుకుని, క్షమాపణ చెప్పాడు… ఏపీలో ఆరామస్తాన్ పరిస్థితీ అదే కదా… చాలా ఎగ్జిట్ పోల్స్ దెబ్బతిన్నాయి… జాతీయ అంచనాల్ని జీన్యూస్ సరిగ్గా ఇచ్చినట్టుంది…
https://x.com/ShivAroor/status/1797940057871138959
Ads
మహారాష్ట్రలో బీజేపీ శివసేన, ఎన్సీపీలను చీల్చడాన్ని జనం హర్షించలేదు… తిరస్కరించారు… అక్కడ ఉద్దవ్ శివసేన, శరద్ పవార్, కాంగ్రెస్ కూటమి మంచి రిజల్ట్స్ సాధించింది… బహుశా శివసేనను మళ్లీ కలిపేసి, ఠాక్రేను అక్కున చేర్చుకోవచ్చు బీజేపీ… కనీసం ప్రయత్నం చేస్తుందేమో… దానికీ రీజన్ ఉంది… రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రిపేరింగ్ వర్క్ చేపట్టాల్సిందే…
ఒడిశాలో నవీన్ పట్నాయక్ మరీ ఒకటికి పడిపోతాడని ఎవరూ అనుకోలేదు… అక్కడ గెలిచిన సీట్లు కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీకి ఆసరా అయ్యాయి… ఆ అసెంబ్లీ కూడా దక్కింది…
ఉత్తరప్రదేశ్‌లో మరీ విచిత్రం… అయోధ్య గుడి ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమి… వారణాసిలో కొన్ని రౌండ్లలో సాక్షాత్తూ మోడీ వెనుకంజ… చివరకు తక్కువ మెజారిటీతో గెలుపు… రాహుల్ వదిలేసిన అమేథీలో తిరిగి పార్టీ వైభవం… యూపీలో కాంగ్రెస్ కూటమి, బీజేపీ దాదాపు చెరిసగం… అంటే అఖిలేష్ వేగంగా పుంజుకున్నాడు, యోగి ప్రాభవం గణనీయంగా పడిపోయింది… ఒక్క ముక్కలో చెప్పాలంటే బీజేపీని నేల మీదకు తీసుకొచ్చింది యూపీ వోటరే…
మమతను ఈసారి ఎంపీ ఎన్నికల్లోనైనా వెనక్కి నెట్టాలని బీజేపీ విశ్వప్రయత్నం చేసినా సరే, మమత 42లో 29 తో స్థిరంగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది… బీజేపీ 12తో ఆగిపోయింది… తమ బలాన్ని నిలబెట్టుకున్న ప్రాంతీయ నేతల్లో స్టాలిన్, మమత, అఖిలేష్ ముఖ్యులు…
బీహార్‌లో బీజేపీ, జేడీయూ బలం స్థిరంగా ఉంది, తేజస్వి యాదవ్ అనూహ్య ఫలితాలు తీసుకురాలేకపోయాడు… ఆర్జేడీ ఇప్పుడప్పుడే పుంజుకునే సీన్ కనిపించడం లేదు… కలిసి ఉంటే ఎంత బలమో తెలిసింది కాబట్టి నితిశ్ తోకజాడించకపోవచ్చు బహుశా, త్వరలో అక్కడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి…
తమిళనాట స్టాలిన్ క్లీన్ స్వీప్… జయలలిత మరణించాక ఇక డీఎంకేకు అసలు ప్రత్యర్థే లేరు, బీజేపీ ఎంత కష్టపడినా అక్కడ ఫలితం లేదు, కాకపోతే వోట్లు పెరిగాయి… ఇండికూటమికి ఇప్పటికీ స్టాలినే బలమైన అండ…
మధ్యప్రదేశ్ బీజేపీ క్లీన్ స్వీప్… కర్నాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ప్రాబల్యం క్షీణించింది… ప్రభుత్వం ఎన్ని ఉచిత వరాలు ఇచ్చినా జనం బీజేపీ పక్షాన నిలిచారు… ఇంట్రస్టింగు… తెలంగాణ ప్రభుత్వ సారథి రేవంత్ దీన్ని గమనంలోకి తీసుకోవాలి… గుజరాత్‌లో ఒకటి మినహా మిగతావన్నీ మోడీకి జై అన్నాయి…
రాజస్థాన్‌లో ఎన్డీయే ఆధిక్యం (14) కనబరిచింది గానీ, గతంతో పోలిస్తే తగ్గినట్టున్నాయి… ఇండి కూటమి (10) తన ఉనికిని బలంగానే చాటుకుంది… చెప్పుకోవాల్సింది లెఫ్ట్ గురించి… ఆల్రెడీ త్రిపుర, బెంగాల్‌లో జీరోకు పడిపోయింది కదా, ఇప్పుడు కేరళలో ఘోర ఫలితం… యూడీఎఫ్ 18 సాధిస్తే లెఫ్ట్ సాధించింది జస్ట్, ఒకటి… బీజేపీ కూడా ఒకటి… రాబోయే రోజుల్లో లెఫ్ట్ గురించి దేశం మరిచిపోవాల్సిందేనేమో…
జార్ఖండ్‌లో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ముఖ్యమంత్రిని జైలుకు పంపించినా బీజేపీ బావుకున్నది తక్కువే… బీజేపీ 9 కాగా ఇండికూటమి 5… అస్సాంలో పది గెలుచుకుని బీజేపీ తన బలాన్ని నిలుపుకోగా 4 సీట్లతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది… పంజాబ్ ఇంట్రస్టింగు, గత ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకోగా, పవర్‌లో ఉన్న ఆప్ మరీ 3 సీట్లు… బీజేపీకి తీవ్ర నిరాశ… శిరోమణి అకాలీదళ్‌కు ఒకటి…
చత్తీస్‌గఢ్‌లో ఎన్డీయే (10) బ్రహ్మాండమైన ఆధిపత్యం, కాంగ్రెస్‌కు ఒకటి… హర్యానాలో సగం సగం… బీజేపీని కాంగ్రెస్ కూటమి నిలువరించినట్టే… ఢిల్లీలో బీజేపీ కేజ్రీవాల్‌ను చావుదెబ్బ కొట్టింది… మొత్తం ఏడు స్థానాల్లో జెండా ఎగురవేసింది… అటు పంజాబ్‌లో క్షీణత, ఢిల్లీలో భారీ క్షీణత, కేజ్రీవాల్‌కు గడ్డురోజులే…
ఉత్తరాఖండ్ బీజేపీ స్వీప్… జమ్ము-కాశ్మీర్‌లో రెండు… ఇన్నాళ్లూ గుత్తాధిపత్యం చాటిన ఎన్సీపీ, పీడీపీలకు భంగపాటు… హిమాచల్ ప్రదేశ్ బీజేపీ స్వీప్… ఏతావాతా తేలిందేమిటీ అంటే… కాంగ్రెస్, బీజేపీలను పక్కనపెట్టి లెక్కిస్తే… చంద్రబాబు, అఖిలేష్, స్టాలిన్, మమత హేపీ… తేజస్వి, జగన్, కేజ్రీవాల్, కేసీయార్ ఫ్లాప్… ఇదీ స్థూలంగా రాష్ట్రాల వారీగా ఈ ఎన్నికల ముఖచిత్రం… (ఈ స్టోరీకి తీసుకున్న ఇండియాటుడే గణాంకాలు, సాయంత్రం ఏడు గంటల వరకున్నవి,,ముఖచిత్ర సౌజన్యం కూడా ఇండియాటుడే)
Share this Article